ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: దేశమంతా దీపావళి పండుగ సంబరాలు ప్రారంభమవుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఆనందంగా జరుపుకునే ఈ పండుగలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే పలు సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కింది సూచనలు పాటించడం ద్వారా ఈ పండుగను మరింత సురక్షితంగా జరుపుకోవచ్చు.
- కలుషిత గాలి: పండుగ సందర్భంలో పెద్ద ఎత్తున కాల్చే బాణసంచా వలన పెద్ద మొత్తంలో పొగ వెలువడి గాలి కలుషితమయ్యే అవకాశం ఉంది. ఈ కలుషిత గాలి శ్వాసకోస వ్యాధులు ఉన్న వారికి మరింత ప్రమాదకరం. ఆస్తమా, సీఓపీడీ వ్యాధులు ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
- దూరం నుంచే బాణసంచా కాల్చాలి: బాణసంచా పేల్చేటపుడు వెలువడే రసాయనాల పొగ పలు ఆరోగ్య సమస్యలకు కారణం అయ్యే అవకాశం ఉంది. కనుక వాటికి దూరంగా ఉండే కాల్చాలి. పేలుడు సమయంలో వాటికి దగ్గరగా ఎవరూ లేకుండా చూసుకోవాలి. పెద్దల పర్యవేక్షణలోనే పిల్లలు బాణసంచా కాల్చాలి.
- సిటీకి దూరంగా ఉండాలి.: శ్వాసకోశ సంబంధ వ్యాధులు తీవ్ర స్థాయిలో ఉన్నవారు.. వీలైతే సిటీకి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. పండుగకు వారం ముందు నుంచే బాణసంచా కాల్చడం ప్రారంభమవుతుంది. కాబట్టి గాలిలో కలుషిత స్థాయి అలాగే కొనసాగే అవకాశం ఉంది. ఎత్తైన ప్రదేశాలలోని గాలి తక్కువగా కలుషితం అవుతుంది గనుక సాధ్యమైనంత మేరకు అటువంటి ప్రదేశాలు చేరడం ఉత్తమం.
- టెక్నాలజీ ఉపయోగించండి: గాలి కాలుష్యాన్ని తెలిపే మొబైల్ యాప్స్‌ను ఉపయోగించడం ద్వారా నిర్ణీత ప్రాంతంలోని కాలుష్య స్థాయిని తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ఎంతసేపు అక్కడ గడపవచ్చు, ఎంత మేరకు సురక్షితం వంటి విషయాలను అంచనా వేయవచ్చు.
- డాక్టర్‌ను కలవడం: శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్నవారు పండుగ రోజుల్లో పట్టణాల్లో గడపాల్సి వస్తే ముందుగా డాక్టర్‌ను కలవడం ఉత్తమం. ప్రస్తుత ఆరోగ్య స్థితి, పండుగ రోజున వెలువడే కాలుష్య స్థాయిని తట్టుకోగలదా లేదా అని డాక్టర్ ఇచ్చే సలహా ప్రకారం నడుచుకోవాలి. బయటకు వెళ్లాల్సి వస్తే ముఖాన్ని కప్పే మాస్క్‌లు ధరించాలి. డాక్టర్ సూచించిన మందులను అందుబాటులో ఉంచుకోవాలి.
ఈ సలహాలను పాటించడం ద్వారా పండుగ సందర్భంలో ఎదురయ్యే పలు సమస్యలను సులువుగా అధిగమించి దీపావళిని సంతోషకరమైన అనుభూతిగా మలుచుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment