న్యూయార్క్: కోవిడ్ టీకా తీసుకోని కారణంతో... సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌కూ దూరమయ్యాడు. కరోనా టీకా వేసుకోకపోవడంతో ఈ ఏడాది ఆరంభ గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్‌ను ఆడనివ్వలేదు. అయితే యూఎస్ ఓపెన్ టోర్నీ నుంచి మాత్రం ఈ సెర్బియా స్టార్ స్వయంగా తప్పుకున్నాడు.
‘డ్రా’ విడుదలకు కొన్ని గంటల ముందు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అతను వెల్లడించాడు. ‘యూఎస్ ఓపెన్ ఆడేందుకు నేను న్యూయార్క్‌కు వెళ్లట్లేదు. ఇది బాధాకరమే కాని తప్పలేదు. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ ఆశావహ దృక్పథంతో వచ్చే సీజన్‌లో ఆడేందుకు కృషి చేస్తా’ అని ట్వీట్ చేశాడు. 35 ఏళ్ల సెర్బియన్ ఖాతాలో 21 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లున్నాయి. స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ (22 టైటిల్స్) కంటే ఒకటి తక్కువ.
దీన్ని తాజా గ్రాండ్‌స్లామ్‌లో జొకో సాధిస్తాడని అభిమానులు ఆశించారు. అతను 2011, 2015, 2018లో మూడుసార్లు విజేతగా నిలిచాడు. మరో ఆరుసార్లు రన్నరప్‌గా తృప్తి పడ్డాడు. ఇంతటి ఘన రికార్డు ఉన్న అతనికి న్యూయార్క్‌లో మరో టైటిల్ గెలవడం, నాదల్ రికార్డును సమం చేయడం కష్టం కాదు.
అయితే అమెరికా, కెనడా దేశాల్లో స్వదేశీయులు తప్ప టీకా తీసుకోని విదేశీయులను అనుమతించడం లేదు. అందువల్లే జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌కు దూరంగా ఉంటున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడిన ఈ సెర్బియన్ క్వార్టర్స్‌లో నాదల్ చేతిలో ఓడాడు. కానీ వింబుల్డన్‌లో విజేతగా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment