ఉగాది తెలుగువారి తొలిపండుగ. ప్రభవతో మొదలు పెట్టి అక్షయ వరకు తెలుగు సంవత్సరాలు 60. ఈ వరుసలో ఇప్పుడు మనం జరుపుకుంటున్న ఉగాదికి క్రోధి నామ సంవత్సర ఉగాది అని పేరు. క్రోధి అంటే కోపం కలవారని సామాన్యార్థం. క్రోధి అనే పదానికి కొన్ని నిఘంటువులు కోప స్వభావులైన కుక్క, దున్న΄ోతు అని అర్థం చెప్పినప్పటికీ, దానిని పరిగణనలోకి తీసుకోనక్కరలేదు. అన్ని స్వభావాల లాగే మనిషికి కోపం లేదా క్రోధం కూడా అవసరమే. మనకు ఎంత అవసరమో, అంతవరకు మాత్రమే కోపాన్ని ఉంచుకోవాలి. మిగిలిన దానిని నిగ్రహించుకోవాలి. ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రుడు కూడా కొన్ని సందర్భాలలో కోపించాడు. అలా మన జీవితాలకు అవసరమైన మేరకు మాత్రమే కోపాన్ని ఈ ఉగాది ఇస్తుందని, ఇవ్వాలనీ ఆశిద్దాం.
ఉగాదితో చాంద్రమాన సంవత్సరం మొదలవుతుంది. పౌర్ణమిచంద్రుడు చిత్త లేదా చిత్ర నక్షత్రంతో కూడి ఉన్న మాసాన్ని చైత్రమాసంగా పిలుస్తారు. చైత్రమాసం తొలిరోజు అంటే చైత్రశుక్ల పాడ్యమి రోజు ఉగాది అవుతుంది. చంద్రుడు ఒక నక్షత్రంతో మొదలుపెట్టి, భూమి చుట్టూ తిరిగి మళ్లీ ఆ నక్షత్రం దగ్గరకు రావడానికి పట్టే కాలం నక్షత్రమాసం అవుతుంది. ఆ రోజు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. కాలానికి సూర్య, చంద్ర గమనాలుప్రాతిపదిక కాబట్టి ఈ మేరకు చాంద్ర–సౌర సంవత్సరం అవుతుంది.
వ్యావహారిక శకానికి పూర్వం తొలిదశలో సప్తఋషులు నక్షత్ర సంవత్సరాన్ని, చాంద్ర–సౌర సంవత్సరాన్ని కలిపి పంచాంగాన్ని అమలులోకి తెచ్చారు. మూడు, ఐదు సంవత్సరాలలో వచ్చే అధికమాసాలను కలుపుకుని ఐదు సంవత్సరాలతో ఒక యుగం అని పంచాంగ పరంగా అమలు చేశారు. అప్పట్లో ఆ యుగం ఆరంభం శరత్ విషువత్, శరత్ ఋతువు లో ఉండేది. ఈ ఐదు సంవత్సరాల యుగంలో మొదటి సంవత్సరంలో మొదటి రోజు యుగాది అయింది; అదే ఉగాది అయింది. ఈ యుగం జ్యోతిష శాస్త్రానికి అనుగుణం గా కూడా రూపొందింది. ‘జ్యోతి’ అంటే నక్షత్రం అనీ ‘షం’ అంటే సంబంధించిన అనీ అర్థం. జ్యోతిషం అంటే నక్షత్రానికి సంబంధించినది అని అర్థం.
చాంద్ర– సౌర గమనాలప్రాతిపదికన మన పంచాంగం నిర్మితమైంది. పంచాంగం ప్రకారం మనకు ఉగాది నిర్ణీతమైంది. విశ్వామిత్ర మహర్షి పంచాంగంలోనూ, కాలగణనంలోనూ కొన్ని ప్రతిపాదనలను, మార్పులను తీసుకు వచ్చాడు. ఆ తరువాత కాలక్రమంలో జరుగుతూ వచ్చిన ఖగోళమార్పులకు తగ్గట్లు గర్గ మహాముని సంవత్సరాదిని వసంత విషువత్‌కు మార్చాడు. ఆర్యభట్టు, వరాహమిహిరుడు దాన్నే కొనసాగించారు. అదే ఇప్పటికీ కొనసాగుతోంది. సాంప్రదాయిక సంవత్సరాన్ని లేదా ఆచార వ్యవహారాల కోసం సంవత్సరాన్ని చైత్రమాసంతో మొదలుపెట్టారు.
వసంతం, వసంతంతోపాటు ఉగాది... ఈ రెండు ప్రాకృతిక పరిణామాల్ని మనం మన జీవితాలకు ఆదర్శంగా తీసుకోవాలి, వసంత ఋతువు రావడాన్ని వసంతావతారం అని కూడా అంటారు. వసంతావతారం సంవత్సరానికి ఉన్న అవతారాలలో గొప్పది, ఆపై శోభాయామానమైంది. సంవత్సరానికి శోభ వసంతం. వసంతం మనకు వచ్చే ఋతువుల్లో ప్రధానమైంది లేదా కేంద్రభాగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, చెట్లకు కొత్త చివుళ్లు, కోయిలల గానాలు, పచ్చదనం, పువ్వుల కళకళలను తీసుకు వచ్చేది వసంతమే. అందుకే వసంతంలో ఎక్కువ వేడి, చలి ఉండవు. వాతావరణం ఉల్లాసకరంగా ఉంటుంది. వసంతం శ్రేష్ఠమైంది కాబట్టే శ్రీకృష్ణుడు భగవద్గీతలో తాను ఋతువుల్లో వసంతాన్ని అని చె΄్పాడు. నాటి కవులు, పండితులు మొదలుకొని కళాకారుల వరకు అందరికీ వసంత రుతువంటేనే మక్కువ.
వసంతాన్ని కుసుమాకరం అనీ, కుసుమాగమం అనీ అంటారు. కుసుమానికి పుష్పం, పండు, ఫలం అని అర్థాలు ఉన్నాయి. ఈ మూడూ మనకు ఎంతో అవసరం అయినవి. తప్పకుండా మనం వీటిని పొందాలి. మన జీవితాలు కూడా నిండుగా పుష్పించాలి, పండాలి, ఫలవంతం అవ్వాలి. వసంతాన్ని ప్రకృతి ఇస్తున్న సందేశంగా మనం గ్రహించాలి. వసంతం ఒక సందేశం దాన్ని మనం అందుకోవాలి, అందుకుందాం.
సంవత్సరంలో ఉండే మంచితనం వసంతం. వసంతం ప్రకృతి నుంచి మనకు అందివచ్చే మంచితనం. ‘...సంతో వసంతవల్లోకహితం చరంతః ...‘ అని వివేక చూడామణిలో జగద్గురు ఆదిశంకరాచార్యులవారు అన్నారు. అంటే మంచివాళ్లు వసంతంలాగా లోకహితాన్ని ఆచరిస్తారు అని అర్థం. వసంతం వంటి హితం. హితం వంటి వసంతం మనకు, సంఘానికి, దేశానికి, ప్రపంచానికి ఎంతో అవసరం.
శుభానికి తొలి అడుగుగా, మంచితనానికి మారు పేరుగా అన్ని ఆరంభాలకూ ఆది అయిన తొలి పండుగగా ఉగాదికి విశిష్టత ఉంది. ఇతర పండుగలలా కాకుండా ఉగాది కాలానికి, ప్రకృతికి సంబంధించిన పండుగ. మనిషి కాలానికి, ప్రకృతికి అనుసంధానం అవ్వాలని తెలియజెప్పే ఒక విశిష్టమైన పండుగ.
ఆరు ఋతువులకు ఆదిగా వచ్చేది ఈ పండుగ. సంవత్సరంలోని ఆరు ఋతువులకు ప్రతీకలుగా తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపుల్ని తీసుకుని ఆ రుచుల కోసం కొత్త బెల్లం, మిరియాల΄÷డి, వేపపువ్వు, మామిడి పిందెలు, ఉప్పు, కొత్త చింతపండు కలిపి తయారు చేసిన ఉగాది పచ్చడిని మనం తీసుకుంటున్నాం. నింబకుసుమ భక్షణం అని దీనికి పేరు. ఇది ఉగాది పండుగలో ముఖ్యాంశం.
మరో ముఖ్యాంశం పంచాంగశ్రవణం. ఆదిలోనే ఎవరి రాశి ప్రకారం వారికి సంవత్సరంలో జరగడానికి అవకాశం ఉన్న మేలు, కీడులను ఆయా రాశి గల వ్యక్తులకు సూచన్రపాయంగా పంచాంగం తెలియచెబుతుంది. పంచాంగ శ్రవణానికి ముందుగా మనం అభ్యంగన స్నానం చేసి, మామిడి తోరణాలతో, పుష్పాలతో ఇళ్లను అలంకరించుకుని దైవపూజ చెయ్యాలి.
ప్రకృతి ఇచ్చిన సందేశాలుగా అందివచ్చిన ఉగాదిని, వసంతాన్ని ఆకళింపు చేసుకుని, ఆదర్శంగా తీసుకుని, మనం మనకు, ఇతరులకు ఈ ఏడాదిలోని అన్ని ఋతువుల్లోనూ హితకరం అవుదాం.
కాలం ఒక ప్రవాహం
కాలం నదిలాంటిది. ముందుకు ప్రవహిస్తుందే కానీ, వెనక్కి తిరగదు. అలా ముందుకు ప్రవహించే నదిలో ఎన్నో సెలయేర్లు, వాగులు, వంకలు కలిసి ఉన్నట్టే... కాలవాహినిలో తృటి, క్షణం, ముహూర్తం, దినం మొదలైన కాలగతి సూచికలు మిళితమై ఉంటాయి. వీటిన్నింటి మేలు కలయికే కాల ప్రవాహం. ఇటువంటి కాలాన్ని ఉగాది రూపంలో ఆరాధించాలన్నదిప్రాచీనుల నిర్దేశ్యం. ప్రతి కొత్త సంవత్సరం శుభపరంపరలతో కొనసాగాలని కోరుకోవడంతోపాటు శుభాచరణకు మనల్ని మనం సమాయత్తం చేసుకుంటూ ముందుకు సాగుదాం.
ఆరు రుచులలో అనేక అర్థాలు
ఉగాదికి సంకేతంగా చెప్పుకునే ఆరు రుచుల కలయికలో అనంతమైన అర్థముంది. ప్రకృతి లేనిదే జీవి లేదు. జీవి లేని ప్రకృతి అసంపూర్ణం. కాబట్టి సరికొత్త ప్రకృతి అందించే తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు రుచుల సమ్మేళనంతో తయారయ్చే ఉగాది పచ్చడి సేవనం ఆరోగ్యదాయకం. జీవితమంటే కేవలం కష్టాలు లేదా సుఖాలే కాదు, అన్ని విధాలైన అనుభవాలూ, అనుభూతులూ ఉంటాయి, ఉండాలి! అలా ఉన్నప్పుడే జీవితానికి అర్థం పరమార్థం. ఈ సత్యాన్ని బోధిస్తూనే ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఉగాది పచ్చడి.
పంచాంగ శ్రవణ ఫలమేమిటి?
ఉగాదినాటి పంచాంగ శ్రవణం గంగాస్నాన ఫలంతో సమానమని శాస్త్రం చెబుతోంది. అంతేకాదు. ఉగాది పంచాంగ శ్రవణం వల్ల. భూమి, బంగారం, ఏనుగులు, గోవులతో కూడిన సర్వలక్షణ లక్షితమైన కన్యను యోగ్యుడైన వరునకు దానం చేస్తే కలిగే ఫలంతో సమానమైన ఫలాన్నిస్తుందని శాస్త్రోక్తి. వీటితోపాటు సంవత్సరానికి అధిపతులైన రాజాది నవనాయకుల గ్రహఫలితాలను శాస్త్రోక్తంగా వినడం వల్ల గ్రహదోషాలు నివారితమై , వినేవారికి ఆరోగ్యాన్ని, యశస్సును, ఆయుష్షునూ వృద్ధి చేసి, సంపదతో కూడిన సకల శుభఫలాలనూ ఇస్తుందంటారు పెద్దలు. కాబట్టి ఉగాదినాడు పంచాంగ ఫలాలను తెలుసుకోవడం వల్ల భవిష్యత్ కార్యాచరణను చేపట్టవచ్చు.
నూతనత్వానికి నాంది
బ్రహ్మదేవుడు సృష్టినిప్రారంభించినదీ, ప్రజానురంజకంగా పాలించిన శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగినదీ, వెయ్యేళ్లపాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినదీ, శకకారుడైన శాలివాహనుడు కిరీట ధారణ చేసినదీ, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్ని అధిష్ఠించిందీ ఉగాదినాడేనని చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి నూతనకార్యాలుప్రారంభించడానికి ఉగాదిని మించిన శుభతరుణం మరొకటి లేదనే కదా అర్థం.
– డి.వి.ఆర్. భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment