న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం తీసుకొచ్చిన కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ అయిన టీకా లబ్ధిదారుల డేటా లీకైనట్లు వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ వార్తలకు ఎలాంటి ఆధారాల్లేవని స్పష్టం చేసింది. నోడల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్–ఇన్) ఈ వ్యవహారాన్ని సమీక్షిస్తోందని వెల్లడించింది. పోర్టల్‌లోని డేటా భద్రంగా ఉందని, డేటా ప్రైవసీ కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. డేటా లీక్ అంటూ జరుగుతున్న ప్రచారం ఆకతాయిల పనేనని పేర్కొంది.
డేటా లీక్ వార్తలపై సెర్ట్–ఇన్ వెంటనే స్పందించిందని, కోవిన్ యాప్‌పై లేదా డేటాబేస్‌పై ప్రత్యక్షంగా దాడి జరిగినట్లు ఆధారాలు లభించలేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. టెలిగ్రామ్ యాప్‌లో ఫోన్ నెంబర్లు ఎంట్రీ చేస్తే కోవిన్ యాప్ వివరాలను చూపిస్తోందని చెప్పారు. అంతేతప్ప వ్యాక్సిన్ లబ్ధిదారుల వివరాలు లీక్ కాలేదని స్పష్టం చేశారు. కాగా, కోవిన్ పోర్టల్ నుంచి ముఖ్యమైన డేటా లీకైనట్లు తెలుస్తోందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని మొత్తం డేటా మేనేజ్‌మెంట్ వ్యవస్థ గోప్యతపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ సోమవారం డిమాండ్ చేశారు.
అసలేం జరిగింది?
కరోనా టీకా తీసుకున్న వారి వ్యక్తిగత డేటా కోవిన్ పోర్టల్‌లో నిక్షిప్తమైన సంగతి తెలిసిందే. టీకా లబ్ధిదారుల వ్యక్తిగత వివరాలు ఆన్‌లైన్ మెసెంజర్ యాప్ ‘టెలిగ్రామ్’లో కనిపిస్తున్నట్లు కొందరు ట్విట్టర్ ఖాతాదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై దేశవ్యాప్తంగా కలకలం మొదలైంది. ఈ వ్యవహారంపై కొన్ని రాజకీయ పార్టీలు స్పందించాయి. ప్రజల వ్యక్తిగత డేటాకు భద్రత లేకపోవడం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశాయి. దాంతో కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించి, వివరణ ఇచ్చింది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ ద్వారా మాత్రమే కోవిన్ పోర్టల్‌లోని తమ వివరాలను లబ్ధిదారులు తెలుసుకోవచ్చని పేర్కొంది. లబ్ధిదారులు మినహా ఇతరులు తెలుసుకోవడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. లబ్ధిదారుల చిరునామాలు తెలుసుకొనే వెలుసుబాటు కూడా లేదని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment