minister of state for health
-
కోవిన్ పోర్టల్.. ఫుల్ సేఫ్
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం తీసుకొచ్చిన కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ అయిన టీకా లబ్ధిదారుల డేటా లీకైనట్లు వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ వార్తలకు ఎలాంటి ఆధారాల్లేవని స్పష్టం చేసింది. నోడల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్–ఇన్) ఈ వ్యవహారాన్ని సమీక్షిస్తోందని వెల్లడించింది. పోర్టల్‌లోని డేటా భద్రంగా ఉందని, డేటా ప్రైవసీ కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. డేటా లీక్ అంటూ జరుగుతున్న ప్రచారం ఆకతాయిల పనేనని పేర్కొంది. డేటా లీక్ వార్తలపై సెర్ట్–ఇన్ వెంటనే స్పందించిందని, కోవిన్ యాప్‌పై లేదా డేటాబేస్‌పై ప్రత్యక్షంగా దాడి జరిగినట్లు ఆధారాలు లభించలేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. టెలిగ్రామ్ యాప్‌లో ఫోన్ నెంబర్లు ఎంట్రీ చేస్తే కోవిన్ యాప్ వివరాలను చూపిస్తోందని చెప్పారు. అంతేతప్ప వ్యాక్సిన్ లబ్ధిదారుల వివరాలు లీక్ కాలేదని స్పష్టం చేశారు. కాగా, కోవిన్ పోర్టల్ నుంచి ముఖ్యమైన డేటా లీకైనట్లు తెలుస్తోందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని మొత్తం డేటా మేనేజ్మెంట్ వ్యవస్థ గోప్యతపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ సోమవారం డిమాండ్ చేశారు. అసలేం జరిగింది? కరోనా టీకా తీసుకున్న వారి వ్యక్తిగత డేటా కోవిన్ పోర్టల్‌లో నిక్షిప్తమైన సంగతి తెలిసిందే. టీకా లబ్ధిదారుల వ్యక్తిగత వివరాలు ఆన్లైన్ మెసెంజర్ యాప్ ‘టెలిగ్రామ్’లో కనిపిస్తున్నట్లు కొందరు ట్విట్టర్ ఖాతాదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై దేశవ్యాప్తంగా కలకలం మొదలైంది. ఈ వ్యవహారంపై కొన్ని రాజకీయ పార్టీలు స్పందించాయి. ప్రజల వ్యక్తిగత డేటాకు భద్రత లేకపోవడం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశాయి. దాంతో కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించి, వివరణ ఇచ్చింది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ ద్వారా మాత్రమే కోవిన్ పోర్టల్‌లోని తమ వివరాలను లబ్ధిదారులు తెలుసుకోవచ్చని పేర్కొంది. లబ్ధిదారులు మినహా ఇతరులు తెలుసుకోవడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. లబ్ధిదారుల చిరునామాలు తెలుసుకొనే వెలుసుబాటు కూడా లేదని వెల్లడించింది. -
12–18 ఏళ్ల వారికి పరిశీలనలో కోవిడ్ టీకా
న్యూఢిల్లీ: దేశంలోని 12–18 ఏళ్ల గ్రూపు బాలలకు కోవిడ్ టీకా ఇచ్చే విషయంలో నిపుణుల కమిటీ (నెగ్వ్యాక్), వ్యాధినిరోధకతపై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం(ఎన్టీఏజీఐ) శాస్త్రీయ ఆధారాలను పరిశీలించి, చర్చలు జరుపుతున్నాయని కేంద్రం శుక్రవారం లోక్‌సభలో తెలిపింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. దేశీయంగా కేడిలా హెల్త్‌కేర్ సంస్థ తయారు చేసిన జైకోవ్–డి టీకాను పరిమితులకు లోబడి అత్యవసర పరిస్థితుల్లో 12 ఏళ్లు పైబడిన వారికి ఇచ్చేందుకు అనుమతివ్వాలంటూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కి దరఖాస్తు అందిందని తెలిపారు. అదేవిధంగా, భారత్ బయోటెక్ సంస్థ కూడా కోవాగ్జిన్ టీకా బీఆర్డీతో 2–18 ఏళ్ల వయస్సుల వారిపై చేపట్టిన 2/3 దశల క్లినికల్ డేటా వివరాలతో మధ్యంతర నివేదికను డీసీజీఐకి అందజేసిందన్నారు. సీరం ఇన్స్టిట్యూట్ 2–17 ఏళ్ల వారికి కోవోవ్యాక్స్ టీకాతో 2/3 దశల క్లినికల్ ట్రయల్స్ చేపట్టిందన్నారు. బయోలాజికల్–ఈ సంస్థ 5–18 ఏళ్ల వారి కోసం రూపొందించిన టీకా 2/2 దశల క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోందన్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ 12–17 ఏళ్ల వారి కోసం తయారు చేసిన ఏడీ.26కోవ్.2ఎస్ టీకాతో భారత్ సహా పలు ప్రపంచదేశాల్లో 2/3 క్లినికల్ ట్రయల్స్ జరుపుతోందని చెప్పారు. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను బట్టి అనుమతులిచ్చే విషయం పరిశీలిస్తామన్నారు. -
కడుపు నింపుకోడానికే ఒళ్లు అమ్ముకుంటున్నారు: మంత్రి
మహిళలు కడుపు నింపుకోడానికే తమ శరీరాలు అమ్ముకుంటున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ వ్యాఖ్యానించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఉపయోగించుకోవాలి తప్ప.. ఇలా చేయకూడదని సరోగసీ బిల్లు గురించి మాట్లాడుతూ ఆమె ఇలా చెప్పారు. సులభంగా డబ్బు సంపాదించుకోవడం కోసం ఆయా కుటుంబాలు ఈ మహిళలతో వాళ్ల గర్భాలు అద్దెకు ఇచ్చేలా చేస్తున్నాయని మండిపడ్డారు. మహిళలకు సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది కదా అని ప్రశ్నించగా, భారతదేశంలో ఎంతమంది మహిళలు సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారని ఆమె అన్నారు. వాళ్లతో బలవంతంగా ఇలా చేయిస్తున్నారని చెప్పారు. జీవనోపాధి కోసం గర్భాలను అద్దెకు ఇవ్వడం ఒక్కటే మార్గం కాదన్న విషయాన్ని మహిళలకు చెప్పాలని ప్రభుత్వం భావిస్తోందని అనుప్రియా పటేల్ అన్నారు. వాణిజ్యపరమైన సరొగసీని నిషేధిస్తూ కేంద్ర మంత్రివర్గం గత వారం ఒక బిల్లును ఆమోదించింది. కేవలం సన్నిహిత బంధువులు మాత్రమే ఇలా చేయొచ్చని ఈ బిల్లు చెబుతోంది. కొత్తగా పెళ్లయిన జంటలు, ఎన్నారైలు, గేలు సరొగసీ ద్వారా పిల్లలను పొందడానికి వీల్లేకుండా నిషేధిస్తోంది. అయితే.. దీనివల్ల పిల్లలు లేని జంటలకు అవకాశాలు తగ్గిపోతాయని కొందరు అంటున్నారు. దీనివల్ల అక్రమంగా సరొగసీకి వెళ్లే అవకాశాలు ఎక్కువవుతాయని, నిజంగా పిల్లలు కావాలనుకునేవాళ్లు థాయ్‌లాండ్ లాంటి ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఢిల్లీలోని సుప్రసిద్ధ లేడీ శ్రీరామ్ కాలేజిలో చదివిన అనుప్రియా పటేల్.. అక్రమ సరొగసీ మీద గట్టిగా పోరాడుతున్నారు. మన దేశంలో ఈ పేరుతో దాదాపు 200 కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతోందని ఆమె అంటున్నారు.