న్యూఢిల్లీ: దేశంలోని 15–18 ఏళ్ల గ్రూపు టీనేజర్లకు జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవాగ్జిన్ టీకా మాత్రమే అందుబాటులో ఉంటుందని కేంద్రం తెలిపింది. ఆరోగ్య కార్యకర్తలు తదితరులకు ‘ప్రికాషన్ డోస్’గా ఇచ్చే మూడో డోస్ టీకాపైనా మరింత స్పష్టత నిచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇవి జనవరి 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.
‘15ఏళ్లు ఆపై వారు కోవిన్ యాప్ ద్వారా టీకా కోసం జనవరి 1వ తేదీ నుంచి రిజిస్టర్ చేసుకోవచ్చు. 2007, అంతకంటే ముందే పుట్టిన వారు అర్హులవుతారు. దేశంలో 15–18 ఏళ్ల గ్రూపు వారికి కోవాగ్జిన్ టీకా(అత్యవసర వినియోగానికి) ఒక్కటే ప్రస్తుతం అందుబాటులో ఉంది’అని వివరించింది. జైడస్ క్యాడిలా సంస్థ తయారుచేసిన జైకోవ్–డీ వ్యాక్సిన్‌ను 12–18 ఏళ్ల వారికి వాడటానికి ఈ ఏడాది ఆగస్టు 20న అనుమతులు లభించినా.. ఈ టీకాను ఇంకా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో చేర్చలేదు కాబట్టి ప్రస్తుతానికి పిల్లలకు కోవాగ్జిన్ ఒక్కటే అందుబాటులో ఉంటుందని అధికారులు వివరించారు.
అదేవిధంగా, ‘ప్రాధాన్యతాక్రమం ప్రకారం హెల్త్‌కేర్ వర్కర్లు (హెచ్‌సీడబ్ల్యూలు), ఫ్రంట్‌లైన్ వర్కర్లు (ఎఫ్‌ఎల్‌డబ్ల్యూలు), 60 ఏళ్లకు పైబడిన ఇతర వ్యాధుల బాధితులు జనవరి 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ప్రికాషన్ డోస్‌కు అర్హులు. జనవరి 3వ తేదీ నాటికి వీరు కోవిడ్ టీకా రెండో డోస్ తీసుకుని 9 నెలలు లేదా 39 వారాలు పూర్తయి ఉండాలి’అని ఆ మార్గదర్శకాల్లో వివరించింది. ‘కోవిన్ యాప్ నుంచి వీరు టీకా కోసం నమోదు చేసుకోవచ్చు. కోవిన్ యాప్ నమోదైన రెండో డోస్ తీసుకున్న తేదీ ఆధారంగా ప్రికాషన్ డోస్‌కు అర్హత లభిస్తుంది. 9 నెలలు/39 వారాల గడువు ముగిసిన వారి రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు మెసేజీ అందుతుంది. ఆన్‌లైన్‌తోపాటు ఆన్‌సైట్‌లోనూ టీకా కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.
నేడు రాష్ట్రాలతో భేటీ
ప్రికాషన్ డోస్, టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అనుసరించాల్సిన కార్యాచరణ వ్యూహంపై చర్చించేందుకు కేంద్రం మంగళవారం రాష్ట్రాలతో వర్చువల్‌గా సమావేశం జరపనుంది.
Comments
Please login to add a commentAdd a comment