Diwali 2023: వెలుగుల ఉషస్సు | Diwali 2023: The festival of lights, explained through rituals | Sakshi
Sakshi News home page

Diwali 2023: వెలుగుల ఉషస్సు

Published Sun, Nov 12 2023 2:10 AM | Last Updated on Sun, Nov 12 2023 8:50 PM

Diwali 2023: The festival of lights, explained through rituals - Sakshi

‘‘సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం!’’
మన ఇంట్లో వెలిగించింది ఒక్క దీపమైనా ముల్లోకాల చీకట్లను పోగొట్టాలన్నది భారతీయుల ఆశంస. ప్రపంచంలోని అన్ని దేశాలవారు, అన్ని జాతుల వారు ఏదో ఒక సందర్భంలో దీపాల పండగ చేసుకుంటారు. చీకటి అంటే ఎవరికీ ఇష్టం ఉండదు కదా! ఎవరు ఏ కారణంగా జరుపుకున్నా మనస్సులలో ఉన్న ఆనందాన్ని వ్యక్తపరచటానికి సంకేతంగా దీపాలను వెలిగిస్తారు. లోపల ఉన్న ఆనందమనే వెలుగుని బహిర్గతం చేసి, పరిసరాలని వెలిగేలా చేయటం దీపం వెలిగించటంలోని ఉద్దేశం.

చీకటి, వెలుగు అనే మాటలని కాంతి అనే సందర్భంలోనే కాక ఎన్నింటికో ఉపయోగిస్తుంటాము. లోకంలో కావలసిన వాటిని కోరుకోదగిన వాటిని వెలుగుగాను, పనికి రానివాటిని, హాని కలిగించే వాటిని చీకటిగాను చెప్పు తుంటాము. అవిద్య, అజ్ఞానం, అనారోగ్యం, దుఖం, బాధ, చికాకు, దరిద్రం, అపకీర్తి, అవమానం, పాపం మొదలైన మనిషి నాశనానికి, నిరాశా నిస్పృహలకి హేతువులైనవన్నీ చీకటిగాను, జ్ఞానం, ఆరోగ్యం, సంతోషం, ఆనందం, ఆహ్లాదం, కీర్తి, పుణ్యం మొదలైన మానవునికి కోరుకోదగిన, ఉపయోగపడే వన్ని వెలుగుగాను సంకేతించటం జరిగింది. అందువలననే అన్నివిధాలైన చీకట్లను పోగొట్టే వెలుగు అంటే ఇష్టపడే జాతి భారతజాతి. కనుకనే దీపాన్ని ఆరాధిస్తాము.  పూజిస్తాము.

‘‘దీపం జ్యోతి పరమ్‌ బ్రహ్మ
దీపం సర్వ తమోపహమ్‌
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యాదీపం నమోస్తుతే!’’

అని దీపాన్ని ్రపార్థిస్తాము. ఇది నిత్యకృత్యం. వరుసలుగా వందలాది, వేలాది దీపాలు వెలిగించటానికి ఎంతటి సంతోషం ఉ΄÷్పంగి ఉండాలో కదా! అటువంటి సందర్భం ద్వాపరయుగం చివర లో వచ్చింది. దానికి బీజం కృతయుగంలోనే పడి త్రేతాయుగంలో మొలకెత్తింది. యజ్ఞవరాహమూర్తిగా తనను ఉద్ధరించిన మహావిష్ణువుని చూసి వలచింది భూదేవి.

తనకు కుమారుని ప్రసాదించమని కోరింది. ఆ సమయంలో గర్భధారణ జరిగితే అసుర లక్షణాలతో... లోకకంటకుడు అయిన కుమారుడు జన్మిస్తాడని అన్నాడు విష్ణువు. భూదేవి తమకంతో బలవంతం చేసింది. తప్పలేదు. లోకకంటకుడు భూదేవి గర్భంలో ఉన్నాడని తెలిసిన దేవతలు ఆ బాలుడు గర్భంలో నుండి బయటకు రాకుండా చూశారు. భూదేవి విష్ణువుని వేడుకుంది. త్రేతాయుగం చివరలో కుమారుడు ఉదయిస్తాడని అభయం ఇచ్చాడు.

ఆ బాలుడే నరకుడు. అతడికి పదహారు సంవత్సరాలు వచ్చిన తరువాత బ్రహ్మపుత్రానది పరీవాహక ్రపాంతంలో ్రపాగ్జ్యోతిషం రాజధానిగా కామరూపదేశానికి రాజుని చేస్తూ, ధర్మం తప్పవద్దని, గోబ్రాహ్మణులకు హాని తలపెట్టవద్దని, అలా చేస్తే కీడు వాటిల్లుతుందని హెచ్చరించాడు. ఆ మాట ననుసరించి చాలా కాలం భుజబలంతో తనకెవ్వరు ఎదురు లేని విధంగా ధర్మబద్ధంగానే పరిపాలించాడు.

కాని, ద్వాపరయుగం చివరలో అతడిలోని అసురలక్షణాలు బహిర్గత మయ్యాయి. వేదధర్మానికి దూరమై, తాంత్రికసాధన సత్వర ఫలవంతమని అనుసరించటం మొదలుపెట్టాడు. దానికోసం కామాఖ్యాదేవికి బలి ఇవ్వటానికి ఎంతోమంది రాజకుమారులను, పదునారు వేలమంది రాజకుమార్తెలను చెరపట్టి ఉంచాడు. అదితి కుండలాలను, వరుణుని ఛత్రాన్ని హరించాడు. దేవతలకు నిలువ నీడ లేకుండా చేశాడు. మరెన్నో దురంతాలు చేయ సాగాడు.

ఇంద్రుడి అభ్యర్థన మేరకు శ్రీ కృష్ణుడు నరకునిపై యుద్ధానికి వెడుతుంటే భూదేవి అవతారమైన సత్యభామ తానూ వెంట వస్తానని ముచ్చట పడింది. అక్కడ కృష్ణుడు మూర్ఛపోతే అతడికి సేదతీర్చుతూనే యుద్ధంలో నరకుని నిలువరించింది. సత్యభామ ఉపచారాలతో తేరుకున్న కృష్ణుడు చక్రంతో నరకుని తెగటార్చాడు. అది ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి. సత్యభామ కోరిక మేరకు ఆ రోజుని నరకుడి పేరుతో నరక చతుర్దశి అని పిలవటం జరిగింది. 

ఆ మరునాడు, అంటే, అమావాస్య నాడు ప్రజలందరు దీపాలు వెలిగించుకొని సంబరాలు చేసుకున్నారు. ఏదైనా శుభసంఘటన జరిగినప్పుడు కాని, ఎవరైనా మహానుభావులు పుట్టినప్పుడు కాని పండుగలు, వేడుకలు, సంబరాలు చేసుకుంటారు. కాని, ఈ సందర్భంలో ఒకరు చనిపోతే అతడి పేరు మీద చేసుకోవటం జరుగుతోంది. అతడి చావు ఎందు కంతగా సంతోష ప్రదమయింది?   నరకుడు భూదేవి పుత్రుడు.

భూమి వసుంధర. అన్ని రకాలైన ఓషధులు, ఖనిజాలు ఇచ్చేది భూదేవియే. భూపుత్రుడైన నరకునికి వాటన్నిటి మీద వారసత్వపు అధికారం ఉంది. కాని అతడు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. సంపదలతో పాటు వెలుగుని కూడా ఎవరికీ అందకుండా తానే స్వంతం చేసుకున్నాడు. ్రపాగ్జ్యోతిషమంటే ముందుగా వెలుగు ప్రసరించే ్రపాంతం. భారతదేశంలో మొదటి సూర్యకిరణం భూమిని సోకేది అక్కడే కదా! ముందుగా తనకి అందిన వెలుగుని ఇతరులకి చేరకుండా అడ్డుపడేవాడట!

నరకుని భయానికి పగటిపూట బయటకు రావటానికి భయం. వద్దామన్నా వెలుగు లేదు. రాత్రిపూట దీపం వెలిగిస్తే తమ ఉనికి తెలుస్తుందనే భయం. మొత్తానికి చీకట్లో, భయమనే చీకట్లో మగ్గారు. భయ కారణం పోగానే ఇన్నాళ్ళ దీపాలు, కరువుతీరా వెలిగించుకొని పండుగలు, వేడుకలు, సంబరాలు చేసుకున్నారు. ఆ శుభ సంఘటనని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ కృష్ణ అమావాస్యనాడు దీపాలు వెలిగించటం సంప్రదాయం అయింది.

ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఆవిర్భవించి, విష్ణువుని వివాహ మాడింది. దానితో దేవతలకు పోయిన స్వర్గలక్ష్మి లభించింది. కనుక దేవతలు కూడా దీపావళిని ఆనందంగా జరుపుకుంటారు. మనలోనూ, కుటుంబంలోనూ, సమాజంలోనూ, దేశంలోనూ, భూమండలం అంతా కప్పిన అన్నివిధాలైన అంధకారాలు పటాపంచాలు అయ్యే విధంగా దీపాలని వెలిగించి దీపావళిని దివ్య దీపావళిగా ఆనందోత్సాలతో జరుపుకుందాం. వెలుగులని పంచుదాం.

నరకుని సంహరించినదెవరు?
స్వంత కొడుకునైనా దుష్టుడైతే సంహరించటానికి అంగీకరించే, సహకరించే ఉత్తమ మాతృ హృదయానికి సంకేతం సత్యభామ. సౌందర్యానికి, స్వాభిమానానికి, మితిమీరిన కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమకి, పరాక్రమానికి పరాకాష్ఠగా మాత్రమే సత్యభామ ప్రసిద్ధం. కాని, మూర్తీభవించిన మాతృత్వం కూడా. ఒక్క దుష్టుడైన కుమారుడు లేకపోతే కోటానుకోట్ల బిడ్డలకి మేలు కలుగుతుంది అంటే అతడిని శిక్షించటానికి అంగీకరించేది  విశ్వమాతృ హృదయం. ఆ శిక్ష అతడు మరిన్ని దుష్కృత్యాలు చేసి, మరింత పాపం మూట కట్టుకోకుండా కాపాడుతుంది. ఇది బిడ్డపై ఉన్న ప్రేమ కాదా! బిడ్డ సంహారాన్ని ప్రత్యక్షంగా చూడటమే కాదు, ్రపోత్సహించి, సహాయం చేసిన కారణంగా కాబోలు, నరకాసురుణ్ణి సత్యభామయే సంహరించింది అనే అపోహ ఉన్నది.

లక్ష్మీపూజ ఎందుకు?
దీపావళి నాడు లక్ష్మీదేవిని పూజించటం సంప్రదాయం. ఆనాడు లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఆవిర్భవించి, నారాయణుణ్ణి చేపట్టింది. వ్యాపారస్తులు లక్ష్మీదేవిని పూజించి ఈ రోజే కొత్త లెక్కల పుస్తకాలు మొదలుపెడతారు. లక్ష్మీదేవి ఆ నాడు సంధ్యాసమయం తరువాత తన వాహనమైన గుడ్లగూబని అధిరోహించి విహారానికి బయలుదేరి, తన స్వరూపాలైన దీపాలు ఉన్న ఇంట ప్రవేశిస్తుంది. కనుక లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ ఎన్నో దీపాలు వెలిగిస్తారు. తరువాత బాణసంచా పేలుస్తారు. దీపాలు వరుసగా వెలిగిస్తారు కనుక ఈ పండగను దీపావళి అంటారు.

జ్ఞాన జ్యోతులు
అన్ని సంప్రదాయాల వారు దీపావళి జరుపుకోవటానికి వారి కారణాలు వారికి ఉన్నాయి. ఎవరు ఏ కారణంగా జరుపుకున్నా మనస్సులలో ఉన్న ఆనందాన్ని వ్యక్తపరచటానికి సంకేతంగా దీపాలను వెలిగిస్తారు. లోపల ఉన్న ఆనందమనే వెలుగుని బహిర్గతం చేసి, పరిసరాలని అంతా వెలిగేట్టు  చేయటం దీపం వెలిగించటంలోని ప్రధాన ఉద్దేశం. ముందురోజు నరకచతుర్దశి నాడు తెల్లవారుజామున చంద్రుడు ఉండగా నువ్వులనూనెతో అభ్యంగన స్నానం చేస్తారు. పెద్దలు యముడికి తర్పణాలు ఇస్తారు. పిండివంటలు, కొత్తబట్టలతో ఆనందంగా గడుపుతారు. మరునాడు దీపావళి. అమావాస్య పితృతిథి. పైగా దక్షిణాయనం. కనుక మధ్యాహ్న సమయంలో పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు.

– డా. ఎన్‌.అనంతలక్ష్మి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement