న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ రెండోడోసు తీసుకున్న తర్వాత ఎన్నాళ్లకు బూస్టర్ డోసు (మూడో డోసు... ప్రధాని మాటల్లో ప్రికాషన్ డోసు) ఇవ్వాలనే దానిపై భారత వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ముమ్మరంగా సమాలోచనలు చేస్తున్నారు. రెండో డోసు తీసుకున్న 9 నుంచి 12 నెలల తర్వాతే బూస్టర్ డోసు ఉండొచ్చని విశ్వసనీయ అధికారవర్గాలు ఆదివారం తెలిపాయి. ‘కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లకు ఎంతెంతకాలం తర్వాత బూస్టర్ డోసును ఇవ్వాలనే విషయంలో సాంకేతికాంశాల మదింపు జరుగుతోంది. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు’ అని అధికారవర్గాలు పేర్కొన్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ 15–18 ఏళ్లలోపు టీనేజర్లకు జనవరి 3 నుంచి కరోనా టీకాలు ఇస్తామని, జనవరి 10 నుంచి ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వైద్యరంగంలోని వారికి ‘ప్రీకాషన్ డోసు (ముందు జాగ్రత్త చర్యగా)’ను ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే 60 ఏళ్లు పైబడి, అనారోగ్య సమస్యలు ఉన్న వారికీ డాక్టర్ల సలహా మేరకు ప్రికాషన్ డోసు ఇస్తామని మోదీ అన్నారు. ఒమిక్రాన్ వేరియెంట్ ఉధృతి నేపథ్యంలో ఈ నిర్ణయాలు వెలువడ్డాయి. ‘రెండో డోసుకు, ప్రికాషన్ డోసుకు మధ్య వ్యవధి 9 నుంచి 12 నెలలు ఉండొచ్చు. ఇమ్యూనైజేషన్ విభాగం, ఇమ్యూనైజేషన్‌పై జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టీఏజీఐ) ఇదే తరహాలో సమాలోచనలు సాగిస్తున్నాయి’ అని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.
టీనేజర్లకు ప్రస్తుతానికి కోవాగ్జినే
జనవరి 3 నుంచి 15–18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభమైనపుడు కోవాగ్జిన్ మాత్రమే అందుబాటులో ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వ అధికారవర్గాలు ఆదివారం వెల్లడించాయి. దేశంలో 15–18 ఏళ్ల ఏజ్ గ్రూపులో ఏడు నుంచి ఎనిమిది కోట్ల మంది టీనేజర్లు ఉండొచ్చని పేర్కొన్నాయి. హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు... ఈ మూడు కేటగిరీల వారికి మాత్రం గతంలో రెండు డోసులు ఏ కంపెనీ టీకా తీసుకున్నారో ‘బూస్టర్ డోస్’గా అదే టీకా ఇస్తారని తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment