న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి విజృంభించి దేశాన్ని కలావికలం చేస్తున్న వేళ భారత్ అందించిన ఆపన్నహస్తంతో తెరిపినపడిన డొమినికా దేశం తన కృతజ్ఞత చాటుకునేందుకు సిద్ధపడింది. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేసిన సాయానికి గుర్తుగా మోదీకి ‘ది డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’ను ప్రదానం చేయనున్నట్లు ది కామన్వెల్త్ ఆఫ్ డొమినికా గురువారం ప్రకటించింది. భారత ప్రభుత్వ ఉదార గుణాన్ని స్మరించుకుంటూ ఆ దేశ ప్రధాని హోదాలో ఉన్న మోదీకి తమ దేశ అత్యున్నత జాతీయ పురస్కారాన్ని ఇవ్వనున్నట్లు డొమినికన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
గయానాలోని జార్జ్‌టౌన్ పట్టణంలో నవంబర్ 19 నుంచి 21వ తేదీదాకా జరిగే ఇండియా–కరికోమ్ శిఖరాగ్ర సదస్సులో మోదీకి ఈ అవార్డ్‌ను అందజేస్తారు. ‘‘2021 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ ఆదేశాలతో భారతసర్కార్ మాకు 70,000 డోసుల ఆస్ట్రాజెనికా కోవిడ్19 వ్యాక్సిన్లు అందించింది. మా స్థాయికి అది పెద్ద సాయం కావడంతో వాటిలో కొన్నింటిని మా పొరుగు దేశాలకూ సాయంగా అందించగలిగాం. ఆరోగ్యం, వైద్యం, సమాచార సాంకేతిక రంగాల్లోనూ భారత్ మాకు ఎంతో సాయపడింది. అంతర్జాతీయ స్థాయిలో వాతావరణమార్పు నిరోధక చర్యలు చేపట్టడం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకను గుణంగా ముందడుగు వేయడంలో మాకు వెన్నంటి నిలిచింది’’ అని ఆ దేశ ప్రధాని కార్యాలయం కొనియాడింది.
Comments
Please login to add a commentAdd a comment