న్యూఢిల్లీ: దేశంలోని 12–18 ఏళ్ల గ్రూపు బాలలకు కోవిడ్ టీకా ఇచ్చే విషయంలో నిపుణుల కమిటీ (నెగ్‌వ్యాక్), వ్యాధినిరోధకతపై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం(ఎన్‌టీఏజీఐ) శాస్త్రీయ ఆధారాలను పరిశీలించి, చర్చలు జరుపుతున్నాయని కేంద్రం శుక్రవారం లోక్‌సభలో తెలిపింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. దేశీయంగా కేడిలా హెల్త్‌కేర్ సంస్థ తయారు చేసిన జైకోవ్–డి టీకాను పరిమితులకు లోబడి అత్యవసర పరిస్థితుల్లో 12 ఏళ్లు పైబడిన వారికి ఇచ్చేందుకు అనుమతివ్వాలంటూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కి దరఖాస్తు అందిందని తెలిపారు.
అదేవిధంగా, భారత్ బయోటెక్ సంస్థ కూడా కోవాగ్జిన్ టీకా బీఆర్‌డీతో 2–18 ఏళ్ల వయస్సుల వారిపై చేపట్టిన 2/3 దశల క్లినికల్ డేటా వివరాలతో మధ్యంతర నివేదికను డీసీజీఐకి అందజేసిందన్నారు. సీరం ఇన్‌స్టిట్యూట్ 2–17 ఏళ్ల వారికి కోవోవ్యాక్స్ టీకాతో 2/3 దశల క్లినికల్ ట్రయల్స్ చేపట్టిందన్నారు. బయోలాజికల్–ఈ సంస్థ 5–18 ఏళ్ల వారి కోసం రూపొందించిన టీకా 2/2 దశల క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోందన్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ 12–17 ఏళ్ల వారి కోసం తయారు చేసిన ఏడీ.26కోవ్.2ఎస్ టీకాతో భారత్ సహా పలు ప్రపంచదేశాల్లో 2/3 క్లినికల్ ట్రయల్స్ జరుపుతోందని చెప్పారు. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను బట్టి అనుమతులిచ్చే విషయం పరిశీలిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment