precations
-
Health: అనీమియా వద్దు... ‘ఐరన్’ లేడీలా ఉందాం!
రక్తహీనత పురుషులూ, మహిళలూ, చిన్నారులూ ఇలా అందరిలోనూ కనిపించే సమస్యే అయినా మహిళల్లో మరింత ఎక్కువ. భారతీయ మహిళల్లో రక్తహీనతతో బాధపడేవారు చాలా ఎక్కువని అనేక అధ్యయనాలూ, కేస్ స్టడీస్ చెబుతున్నాయి. నెలసరి వంటి సమస్యలు మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండేందుకు కారణమవుతున్నాయి. రక్తహీనత అంటే ఏమిటి, సమస్య పరిష్కారం కోసం మహిళలు అనుసరించాల్సిందేమిటి అనే విషయాలను చూద్దాం...ఎర్రరక్తకణాలు మన శరీరంలోని అన్ని అవయవాలకూ రక్తాన్ని మోసుకుని వెళ్తుంటాయి. వాటి సంఖ్య తగ్గడం వల్ల అన్ని అవయవాలకూ తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో అది ప్రమాదకరంగా పరిణమిస్తుంది. రక్తహీనతల్లోనూ ఐరన్‌లోపం వల్ల కలిగేది చాలా సాధారణమైనది. మన శరీరంలోని రక్తం ఎర్రగా ఉండటానికి అందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం కారణం. మన శరీరంలో 100 గ్రాముల రక్తంలో... హీమోగ్లోబిన్ పరిమాణం మగవారిలోనైతే 13 గ్రాములు, మహిళల్లోనైతే 12 గ్రాములు, ఆరు నుంచి పన్నెండేళ్ల పిల్లల్లో 12 గ్రాములు ఉండాలి. ఒకవేళ ఈ హీమోగ్లోబిన్ పరిమాణం ఇంతకంటే తక్కువగా ఉంటే వారు రక్తహీనతతో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు.లక్షణాలు.. – అనీమియా లక్షణాలు కొందరు మహిళల్లో కాస్త తక్కువగానూ, మరికొందరిలో తీవ్రంగా ఉంటాయి. రక్తహీనత వచ్చిన వారిలో ఎర్రరక్తకణాల (రెడ్ బ్లడ్ సెల్స్ / ఎరిథ్రోసైట్స్) సంఖ్య తగ్గిపోవడం వల్ల చర్మం పాలిపోయినట్లు కనిపించడం, గోర్ల కింద రక్తం లేనట్టుగా తెల్లగా కనిపించడాన్ని అనీమియాకు సూచనగా పరిగణించవచ్చు. అనీమియా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు...– శ్వాస కష్టంగా ఉండటం– కొద్దిపాటి నడకకే ఆయాసం– అలసట– చికాకు / చిరాకు / కోపం– మగత– తలనొప్పి– నిద్రపట్టకపోవడం– పాదాలలో నీరు చేరడం– ఆకలి తగ్గడం– కాళ్లుచేతుల్లో తిమ్మిర్లు, చల్లగా మారడం– ఛాతీనొప్పి– త్వరగా భావోద్వేగాలకు గురికావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.రక్తహీనత ఉన్న మహిళలు తప్పనిసరిగా డాక్టర్ చేత పరీక్షలు చేయించుకుని తమ అనీమియాకు నిర్దిష్టంగా కారణమేమిటో తెలుసుకోవాలి. అసలు కారణాన్ని తెలుసుకుని దానికి సరైన చికిత్స ఇస్తే అనీమియా తగ్గుతుంది. ఆ తర్వాత మాత్రమే అవసరాన్ని బట్టి అనంతర చికిత్స తీసుకోవాలి.జాగ్రత్తలు / చికిత్స..ఐరన్ పుష్కలంగా లభించే ఆహారం అయిన కాలేయం, ఆకుపచ్చటి ఆకుకూరలు, నువ్వులు, ఖర్జూరం, అటుకులు, బెల్లం వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అవసరమైనవారు డాక్టర్ సలహా మీద ఐరన్ ట్యాబ్లెట్లు వాడాలి. ఇలాంటి టాబ్లెట్లు వాడే సమయంలో కొందరికి మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవి డాక్టర్ల సలహా మేరకు వాడాలి. అప్పుడు డాక్టర్లు వారికి సరిపడే అనీమియా మందుల్ని సూచిస్తారు. మరీ రక్తహీనత ఎక్కువగా ఉంటే అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించాలి.కారణాలు..మహిళలు తమ నెలసరి వల్ల ప్రతి నెలా రక్తాన్ని కోల్పోతుంటారు. కాబట్టి వాళ్లలో రక్తహీనతకు అది ప్రధాన కారణం. మరి కొందరిలో ఎర్రరక్తకణాల తయారీ ప్రక్రియ దెబ్బతినడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇక కొత్త ఎర్రరక్తకణాలు తయారయ్యే లోపే కొందరిలో పాతవి వేగంగా చనిపోవడం వల్ల కూడా రక్తహీనత వస్తుంది. మహిళల్లో రుతుస్రావంతో పాటు బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అతిగా రక్తంపోవడం, యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ ఉండటం వంటి అంశాలు కూడా రక్తహీనతకు కారణమవుతాయి. -
చలిలో విద్యుత్ వాహనాలు.. ఇవి పాటించాల్సిందే..
చలికాలంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుంటాయి. ఇలాంటి వాతావరణంలో విద్యుత్ వాహనాల పనితీరు భిన్నంగా ఉంటుంది. లిథియం అయాన్ బ్యాటరీల్లో ఛార్జింగ్ త్వరగా తగ్గిపోతుంది. అలా ఎందుకు జరుగుతుంది? శీతల వాతావరణంలో ఈవీలను ఎలా మెయింటైన్ చేయాలి? ఛార్జ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రభావం ఇలా.. శీతాకాలంలో ఈవీల పనితీరు సాధారణం కంటే 20-30 శాతం తగ్గుతుందని వాహన నిపుణులు చెబుతున్నారు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. బ్యాటరీ పనితీరు తగ్గడం ఒకటైతే.. శక్తి వినియోగం పెరగడం మరొకటి. విద్యుత్వాహనాల లిథియం అయాన్ బ్యాటరీలు 15-25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో సరిగ్గా పనిచేస్తాయి. మరోవైపు చలికాలంలో వాహనాలకు అవసరమైన వేడి కోసం బ్యాటరీ నుంచే ఎక్కువ శక్తిని తీసుకోవాల్సి వస్తుంది. దీంతో సాధారణ సమయంలో కంటే శీతాకాలంలో బ్యాటరీ వినియోగం పెరుగుతుంది. చలిలో రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థ అంత ప్రభావవంతంగా పనిచేయదు. సాధారణ సమయంలో ఈ బ్రేకింగ్ వ్యవస్థ వల్ల బ్యాటరీ కొంతమేర ఛార్జ్ అవుతుంది. శీతాకాలంలో మాత్రం ఇది అంతగా పనిచేయదు. ఈ నేపథ్యంలో చల్లని వాతావరణంలో ఈవీలను డ్రైవ్ చేయడం కొంత భిన్నంగా అనిపిస్తుంది. ఇలా ఎందుకంటే.. చలిలో లిథియం అయాన్ బ్యాటరీల్లోని ఎలక్ట్రోలైట్ లిక్విడ్ మందంగా ఉంటుంది. దీంతో ఎలక్ట్రోకెమికల్ ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా బ్యాటరీల అంతర్గత నిరోధం పెరుగుతుంది. దీంతో లిథియం అయాన్లు యానోడ్, కేథోడ్ మధ్య సులభంగా చలించలేవు. ఇలాంటి స్థితిలో బ్యాటరీ నుంచి ఒక్కసారిగా శక్తిని తీసుకోవడం ప్రారంభిస్తే వోల్టేజ్ గణనీయంగా పడిపోయి డిశ్ఛార్జ్కు దారితీస్తుంది. ఇదీ చదవండి: నాలుగేళ్లలో రూ.400 లక్షల కోట్లు..? జాగ్రత్తలు ఇవే.. వీలైనంత వరకు ఈవీలను బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేయొద్దు. ఇండోర్‌లో పార్క్ చేయడం వల్ల వాటిపై చలి ప్రభావం కొంతమేర తగ్గుతుంది. కుదరకపోతే కనీసం కవర్‌తోనైనా కప్పి ఉంచాలి. ఈవీల ఛార్జింగ్ 20 శాతం కంటే దిగువకు పడిపోకుండా చూసుకోవాలి. లేదంటే వాహనాన్ని స్టార్ట్ చేసినప్పుడు కొన్ని పరికరాలు వేడి కావడానికి బ్యాటరీ నుంచి శక్తిని తీసుకుంటాయి. దీంతో బ్యాటరీ మరింత తొందరగా డిశ్ఛార్జ్ అవుతుంది. ఒకవేళ చలికాలంలో దూర ప్రయాణాలను ప్లాన్ చేస్తే కనీసం 80 శాతానికి పైనే ఛార్జింగ్ ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
పాములుంటాయ్..! జాగ్రత్త..!!
నిర్మల్: జిల్లాలో ఏటా పదుల సంఖ్యలో పాముకాటుతో మృత్యువాత పడుతున్నారు. ఇందులో రైతులు, చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. పొలాల్లో పనులు చేస్తూ కొందరు, ఇంటి పరిసరా ల్లో ఆడుకుంటూ మరికొందరు, రాత్రిళ్లు ఇంట్లో నిద్రపోతుండగా ఇంకొందరు పాము కాటుతో మృతి చెందిన ఘటనలున్నాయి. పాముకాటు వేసిన సమయంలో బాధితులు కంగారులో నాటు వైద్యులను ఆశ్రయిస్తుంటారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాముకాటు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా మూఢవిశ్వాసాలతో మంత్రాలు చేయించడం, పసరు మందులు వాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నా రు. జిల్లాలో ప్రస్తుతమున్న చల్లని వాతావరణానికి పచ్చని చెట్లు, పొదలు తోడు కావడం, వర్షానికి వరదనీటి ప్రవాహం వస్తుండడంతో పాములు ఆరుబయట విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని కాలనీల్లో జనావాసాల మధ్య, నిల్వ నీరున్న కుంటల్లో దర్శనమిస్తున్నాయి. కప్పలు, ఎలుకలను వేటాడే క్రమంలో ఇళ్ల సమీపంలో ఉండే గుంతలు, చెట్లపొదల వద్ద ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో అటుగా వెళ్లి ఆడుకుంటున్న చిన్నపిల్లలు పాముకాటుకు గురవుతున్నారు. అంతే కాకుండా ఇళ్ల ముందు, ఆరుబయట నిలిపి ఉంచుతున్న ద్విచక్ర వాహనాలు, కారు ఇంజిన్లు, బస్సుల్లో ఇలా ఎక్కడపడితే అక్కడ పాములు కనిపిస్తుండడంతో జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా తరచూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పాము కాటును ఇలా గుర్తించాలి.. పాము కరిస్తే ముందుగా ఏ ప్రాంతంలో కాటు వేసింది.. నేరుగా శరీరంపై కాటు వేసిందా? లేక దుస్తుల పైనుంచి వేసిందా? అనేది పరిశీలించాలి. శరీరంపై కాటు వేస్తే ఎన్నిగాట్లు పడ్డాయో చూడాలి. త్రాచుపాము, కట్లపాము, రక్తపింజర కాటేస్తే రెండు గాట్లు పడుతాయి. అంతకంటే ఎక్కువ గాట్లు కనిపిస్తే అది సాధారణ పాముగా గుర్తించవచ్చు. విష సర్పం కాటేస్తే సూదితో గుచ్చితే చుక్కగా రక్తం వచ్చినట్లు ఉంటుంది. కరిచిన చోట రెండు రక్తపు చుక్కలు కనిపిస్తాయి. ఇవీ.. జాగ్రత్తలు పొలం పనులకు వెళ్లే రైతులు, అడవుల్లో పశువుల వెంట తిరిగేవారు పాముకాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రిపూట పొలాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా టార్చిలైట్ వెంట తీసుకెళ్లాలి. పాములు ఎక్కువగా మోకాలు కింది భాగంలో కాటువేస్తాయి. కాబట్టి కాళ్లను కప్పి ఉండే చెప్పులు ధరించాలి. కాళ్ల కిందకు ఉండే దుస్తులు వేసుకోవాలి. కప్పలు, ఎలుకలు ఎక్కువగా ఉండే చోట పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అది దృష్టిలో పెట్టుకుని పనులు చేసుకోవాలి. ఎవరైనా పాముకాటుకు గురైతే ఆందోళనకు గురికాకుండా వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ప్రథమ చికిత్స ఇలా.. పాముకాటు వేసినప్పుడు నోరు లేదా బ్లేడ్‌తో గాటు పెట్టకూడదు. కంగారులో నాటువైద్యులను ఆశ్రయించవద్దు. పాము కాటు వేసిన చోట సబ్బుతో శుభ్రంగా కడగాలి. పాముకాటుకు గురైన వ్యక్తికి ప్రమాదం ఏమీ లేదని చెప్పాలి. కాటు వేసిన భాగంలోని మూడు అంగుళాల పైభాగాన గుడ్డతో కట్టాలి. మందులు అందుబాటులో ఉంచాం అన్ని ప్రభుత్వ దవా ఖానలు, పీహెచ్‌సీల్లో పాముకాటుకు సంబంధించిన యాంటీ స్నేక్ వీనం మందులు అందుబాటులో ఉంచాం. పాము కాటేస్తే దాని లక్షణాలు గుర్తించి వెంటనే చికిత్స పొందితే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. ఏటా పాముకాటు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. వానాకాలం జాగ్రత్తగా ఉండడం మంచిది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. – ధన్‌రాజ్, జిల్లా వైద్యాధికారి -
వేగంగా ప్రికాషన్ డోసు టీకా పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా టీకాకు సంబంధించిన ప్రికాషన్ డోసు పంపిణీపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. 18–59 ఏళ్ల మధ్యనున్న వారికి ఈ నెల 15 నుంచి ఈ టీకా పంపిణీని ప్రారంభించారు. ఇప్పటివరకూ 15,53,703 మందికి పంపిణీ చేశారు. అత్యధికంగా 1,15,076 మందికి ఇవ్వడం ద్వారా కర్నూల్ జిల్లా తొలి స్థానంలో ఉంది. అనంతరం.. 1.04 లక్షలతో విశాఖపట్నం, 85,569 మందితో శ్రీకాకుళం తర్వాత స్థానాల్లో నిలిచాయి. సెప్టెంబర్ నెలాఖరులోగా 3.43 కోట్ల మందికి ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరులోగా రాష్ట్రంలో 3.43 కోట్ల మందికి ఈ ప్రికాషన్ టీకాను పంపిణీ చేయాలన్నది లక్ష్యం. ఇందులో ఇప్పటివరకూ 15.53 లక్షల మందికి వేశారు. గడువులోగా లక్ష్యం పూర్తికి వైద్య, ఆరోగ్య శాఖాధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వారంలో రెండ్రోజులు కాలేజీలు, బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో టీకా పంపిణీ చేపడుతున్నారు. ఇక భారీ వర్షాలు, వరదల కారణంగా పలు జిల్లాల్లో ఈ కార్యక్రమం మందగించింది. కానీ, అవి ఇప్పుడు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో టీకా పంపిణీని వేగవంతం చేయడంపై అధికారులు దృష్టిపెట్టారు. ఎప్పటికప్పుడు జిల్లాల వైద్యాధికారులతో సమీక్షలు నిర్వహించి పురోగతిపై ఆరా తీస్తున్నారు. రెండో డోసు టీకా వేసుకుని ఆర్నెలలు పూర్తయిన వారందరికీ ప్రికాషన్ డోసు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 73 శాతం పూర్తి మరోవైపు.. ఫ్రంట్‌లైన్, హెల్త్‌కేర్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఈ నెలాఖరుకు 76,95,871 మందికి వేయాల్సి ఉండగా 56.19 లక్షల మందికి (73.02%) పూర్తయింది. అలాగే, హెల్త్‌కేర్ వర్కర్లు 98.46%, ఫ్రంట్‌లైన్ వర్కర్లు 85.46 శాతం, 60 ఏళ్లు పైబడి 67.39 శాతం మందికి ప్రికాషన్ టీకా వేశారు. 99.02% మంది పిల్లలకు రెండు డోసులు ఇక 12–14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా రెండు డోసుల పంపిణీ దాదాపు పూర్తయింది. రాష్ట్రంలో ఈ వయసు పిల్లలు 14.90 లక్షల మందికి టీకా పంపిణీ చేయాలని కేంద్రం లక్ష్యం నిర్దేశించగా.. అనతికాలంలోనే ఆ లక్ష్యాన్ని అధిగమించి తొలి డోసు పంపిణీని వైద్యశాఖ పూర్తిచేసింది. 99.02 శాతం మందికి రెండో డోసు టీకా ప్రక్రియ కూడా పూర్తయింది. అనంతపురం, నంద్యాల, కర్నూలు, నెల్లూరు, ఏలూరు జిల్లాల్లో రెండు డోసుల పంపిణీ వంద శాతం ముగిసింది. కనిష్టంగా విజయనగరం జిల్లాలో 93.5 శాతం, ఏఎస్ఆర్ జిల్లాలో 95.73 శాతం మందికి రెండు డోసుల టీకా వేశారు. మిగిలిన అన్ని జిల్లాల్లో 97 శాతానికి పైగా రెండు డోసులు పంపిణీ చేపట్టారు. -
9 నెలల తర్వాతే బూస్టర్
న్యూఢిల్లీ: దేశంలోని 15–18 ఏళ్ల గ్రూపు టీనేజర్లకు జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవాగ్జిన్ టీకా మాత్రమే అందుబాటులో ఉంటుందని కేంద్రం తెలిపింది. ఆరోగ్య కార్యకర్తలు తదితరులకు ‘ప్రికాషన్ డోస్’గా ఇచ్చే మూడో డోస్ టీకాపైనా మరింత స్పష్టత నిచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇవి జనవరి 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ‘15ఏళ్లు ఆపై వారు కోవిన్ యాప్ ద్వారా టీకా కోసం జనవరి 1వ తేదీ నుంచి రిజిస్టర్ చేసుకోవచ్చు. 2007, అంతకంటే ముందే పుట్టిన వారు అర్హులవుతారు. దేశంలో 15–18 ఏళ్ల గ్రూపు వారికి కోవాగ్జిన్ టీకా(అత్యవసర వినియోగానికి) ఒక్కటే ప్రస్తుతం అందుబాటులో ఉంది’అని వివరించింది. జైడస్ క్యాడిలా సంస్థ తయారుచేసిన జైకోవ్–డీ వ్యాక్సిన్‌ను 12–18 ఏళ్ల వారికి వాడటానికి ఈ ఏడాది ఆగస్టు 20న అనుమతులు లభించినా.. ఈ టీకాను ఇంకా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో చేర్చలేదు కాబట్టి ప్రస్తుతానికి పిల్లలకు కోవాగ్జిన్ ఒక్కటే అందుబాటులో ఉంటుందని అధికారులు వివరించారు. అదేవిధంగా, ‘ప్రాధాన్యతాక్రమం ప్రకారం హెల్త్‌కేర్ వర్కర్లు (హెచ్‌సీడబ్ల్యూలు), ఫ్రంట్‌లైన్ వర్కర్లు (ఎఫ్‌ఎల్‌డబ్ల్యూలు), 60 ఏళ్లకు పైబడిన ఇతర వ్యాధుల బాధితులు జనవరి 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ప్రికాషన్ డోస్‌కు అర్హులు. జనవరి 3వ తేదీ నాటికి వీరు కోవిడ్ టీకా రెండో డోస్ తీసుకుని 9 నెలలు లేదా 39 వారాలు పూర్తయి ఉండాలి’అని ఆ మార్గదర్శకాల్లో వివరించింది. ‘కోవిన్ యాప్ నుంచి వీరు టీకా కోసం నమోదు చేసుకోవచ్చు. కోవిన్ యాప్ నమోదైన రెండో డోస్ తీసుకున్న తేదీ ఆధారంగా ప్రికాషన్ డోస్‌కు అర్హత లభిస్తుంది. 9 నెలలు/39 వారాల గడువు ముగిసిన వారి రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు మెసేజీ అందుతుంది. ఆన్‌లైన్‌తోపాటు ఆన్‌సైట్‌లోనూ టీకా కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. నేడు రాష్ట్రాలతో భేటీ ప్రికాషన్ డోస్, టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అనుసరించాల్సిన కార్యాచరణ వ్యూహంపై చర్చించేందుకు కేంద్రం మంగళవారం రాష్ట్రాలతో వర్చువల్‌గా సమావేశం జరపనుంది. -
9–12 నెలల తర్వాతే బూస్టర్!
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ రెండోడోసు తీసుకున్న తర్వాత ఎన్నాళ్లకు బూస్టర్ డోసు (మూడో డోసు... ప్రధాని మాటల్లో ప్రికాషన్ డోసు) ఇవ్వాలనే దానిపై భారత వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ముమ్మరంగా సమాలోచనలు చేస్తున్నారు. రెండో డోసు తీసుకున్న 9 నుంచి 12 నెలల తర్వాతే బూస్టర్ డోసు ఉండొచ్చని విశ్వసనీయ అధికారవర్గాలు ఆదివారం తెలిపాయి. ‘కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లకు ఎంతెంతకాలం తర్వాత బూస్టర్ డోసును ఇవ్వాలనే విషయంలో సాంకేతికాంశాల మదింపు జరుగుతోంది. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు’ అని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ 15–18 ఏళ్లలోపు టీనేజర్లకు జనవరి 3 నుంచి కరోనా టీకాలు ఇస్తామని, జనవరి 10 నుంచి ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వైద్యరంగంలోని వారికి ‘ప్రీకాషన్ డోసు (ముందు జాగ్రత్త చర్యగా)’ను ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే 60 ఏళ్లు పైబడి, అనారోగ్య సమస్యలు ఉన్న వారికీ డాక్టర్ల సలహా మేరకు ప్రికాషన్ డోసు ఇస్తామని మోదీ అన్నారు. ఒమిక్రాన్ వేరియెంట్ ఉధృతి నేపథ్యంలో ఈ నిర్ణయాలు వెలువడ్డాయి. ‘రెండో డోసుకు, ప్రికాషన్ డోసుకు మధ్య వ్యవధి 9 నుంచి 12 నెలలు ఉండొచ్చు. ఇమ్యూనైజేషన్ విభాగం, ఇమ్యూనైజేషన్‌పై జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్టీఏజీఐ) ఇదే తరహాలో సమాలోచనలు సాగిస్తున్నాయి’ అని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. టీనేజర్లకు ప్రస్తుతానికి కోవాగ్జినే జనవరి 3 నుంచి 15–18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభమైనపుడు కోవాగ్జిన్ మాత్రమే అందుబాటులో ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వ అధికారవర్గాలు ఆదివారం వెల్లడించాయి. దేశంలో 15–18 ఏళ్ల ఏజ్ గ్రూపులో ఏడు నుంచి ఎనిమిది కోట్ల మంది టీనేజర్లు ఉండొచ్చని పేర్కొన్నాయి. హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు... ఈ మూడు కేటగిరీల వారికి మాత్రం గతంలో రెండు డోసులు ఏ కంపెనీ టీకా తీసుకున్నారో ‘బూస్టర్ డోస్’గా అదే టీకా ఇస్తారని తెలిపాయి. -
Coronavirus: మూడో వేవ్? ఎదుర్కొందాం ఇలా..!
అల తర్వాత అల... ఆటు తర్వాత పోటు... సముద్రంలో మామూలే. కానీ ఇప్పుడు కరోనా సంక్షోభమూ ఓ కడలిలాగే అంతూపొంతూ లేకుండా కనిపిస్తోంది. కొత్త కొత్త వేరియెంట్లూ, స్ట్రెయిన్లూ అంటూ అలల్లా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ఇప్పుడు నడుస్తున్న రెండో వేవ్ తర్వాత మూడో వేవ్ కూడా వస్తుందా? అది మరింత శక్తిమంతంగా పెద్దలతో పాటు పిల్లలనూ ప్రమాదంలో ముంచెత్తుతుందా అన్నది చాలామంది ముందు ఉన్న ప్రశ్న. ఒకవేళ అది అంత పెద్ద అలే అయితే... దాన్ని ఎలా ఎదుర్కోవాలన్నది మన ముందు ఉన్న ప్రశ్న. అలల్లో కొట్టుకుపోవడం అందరికీ మామూలే. కానీ కొందరు సర్ఫర్లు మాత్రం పెద్ద పెద్ద అలలకు బెంబేలెత్తరు.... బెదిరిపోరు. వచ్చే అల ఉంటే ఎలాగూ వస్తుంది... వద్దని మనం అనుకున్నా ఆగదు. అయితే... ఒకవేళ అలాంటి రాకాసి అల వచ్చినప్పటికీ... మన ముందస్తు తయారీతో సర్ఫర్ల స్వారీలా దాన్ని నేర్పుగా అధిగమించే మార్గాలను తెలుసుకుందాం. కరోనా మూడో దశను కలిసికట్టుగా ఎదుర్కొందాం. అసలు కరోనా దశల వారీగా ఎందుకు వస్తుంటుందో చూద్దాం? కరోనా ఒక్కటే కాదు.. ఆ మాటకొస్తే చాలారకాల వైరల్ ఇన్ఫెక్షన్లు దశలవారీగా సంభవిస్తుంటాయి. ఇలా జరగడానికి కారణం ఉంది. ప్రపంచంలోని ప్రతి జీవీ తన పరిణామ దశలో అంతకంతకూ తనను తాను మెరుగుపరచుకుంటూ ఉంటుంది. మనుగడ కోసం కృషి చేస్తుంటుంది. కరోనా వైరస్ సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఒకసారి ఒక స్ట్రెయిన్‌తో ఇది వచ్చాక.. ఆ స్ట్రెయిన్‌కు చాలామందిలో ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. దాంతో ఆ ఇమ్యునిటీ ఉన్నవారిలో తాను మనుగడ సాగించలేదు. కాబట్టి మరింతగా మెరుగుపరచుకుని మరో కొత్త స్ట్రెయిన్ రూపంలో మరిన్ని (తన మనుగడ కోసం కావాల్సిన అనుకూల) మార్పులతో అది తనను తాను మళ్లీ మళ్లీ ఆవిష్కరించుకుంటూ ఉంటుంది. ఇలా తనను తాను కొత్త స్ట్రెయిన్లు సృష్టించుకుంటుంది కాబట్టి దశలు దశలుగా (ఫస్ట్, సెంకడ్, థర్డ్ ఇలా వేవ్స్) వస్తుంటుంది. అలా ప్రతి దశ అధిక సంఖ్యలో కేసులు నమోదవ్వడానికి కారణమవుతుంది. వైరస్ ఇలా అనేక స్ట్రెయిన్లుగా, వేరియెంట్లుగా ఎందుకు మారుతుందో తెలుసుకుని, దాన్ని ఎదుర్కోవడం ఎలాగో తెలుసుకునే ముందుగా అసలు వైరస్ గురించి కాస్తంత అవగాహన పెంచుకుందాం. దాంతో మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న అంశం చాలా తేలికవుతుంది. ప్రతిజీవిలోనూ ఎన్నో రకాల కణాలుంటాయి. ఉదాహరణకు గుండె కండర కణం, మెదడు కణం, ఊపిరితిత్తుల కణం.. ఇలా ఎన్నెన్నో. ప్రతి కణంలోనూ ఓ కేంద్రకం, అందులో క్రోమోజోములు ఉంటాయి. అవన్నీ డీఎన్ఏ, ఆర్ఎన్ఏలాంటి మూల పదార్థాలతో నిర్మితమై ఉంటాయి. వైరస్ అనేది కూడా కణంలోని మూల పదార్థమైన ఒక ఆర్ఎన్ఏ లేదా కొన్నిసార్లు డీఎన్ఏ మాత్రమే నిర్మితమై ఉండే చాలా చిన్న జీవాంశం. మనకు ఏదైనా పరాన్నజీవి సోకిందనుకోండి. అప్పుడు అది బ్యాక్టీరియానో, ఫంగసో లేదా ఏకకణజీవో అయితే.. మందులు వాడి దాన్ని ఒకింత తేలిగ్గానే చంపవచ్చు. కానీ వైరస్ అలా కాదు. అది ఆర్ఎన్ఏ కావడం వల్ల మన కణంలోకి చొరబడి మన ఆర్ఎన్ఏలతో కలిసిపోయి తన ప్రత్యుత్పత్తి నిర్వహించుకుంటూ ఉంటుంది. ఇలా ఒక కణంలోకి చొరబడిన ఓ వైరస్.. మూడొందలు మొదలుకొని 1000కి పైగా వైరస్‌లుగా పెరిగి ఆ కణాన్ని నాశనం చేసి, బయటకు వచ్చేస్తుంది. కొత్తగా పుట్టిన అవి మళ్లీ తమ ప్రత్యుత్పత్తిని కొనసాగిస్తాయి. అలా వైరస్లలో హానికరమైనవి వ్యాపించినప్పుడు మనం వాటి దుష్ఫలితాలను చూస్తాం. ఈ వైరస్లు ఎంత చిన్నవంటే.. ఒక సూది మొన మీద కోట్లాది వైరస్లు ఉంటాయి. దాదాపు ప్రపంచవ్యాప్తంగా (ఈ కథనం రాస్తున్ననాటికి అంటే.. 26వ తేదీ సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బారిన పడిన వారు 18,12,57,890 మంది రోగులు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క కట్టింది). ఉజ్జాయింపుగా ఇప్పటికి 20 కోట్ల మంది కోవిడ్ బారిన పడ్డట్లు అంచనా వేసి... ఈ అందరిలోనూ ఉన్న ఈ బిలియన్లూ, ట్రిలియన్లలో ఉన్న వైరస్‌లను సేకరించి... ఓ టీ–కప్పు లో వేశామనుకుందాం.. ఇంకా ఆ టీకప్పు నిండకుండా.. కాస్తంత వెలితిగానే ఉంటుంది. అంత చిన్నవన్నమాట ఈ వైరస్లు. కరోనా ఏమిటీ... వాటి కొత్త స్ట్రెయిన్ కథ ఏమిటి? ఈ లోకంలో కోటాను కోట్ల రకాల వైరస్లు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందులో కేవలం మనకు జలుబు తెచ్చిపెట్టేవే దాదాపు 200 రకాల పైనే ఉంటాయి. వాటినీ వాటి సమలక్షణాల ఆధారంగా గ్రూపులుగా చేస్తే జలుబు తెచ్చే వైరస్లు ఆరు ప్రధాన రకాలు అవి.. 1) ఇన్ఫ్లుయెంజా, 2) పారా ఇన్ఫ్లుయెంజా, 3) రైనో వైరస్, 4) ఎడినో వైరస్, 5) హ్యూమన్ రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్ (ఆర్ఎస్వీ) 6) కరోనా. ఇలా చూసినప్పుడు కరోనా అన్నది ఈ ప్రపంచానికి కొత్తదేమీ కాదు. ఎప్పట్నుంచో ఉన్నదే. ఈ కరోనాలోనూ మళ్లీ ప్రధానమైనవి ఏడు రకాల వైరస్లు ఉన్నాయి. ఇవన్నీ ఒక మనిషి నుంచి ఇంకొకరికి వ్యాపించేవే. ఇందులో నాలుగు రకాలు మాత్రం చాలా తేలికపాటి జలుబును తెచ్చి, ఓ వారం రోజుల్లో తగ్గిపోయేలా మాయమవుతాయి. కానీ మరో మూడు మాత్రమే ఒకింత ప్రమాదకరమైనవి. ఆ మూడింటినీ నిర్దిష్టంగా చెప్పాలంటే 1) సార్స్ (సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్)ను తెచ్చే వైరస్, 2) మధ్యప్రాచ్య దేశాల్లో వచ్చిన వేరియెంట్ అయిన మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్)తో పాటు తాజాగా ఇప్పుడు మనకు కనిపిస్తున్న ‘కోవిడ్–19’ వైరస్. అంతెందుకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కొత్తల్లోనూ పరిశోధకులు దాదాపు 103 రకాల శాంపుళ్లను పరిశీలించినప్పుడు అందులో కొన్ని ‘ఎల్’ అనే రకానికీ, మరికొన్ని ‘ఎస్’ అనే రకానికి చెందనవి ఉన్నట్లు గుర్తించారు. వీటిల్లోనూ తొలుత ‘ఎస్’ వచ్చిందనీ.. అయితే అది కొందరికి మాత్రమే పరిమితం కాగా.. ఆ తర్వాత కనిపించిన ‘ఎల్’ రకం చాలామందిలో కనిపించినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రముఖమైన కొన్ని కొత్త వేరియెంట్లు ఇవే... ► ఆల్ఫా (బి.1.1.7.): గత ఏడాది చివర్లో ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో కనిపించిన వేరియెంట్ ఇది. ఇది కరోనా వైరస్ల మీద ఉన్న కొమ్ములాంటి దానిపై (స్పైక్ ప్రోటీన్‌లో) వచ్చిన మార్పు కారణంగా ఉనికిలోకి వచ్చిన వేరియెంట్. ఇది అంతకుముందున్న వేరియెంట్ల కంటే 70% వేగంగా వ్యాపిస్తోందని ప్రతీతి పొందింది. ► బీటా (బి.1.351): మిగతా అన్ని దేశాలతో పాటు ప్రత్యేకంగా ఇది సౌత్ ఆఫ్రికా, నైజీరియాలలో ఎక్కువగా వ్యాపించింది. సౌత్ ఆఫ్రికన్ వేరియెంట్ మిగతావాటికంటే ఒకింత ప్రమాదకారిగా పేరు పొందింది. ►గామా (పీ.1): ఈ ఏడాది మొదట్లో అంటే.. జనవరి 2021లో ఇది బ్రెజిల్ నుంచి జపాన్‌కు ప్రయాణం చేసిన వ్యక్తుల వల్ల జపాన్‌లో ఎక్కువగా కనిపించిందని నిపుణులు పేర్కొన్నారు. జనవరి చివరినాటికి అమెరికా అంతటా వ్యాపించింది. అయితే మిగతా అన్ని వేరియెంట్ల కంటే ఇది చాలా వేగంగా అంటుకుంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇక అప్పటికే ఒకసారి కోవిడ్–19 వచ్చిన వారికీ రెండోసారి రావడానికి ఇదే కారణమని వారు తెలిపారు. ఈ సంగతి బ్రెజిల్‌లోని 29 ఏళ్ల మహిళకు చేసిన పరీక్షల్లో పరిశోధనల్లో నిర్ధారణ కూడా అయ్యింది. గతంలో ఆమెలో పుట్టిన యాంటీబాడీలను తట్టుకుని కూడా పెరిగేలా ఈ వేరియెంట్ మార్పులు చెందిందని తెలిసింది. ► డెల్టా (బి.1.617.2): ఈ వేరియెంట్నే మన దేశపు వేరియెంట్‌గా పిలుస్తున్నారు. నిజానికి ఇది గత ఏడాది చివర్లో అంటే డిసెంబరులోనే మన దేశంలో కనుగొన్నా.. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి దేశమంతటా విజృంభించి, విలయతాండవంతో వేలాది మరణాలకు కారణమైందని చెబుతున్నారు. మన దేశంతో పాటు దీన్ని యూఎస్, యూకే, సింగపూర్ వంటి మరో 43 దేశాల్లోనూ చూశారు. ►డెల్టా ప్లస్ (ఏవై.1): కరోనా డెల్టా వేరియెంట్ (బి.1.617.2) అనేది మార్పులకు గురై డెల్టా ప్లస్ (ఏవై.1)గా మారినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ మార్పు కారణంగా కరోనా వైరస్‌లో ఉండే స్పైక్‌లలో మార్పు వచ్చి... అవి మరింతగా కణంలోకి చొచ్చుకుపోయేలా మార్పులు జరిగిందని నిపుణుల మాట. ఈ మార్పులను ‘కే417ఎన్’గా చెబుతున్నారు. ఇప్పటివరకు రూపొందిన వ్యాక్సిన్లన్నీ గతంలోని వేరియెంట్లనూ, మామూలుగా ఉన్న స్పైక్లనూ సమర్థంగా ఎదుర్కొంటున్నవని తేలినప్పటికీ... ఇవి ఈ కొత్త మార్పులతో రూపొందిన వైరస్ వేరియెంట్లను ఎదుర్కోగలవా అన్నది నిపుణుల ముందు ఉన్న సందేహం. అందువల్లనే దీనిపై అన్ని వర్గాల ప్రజల్లోనూ భయాందోళలను పెరుగుతున్నాయి. ఇది ఇప్పటికే మహారాష్ట్ర, ఝార్ఖండ్ వంటి కొన్ని రాష్ట్రాలలో మూడో వేవ్‌ని తెచ్చినట్లుగా మరికొందరి అనుమానం. కాగా... ఇదే మూడో వేవ్‌కు కారణమవుతుందేమోనన్నది చాలామందిలో ఉన్న సంశయం. మూడో వేవ్ తప్పదా? ఇప్పుడు ముఖ్యంగా మూడో వేవ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటివరకూ దాదాపు 7 నుంచి 8 వేల వరకు మ్యూటేషన్స్ జరిగాయంటూ మనం ఈ కథనంలోనే చెప్పుకున్నాం. కానీ ఈ ఏడెనిమిది వేలలో కేవలం అల్ఫా, బీటా, గామా, డెల్టాల గురించి ఎందుకు ప్రస్తావించాం? ఎందుకంటే... కేవలం ఆర్ఎన్ఏ మాత్రమే ఉండే కరోనా వైరస్‌లో దాదాపు పదివేల మార్పులు వచ్చి... పదివేల వేరియెంట్లుగా మారినప్పటికీ ఓ నాలుగైదు మాత్రమే ప్రమాదకారులుగా ఉండటం మనం చూశాం. అంటే... ఇప్పుడూ మళ్లీ మరో మూడు నాలుగు వేల మార్పులు జరిగినప్పటికీ వాటిల్లో ఏదైనా ఘోర ప్రమాదకారి అవుతుందేమో! అలా అయితే ఏం చేయాలి అనేదే సమస్యగాని... తప్పక మూడో వేవ్ వచ్చి తీరుతుందనీ... అది ప్రమాదకారిగా మారి విలయం సృష్టిస్తుందనీ కాదు. మనకు తెలుసు మనుగడ కోసం ప్రతి జీవీ మరింత ఎక్కువ మెరుగ్గా మారుతుందని. జీవుల్లో ఓ వైరస్‌కు యాంటీబాడీస్ వల్ల నిరోధకత పెరుగుతున్న కొద్దీ... వాటిని అధిమించడానికి అది ఆ యాంటీబాడీస్‌ను తప్పించుకుని మరింత శక్తిమంతం అయ్యేలా రూపొందడానికి ప్రయత్నిస్తుంటుంది. దీన్నే ‘యాంటీబాడీ ఎస్కేప్ వేరియెంట్’ అని కూడా అంటుంటారు. (పెద్దగా ఫలితం లేకపోవడంతో పాటు ప్రమాదకరమైన కొత్త వేరియెంట్లకు కారణమవుతుందనే అంశాల వల్లనే ప్లాస్మాథెరపీని చికిత్స ప్రోటోకాల్ నుంచి తొలగించిన సంగతి మనకు తెలిసిందే). పై అంశాలన్నింటినీ పరిశీలించినప్పుడు ఈ ఏడాది చివరినాటికి 10,000 సార్లు మ్యూటేషన్ జరిగి కొత్త కొత్త వేరియెంట్లు వస్తే... అందులో ఏదైనా ఇప్పటి చికిత్సలకు లొంగనంత బలంగా కొత్త స్ట్రెయిన్ వస్తే... దాని వల్ల మూడో వేవ్ రావచ్చన్నది నిపుణుల అంచనా. అంతేతప్ప అది తప్పక వస్తుందనీ కాదు... రాదనే గ్యారంటీలేదు. కాకపోతే వస్తే ఏమిటి, ఎదుర్కోవడం ఎలా అన్న సన్నద్ధత మాత్రం తప్పక ఉండాల్సిందే. పిల్లలపైన తప్పక ప్రభావం చూపుతుందా? ఈసారి వచ్చే వేరియెంట్ ఈసారి పిల్లలపై ప్రభావం చూపుతుందనే వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కారణం ఉంది... మొదటి వేవ్ వచ్చినప్పుడు ఎక్కువగా వయోవృద్ధులు, బాగా వయసు పైబడినవారు ప్రభావితం అయ్యారనీ, రెండో వేవ్‌లో యువకులు మొదలు మధ్యవయస్కులు ఈ వైరస్ బారిన పడ్డారనీ... అందువల్ల మూడోవేవ్ వస్తేగిస్తే అది తప్పక పిల్లల మీద ప్రభావ చూపుతుందనేది చాలామంది చెబుతున్న మాట. కానీ గణాంకాల మాట వేరేగా ఉంది. ఉదాహరణకు ఏడాది నుంచి పదేళ్ల పిల్లల విషయంలో చూస్తే మొదటి వేవ్‌లో 3.28% చిన్నారులు దీనిబారిన పడగా రెండో వేవ్‌లో వారి శాతం 3.05% మాత్రమే. అంటే ఇంకా చెప్పాలంటే పిల్లల శాతం తగ్గింది. ఇక 11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్యవారిని చూస్తే.. మొదటి ఏడాదిలో వారి శాతం 8.03% కాగా రెండో వేవ్‌లో అది 8.57 శాతానికి పెరిగింది. అంటే పెరుగుదల కేవలం 0.54% మాత్రమే. అంటే.. కరోనాతో ప్రభావితమయ్యే పిల్లల శాతం మొదటి నుంచీ దాదాపుగా (అటు ఇటుగా) మూడు శాతానికి దగ్గరగానే ఉంది. వాళ్లలోనూ ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్లిన వారు చాలా చాలా తక్కువ. కాబట్టి గణాంకాల పరంగా చూసినా పిల్లలు ప్రభావితమవుతారనేందుకు ఎలాంటి దాఖలాలూ లేవు. ఇక మొదట్లో వయోవృద్ధులూ రెండో వేవ్‌లో మధ్య వయస్కులూ ప్రభావితమయ్యారని చెప్పడానికీ పెద్దగా ఆస్కారం లేదు. ఉదాహరణకు మొదటి వేవ్‌లో 21 – 30 ఏళ్ల వారు 21.21% అయితే రెండోవేవ్ నాటికి ఈ సంఖ్య 22.49% మాత్రమే. అంటే పెరుగుదల 1.28% మాత్రమే. అలాగే 31–40 ఏళ్ల వారూ మొదటివేవ్లో 21.23% ఉండగా రెండోవేవ్‌లో వారి శాతం 22.70%. అంటే పెరుగుదల కేవలం శాతం 1.47% మాత్రమే. ఇలా చూసినప్పుడు మధ్యవయస్కులోనూ జబ్బుపడ్డవారి సంఖ్య పెరుగుదల గణనీయంగా ఏమీ లేదు. అయితే మొదటివేవ్లో వృద్ధులు ఎక్కువగా ప్రభావితమయ్యారనీ, రెండోవేవ్‌లో వారి శాతం అంతగా లేదని చెప్పడం ఒక రకంగా వాస్తవమే అయినా.. మొదటివేవ్‌తో పోల్చినప్పుడు ఆ ఏజ్ గ్రూపులపై కుటుంబ సభ్యుల శ్రద్ధ పెరగడం.. కరోనా వైరస్ అందుబాటులోకి రాగానే మొదట మనం టీకాలు వేసింది. 65 ఏళ్లకు పైబడినవారికి మాత్రమేనని గుర్తుపెట్టుకుంటే అందుకు కారణాలు మనకే తేలిగ్గా అర్థమవుతాయి. ఇదే టీకా కార్యక్రమం విస్తరించి అన్ని వయసుల వారికీ విస్తృతంగా వ్యాక్సిన్ అందేలా చేసినప్పుడు మూడో వేవ్ ప్రభావం అసలు పెద్దగా ఉండకపోవచ్చు. ఉన్నా నామమాత్రం కావచ్చు కూడా. అందుకే టీకా కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడితే మూడో వేవ్ అంత ప్రమాదకారి కాబోదనే మన ముందున్న గణాంకాలూ, అంచనాలు చెబుతున్నాయి. అంటే.. మూడోవేవ్ ప్రభావాన్ని తగ్గించేది టీకా అన్న విషయాన్ని అందరూ గుర్తెరిగితే చాలు. ఇక మరో విషయం ఏమిటంటే.. వైరస్ పిల్లల శరీరంలోకి చేరడానికి, పెద్దల్లోలాగా వాళ్లలో రిసెప్టార్లు అంతగా అభివృద్ధి చెంది ఉండవు. దాంతో పిల్లలు ఇప్పటివరకూ చాలా తక్కువ సంఖ్యలోనే వ్యాధి బారినపడ్డారు. ఇదే సానుకూలమైన అంశం మూడోవేవ్‌లోనూ కనిపించవచ్చు. అందుకే మూవోవేవ్లో పిల్లలు తప్పకుండా పడతారన్నది ఒక ఆధారం లేని అంచనాయే తప్ప అదే వాస్తవం కాదు. కోవిడ్ ఇన్ఫెక్షన్ పిల్లలో తీవ్రంగా ఉంటుందా? పెద్దలతో పోలిస్తే పిల్లల్లో కోవిడ్ న్యుమోనియా ఒకింత తక్కువే అయినా మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎమ్ఐఎస్–సి) వంటి కోవిడ్–19 అనంతర దుష్ప్రభావాలు పిల్లల్లో ఎక్కువగా కనిపించేందుకు అవకాశం ఉంది. అలాగే ఈ ఎమ్ఐఎస్–సిలోనూ కొన్ని సందర్భాలో లక్షణాలు ఏమీ లేకుండా లేదా కొన్ని చాలా స్వల్ప లక్షణాలతో కరోనా సోకిన 2 – 6 వారాల తర్వాత కూడా కొందరిలో ‘ఇమ్యూన్ డిస్‌రెగ్యులేషన్’ ఉండవచ్చునని కొందరి ఆందోళన. ‘ఇమ్యూన్ డిస్‌రెగ్యులేషన్’ అంటే పిల్లల్లో ఉండే వ్యాధినిరోధకత తీవ్రంగా ప్రభావితమై వారు ఇతరత్రా ఇన్ఫెక్షన్లకు గురికావడం. అయితే ఇలా జరగడానికి ఉన్న ఆస్కారం తక్కువ. ఒక పరిశీలన మేరకు ప్రస్తుతం లక్షమంది పిల్లల్లో కేవలం పన్నెండు కంటే తక్కువ కేసుల్లోనే ఇలాంటి పరిస్థితిని నిపుణులు చూశారు. త్వరగా గమనిస్తే ఇలాంటి కేసులకూ సమర్థమైన చికిత్స అందించవచ్చు. పైగా ఒకవేళ పిల్లల్లో ‘ఎమ్ఐఎస్–సి’ వచ్చినా.. ఆ చిన్నారుల నుంచి ఈ సమస్య ఇతరులకు వ్యాపించడం లేదు. కాబట్టి ఎలా చూసినా పిల్లల్లో థర్డ్ వేవ్ ప్రభావం ఉంటుందనే వాదనలకు సరైన ఆధారాలు లేవు. అంతమాత్రాన నిర్లక్ష్యం కూడదు... అయితే తార్కాణాలేవీ కనిపించనప్పటికీ పిల్లల విషయంలో అప్రమత్తత మాత్రం అవసరం. ఎందుకంటే ఇప్పటికి మనం టీకా వేస్తున్నది కేవలం 18 ఏళ్లకు పైబడినవారికి మాత్రమే. వాళ్లందరికీ ఇమ్యూనిటీ వచ్చాక... అలాంటి రక్షణ వలయం లేనివారు పిల్లలే అవుతారు. కాబట్టి వారి విషయంలో చాలా చాలా అప్రమత్తంగా ఉండి తీరాల్సిందే. ఎలాంటి పిల్లలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు? ►పెద్దల్లోలాగే దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలపై కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు. మరీ ముఖ్యంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయ సంబంధిత సమస్యలు, థలసీమియా వ్యాధిగ్రస్తులైన పిల్లలపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. కాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు, కీమోథెరపీ / రేడియేషన్ థెరపీ వంటివి తీసుకుంటున్న పిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి పిల్లలకు ప్రాధాన్యక్రమంలో వ్యాక్సిన్ ముందుగా ఇచ్చే ఏర్పాట్లూ చేయాలి. ∙ఊబకాయం ఉన్న పిల్లల విషయంలో సాధారణ పిల్లల కంటే ఒకింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ∙పోషకాహారలోపం ఉన్న పిల్లలూ, రోగనిరోధక వ్యవస్థలో లోపం ఉన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్లో హోమ్ ఐసోలేషన్ ఎలా? ► వైరస్ సోకిన పిల్లలు తల్లిదండ్రులతో ఉండవచ్చు. ఆ సమయంలో పెద్దల సపోర్ట్ పిల్లలకు చాలా అవసరం కాబట్టి వారి వెంట ఉండాల్సిందే. అయితే పేరెంట్స్ కోవిడ్ నిబంధలైన మాస్క్ ధరించడం, చేతులను మాటిమాటికీ కడుక్కోవడం వంటి జాగ్రత్తలను తప్పక పాటిస్తూ ఉండాలి. ► కరోనా వైరస్‌కు గురైన పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాతలూ, నానమ్మ, అమ్మమ్మలూ, మామ్మలతో పాటు ఇంట్లో పెద్దవయసు వారి దగ్గర వదలకూడదు. మైల్డ్ నుంచి ఓ మోస్తరుగా లక్షణాలు కనిపించిన పిల్లలను 10రోజులు, తీవ్రమైన లక్షణాలు కనిపించినవారిని 20 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలి. అందరికీ వ్యాక్సిన్ వేశాక కరోనా కథ ముగిసిపోతుందా? ఈ విషయం ఇంకా స్పష్టంగా తెలియదు. అందరికీ వ్యాక్సిన్ అందాక మనందరిలోనూ కరోనా వైరస్‌కు ఇమ్యూనిటీ వస్తే మున్ముందు అది మరిన్ని వేరియెంట్లుగా మారే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. దాంతో జలుబు తెచ్చిపెట్టే అనేకానేక వైరస్లలో ఇదీ ఒకటిగానో లేదా ఫ్లూలా ప్రతి ఏడాదీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన ఓ ప్రమాదరహితమైన (అంటే ఏ కొద్దిమందికో తప్ప మిగతా ప్రజలందరికీ ప్రమాదం చేకూర్చని) ఇన్ఫెక్షన్లా మిగిలిపోవచ్చు. గతంలోనూ ఎన్నో పాండమిక్‌లను ప్రపంచం చూసినట్లుగానే దీన్నీ సమర్థంగా ఎదుర్కొని మానవాళి ఎప్పటిలాగే తన మనుగడ కొనసాగించవచ్చు. వేరియెంట్లు లేదా కొత్త స్ట్రెయిన్లు ఎలా పుడతాయంటే... వైరస్లు తొలుత హైజాక్ చేసినట్లుగా తాము ప్రవేశించిన కణంలోకి దూరిపోతాయి కదా. అక్కడ తమను వృద్ధి చేసుకోవడం మొదలుపెడతాయి. తమను తాము వృద్ధి చేసుకునే ప్రక్రియలో తమ ‘కాపీ’ వైరస్‌ను సృష్టిస్తాయి. ఈ ప్రక్రియనే ‘కాపీయింగ్’ అంటారు. ఒక వైరస్ వేలాది వైరస్‌లను కాపీ చేసుకుంటుంది. ఇవన్నీ మళ్లీ అన్నన్ని కణాలను హైజాక్ చేసి.. మళ్లీ వేలాదిగా, లక్షలాదిగా పెరుగుతూ పోతాయి. ఇలా వేల కొద్దీ పుట్టే సమయంలో వాటి ఆర్ఎన్ఏలో ఏదైనా చిన్న పొరబాటు జరిగి.. ఆ ఆర్‌ఎన్‌ఏలోని పదార్థాల్లో కొత్త మార్పులు జరిగితే.. అది కొత్త స్ట్రెయిన్‌గా, కొత్త వేరియెంట్‌గా మారే అవకాశం ఉంది. కోటాను కోట్లుగా కాపియింగ్ జరిగే ప్రక్రియలో ఇలా కొత్త స్ట్రెయిన్లు, కొత్త వేరియెంట్లుగా మారే అవకాశాలు ఎక్కువ. పిల్లల విషయంలో మన సన్నద్ధత ఎలా ఉండాలంటే... ► పిల్లలైనా పెద్దలైనా మొదట కనిపించే లక్షణం కేవలం జ్వరం మాత్రమే. కాబట్టి ఈ లక్షణాన్ని తేలిగ్గా ఎదుర్కొనేలా పారాసిటమాల్‌తో పాటు వారికి అవసరమైన మాత్రలను సంసిద్ధంగా ఉంచుకోవాలి. ► పిల్లలకు అవసరమైన ఇన్‌పేషెంట్ వసతులతో హాస్పిటల్స్‌ను సైతం సిద్ధం చేయాలి. ఆసుపత్రి సిబ్బంది అందరినీ అప్రమత్తం చేయాలి. ► పిల్లలకు వచ్చేందుకు అవకాశం ఉన్న మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎమ్ఎస్ఐఎస్)కి అవసరమైన ఔషధాలు, చికిత్స సదుపాయాలను ముందునుంచే తయారుగా పెట్టుకునేలా హాస్పిటళ్లను సంసిద్ధం చేయాలి. ► పిల్లల కోసమే ప్రత్యేకంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)తో కూడిన కోవిడ్ వార్డుల ఏర్పాటు జరగాలి. ► పిల్లలు కూడా పెద్దలు తీసుకుంటున్న జాగ్రత్తలను తప్పక పాటించాలి. అంటే... మాస్క్ ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం. భౌతిక దూరం వంటివి పాటించాలి. పిల్లలు ఈ మార్గదర్శకాలను పాటించేలా పెద్దలు వారికి అవగాహన కల్పించాలి. అలా చేయడానికి వారికి తోడ్పడాలి. ► చివరగా... అమెరికాలాంటి దేశాల్లో ఇప్పటికే ఫైజర్ వంటి వ్యాక్సిన్లు పిల్లలకు సురక్షితమని తేలింది. ఇక మన దేశంలోనూ పిల్లలపై కోవాక్సిన్ వంటి వ్యాక్సిన్ల ట్రయల్స్ జరుగుతున్నాయి. వీటి ఫలితాలు వస్తే... మొదట్లో వయోవృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రాధాన్యక్రమంలో తొలుత 65 ఏళ్ల పైబడిన వారికి ఇచ్చినట్లే... మన ట్రయల్స్‌లోనూ పిల్లలకు వ్యాక్సిన్ సురక్షితమని తేలాక... ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ పిల్లలందరికీ వ్యాక్సిన్ అందేలా చూడాలి. పిల్లలతో మన అనుబంధం బలమైన భావోద్వేగపూరితమైన బంధం. వాళ్లు మన కంటి వెలుగులు. అందుకే గతంలో వ్యాక్సిన్ కొరత వంటి సంభవించిన అంశాలతో పాఠాలు నేర్చుకుని పిల్లల విషయంలో అలాంటి తప్పిదాలు జరగకకుండా... పిల్లలందరికీ వ్యాక్సిన్ అందేలా చూస్తే మూడో వేవ్ ప్రభావం వారి మీద లేకుండా జాగ్రత్తపడవచ్చు. పెద్దలూ... ఈ జాగ్రత్తలు తీసుకోండి... పిల్లల విషయంలో పెద్దలూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అతి తీవ్రమైన జ్వరం వచ్చినా, గొంతునొప్పి, దగ్గు, నీరసం, నిస్సత్తువ, బలహీనత, ఒళ్లునొప్పులూ, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, వాసన తెలియకపోవడం, తిండి సయించకపోవడం, చనుబాలు తాగే పిల్లలు పాలు తాగకపోవడం, ఒళ్ళంతా ఎర్రబడడం, కళ్లు, నాలుక ఎర్రబారడం, మగతగా ఉండటం, ఫిట్స్ రావడం, ఆయాసం రావడం, ఒళ్లు నీలంగా మారడం, అపస్మారక స్థితి, ఆక్సిజన్ లెవెల్ తగ్గడం వంటి తీవ్ర లక్షణాలను పిల్లల్లో గమనిస్తే తక్షణమే వారిని హాస్పిటల్‌కు తరలించాలి. -యాసీన్ -
కుక్క కాటుకు గురైనప్పుడు ఏం చేయాలో తెలుసా?
చిన్న పిల్లల మీద కుక్కల దాడులు అధికమతున్నాయి. వాటి దాడిలో చాలా మంది తీవ్రంగా గాయపడుతున్నారు. కుక్క కాటుకు గురైనప్పుడు ఏం చేయాలో, ఎలాంటి జగ్రత్తలు తెలుసుకోండి. ఈ కింది జాగ్రత్తలు తీసుకుంటే.. గాయం తీవ్రతను తగ్గించవచ్చు. ►కుక్క కరచినప్పుడు అయిన గాయాన్ని పై నుంచి పడే శుభ్రమైన నీటి ప్రవాహం కింద కడగాలి. అంటే... మగ్‌తో నీళ్లు పోస్తూ గాని, కుళాయి కింది గాయాన్ని ఉంచి నీళ్లు పడుతుండగా సబ్బుతో, వీలైతే డెట్టాల్‌తో వీలైనంత శుభ్రంగా కడగాలి. ► కుక్క కాటు గాయానికి ఎలాంటి కట్టు కట్టకూడదు. దాన్ని ఓపెన్‌గా ఉంచాలి. ►కుక్క కాటు తర్వాత రేబీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి తక్షణం డాక్టర్‌ను సంప్రదించి యాంటీరేబీస్ వ్యాక్సిన్‌ను అవసరాన్ని బట్టి మూడు లేదా ఐదు మోతాదుల్లో ఇప్పించాలి. ► గాయం తీవ్రతను బట్టి ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్స్‌ను గాయం అయిన చోట రెండు డోసులు ఇప్పించి, మిగతాది చేతికి ఇవ్వాల్సి ఉంటుంది. ► గాయం అయిన వైపు ఉండే చేతికి ఇమ్యునో గ్లోబ్యులిన్ ఇంజెక్షన్ ఇచ్చి... ఆ రెండో వైపు చేతికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్‌ను ఇవ్వాలి. -
అడినాయిడ్స్, టాన్సిల్స్ రెండు ఒక్కటేనా..?
చాలా మంది అడినాయిడ్స్, టాన్సిల్స్... ఈ రెండింటినీ ఒకటే అనుకుని పొరబడుతుంటారు. అడినాయిడ్స్‌లో సమస్య వస్తే టాన్సిల్స్ వాచాయని అనుకుంటుంటారు. కానీ అవి రెండూ వేర్వేరు. అసలు అడినాయిడ్స్ అంటే ఏమిటి, ఎక్కడ ఉంటాయి... అన్న విషయాలు తెలుసుకుందాం. అడినాయిడ్స్ ముక్కు లోపలి భాగానికి ఒకింత వెనకగా, నోటిలోపల అంగిటి పైభాగాన ఉంటాయి. అవి స్పాంజి కణజాలంతో తయారై మెత్తగా, గుంపులుగా అంటే ద్రాక్షగుత్తిలా ఉంటాయి. నోరు తెరవగానే టాన్సిల్స్ కనిపిస్తాయిగానీ, అడినాయిడ్స్ కనిపించవు. వీటిని చూడటానికి ఎండోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. అదేగాకుండా తల ఎక్స్–రే తీసినప్పుడు కూడా వాటి పరిమాణం వంటివి తెలుస్తాయి. అడినాయిడ్స్ పనేంటి? ఇవి పిల్లలను ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంటాయి. టాన్సిల్స్ లాగానే అడినాయిడ్స్ కూడా మనం గాలి పీల్చేటప్పుడు, తినేటప్పుడు ఎలాంటి హానికరమైన బ్యాక్టీరియాగాని, వైరస్‌గాని లోపలికి ప్రవేశించకుండా కాపాడతాయి. హానికరమైన బ్యాక్టీరియా తాలూకు యాంటీబాడీస్‌తో అడినాయిడ్స్‌లో ఉండే యాంటీబాడీస్ మనలోనికి శత్రుకణాలు ప్రవేశించినప్పుడు వాటితో పోరాడి మనల్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. అంటే... రక్షకభటుల్లా పనిచేసే ఇవి చిన్నపిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. చిన్నపిల్లల్లో వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉండి, వయసు పెరుగుతున్న కొద్దీ ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది. అందుకే పిల్లలు పెద్దవుతున్న కొద్దీ అడినాయిడ్స్ సైజ్ తగ్గుతూ, అవి క్రమంగా కృశించిపోతూ ఉంటాయి. ఐదేళ్ల వయసులో అడినాయిడ్స్ కృశించిపోతాయి. యుక్తవయసుకు రాగానే అడినాయిడ్స్ ఉండవు. కొందరు పిల్లల్లో అడినాయిడ్స్ వాపు ఎందుకు? బ్యాక్టీరియాగాని, వైరస్‌గాని లోనికి ప్రవేశించినప్పుడు అడినాయిడ్స్ కణజాలంలో వాపు వస్తుంది. కణజాలంలో వాపు రావడం వల్ల అవి ఇన్ఫెక్షన్ నుంచి కాపాడలేవు. అవి క్రమంగా బ్యాక్టీరియా, వైరస్‌లతో నిండిపోతున్న కొద్దీ వాటిలో వాపు పెరుగుతూ పోతుంది. అలాంటి సమయాల్లో కొన్నిసార్లు టాన్సిల్స్ కూడా ఇన్ఫెక్షన్కూ, వాపునకు గురవుతాయి. ఇలా వాపు పెరగడంతో గాలి పీల్చుకోవడమూ కష్టమవుతుంది. దాంతో కొన్ని ఇబ్బందులూ వస్తాయి అవి... చిన్నపిల్లల్లో ముక్కురంధ్రాలు మూసుకుని పోయి గాలి పీల్చడం కష్టమై, నోటితో గాలి పీల్చుకుంటారు. కొంతమంది పిల్లలకు నిద్ర చక్కగా పట్టకపోవడం, తరచూ నిద్రాభంగం కావడం జరుగుతుంటుంది. నిద్రపోయేటప్పుడు పిల్లలో గురక వస్తుంది. గొంతునొప్పిగా ఉండి, మింగడం కష్టమవుతుంది. మెడప్రాంతంలో ఉన్న గ్రంథులు వాపునకు గురవుతాయి. వినికిడి సమస్యలూ తలెత్తవచ్చు. దాంతోపాటు దంతసమస్యలూ తలెత్తవచ్చు. చికిత్స: అడినాయిడ్స్ వాపు ఉన్న పిల్లలు తరచూ జ్వరాలతో, అస్వస్థతో బాధపడుతుంటారు. అడినాయిడ్స్‌లో వాపు ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేస్తారు. అడినాయిడ్స్కు వచ్చిన వాపు వంటి సమస్యలకు సకాలంలో చికిత్స పొందకపోతే వ్యాధి తీవ్రత పెరిగి మందులకు నయం కాకపోవచ్చు. దాని వల్ల అడినాయిడ్స్ తొలగించాల్సి పరిస్థితి రావచ్చు. వాటిని తొలగించాల్సిన ప్రక్రియను అడినాయిడెక్టమీ అంటారు. -
జుట్టు రాలుతోందా...? అరికట్టండిలా..!
మీ జుట్టు రాలిపోతోందా? ఆందోళన పడకండి... ఈ కింద పేర్కొన్న అంశాలను తెలుసుకొని, సూచించిన జాగ్రత్తలను పాటించండి. మంచి జుట్టు కోసం ముఖ్యంగా మూడు అంశాలు అవసరం. అవి... జింక్, ఐరన్, విటమిన్–సి. ఈ మూడూ పుష్కలంగా అందేలా మన ఆహారాన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటే జుట్టు రాలిపోవడాన్ని చాలావరకు అరికట్టవచ్చు. ఐరన్ కోసం మనకు ఐరన్ సమృద్ధిగా అందాలంటే... గుడ్డు, డ్రైఫ్రూట్స్, జీడిపప్పు లాంటి నట్స్, సీఫుడ్స్ వంటి తీసుకోవాలి. మాంసాహారంలోనూ... కాలేయం, కిడ్నీల వల్ల ఐరన్ ఎక్కువగా సమకూరుతుంది. శాకాహారులైతే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే పాలకూర వంటి ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువ. అందుకే ఆహారంలో వాటి పాళ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. విటమిన్–సి కోసం ఆహార పదార్థాలన్నింటిలోనూ ఉసిరిలో విటమిన్–సి పుష్కలంగా దొరుకుతుంది. అలాగే బత్తాయి, నారింజ వంటి నిమ్మజాతి పండ్లన్నింటిలోనూ విటమిన్–సి ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. జింక్ కోసం గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. అందుకే వాటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. జుట్టు విపరీతంగా ఊడిపోయేవారి ఆహారంలో జింక్, ఐరన్ పుష్కలంగా ఉండాలని బ్రిటిష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ గట్టిగా సిఫార్సు చేస్తోంది.జింక్‌కు గుమ్మడి గింజలు మంచి వనరు. దానితో పాటు సీఫుడ్, డార్క్‌చాక్లెట్, వేరుసెనగలు, వేటమాంసంలోనూ జింక్ ఎక్కువే. పుచ్చకాయ గింజల్లోనూ జింక్ ఎక్కువే. మీరు తినే సమతులాహారంలో ఇవి తీసుకుంటూనే... జుటు ఆరోగ్యం కోసం వారంలో కనీసం రెండు సార్లు తలస్నానం చేయండి. జుట్టు రాలిపోవడం తగ్గుతుంది. అప్పటికీ జుట్టు రాలుతుంటే మాత్రం... ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకుని డాక్టర్‌ను కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే థైరాక్సిన్ హార్మోన్ అసమతౌల్యతతో జుట్టు రాలే సమస్య ఉంటుంది. ఆహారం ద్వారానే ఈ సమస్యను అధిగమించాలనుకుంటే మీ డైట్లో క్రమం తప్పకుండా చేపలు ఉండేలా చేసుకొండి. ఇన్ని జాగ్రత్తల తర్వాత కూడా జుట్టు రాలడం ఆగకపోతే ఓసారి ట్రైకాలజిస్ట్ / డర్మటాలజిస్ట్‌ను కలవండి. -
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతి
సాక్షి, విజయవాడ: కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. సమావేశాలు జరిగేటప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సిబ్బందని వెంట తీసుకురావద్దని అసెంబ్లీ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక బులెటిన్‌ను విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సభ్యులంతా కచ్చితంగా భౌతికదూరం పాటించాల్సిందేనని నిబంధనలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అసెంబ్లీలోకి అనుమతి ఉంటుదని తెలిపారు. కారు పాస్ ఖచ్చితంగా వాహనాలకు అతికించాలని స్పష్టం చేశారు. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. (అచ్చెన్నకు మా ఉసురే తగిలింది) గుర్తు తెలియనివారికి అసెంబ్లీలోకి అనుమతించేది లేదని పేర్కొన్నారు. అలాగే గన్మెన్లను, విజిటర్లను అసెంబ్లీలోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇక అసెంబ్లీలోకి ఎలాంటి ఆయుధాలు తీసుకురావద్దని సభ్యులకు ఆదేశాలు జారీచేశారు. బ్యానర్లు, ఫ్లకార్డ్స్, కర్రలు, స్ప్రేలు వంటివేవీ అనుమతించమని, అసెంబ్లీ ఆవరణలో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదన్నారు. సభ్యులు తమవెంట పీఎస్‌లు, పీఏలు, పీఎస్‌ఓలను తీసుకురావొద్దని కోరారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. (కార్మికుల ఉసురు తీశారు) -
కరోనా జయించాలంటే ఇవి తినాలి
ప్రపంచ దేశాల ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న కరోనా వైరస్ (కోవిడ్-19) సోకకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యల గురించి ప్రపంచ వైద్య నిపుణులు ఇప్పటికే పలుసార్లు వెల్లడించిన విషయం తెల్సిందే. కరోనా వైరస్ సోకితే కచ్చితంగా ప్రాణాపాయమంటూ భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, సకాలంలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటే ఎలాంటి ప్రాణహాని ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. కరోనా బాధితుల్లో మృతుల సంఖ్య 3.6 శాతానికి మించి లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేయగా, ఒక శాతానికి మించి ఉండదని లండన్, ఆస్ట్రేలియా వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. (కరోనా పుణ్యమా.. గూగుల్ వేటలో అదే టాప్) కరోనా వైరస్‌ను జయంచడంలో ప్రజల్లో ఉండే రోగ నిరోధక వ్యవస్థ ఎక్కువగా దోహద పడుతోంది. ఈ రోగ నిరోధక వ్యవస్థ మనం తీసుకునే ఆహారం అలవాట్లపై ఆధారపడి ఉంటుందని, రోగ నిరోధక వ్యవస్థను పెంచే ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుందని ఆస్ట్రేలియా వైద్యులు సూచిస్తున్నారు. మన వంటకాల్లో, తినే పదార్థాల్లో యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే అల్లం, ఉల్లిపాయ, క్యారెట్లు, గుమ్మడికాయ, పసుపు లాంటివి రోజు ఒక్కసారైనా ఉండేలా చూసుకోవాలి. రోజు విడిచి రోజు నాలుగు రకాల కూరలు లేదా కూరగాయలు తినాలి. వీటిలో పాలకూర, బ్రోకలీ, పుట్ట గొడుగులు ప్రశస్తమైనవి. అల్ల నేరేడు పండ్లు, బెర్రీలు, దానిమ్మ పండ్లు, బాదం గింజలు వారానికి మూడుసార్లు తీసుకోవాలి. వీటిలో రోగ నిరోధక శక్తిని పెంచే సీ, బీ, ఈ విటమిన్లు ఉంటాయి. చేపలు, గుడ్లు, మాంసంలో కండరాలు, ఎముకలను బలంగా ఉంచే ప్రొటీన్లతోపాటు డీ సహా 20 రకాల విటమిన్లు ఉంటాయి. జింకు ఎక్కువగా ఉండే నత్త గుల్లలు వారానికి ఓసారి తినడం మంచిది. (ఆపిల్, నైక్, సోని ఆఫీసుల మూసివేత) వీటన్నింటితోపాటు బ్యాక్టీరియా సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల కూడా రోగ నిరోధక శక్తి మరింత పెరగుతుందని ఆస్ట్రేలియా న్యూట్రిషనల్ థెరపిస్ట్ హన్నా బ్రాయ్ తెలిపారు. అలాగే రోజు గ్రీన్ టీ తీసుకోవడం మంచిది. మనం తీసుకునే ఆహారంలో ఇవి ఉండేలా చేసుకున్నట్లయితే సులభంగానే కరోనా వైరస్‌ను జయంచవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. (కరోనా వ్యాప్తికి విరుగుడు కనిపెట్టిన ప్రధాని) -
దీపావళిని సంతోషంగా జరుపుకోండిలా!
సాక్షి, హైదరాబాద్: దేశమంతా దీపావళి పండుగ సంబరాలు ప్రారంభమవుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఆనందంగా జరుపుకునే ఈ పండుగలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే పలు సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కింది సూచనలు పాటించడం ద్వారా ఈ పండుగను మరింత సురక్షితంగా జరుపుకోవచ్చు. కలుషిత గాలి: పండుగ సందర్భంలో పెద్ద ఎత్తున కాల్చే బాణసంచా వలన పెద్ద మొత్తంలో పొగ వెలువడి గాలి కలుషితమయ్యే అవకాశం ఉంది. ఈ కలుషిత గాలి శ్వాసకోస వ్యాధులు ఉన్న వారికి మరింత ప్రమాదకరం. ఆస్తమా, సీఓపీడీ వ్యాధులు ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. దూరం నుంచే బాణసంచా కాల్చాలి: బాణసంచా పేల్చేటపుడు వెలువడే రసాయనాల పొగ పలు ఆరోగ్య సమస్యలకు కారణం అయ్యే అవకాశం ఉంది. కనుక వాటికి దూరంగా ఉండే కాల్చాలి. పేలుడు సమయంలో వాటికి దగ్గరగా ఎవరూ లేకుండా చూసుకోవాలి. పెద్దల పర్యవేక్షణలోనే పిల్లలు బాణసంచా కాల్చాలి. సిటీకి దూరంగా ఉండాలి.: శ్వాసకోశ సంబంధ వ్యాధులు తీవ్ర స్థాయిలో ఉన్నవారు.. వీలైతే సిటీకి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. పండుగకు వారం ముందు నుంచే బాణసంచా కాల్చడం ప్రారంభమవుతుంది. కాబట్టి గాలిలో కలుషిత స్థాయి అలాగే కొనసాగే అవకాశం ఉంది. ఎత్తైన ప్రదేశాలలోని గాలి తక్కువగా కలుషితం అవుతుంది గనుక సాధ్యమైనంత మేరకు అటువంటి ప్రదేశాలు చేరడం ఉత్తమం. టెక్నాలజీ ఉపయోగించండి: గాలి కాలుష్యాన్ని తెలిపే మొబైల్ యాప్స్‌ను ఉపయోగించడం ద్వారా నిర్ణీత ప్రాంతంలోని కాలుష్య స్థాయిని తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ఎంతసేపు అక్కడ గడపవచ్చు, ఎంత మేరకు సురక్షితం వంటి విషయాలను అంచనా వేయవచ్చు. డాక్టర్‌ను కలవడం: శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్నవారు పండుగ రోజుల్లో పట్టణాల్లో గడపాల్సి వస్తే ముందుగా డాక్టర్‌ను కలవడం ఉత్తమం. ప్రస్తుత ఆరోగ్య స్థితి, పండుగ రోజున వెలువడే కాలుష్య స్థాయిని తట్టుకోగలదా లేదా అని డాక్టర్ ఇచ్చే సలహా ప్రకారం నడుచుకోవాలి. బయటకు వెళ్లాల్సి వస్తే ముఖాన్ని కప్పే మాస్క్‌లు ధరించాలి. డాక్టర్ సూచించిన మందులను అందుబాటులో ఉంచుకోవాలి. ఈ సలహాలను పాటించడం ద్వారా పండుగ సందర్భంలో ఎదురయ్యే పలు సమస్యలను సులువుగా అధిగమించి దీపావళిని సంతోషకరమైన అనుభూతిగా మలుచుకోవచ్చు. -
డెంగీ నివారణకు చర్య తీసుకోవాలి
నకిరేకల్: డెంగీ వ్యాధి నివారణకు చర్య తీసుకోవాలని కోరాతూ ప్రజాపోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్లేట్లెట్స్ పరీక్షలు చేసే సెల్ కౌంటర్ పరికరాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆస్పత్రికి వచ్చిన బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఇటీవల కాలంలో నకిరేకల్, కేతేపల్లి మండలాల్లో డెంగీ జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతరం ఆస్పత్రిలో జ్వర పీడిత రోగులను పరామర్శించారు.రోగులకు మెరుగైన సేవలు అందించాలని కోరుతూ ప్రధాన వైద్యాధికారి ఎండి.రఫీ, క్లస్టర్ ఇన్చార్జి వేణుగోపాల్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఆ సమితి నాయకులు గోపిరెడ్డి శ్యామ్ సుందర్‌రెడ్డి, రుద్రవరం నర్సింహ్మ, కొండ గూడురు సత్యనారాయణచారి, కుమార్, మహేశ్వరం సుధాకర్,మేకల సైదులు, కురుమిల్ల పర్శరామ్, పట్టేటి ప్రసాద్, పర్నాటి సీతారామిరెడ్డి, రమేష్ ఉన్నారు.