telugu peoples
-
ఇరాన్ దాడుల నేపథ్యంలో తెలుగు వారి ఆందోళన
-
ఢిల్లీలో తెలుగు ఓట్ల కోసం వేట!
ఢిల్లీ ఎన్నికల్లో తెలుగు వారి పాత్ర తక్కువేం కాదు. దేశ రాజధానిలో కోటిన్నర ఓటర్లుంటే అందులో మనవారి వాటా అయిదున్నర శాతం. తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. మీట్ అండ్ గ్రీట్ పేరుతో బిజెపి దగ్గరయ్యే ప్రయత్నంచేస్తుండగా, తమ సొంత ప్రాంతాన్ని వదిలి ఇక్కడ ఉంటున్న తెలుగువారికి ఢిల్లీ తమ ఇళ్లే అన్న భద్రత భరోసా ఇస్తామంటోంది ఆప్.దేశరాజధాని ఢిల్లీని మిని ఇండియాగా అభివర్ణిస్తుంటారు. అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఏకంగా 15 భాషల్లో ఎన్నికల ప్రచారం జరిగే చోటు ఏదైనా ఉందంటే అది ఢిల్లీనే. చాలా ఏళ్ల కిందటే దేశం నలుమూలల నుంచి వచ్చి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ ఢిల్లీలో స్థిరపడిపోయినవాళ్లు కొందరైతే.. కేంద్ర ఉద్యోగులు, ప్రొఫెషనల్, నాన్ ఫ్రొఫెషనల్ రంగాల్లో పనిచేస్తున్నవాళ్లూ ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ పరిధిలో సంఖ్యాపరంగా ఆధిపత్యం ఉత్తరాదివాళ్లదే అయినా.. 25 లక్షల పైచిలుకు ఓట్లతో దక్షిణాదిప్రజలు కూడా తమదైన ప్రభావం చూపిస్తున్నారు. కోటిన్నర ఓటర్లలో తెలుగువారు దాదాపు అయిదుశాతానికి పైనే ఉన్నారు. తెలుగువాళ్లు ప్రధానంగా ఢిల్లీలోని షాద్రా, మయూర్ విహార్, లజ్‌పత్ నగర్, సరితా విహార్, ద్వారక, వికాస్పురి, కేశవపురం, రోహిని, మునిర్కా, వసంత్ విహార్ నివసిస్తుంటారు. పలు తెలుగు సంఘాలు, సంస్థల లెక్కల ప్రకారం అక్కడ సుమారు 9 లక్షల మంది తెలుగువాళ్లున్నారు. తెలుగువారికి సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం ఇక్కడ లోటుగా కనిపిస్తోంది.తెలుగు ప్రజలను కలుస్తున్న పార్టీలు వారిని ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. సొంతూళ్లకు దూరంగా ఉంటున్న ఢిల్లీలోని తెలుగువారికి తగిన భద్రత, ప్రయోజనాలు ఇస్తామంటూ ఆప్ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.ఢిల్లీలో తెలుగువారి సంక్షేమం కోసం పలు తెలుగుసంఘాలు పనిచేస్తున్నాయి. ఆంధ్రా అసోసియేషన్, ఢిల్లీ తెలుగు సంఘం, ఆదిలీలా ఫౌండేషన్ పేరుతో పండుగల సమయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. తెలుగువారిని ఒక వేదికపైకి తీసుకువస్తుంటాయి. అయితే తెలుగు ప్రజలు సైతం తమకంటూ కొంత రాజకీయ ప్రాతినిధ్యం కోసం ప్రయత్నం చేసినా పెద్దగా ఎవరు సక్సెస్ కాలేదు.18వ లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరవ దశలో మే 25వ తేదీ శనివారం నాడు ఢిల్లీ 7 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది:::సాక్షి, ఢిల్లీ ప్రతినిధి -
Ugadi 2024: క్రోధిని కార్యసాధనంగా మలచుకుందాం!
ఉగాది తెలుగువారి తొలిపండుగ. ప్రభవతో మొదలు పెట్టి అక్షయ వరకు తెలుగు సంవత్సరాలు 60. ఈ వరుసలో ఇప్పుడు మనం జరుపుకుంటున్న ఉగాదికి క్రోధి నామ సంవత్సర ఉగాది అని పేరు. క్రోధి అంటే కోపం కలవారని సామాన్యార్థం. క్రోధి అనే పదానికి కొన్ని నిఘంటువులు కోప స్వభావులైన కుక్క, దున్న΄ోతు అని అర్థం చెప్పినప్పటికీ, దానిని పరిగణనలోకి తీసుకోనక్కరలేదు. అన్ని స్వభావాల లాగే మనిషికి కోపం లేదా క్రోధం కూడా అవసరమే. మనకు ఎంత అవసరమో, అంతవరకు మాత్రమే కోపాన్ని ఉంచుకోవాలి. మిగిలిన దానిని నిగ్రహించుకోవాలి. ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రుడు కూడా కొన్ని సందర్భాలలో కోపించాడు. అలా మన జీవితాలకు అవసరమైన మేరకు మాత్రమే కోపాన్ని ఈ ఉగాది ఇస్తుందని, ఇవ్వాలనీ ఆశిద్దాం. ఉగాదితో చాంద్రమాన సంవత్సరం మొదలవుతుంది. పౌర్ణమిచంద్రుడు చిత్త లేదా చిత్ర నక్షత్రంతో కూడి ఉన్న మాసాన్ని చైత్రమాసంగా పిలుస్తారు. చైత్రమాసం తొలిరోజు అంటే చైత్రశుక్ల పాడ్యమి రోజు ఉగాది అవుతుంది. చంద్రుడు ఒక నక్షత్రంతో మొదలుపెట్టి, భూమి చుట్టూ తిరిగి మళ్లీ ఆ నక్షత్రం దగ్గరకు రావడానికి పట్టే కాలం నక్షత్రమాసం అవుతుంది. ఆ రోజు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. కాలానికి సూర్య, చంద్ర గమనాలుప్రాతిపదిక కాబట్టి ఈ మేరకు చాంద్ర–సౌర సంవత్సరం అవుతుంది. వ్యావహారిక శకానికి పూర్వం తొలిదశలో సప్తఋషులు నక్షత్ర సంవత్సరాన్ని, చాంద్ర–సౌర సంవత్సరాన్ని కలిపి పంచాంగాన్ని అమలులోకి తెచ్చారు. మూడు, ఐదు సంవత్సరాలలో వచ్చే అధికమాసాలను కలుపుకుని ఐదు సంవత్సరాలతో ఒక యుగం అని పంచాంగ పరంగా అమలు చేశారు. అప్పట్లో ఆ యుగం ఆరంభం శరత్ విషువత్, శరత్ ఋతువు లో ఉండేది. ఈ ఐదు సంవత్సరాల యుగంలో మొదటి సంవత్సరంలో మొదటి రోజు యుగాది అయింది; అదే ఉగాది అయింది. ఈ యుగం జ్యోతిష శాస్త్రానికి అనుగుణం గా కూడా రూపొందింది. ‘జ్యోతి’ అంటే నక్షత్రం అనీ ‘షం’ అంటే సంబంధించిన అనీ అర్థం. జ్యోతిషం అంటే నక్షత్రానికి సంబంధించినది అని అర్థం. చాంద్ర– సౌర గమనాలప్రాతిపదికన మన పంచాంగం నిర్మితమైంది. పంచాంగం ప్రకారం మనకు ఉగాది నిర్ణీతమైంది. విశ్వామిత్ర మహర్షి పంచాంగంలోనూ, కాలగణనంలోనూ కొన్ని ప్రతిపాదనలను, మార్పులను తీసుకు వచ్చాడు. ఆ తరువాత కాలక్రమంలో జరుగుతూ వచ్చిన ఖగోళమార్పులకు తగ్గట్లు గర్గ మహాముని సంవత్సరాదిని వసంత విషువత్కు మార్చాడు. ఆర్యభట్టు, వరాహమిహిరుడు దాన్నే కొనసాగించారు. అదే ఇప్పటికీ కొనసాగుతోంది. సాంప్రదాయిక సంవత్సరాన్ని లేదా ఆచార వ్యవహారాల కోసం సంవత్సరాన్ని చైత్రమాసంతో మొదలుపెట్టారు. వసంతం, వసంతంతోపాటు ఉగాది... ఈ రెండు ప్రాకృతిక పరిణామాల్ని మనం మన జీవితాలకు ఆదర్శంగా తీసుకోవాలి, వసంత ఋతువు రావడాన్ని వసంతావతారం అని కూడా అంటారు. వసంతావతారం సంవత్సరానికి ఉన్న అవతారాలలో గొప్పది, ఆపై శోభాయామానమైంది. సంవత్సరానికి శోభ వసంతం. వసంతం మనకు వచ్చే ఋతువుల్లో ప్రధానమైంది లేదా కేంద్రభాగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, చెట్లకు కొత్త చివుళ్లు, కోయిలల గానాలు, పచ్చదనం, పువ్వుల కళకళలను తీసుకు వచ్చేది వసంతమే. అందుకే వసంతంలో ఎక్కువ వేడి, చలి ఉండవు. వాతావరణం ఉల్లాసకరంగా ఉంటుంది. వసంతం శ్రేష్ఠమైంది కాబట్టే శ్రీకృష్ణుడు భగవద్గీతలో తాను ఋతువుల్లో వసంతాన్ని అని చె΄్పాడు. నాటి కవులు, పండితులు మొదలుకొని కళాకారుల వరకు అందరికీ వసంత రుతువంటేనే మక్కువ. వసంతాన్ని కుసుమాకరం అనీ, కుసుమాగమం అనీ అంటారు. కుసుమానికి పుష్పం, పండు, ఫలం అని అర్థాలు ఉన్నాయి. ఈ మూడూ మనకు ఎంతో అవసరం అయినవి. తప్పకుండా మనం వీటిని పొందాలి. మన జీవితాలు కూడా నిండుగా పుష్పించాలి, పండాలి, ఫలవంతం అవ్వాలి. వసంతాన్ని ప్రకృతి ఇస్తున్న సందేశంగా మనం గ్రహించాలి. వసంతం ఒక సందేశం దాన్ని మనం అందుకోవాలి, అందుకుందాం. సంవత్సరంలో ఉండే మంచితనం వసంతం. వసంతం ప్రకృతి నుంచి మనకు అందివచ్చే మంచితనం. ‘...సంతో వసంతవల్లోకహితం చరంతః ...‘ అని వివేక చూడామణిలో జగద్గురు ఆదిశంకరాచార్యులవారు అన్నారు. అంటే మంచివాళ్లు వసంతంలాగా లోకహితాన్ని ఆచరిస్తారు అని అర్థం. వసంతం వంటి హితం. హితం వంటి వసంతం మనకు, సంఘానికి, దేశానికి, ప్రపంచానికి ఎంతో అవసరం. శుభానికి తొలి అడుగుగా, మంచితనానికి మారు పేరుగా అన్ని ఆరంభాలకూ ఆది అయిన తొలి పండుగగా ఉగాదికి విశిష్టత ఉంది. ఇతర పండుగలలా కాకుండా ఉగాది కాలానికి, ప్రకృతికి సంబంధించిన పండుగ. మనిషి కాలానికి, ప్రకృతికి అనుసంధానం అవ్వాలని తెలియజెప్పే ఒక విశిష్టమైన పండుగ. ఆరు ఋతువులకు ఆదిగా వచ్చేది ఈ పండుగ. సంవత్సరంలోని ఆరు ఋతువులకు ప్రతీకలుగా తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపుల్ని తీసుకుని ఆ రుచుల కోసం కొత్త బెల్లం, మిరియాల΄÷డి, వేపపువ్వు, మామిడి పిందెలు, ఉప్పు, కొత్త చింతపండు కలిపి తయారు చేసిన ఉగాది పచ్చడిని మనం తీసుకుంటున్నాం. నింబకుసుమ భక్షణం అని దీనికి పేరు. ఇది ఉగాది పండుగలో ముఖ్యాంశం. మరో ముఖ్యాంశం పంచాంగశ్రవణం. ఆదిలోనే ఎవరి రాశి ప్రకారం వారికి సంవత్సరంలో జరగడానికి అవకాశం ఉన్న మేలు, కీడులను ఆయా రాశి గల వ్యక్తులకు సూచన్రపాయంగా పంచాంగం తెలియచెబుతుంది. పంచాంగ శ్రవణానికి ముందుగా మనం అభ్యంగన స్నానం చేసి, మామిడి తోరణాలతో, పుష్పాలతో ఇళ్లను అలంకరించుకుని దైవపూజ చెయ్యాలి. ప్రకృతి ఇచ్చిన సందేశాలుగా అందివచ్చిన ఉగాదిని, వసంతాన్ని ఆకళింపు చేసుకుని, ఆదర్శంగా తీసుకుని, మనం మనకు, ఇతరులకు ఈ ఏడాదిలోని అన్ని ఋతువుల్లోనూ హితకరం అవుదాం. కాలం ఒక ప్రవాహం కాలం నదిలాంటిది. ముందుకు ప్రవహిస్తుందే కానీ, వెనక్కి తిరగదు. అలా ముందుకు ప్రవహించే నదిలో ఎన్నో సెలయేర్లు, వాగులు, వంకలు కలిసి ఉన్నట్టే... కాలవాహినిలో తృటి, క్షణం, ముహూర్తం, దినం మొదలైన కాలగతి సూచికలు మిళితమై ఉంటాయి. వీటిన్నింటి మేలు కలయికే కాల ప్రవాహం. ఇటువంటి కాలాన్ని ఉగాది రూపంలో ఆరాధించాలన్నదిప్రాచీనుల నిర్దేశ్యం. ప్రతి కొత్త సంవత్సరం శుభపరంపరలతో కొనసాగాలని కోరుకోవడంతోపాటు శుభాచరణకు మనల్ని మనం సమాయత్తం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఆరు రుచులలో అనేక అర్థాలు ఉగాదికి సంకేతంగా చెప్పుకునే ఆరు రుచుల కలయికలో అనంతమైన అర్థముంది. ప్రకృతి లేనిదే జీవి లేదు. జీవి లేని ప్రకృతి అసంపూర్ణం. కాబట్టి సరికొత్త ప్రకృతి అందించే తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు రుచుల సమ్మేళనంతో తయారయ్చే ఉగాది పచ్చడి సేవనం ఆరోగ్యదాయకం. జీవితమంటే కేవలం కష్టాలు లేదా సుఖాలే కాదు, అన్ని విధాలైన అనుభవాలూ, అనుభూతులూ ఉంటాయి, ఉండాలి! అలా ఉన్నప్పుడే జీవితానికి అర్థం పరమార్థం. ఈ సత్యాన్ని బోధిస్తూనే ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఉగాది పచ్చడి. పంచాంగ శ్రవణ ఫలమేమిటి? ఉగాదినాటి పంచాంగ శ్రవణం గంగాస్నాన ఫలంతో సమానమని శాస్త్రం చెబుతోంది. అంతేకాదు. ఉగాది పంచాంగ శ్రవణం వల్ల. భూమి, బంగారం, ఏనుగులు, గోవులతో కూడిన సర్వలక్షణ లక్షితమైన కన్యను యోగ్యుడైన వరునకు దానం చేస్తే కలిగే ఫలంతో సమానమైన ఫలాన్నిస్తుందని శాస్త్రోక్తి. వీటితోపాటు సంవత్సరానికి అధిపతులైన రాజాది నవనాయకుల గ్రహఫలితాలను శాస్త్రోక్తంగా వినడం వల్ల గ్రహదోషాలు నివారితమై , వినేవారికి ఆరోగ్యాన్ని, యశస్సును, ఆయుష్షునూ వృద్ధి చేసి, సంపదతో కూడిన సకల శుభఫలాలనూ ఇస్తుందంటారు పెద్దలు. కాబట్టి ఉగాదినాడు పంచాంగ ఫలాలను తెలుసుకోవడం వల్ల భవిష్యత్ కార్యాచరణను చేపట్టవచ్చు. నూతనత్వానికి నాంది బ్రహ్మదేవుడు సృష్టినిప్రారంభించినదీ, ప్రజానురంజకంగా పాలించిన శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగినదీ, వెయ్యేళ్లపాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినదీ, శకకారుడైన శాలివాహనుడు కిరీట ధారణ చేసినదీ, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్ని అధిష్ఠించిందీ ఉగాదినాడేనని చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి నూతనకార్యాలుప్రారంభించడానికి ఉగాదిని మించిన శుభతరుణం మరొకటి లేదనే కదా అర్థం. – డి.వి.ఆర్. భాస్కర్ -
స్విట్జర్లాండ్‌లో అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు
స్విట్జర్లాండ్‌లో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వందలాది మంది తెలుగు రాష్ట్రాల ప్రజలు పాల్గొన్నారు. ఈ దీపావళి వేడుకలను తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విటర్లాండ్ ప్రెసిడెంట్ గనికాంబ కడలి గారు, జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గారావు , ట్రెజరర్ మాధురి ముళ్ళపూడి , కల్చరల్ సెక్రెటరీ మాణిక్యవల్లి చాగంటి ,స్పోర్ట్స్ సెక్రెటరీ రామచంద్ర వుట్టి, ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
డల్లాస్‌లో నాట్స్ 5కే రన్/1కే ఫన్ వాక్
టెక్సాస్: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా డల్లాస్ లో 5కే రన్/1కే ఫన్ వాక్, ఫుడ్ డ్రైవ్ లను నిర్వహించింది. నాట్స్ డల్లాస్ విభాగం ప్రతి ఏటా గాంధీ జయంతి సందర్భంగా మన తెలుగువారిలో ఆరోగ్యంపై అవగాహన కలిగిస్తోంది. ఇందులో వారిని భాగస్వాములను చేసేందుకు ఈ కార్యకమాన్ని 2014 నుంచి నిర్వహిస్తూ వస్తుంది. డల్లాస్-ఫోర్టువర్తు మెట్రో చుట్టు పక్కల ప్రాంతాల నుంచి దాదాపు 100 మందికి పైగా ఈ రేసులో పాల్గొన్నారు. ఫిటెనెస్ కోసం పరుగులు పెట్టే వారంతా 5కె రన్లో పాల్గొంటే.. ఆరోగ్యం కోసం 1కే ఫన్‌లో సరదాగా నడస్తూ ఉత్సాహంగా పోటీ పడ్డారు. ఈ పరుగు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రేస్ బిబ్స్ ను అందించడం జరిగింది. దీని ఆధారంగా వారు 5K రన్ పూర్తి చేయటానికి తీసుకున్న సమయం, వారి వయోపరిమితి ఆధారంగా తీసుకోవడంతో పాటు మొదటి మూడు స్థానాలలో నిలిచిన వారిని విజేతలుకు పతకాలను అందించారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల ఈ రన్ విజయవంతం కావడానికి తన వంతు సహకారం అందించారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ కార్యక్రమాలకి తమ సహాయ సహకారాలను అందిస్తున్న అందరికి చాప్టర్ కోఆర్డినేటర్ సత్య శ్రీరామినేని ధన్యవాదాలు తెలిపారు. స్వాగత్ బిర్యానీస్ ఇండియన్ క్యూసిన్, ఫార్మ్ 2 కుక్, హిండ్ సైట్, కోపెల్ చెస్ క్లబ్, వైకుంట్ డెవలపర్స్, క్లౌడ్ జెనిక్స్, ఏజ్నిక్స్ ఫార్మాస్యూటికల్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సాల్వేషన్ ఆర్మీ కోసం నాట్స్ ఫుడ్ డ్రైవ్ నాట్స్ ప్రతి ఏటా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించే ఫుడ్ డ్రైవ్ కూడా డల్లాస్ నాట్స్ విభాగం ఈ 5కే రన్‌తో పాటు నిర్వహించింది. ఈ ఫుడ్ డ్రైవ్ కి కూడా మన తెలుగు వారి నుంచి విశేష స్పందన లభించింది. దీని ద్వారా విరాళంగా వచ్చిన ఆహారాన్ని డల్లాస్‌లోని స్థానిక సాల్వేషన్ ఆర్మీకి విరాళంగా అందించారు. డల్లాస్ టీం క్రీడా విభాగ నాయకులు గౌతం కాశిరెడ్డి, నాట్స్ డల్లాస్ చాప్టర్ కో-కోర్డినేటర్ రవి తాండ్ర, డల్లాస్ టీం సభ్యులు శ్రీథర్ న్యాలమడుగుల, రవీంద్ర చుండూరు, శ్రీనివాస్ ఉరవకొండ, త్రినాథ్ పెద్ది, యషిత, రేహాన్, సందీప్ తాతినేనితో పాటు ఇతర సభ్యులు ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ డల్లాస్ విభాగం చేపట్టిన రన్, ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా క్రీడా విభాగ సభ్యులకు నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి (బాపు) నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
‘మన భాష, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందాం’
మన భాష, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవటం తెలుగు వారిగా మన గౌరవాన్ని మరింత ఇనుమడింపజేస్తుందని భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ఈ దిశగా తెలుగు వారంతా చొరవ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం మలేషియా, సింగపూర్ పర్యటనల్లో ఉన్న ఆయన, మలేషియా తెలుగు సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలేషియాలోని తెలుగు సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. 41 ఏళ్ళ క్రితం రెండవ ప్రపంచ తెలుగు మహాసభలకు, నాటి విద్యాశాఖ మంత్రి మండలి వెంకట కృష్ణారావు ఆహ్వానం మేరకు మిత్రులు జైపాల్ రెడ్డితో కలిసి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి సంస్కృతిలో జీవన విధానం, విశ్వాసాలు భాగంగా ఉంటాయన్న ఆయన, ఈ రెండు కాలగమనంలో పురోగమించాలే తప్ప, తిరోగమించరాదని సూచించారు. ఇటీవల తమ చెన్నై పర్యటనలో భాగంగా ఉన్నతమైన కుటుంబ విలువలకు చిరునామాగా నిలిచిన బటర్ ఫ్లై గ్రూప్ అధినేత మురుగేశన్ చెట్టియార్ గృహాన్ని సందర్శించారని అన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ ఇంటిలో 65 మంది కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవించడం గొప్పవిషయమని తెలిపారు. ఇలాంటి విలువలను ముందు తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో తమ కుమార్తె, మనుమడిని కూడా వారి ఇంటికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు. ఈ స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. భాష మన సంస్కృతికి జీవనాడి అన్న ఆయన, ఉన్నతమైన సంస్కృతి... ఉన్నతమైన సమాజానికి బాటలు వేస్తుందని, భాష ద్వారా సంస్కృతి, సంస్కృతి ద్వారా సమాజం శక్తివంతమౌతాయని పేర్కొన్నారు. భారత్, మలేషియా మధ్య చక్కని బంధం ఏర్పడటంలో ప్రవాస భారతీయుల పాత్ర కీలకమన్నారు. ఈ నేపథ్యంలో 1960ల నుంచి మలేషియా తెలుగు సంఘం పోషిస్తున్న పాత్రను అభినందించిన ఆయన, తెలుగు సాంస్కృతిక వారసత్వం, భాషను పరిరక్షించుకునేందుకు ప్రారంభమైన మలేషియా తెలుగు సంఘం, పేర్లు మార్చుకున్నా ప్రాథాన్యతలను మార్చుకోకుండా అదే స్ఫూర్తితో పని చేస్తుండటం ఆనందదాయకమన్నారు. మలేషియాలోని ఇతర ప్రజల మధ్య సామరస్యంగా జీవించటంలో, బహుళ జాతుల మధ్య తెలుగు సంఘం గౌరవం, గుర్తింపును నిలబెట్టడానికి వారు చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. ఇదే స్పూర్తి భవిష్యత్ లోనూ కొనసాగాలని ఆకాంక్షించారు. -
స్వాతంత్య్రోద్యమంలో తెలుగువారి పాత్ర చిరస్మరణీయం
సాక్షి, న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో దేశవ్యాప్తంగా ఎందరో వీరులు, వీర వనితలు ఆత్మ త్యాగాలు చేశారని, ఈ పోరాటంలో తెలుగువారి పాత్రను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా జాతీయవాద చైతన్యం పెరుగుతోందని చెప్పారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలోనూ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతోపాటు స్వచ్ఛంద సంస్థలు చాలా ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశాయని కిషన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. భారతదేశ స్వాతంత్య్ర సిద్ధికి ఘనమైన చరిత్ర ఉన్నట్టుగానే, ఆంధ్రా అసోసియేషన్‌కు సైతం గొప్ప చరిత్ర ఉందని చెప్పారు. తెలుగు తేజం విప్లవ వీరుడైన అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో జరిగిన పోరాట స్ఫూర్తిని యావత్ దేశానికి తెలియజేసే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి ద్వారా అల్లూరి 125వ జయంతి కార్యక్రమాలను భీమవరంలో ఘనంగా నిర్వహించి, విగ్రహాన్ని ఆవిష్కరింపజేశామని తెలిపారు. ఈ నెల 22న అల్లూరి నడయాడిన ప్రాంతాల్లో పర్యటించి రూ.50 కోట్లతో ఒక సర్క్యూట్ ఏర్పాటు చేయనున్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. ప్రముఖ తెలుగు గాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడైన ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతిని కూడా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉన్నప్పటికీ.. భారతదేశంపై ఆ ప్రభావం లేకుండా ప్రజలపై ఆర్థిక మాంద్యం భారం పడకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోటగిరి సత్యనారాయణ, అసోసియేషన్ ప్రతినిధులు, ఢిల్లీలోని తెలుగు ప్రజలు పాల్గొన్నారు. -
రెండు వసంతాలు పూర్తి చేసుకున్న ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’
సింగపూర్‌లో 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థ రెండు వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులందరూ కలిసి మా రెండేళ్ల ప్రయాణం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా విరాజిల్లేలా సంస్థ స్థాపించిన మొదటి రోజు నుండి సింగపూరులో నిక్షిప్తమైన తెలుగు సాహితీ సంపదను, కళాకారులను, సాహితీ వేత్తలను వెలుగులోకి తెస్తుందంటూ ప్రముఖులు కొనియాడారు. అనంతరం సంస్థ ప్రధాన ప్రధాన కార్యవర్గ సభ్యుల అంతరంగాలను ఆవిష్కరించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ రెండేళ్ల ప్రస్థానంలో తమ సంస్థను కలుపుకొని ప్రోత్సహించిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్, తానా, మలేషియా తెలుగు సంఘం, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య, వీధి అరుగు నార్వే, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మొదలైన ప్రపంచవ్యాప్త సంస్థలకు, వారి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కవుటూరు రత్నకుమార్, సుబ్బు వి పాలకుర్తి,రాధిక మంగిపూడి, ఊలపల్లి భాస్కర్, చామిరాజు రామాంజనేయులు, గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయనిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మలేషియాలో తెలుగు వైభవం.. 5 లక్షల పైమాటే..!
పరిచయంలేని ప్రదేశంలో మన ప్రాంతం వాళ్లు కనిపిస్తే ఆనందం! పరాయిగడ్డ మీద మన భాష వినిపిస్తే నైతిక బలం..!! సంఘాలు, సంస్థలను ఏర్పాటుచేసుకునేది ఇలాంటి మద్దతు కోసమే! మన మాట, సంస్కృతి, సంప్రదాయాలను పట్టి ఉంచుకోవడానికే!! నివసిస్తున్న దేశమేదైనా మన ఉనికి చాటుకోవడానికే!! ఇదంతా ఓ పోరాటం.. స్వస్థలాలను వదిలి దేశాంతరం వెళ్లిన వాళ్లంతా చేసే కనిపించని పోరాటం!! బ్రిటిష్ రాజ్యంలో మన తెలుగు వాళ్లు కూడా తెల్లవారి కూలీలుగా వాళ్ల కాలనీలకు వలస వెళ్లారు! అందులో మలేసియా ఒకటి! అక్కడి కొబ్బరి, రబ్బరు తోటలు సహా చాలా చోట్ల పనులకు కుదిరారు. అక్కడే స్థిరపడ్డారు. మాతృభాషను పరిరక్షించుకుంటే అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నట్లేనని భావించారు. తెలుగు సంఘం ఏర్పాటు చేసుకున్నారు. తెలుగును కాపాడుకుంటున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ద్వైవార్షిక సభలు ఇటీవల రవాంగ్‌లో నిర్వహించారు. ఆ సందర్భంగానే ఈ స్టోరీ! అది రవాంగ్ పట్టణం.. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌కు ఇరవై మైళ్ల దూరంలో ఉంటుంది. చుట్టూ ఆకాశపుటంచుల్లోకి కొమ్మలు చాచుకొని పెరిగిన.. ప్రపంచంలోకెల్లా ఎతైన మహావృక్షాలు, వాటితో పోటీపడే కొండలు, కోనలతో పచ్చగా.. ఆహ్లాదభరింతంగా ఉంటుంది. బహుశా ఆ వాతావరణం వల్లనే రవాంగ్ సామాజిక జీవితం కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. నెమ్మదిగా ప్రవహించే నదిలో సాఫీగా సాగిపోయే పడవ ప్రయాణంలా జనజీవితం కనిపిస్తుంది. ఆ రవాంగ్‌లో జూన్ 26వ తేదీ.. ఆదివారం పండగలాంటి సందడి నెలకొంది. మలేసియాకు నలుదిక్కులా ఉన్న రహదారులు రవాంగ్‌కు ప్రయాణమయ్యాయి. ఉదయం ఏడింటికే వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. రవాంగ్‌కు వందల మైళ్ల దూరంలోని జోహూర్, క్లింగ్, బాగాన్ డత్తో తదితర నగరాలు, పట్టణాలు, గ్రామాల నుంచి ఉదయం తొమ్మిదింటికల్లా వచ్చేశారు. ఇటు సింగపూర్, అటు థాయ్‌లాండ్ సరిహద్దు జిల్లాల నుంచి కూడా వందలాది మంది వచ్చారు. వాళ్లంతా ఆ దేశంలో పుట్టిపెరిగిన మలేసియన్ తెలుగువాళ్లు. ఎనభై ఏళ్లు దాటిన రెండో తరం పెద్దల నుంచి ఐదారేళ్ల నేటి తరం చిన్నారుల వరకూ ఉన్నారు. అది వాళ్లు ప్రాణప్రదంగా భావించే తెలుగుతల్లి ఆలయం. మలేసియా తెలుగు అకాడమీ భవన ప్రాంగణం. గత 50 ఏళ్లుగా ఆ ప్రాంగణంతో మలేసియా తెలుగువాళ్లకు అనుబంధం ఉంది. ఒకప్పుడు రవాంగ్ తెలుగు సంఘం కార్యాలయంగా, తెలుగు సాంస్కృతిక నిలయంగా వెలుగొందిన ఆ ప్రాంతంలోనే ఇప్పుడు ఐదంతస్తుల తెలుగు అకాడమీ భవనాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని తెలుగువాళ్లంతా కలసి ఒక్కో రింగిట్ (అక్కడి కరెన్సీ) పోగు చేసుకొని ఆ భవానాన్ని కట్టుకున్నారు. అది అక్కడి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. 150 ఏళ్లకు పైగా కాపాడుకుంటున్న తల్లిభాష తెలుగును భవిష్యత్ తరాలకు వారసత్వ కానుకగా అందజేసేందుకు మలేసియా తెలుగు సంఘం సకల సదుపాయా లతో ఆ భవనాన్ని నిర్మించింది. విశాలమైన తరగతి గదులు, వసతి కేంద్రాలు, గ్రం«థాలయం, ఆటస్థలం వంటి అన్ని ఏర్పాట్లూ ఉన్నాయి. తెలుగు భాషాభివృద్ధి, బోధన, సాహిత్య అధ్యయనం, మలేసియా తెలుగువారి చరిత్రను గ్రంథస్థం చేయడం వంటి లక్ష్యాలతో ఏర్పాటైన తెలుగు అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్లు ఆ ఆదివారం అక్కడ సమావేశామయ్యారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మలేసియా తెలుగు సంఘం 44వ ద్వైవార్షిక ప్రతినిధుల మహాసభ కూడా అదే రోజు కావడం మరో విశేషం. కుటుంబ వేడుకలా... నిజానికి రెండేళ్ల క్రితమే తెలుగు అకాడమీ భవనం ప్రారంభం కావలసి ఉంది. కోవిడ్ కారణంగా వాయిదా పడింది. గతంలో ఏడాదికి రెండు, మూడు సార్లయినా ఎక్కడో ఒకచోట కలుసుకొనే తెలుగువాళ్లు గత రెండేళ్లుగా కలవలేకపోయారు. దాంతో జూన్ 26వ తేదీ నాటి కార్యక్రమం వారికి ఒక భావోద్వేగభరితమైన వేదికైంది. అందుకే ఇంటిల్లిపాదీ ఆ తెలుగు వేడుకల కోసం తరలివచ్చారు దూరభారాలు లెక్కచేయకుండా! దేశంలోని తెలుగు వాళ్లంతా ఆ రోజు అక్కడ ఒక కుటుంబంలా కలసిపోయారు. ఆత్మీయ పలకరింపులతో తెలుగు భాష తేనెలూరింది. సంప్రదాయ వస్త్రధారణతో తెలుగుదనం ఉట్టిపడింది. మలేసియా మాజీ ప్రధానమంత్రి దత్తో శ్రీ నజీబ్‌తోపాటు అక్కడి తెలుగు ప్రముఖులు అందరూ ఆ వేడుకకు హాజరయ్యారు. మొదటగా మలేసియా జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులూ’ అంటూ తెలుగుతల్లి ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. అక్కడ తెలుగు సాంస్కృతిక వైభవాన్ని చాటే కార్యక్రమాలు, ప్రసంగాలు, ఆటలు, పాటలతో ఆ ఉదయం.. సాయంకాలంగా ఎప్పుడు కరిగిపోయిందో తెలియలేదు. మలేసియాలోని తెలుగువాళ్లు మొదట్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. వాళ్లు పనిచేసే తోటల్లో తెలుగు బడులు, గుడులు ఉండేవి. పిల్లలు తెలుగు నేర్చుకొనేవారు. పెద్దవాళ్లు సాయంత్రం పూట రాముడి సన్నిధిలో చేరి కష్టసుఖాలను పంచుకొనేవారు. కాలక్రమంలో తెలుగు బడులు శిథిలమయ్యాయి. ఆ తదనంతర తరాలకు చెందినవారు ఉన్నత చదువులు చదువుకొని గొప్ప స్థానాల్లో స్థిరపడ్డప్పటికీ తల్లి భాష తెలుగుకు దూరమయ్యారు. మలేసియా తెలుగు సంఘానికి ఇది మనస్తాపంగా మారింది. ఈ క్రమంలోనే 2006లో ఆ సంఘం జాతీయ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ అచ్చయ్యకుమార్ రావు నేతృత్వంలో తెలుగు భాషాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ప్రారంభించారు. మలేసియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పాఠ్యపుస్తకాలను తయారు చేశారు. పలు చోట్ల నీతిశిబిరాలు, తెలుగు తరగతులు ఏర్పాటు చేశారు. తెలుగు వారిని తిరిగి సంఘటితం చేశారు. మలేసియా అంతటా 30కి పైగా తెలుగు శాఖల్లో ఇది ఒక ఉద్యమంలా సాగింది. ప్రస్తుతం 6 వేల మంది పిల్లలు తెలుగు భాష నేర్చుకుంటున్నారు. ‘మలేసియా భూమిపైన తెలుగు వాడు ఉన్నంత కాలం తెలుగు వర్ధిల్లుతుంది. ఆ లక్ష్యంతోనే అకాడమీ నిర్మించుకున్నాం. భవిష్యత్ తరాలకు ఇది బాటలు వేస్తుంది. తెలుగుకు దూరమైన వాళ్లంతా ఇప్పుడు దగ్గరయ్యారు. పిల్లలు చక్కగా నేర్చుకుంటున్నారు’అని సంతోషం వ్యక్తం చేశారు డాక్టర్ అచ్చయ్యకుమార్ రావు. ఆయన నేతృత్వంలో మొదలైన తెలుగు భాషోద్యమం ఇప్పుడు చక్కటి ఫలితాలనిస్తోంది. తెలుగు వారి ముఖద్వారం బాగాన్ డత్తో... మలేసియా తెలుగువాళ్లకు గొప్ప చరిత్ర ఉంది. 150 ఏళ్లకు పూర్వమే వలస వెళ్లిన తెలుగువాళ్లు ఆ దేశ చరిత్రలో భాగమయ్యారు. ఒకప్పటి మలయా దేశం (ఇప్పుడు మలేసియా)లో కొబ్బరి, కాఫీ, తేయాకు, రబ్బరు, పామాయిల్ తోటల్లో పని చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం నుంచి కార్మికులను తరలించింది. 1850 నుంచే ఈ వలసలు మొదలైనప్పటికి 1890 నాటికి వేలాది మంది తమిళ, తెలుగు ప్రజలు పిల్లాపాపలతో, కట్టుబట్టలతో పొట్టచేతపట్టుకొని అక్కడికి చేరుకున్నారు. విశాఖ, చెన్నపట్టణం, తదితర రేవు పట్టణాల నుంచి బయలుదేరి ఓడలు ఏడు రోజుల తరువాత మలేసియాలోని పినాంగ్ రేవుకు చేర్చాయి. అలా వెళ్లిన తెలుగువాళ్లు పినాంగ్ నుంచి జంగ్ అనే చైనా వారి తెరచాప ఓడల్లో మలక్కా జలసంధి గుండా పేరాక్ నది ముఖద్వారమైన బాగాన్ డత్తోకు చేరుకున్నారు. ఆ రోజుల్లో అది ఒక చేపల రేవు. బ్రిటన్‌కు చెందిన స్ట్రెయిట్స్ ప్లాంటేషన్ కంపెనీకి చెందిన వేల ఎకరాల విస్తీర్ణంలోని కొబ్బరి తోటల్లో మొట్టమొదటి తెలుగు తరం పనిలో చేరారు. ఆ తరువాత తెలుగు కుటుంబాలు విస్తరిస్తున్న కొద్దీ వివిధ ప్రాంతాల్లో ఉన్న కొబ్బరి, రబ్బరు, పామాయిల్ తోటలకు స్థానికంగా వలసబాట పట్టారు. రబ్బరు తోటలతో నిండి ఉన్న రవాంగ్లోనూ బాగాన్ డత్తోకు సమాంతరంగా తెలుగు కుటుంబాలు విస్తరించాయి. ఒకప్పుడు గుప్పెడు మంది కూడా లేని తెలుగు జనాభా ఇప్పుడు ఇంచుమించు 5 లక్షలకు చేరుకుంది. ఉపాధి కోసం వెళ్లిన తెలుగు వాళ్లు బ్రిటిష్ కంపెనీల లాభాల కోసం నెత్తురు ధారపోశారు. ఆ తదనంతరం మలేసియా అభివృద్ధిలో భాగమయ్యారు. రెండు ప్రపంచయుద్ధాల కాలంలో మలేసియా స్వాతంత్య్రోద్యమంలో తెలుగు ప్రజల త్యాగాలు ఉన్నాయి. తెలుగు ఒక్కటే అస్తిత్వం... బ్రిటిష్ వారు పంపిన వలస కూలీలుగా మలేసియాకు చేరుకున్న తెలుగువాళ్లు బతుకుతెరువు కోసం తమిళ, మలయ్, చీనా తదితర భాషలను నేర్చుకున్నారు. అయినా మృతృభాష తెలుగును మాత్రం విస్మరించలేదు. ఎక్కడెక్కడో స్థిరడిన తెలుగు వాళ్లను ఆ భాషే ఒక్క గూటి పక్షులను చేసింది. అదొక్కటే వారి అస్తిత్వం. మెజారిటీ భాషల ఆధిపత్యం నుంచి తమ అస్తిత్వాన్ని కాపాడుకొనేందుకు ఎంతో కష్టపడ్డారు. తెలుగు బడులు మూసివేసిన తరువాత ఆ కష్టం మరింత ఎక్కువైంది. ‘ఒకదశలో తెలుగును బతికించుకోవడమే సవాలుగా మారింది. తెలుగు నీతి శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం తెలుగు బోధించాం. క్రమంగా ఫలితాలు కనిపించాయి’ అని చెప్పారు ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన చెగు అక్కయ్య అప్పల్నాయుడు. 74 ఏళ్ల వయస్సులో ఆయన ఇప్పుడు మలేసియాలోని అన్ని తెలుగు శాఖల్లో తెలుగు భాషా బోధన పర్యవేక్షకులుగా వ్యవహరిస్తున్నారు. ఇంచుమించు 1990 నుంచి 2005 వరకు తెలుగు భాష సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. ఈ క్రమంలోనే ప్రతి కుటుంబంలో పిల్లలు, పెద్దలు తెలుగు రాయడం, మాట్లాడడం, చదవడం విధిగా అలవరచుకోవాలనే లక్ష్యంతో 2006లో మలేసియా తెలుగు సంఘం 50 ఏళ్ల స్వర్ణోత్సవాల సందర్భంగా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొన్నారు. ఈ ఉద్యమానికి తెలుగు వారి నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభించాయి. ప్రతి ఇల్లు, ప్రతి తెలుగుశాఖ ఒక తెలుగు బడి అయింది. ఆరువేల మంది పిల్లలు ఇప్పుడు తెలుగుభాష పైన పట్టు సాధించారు. మలేసియా తెలుగువారి మహత్తరమైన తెలుగు వెలుగుల ప్రస్థానానికి ప్రతీకగానే తెలుగు అకాడమీ భవనం ప్రారంభమైంది. తెలుగుభాషోద్యమ రథసారథి 2006 నుంచి 2020 వరకు మలేసియా తెలుగు సంఘం అధ్యక్షులుగా వ్యవహరించిన డాక్టర్ అచ్చయ్యకుమార్ రావు తెలుగు నీతి శిబిరాలు, తెలుగు తరగతులు ఏర్పాటు చేశారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో ప్రాథమిక, మాధ్యమిక, ప్రవీణ, విశారద అనే నాలుగు దశల్లో తెలుగు బోధనకు అవసరమైన పాఠ్యప్రణాళికలను రూపొందించడం వెనుక ఆయన కృషి ఉంది. తెలుగు అకాడమీ భవన నిర్మాణాన్ని ఒక సవాలుగా తీసుకొని పూర్తి చేశారు. అలుపెరుగని అధ్యాపకుడు తెలుగు, తమిళ, మలయ్, ఇంగ్లిష్ భాషలపైన గట్టి పట్టు ఉన్న చెగు అక్కయ్య చెగు అప్పల్నాయుడు ఉపాధ్యాయ వృత్తిలో చేరినప్పటి నుంచి తెలుగు భాషా బోధన కోసం కృషి చేశారు. ఇప్పటికీ కాలికి బలపం కట్టుకొని మలేసియా అంతటా పర్యటిస్తూ తెలుగుశాఖలను ప్రోత్సహిస్తున్నారు. పాఠ్యప్రణాళికలను రూపొందించడంలోనూ, భాషాబోధనలోనూ ఆయన నిపుణులు. తెలుగు సాంస్కృతిక వారధి రెండో తరానికి చెందిన పెద్దలు, ఎనభై ఏళ్లు దాటినా తెలుగు భాషాభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్న ప్రముఖ విద్యావేత్త డీవీ శ్రీరాములు. మలేసియాకు, తెలుగు రాష్ట్రాలకు నడుమ సాంస్కృతిక వారధిగా నిలిచారు. 1970ల నుంచే అక్కడి తెలుగు వాళ్లకు హైదరాబాద్, విశాఖ, సహా అన్ని ప్రాంతాలను పరిచయం చేయడంతో పాటు తెలుగు ఆత్మగౌరవాన్ని సమున్నతంగా చాటారు. ∙పగిడిపాల ఆంజనేయులు -
సింగపూర్‌లో రక్తదాన శిబిరం
సామాజికసేవా కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ముందుండే సింగపూర్ తెలుగు సమాజం మరోసారి రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. 2021 నవంబరు 27, 28 తేదిల్లో స్ధానిక హెల్త్ సర్వీసెస్ అథారిటీ సింగపూర్ బ్లడ్ బాంక్ నందు ఈ కార్యక్రమం జరిగింది. స్థానికంగా నివసిస్తున్న తెలుగు వారితో పాటు ఇతర దాతలు కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కరోనా సమయంలో తెలుగు సమాజం వరుసగా ఆరోసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం విశేషం. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 40 మంది రక్తదానం చేశారని నిర్వాహకులు జూనెబోయిన అర్జునరావు తెలిపారు. రక్తదానం పట్ల ఆసక్తి ఉన్న ఇతర దాతలు తర్వాత రోజుల్లో కూడా RO284 కోడ్ ఉపయోగించి రక్తదానం చేయవచ్చన్నారు. సింగపూర్ తెలుగు సమాజనికి, రెడ్‌క్రాస్‌తో పాటు బ్లడ్ బాంక్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కష్టకాలంలో ముందుకు వచ్చి వెలకట్టలేని రక్తదానం చేసిన దాతలకు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. -
Hurricane Ida: అమెరికా వరదల్లో.. మనోళ్లు ఇద్దరు మృతి
న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీలో ఇడా తుపాను ప్రభావంతో సంభవించిన ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన వారిలో ఇద్దరు తెలుగు వారు ఉన్నట్లు తెలిసింది. వీరిని మాలతి కంచె(46) అనే సాఫ్ట్వేర్ డిజైనర్, ధనుష్ రెడ్డి(31)గా అధికారులు గుర్తించారు. ఈ నెల ఒకటో తేదీ సాయంత్రం రేరిటాన్‌కు చెందిన మాలతి కంచె(46) తన కుమారుడిని రట్జెర్స్ యూనివర్సిటీ కాలేజీలో దించి, కుమార్తె(15)తో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. బ్రిడ్జివాటర్ ప్రాంతంలో రూట్ –22 రోడ్డుపైకి అకస్మాత్తుగా చేరుకున్న నడుముల్లోతు వరద నీటిలో వారు చిక్కుకు పోయారు. కారులో నుంచి బయటపడిన తల్లి, కూతురు ఒక చెట్టును పట్టుకున్నారు. ఆ చెట్టు కూడా కూలిపోగా మాలతి వరద ఉధృతికి కొట్టుకు పోయారు. ఈదడం తెలిసిన ఆమె కూతురు సురక్షితంగా బయటపడింది. మాలతి గల్లంతైనట్లు సమాచారం అందుకున్న అధికారులు అన్వేషణ ప్రారంభిం చారు. ఆమె మృత దేహాన్ని అక్కడికి 8 కిలోమీటర్ల దూరంలోని బౌండ్‌బ్రూక్ వద్ద శుక్రవారం కనుగొన్నారు. మాలతి స్వస్థలం హైదరాబాద్ కాగా, ఆమె భర్త ప్రసాద్ కంచె తెనాలికి చెందినవారు. వీరిది ప్రేమ వివాహం. మరో ఘటన న్యూజెర్సీలోని సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్ ప్రాంతంలో ఈ నెల 1వ తేదీన చోటు చేసుకుంది. ధనుష్ రెడ్డి అనే వ్యక్తి నడిచి వెళ్తుండగా అకస్మాత్తుగా వచ్చిన వరద తీవ్రతకు కొట్టుకు పోయారు. ధనుష్ రెడ్డి మృతదేహాన్ని మరుసటి రోజు అక్కడికి 8 కిలోమీటర్ల దూరంలోని పిస్కాట్‌ఎవే అనే ప్రాంతంలో కనుగొన్నారు. -
అఫ్గాన్‌లో చిక్కుకున్న తెలుగువారి కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్
సాక్షి,అమరావతి: అఫ్గానిస్తాన్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారి కోసం కార్మికశాఖలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏపీ సర్కార్ ఏర్పాటు చేసింది. అఫ్ఘాన్‌లో చిక్కుకున్న తెలుగు వారు 0866-2436314, 7780339884, 9492555089 హెల్ప్ డెస్క్ నంబర్లకు ఫోన్ చేసి వివరాలను తెలుపవచ్చని కార్మిక శాఖ పేర్కొంది. అఫ్గానిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులు, అఫ్గానీల కోసం భారత ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. అవసరమైన వారు ఈ నెంబర్లకు సంప్రదించడం ద్వారా భారత ప్రభుత్వం నుంచి సహాయం పొందవచ్చు. ఇప్పటికే ఆఫ్గనీలకు ప్రత్యేక వీసాలను జారీ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. వాట్సాప్: +91 8010611290 ; +91 9599321199 ; +91 7042049944 ఫోన్: +91 11 4901 6783 ; +91 11 4901 6784 ; +91 11 49016785 ఇ-మెయిల్: SituationRoom@mea.gov.in చదవండి: MK Stalin: 68 ఏళ్ల వయసులో ఔరా అనిపిస్తున్నారు, వీడియో వైరల్ -
‘అక్షర దీపిక’ జూన్ ఎడిషన్ విడుదల
టెంపాబే : ప్రవాత భారతీయులకు అండగా ఉంటూ వస్తోన్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) 2021 జూన్‌కి సంబంధించి అక్షర దీపికను విడుదల చేసింది. ఈ పుస్తకంలో ఇటీవల కాలంలో నాట్స్ ఆధ్వర్యంలో చేపట్టిన అనేక కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను క్రోడీకరించారు. ముఖ్యంగా టెంపాబే నాట్స్ విభాగం ఆధ్వర్యంలో ఫ్లోరిడాలో నిర్వహించిన కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్ చాలా మందికి ఉపయోగపడిందని అక్షర దీపికలో పేర్కొన్నారు. పాస్‌పోర్టు పునరుద్ధరణ, కొత్త పాస్‌పోర్ట్ దరఖాస్తు, ఐసీఐ దరఖాస్తు, పునరుద్ధరణలు, పవర్ ఆఫ్ అటార్నీ, లైఫ్ సర్టిఫికేషన్, ధ్రువీకరణ వంటి సేవలు ఈ కాన్సులర్ ద్వారా అందించారు. సుమారు 400ల మందికి పైగా భారతీయులు ఈ సేవలను ఉపయోగించుకున్నారు. నాట్స్ ఆధ్వర్యంలో కాన్సులర్ సర్వీసెస్‌తో పాటు విద్యార్థుల కోసం వెబినార్స్ నిర్వహించారు. న్యూజెర్సీలో బాల సుబ్రహ్మణ్యం స్వర నీరాజనం కార్యక్రమం, యోగా, తులసీ దళంలతో పాటు తెలుగు ప్రజలకు ఉపయోగపడే పలు కార్యక్రమాలను నిర్వహించినట్టు నాట్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. జులై, ఆగష్టులలో సూపర్ బ్రెయిన్ వర్క్‌షాప్‌లను నిర్వహించబోతునట్టు తెలిపారు. -
ప్రధాని మోదీ ఉగాది శుభాకాంక్షలు, తెలుగులో ట్వీట్
సాక్షి, ఢిల్లీ: ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని.. తెలుగులో ట్వీట్ చేశారు. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నానని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను. — Narendra Modi (@narendramodi) April 13, 2021 ఆనందాల హరివిల్లు ఉగాది: గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అమరావతి: శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పండుగ అన్ని వర్గాలకూ శాంతి, సామరస్యం, ఆనందాన్ని తీసుకురావాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. ఆయన సోమవారం ఓ ప్రకటనలో రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు లోగిళ్లలో ఆనందాల హరివిల్లు అయిన ఉగాది పండుగ ప్రతి ఇంటా శుభం కలుగజేయాలని ఆకాంక్షించారు. ప్రజలంతా కరోనా నిబంధనలను పాటిస్తూ ఉగాది పండుగ జరుపుకోవాలని ఆయన సూచించారు. చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఉగాది కానుక వచ్చేసింది ఉగాది పండుగను ఇలా జరుపుకోవాలి! -
స్వదేశానికి రప్పించాలని వేడుకోలు
-
కువైట్‌లో తెలుగువారి ఆర్తనాదాలు..
సాక్షి, నిజామాబాద్: బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లిన తెలుగు రాష్ట్రాల వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. వారితో పాటు తమిళనాడు, బీహార్ వాసులు కూడా కరోనా ప్రభావంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని నిజామాబాద్, కామారెడ్డి, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల వాసులు ఐదు నెలలుగా జీతాలు లేక కువైట్‌లో కష్టాలు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో రూముల్లోంచి బయటకు వెళ్లలేని దుస్థితి ఏర్పడింది. వసతులు లేక విలవిల్లాడుతున్నారు. కనీసం భోజనం, నీళ్లు ఇప్పించాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. భారత్‌కు రప్పించాలని సెల్పీ వీడియోలు ద్వారా వేడుకుంటున్నారు. అక్కడ కంపెనీలు పట్టించుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి స్వదేశానికి రప్పించాలని వేడుకుంటున్నారు. -
‘వారంతా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి’
సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్నవారంతా స్పందన వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని కోవిడ్ స్టేట్ లెవల్ కో ఆర్డినేటర్ కృష్ణబాబు తెలిపారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాళ్లంతా spandana.ap.gov.inలో నమోదు చేసుకోవాలని సూచించారు. అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు సమాచారం ఇచ్చామని.. ఏపీకి రావాలనుకుంటున్నవారికి ఏర్పాట్లు చేయాలని కోరామని ఆయన తెలిపారు. రాజస్తాన్‌లో 9వేల మంది రిజిస్టర్ చేసుకున్నట్లు సమాచారం వచ్చిందని.. వారిని ఏపీకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తమిళనాడులో ఉన్న మత్స్యకారులను కూడా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహారాష్ట్ర వలస కూలీలను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. శ్రామిక్ రైళ్లలో సాధారణ ప్రజలకు అనుమతి ఉండదని.. వలస కూలీలకు మాత్రమే పాస్‌లు ఇస్తున్నామని కృష్ణబాబు వెల్లడించారు. రాజస్తాన్ మౌంట్ అబూలో 670 మంది వారు ఉన్నారని.. వారికి రాజస్తాన్ ప్రభుత్వం ప్రత్యేక రైలు సిద్ధం చేసిందని తెలిపారు. ఏ రైలులో కూడా 1200 మందికి మించి ఉండరని తెలిపారు. వివిధ దేశాల నుంచి ఏపీకి వచ్చేందుకు 10,500 మంది రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి ఒక పద్దతి ప్రకారం పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా సరిహద్దుల్లోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని స్పష్టం చేశారు, ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోలేని వారు తహశీల్ధార్ కార్యాలయంలో సంప్రదించవచ్చని కృష్ణబాబు పేర్కొన్నారు. (మద్య నియంత్రణ దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం) -
క్వారంటైన్ కష్టాలు..
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన నాగరాజు (పేరు మార్చాం) మొన్నటివరకు జర్మనీలో ఉండి వచ్చారు. మొన్నటి వరకు ఆ కాలనీలో అతడో సెలబ్రిటీ.. కానీ ఇప్పుడు అతడిని అంటరానివాడిగా ఆ కాలనీవాసులు చూస్తున్నారు. గచ్చిబౌలిలో నివసించే అరుణ్ (పేరు మార్చాం) లండన్ నుంచి వచ్చాడు. అతడు ఉండే అపార్ట్మెంట్లో తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నాడు. ఇతడి ఫ్లాట్ తలుపులు, కిటికీలు తెరిచినా పక్కింటి వారు, అపార్ట్‌మెంట్‌వాసులు అంగీకరించట్లేదు. క్వారంటైన్లో ఉన్న మనిషిని ఇంట్లో పెట్టుకుని యథేచ్ఛగా తలుపులు తీస్తారా? అని ఆయన కుటుంబసభ్యులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇవి రెండే కాదు.. విదేశాల నుంచి హోం క్వారంటైన్లో ఉన్న వందలాది మంది విదేశాల నుంచి వచ్చిన వారి గోస ఇది. గతంలో పూలు అమ్మిన చోట ఇప్పుడు రాళ్లు అమ్ముకుంటున్న పరిస్థితులు. గతంలో ఉన్న గౌరవాన్ని కరోనా మింగేయడంతో ఓ రకంగా వివక్షపూరిత జీవనం కొనసాగిస్తున్నారు. ఎంతగా అంటే.. కనీసం వారికి అన్నం పెట్టేందుకు కుటుంబసభ్యులు కూడా భయపడేంత. మార్పు వస్తేనే మేలు.. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల నుంచి వారికి దూరంగా ఉండటమే మంచిది. కానీ వారికి కరోనా సోకినా, సోకకున్నా తన చుట్టుపక్కల ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలన్న నిబద్ధతతో తమకు తాము 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉంటున్న వారిని కించపరిచేలా వ్యవహరించడం తగదని అటు ప్రభుత్వ వర్గాలు, ఇటు వైద్యులు చెబుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారందరిలో ఈ వైరస్ లేదని, అయినా ముందు జాగ్రత్తగా మాత్రమే వారిని స్వీయ నిర్బంధంలో ఉం చామని, వారి పట్ల అమానుషంగా వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా యి. కరోనా వైరస్ సోకిన వారిని తాకినప్పుడు ఈ వైరస్ వస్తుందని, అది కూడా ఆ వ్యక్తి తన ముఖ భాగాలను చేతితో తాకితేనే శరీరంలోకి ప్రవేశిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవరికి వారు వారి ఇళ్లల్లో ఉన్నా.. ఒకవేళ బయటకు వచ్చినా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ చేతులు తరచూ కడుక్కున్నా.. తన ముఖ భాగాలను తాకకపోయి నా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించదన్న వాస్తవాన్ని గుర్తించాలని సూచి స్తున్నారు. క్వారంటైన్లో ఉన్న వారు తమ పరిసరాల్లో ఉన్నంత మా త్రాన భయపడాల్సిన పని లేదనే విషయాన్ని గ్రహించాలని కోరుతున్నారు. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపించేది కాదు కాబట్టి క్వారంటైన్లో ఉన్న వారు నివసించే ప్లాట్లు, ఇళ్ల తలుపులు తెరచి ఉన్నంత మాత్రాన ప్రమాదమేమీ లేదని వివరిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్లో ఉండటంపై సమాజం అపోహలు తొలగించుకోవాలని, వారిలో ధైర్యం కల్పించినప్పుడే విదేశాల నుంచి వచ్చిన వారంతా ఇళ్లకు పరిమితమవుతారని, అప్పుడే ఈ వైరస్ నియంత్రణలోకి వస్తుందనే వాస్తవాన్ని మాత్రం విస్మరించొద్దని సూచిస్తున్నారు. రాష్ట్రంలో తొలి కరోనా వైరస్ బాధితుడు రామ్‌తేజ్ మన్ కీ బాత్‌లో ప్రధారి నరేంద్ర మోదీతో చెప్పిన విధంగా క్వారంటైన్ అంటే జైలు జీవితం కాదని, అలాంటి వివక్షను ఈ సమాజం విదేశాల నుంచి వచ్చిన వారికి ఇవ్వడం వల్ల వారు మరింత భయపడితే అసలుకే ఎసరు వస్తుందని గుర్తుంచుకోవాలి. అందుకే సాటి మనిషిని గౌరవించడం నేర్చుకోండి.. క్వారంటైన్లో ఉన్నవారినే కాదు కరోనా వైరస్ సోకిన వారిని కూడా అవమానించొద్దని చెబుతున్నారు. -
ఇజ్రాయిల్‌లో మనోళ్లకు కష్టాలు
ఆర్మూర్: ఉపాధి కోసం ఇజ్రాయిల్ వెళ్లిన తెలుగు వారు కరోనా వైరస్ కారణంగా ఇక్కట్లు పడుతున్నారు. ఇజ్రాయిల్ ఇమ్మిగ్రేషన్ అథారిటీ నిబంధనల ప్రకారం ఉపాధి కోసం వెళ్లిన తెలుగు వారి సంఖ్య వెయ్యికి పైగా ఉండగా భారతీయులు మొత్తం పది వేల మందికి పైగా ఉంటారు. అనధికారికంగా విజిట్ విసాపై వెళ్లి అక్కడే ఉపాధి వెతుక్కుంటున్న వారి సంఖ్య సైతం అధికంగానే ఉంటుంది. అయితే కరోనా వైరస్ విస్తరిస్తున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు వారు ‘సాక్షి’తో తమ కష్టాలను పంచుకున్నారు. కరోనా వైరస్ ఇజ్రాయిల్‌లో సైతం విస్తరిస్తుండటంతో అక్కడి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా షాపింగ్ మాల్స్, థియేటర్లు, హోటళ్లు, బేకరీలు మూసివేసింది. బస్సులను సైతం నిలిపి వేశారు. కార్యాలయాల్లో విధులు నిర్వహించే వారికి హోంటు వర్క్‌కు అవకాశం కల్పించారు. కానీ అధికంగా తెలుగు వారు ఇక్కడ ఇళ్లలో కార్మికులుగా, వృద్ధులను, వికలాంగులను చూసుకొనే కేర్ టేకర్లుగా పని చేస్తుంటారు. వారం రోజులుగా వీరిని పనుల్లోకి రావద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. వారి గదుల్లోనుంచి బయటకు రావొద్దని సూచించారు. దీంతో వారం, పది రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను కొనుగోలు చేసి గదులకే పరిమితమయ్యామని వారు ఆదేవన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రతి నెల డబ్బులను ఇంటికి పంపిస్తామని, ఇప్పుడు డబ్బులు లేక తమకు రోజు గడవడమే కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. -
అమెరికాలో అద్భుత స్పందన
డాలస్ (అమెరికా): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అమెరికా పర్యటనలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఆయన ఎక్కడకు వెళ్లినా తెలుగు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ముఖ్యంగా డాలస్‌లోని హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ప్రవాసాంధ్రుల సమావేశం ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో కోలాహలంగా సాగింది. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లోని తెలుగు వారు ఈ సమావేశానికి అంచనాలకు మించి హాజరు కావడం విశేషం. శనివారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి) డాలస్ విమానాశ్రయానికి సైతం పెద్దఎత్తున తరలి వచ్చిన ప్రవాసాంధ్రులు జై జగన్ అంటూ కేరింతల మధ్య ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్‌కు చేరుకున్న వైఎస్ జగన్ అక్కడే అమెరికాలోని తెలుగు ప్రముఖులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని, అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధులు కూడా జగన్‌ను అక్కడే కలుసుకున్నారు. ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగించడానికి హచిన్సన్ ప్రాంతం చేరుకున్నప్పుడు ఆహూతులను అదుపు చేయడానికి అమెరికన్ భద్రతా సిబ్బంది బాగా ప్రయాస పడాల్సి వచ్చింది. సభా హాలులో నవరత్నాలుపై రూపొందించిన గీతంతో, వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. ‘నాకొక కల ఉంది...’ అని మార్టిన్ లూథర్ కింగ్ మాటలను ఉటంకించినప్పుడు మంత్రముగ్ధులయ్యారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తున్నప్పుడు హర్షామోదాలు వ్యక్తం అయ్యాయి. అమెరికా–భారత్ రెండు దేశాల జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. అమెరికాలో భారత రాయబార కార్యాలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభ అనంతరం నేరుగా డల్లాస్ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అక్కడ స్థానిక ప్రవాసాంధ్రులంతా ఘనంగా వీడ్కోలు పలికారు. కెనడాలోని టొరాంటో, మాంట్రియల్, న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీ, పిట్స్బర్గ్, డెట్రాయిట్, షికాగో, ఓహియో, ఆరిజోనా, సియాటెల్, కాలిఫోర్నియా బే ఏరియా, ఎల్ఏ, నార్త్ కాలిఫోర్నియా, సెంట్ లూయిస్, ఓక్లహామా, అట్లాంటా, ఫ్లోరిడా, ఆస్టిన్, హ్యూస్టన్, డాలస్ నుంచి ప్రవాసులు హాజరయ్యారు. కాగా, ‘స్వాగత సుమాంజలి’ పేరుతో ప్రవాసాంధ్రులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సన్మానపత్రాన్ని బహూకరించారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలంటూ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, పలు కంపెనీల ప్రతినిధులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. వాషింగ్టన్ డీసీలో ఆదివారం ఆయన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి చేయూతనివ్వాలన్నారు. (చదవండి: ఇది మీ ప్రభుత్వం.. ఆనందంగా రండి) -
తెలుగు వారమండీ!
చిన్న నుంచి పెద్ద దాకా ఫేస్‌బుక్‌ను ఎడాపెడా ఉపయోగిస్తుండడాన్ని చూసిన సీనియర్ పాత్రికేయులు పట్నాయకుని వెంకటేశ్వరరావు బుర్రలో ఓ చక్కటి ఆలోచన తళుక్కున మెరిసింది. అదేమిటంటే, తెలుగును ఇష్టపడే వారందరికీ ఆ మధురిమను రుచి చూపిస్తే బాగుంటుంది కదా, అందుకు ఫేస్‌బుక్‌నే వేదికగా మార్చుకుంటే ఎలా ఉంటుంది?’ అని. తనకు వచ్చిన ఈ ఆలోచనను వెంటనే అమలు చేసేశారు. అందులో భాగమే యూ ట్యూబ్‌లో తనకున్న వీఆర్ తెలుగు ఛానల్ ద్వారా ‘వారం వారం తెలుగు హారం’ పేరిట ప్రతి ఆదివారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఫేస్బుక్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ప్రారంభించేశారు. దీనిని మొక్కుబడిగా కాకుండా ఎంతో చిత్తశుద్ధితో తనకు ఎన్ని పనులున్నా పక్కనపెట్టేసి, ఆ సమయాన్ని పూర్తిగా కేటాయిస్తూ, ఓ యజ్ఞంలా నిర్వర్తిస్తున్నారు. అలా గత ఏడాది మార్చి 17 నుంచి ఇప్పటి వరకు అంటే 54 వారాలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. తెలుగును ఇష్టపడే వారిలో చాలామందిని తన వీఆర్ తెలుగు ఛానల్‌కు వీక్షకులుగా చేసుకోగలిగారు. ఎంతోమంది తెలుగు భాషాభిమానులను, పెద్దలను, యువతను ఇందులో భాగస్వాముల్ని చేశారు. అది ఎలా సాధ్యమైందో ఆయన మాటల్లోనే...‘‘తెలుగు మాట ప్రతీ ఇంటా మార్మోగాలనే సదుద్దేశంతో దీన్ని నేను ప్రారంభించాను. ఇల్లే వేదికగా నిర్వహిస్తున్న ఈ మహా యజ్ఞం ఇంత చక్కగా సాగడానికి కారణం తెలుగు భాషాభిమానులు ఇస్తున్న ప్రోత్సాహం. నాకు సలహాలు ఇచ్చి వెన్నుదన్నుగా నిలుస్తున్న పెద్దలు, తెలుగు భాషాభిమానులకు నా నమస్సులు. ఇంటివద్ద సహకరిస్తున్న నా సతీమణి ఇందిర, మా అమ్మాయి శివప్రత్యూషలకు కృతజ్ఞతలు. ఇక నేను అడిగిన తడవుగానే ఎలాంటి బేషజాలు చూపకుండా ఇంటికి వచ్చి కార్యక్రమంలో పాలు పంచుకున్న అతిథులు, ఫోన్ ద్వారా ముచ్చటించి కార్యక్రమంలో తెలుగు భావాలను పంచుకున్న పెద్దలకు వందనాలు. ఇలా ఇప్పటికి 25 మంది ప్రముఖులు ఇంటివద్దకు వచ్చి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. మరో 25 మంది శ్రీకాకుళం, విశాఖ, అనంతపురం, కడప, కర్నూలు, సిద్దిపేట, వరంగల్, హైదరాబాద్‌లనుంచి ఫోన్ ద్వారా ముచ్చటించి చక్కని తెలుగుకు చిక్కని బాటలు వేశారు. ఇక నేను వ్యక్తిగత వ్యాఖ్యానం ద్వారా 90 కి పైగా వేమన పద్యాలు, 50 వరకూ తెలుగు దనం నింపే పద్యాలు, 50 సామెతలు, తెలుగు విశేషాలు, తెలుగు ప్రముఖుల ముచ్చట్లు, సందర్భోచితంగా కొత్త అంశాలు మీముందు ఉంచాను. ఇవి కూడా ముమ్మరంగా షేర్ అయ్యాయి. వేలమంది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ చూశారు. దీనికి అనుబంధంగా యూ ట్యూబ్‌లో నడుస్తున్న ‘వీఆర్ తెలుగు చానల్’ ద్వారా 10 వేల వరకూ వీక్షకులు ఆదరించారు. ముఖ్యంగా తెలుగు విశేషాలు కొత్త తరానికి చేర్చాలనే సంకల్పంతో సాగుతున్న ఈ మహత్తర వినూత్న కార్యక్రమం మీ ముందుకు తెస్తున్నందుకు, దీనికి మీ ఆదరణ తోడుగా నిలుస్తున్నందుకు ఒడలు పులకరిస్తోంది. ఈ సరికొత్త ప్రయోగానికి సదా మీ ఆశీస్సులు కోరుకుంటున్నాను..’’ తెలుగు హారంలో పరిమళించిన కొన్ని పుష్పాలు... రత్నాల నరసింహమూర్తి (సీనియర్ జర్నలిస్టు), వర్థనపు సుధాకర్( డీడీ ఖజానా శాఖ, విశాఖ), పి. లక్ష్మణ్ (వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మహబూబ్ నగర్); పోకల సుబ్బారెడ్డి (వ్యక్తిత్వ ప్రేరకుడు, కర్నూలు), ఆర్. మధుసూదన రావు(కథకుడు, సినీగేయ రచయిత); బాబూచారి (గాయకుడు), మక్కపాటి మంగళ (స్వర్ణపుష్పం పత్రిక ఎడిటర్); కాలువ మల్లయ్య (సాహితీ ప్రముఖుడు, ఉమ్మడి రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ సభ్యుడు), డా. వకుళాభరణం కృష్ణమోహన్ (తెలంగాణ రాష్ట్రం బీసీ కమిషన్ సభ్యుడు, సాహితీ వేత్త)లు అతిథులుగా వచ్చి తెలుగు భావాలను ప్రత్యక్షంగా పంచుకున్నారు. ఫోన్ ద్వారా ముచ్చటించిన వారు... సన్నశెట్టి రాజశేఖర్ (సంపాదకులు, ఉత్తరాంధ్ర పత్రిక, శ్రీకాకుళం), 2. భద్రి కూర్మారావు (జానపద కళా ప్రముఖుడు, డిగ్రీ కళాశాల ఉపన్యాసకుడు, శ్రీకాకుళం; శ్యామసుందర శాస్త్రి, (రేడియో వ్యాఖ్యాత, అనంతపురం) ఈశ్వర రెడ్డి (ఆచార్యుడు, వేమన వర్సిటీ, కడప), మహ్మద్ మియా (గజల్ గాయకుడు, కర్నూలు), నందిగం శివప్రసాద్ (సినీ సంగీత దర్శకుడు, హైదరాబాద్); జంద్యాల రఘుబాబు (కవి, రచయిత, కర్నూలు), శ్యామ్ ప్రసాద్ లాల్ (జేసీ, కరీంనగర్), ఎం. హరికిషన్ (ప్రఖ్యాత బాలల కథకుడు, కర్నూలు) తెలుగు హారం కార్యక్రమ లక్ష్యాలుప్రతీ ఇల్లూ తెలుగుకు పెద్ద పీట వేయాలి; తెలుగు భాష, సంస్కృతి, పద్యం, పాట, నాటకం, సామెతలు, నుడికారాలు, అవధానం వంటి అన్ని ప్రక్రియలను కొత్త తరం పిల్లలకు తెలియచేసి భాషా మమకారం పెంచడం, మన మాతృభాష కొన్ని వందల తరాలకు అందేలా తెలుగు కుటుంబాలు కృషి చేసేందుకు ప్రేరణ కలిగించడం -
నిత్యమైన మంగ
తెలుగు వారింట ‘శశిరేఖ’గా అడుగుపెట్టి ఇంటిల్లిపాదితో ‘మంగతాయారు’గా ముచ్చట్లుచెప్పి ‘నిత్య’మై వెలుగొందుతున్న మేఘనా లోకేష్ జీ తెలుగులో ‘కళ్యాణవైభోగం, రక్తసం బంధం’ సీరియల్స్‌లో నటిస్తున్నారు. తెలుగువారు మెచ్చిన మేఘన చెబుతున్న ముచ్చట్లు ఇవి. ‘‘సీరియల్స్ అంటే ఏడుపు మాత్రమే ఉంటుందనుకునే రోజులు కావివి. అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో, తమ జీవితాలతో పాటు కుటుంబ బంధాలను ఎలా సరిదిద్దుతారో చూపుతున్నారు. ఆరేళ్లుగా బుల్లితెర నటిగా ఉంటున్న నాకు నేను నటించిన పాత్రలన్నీ ఎంతో మంచిని నేర్పిస్తూనే ఉన్నాయి. స్ట్రాంగ్‌గా మార్చిన పాత్రలూ ఉన్నాయి. నేను పుట్టిపెరిగింది అంతా మైసూరులోనే. కన్నడ అమ్మాయిని. ఆరేళ్ల క్రితం వరకు చదువు, స్టేజ్ షోలే లోకంగా ఉండేవి. చదువు పూర్తి చేశాను. చదువుతో పాటు స్టేజ్ షోల పట్ల కూడా నాకు ఆసక్తి ఉండేది. నేను వృద్ధిలోకి రావడానికి మా నాన్న చాలా త్యాగాలు చేశారు. స్టేజ్ షోస్‌లో పాల్గొనేటప్పుడు ఆ షోస్ కోసం రోజూ 20 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి, తీసుకొచ్చేవారు. టీవీ సీరియల్స్‌లో అవకాశం వచ్చినప్పుడు నాన్న కాస్త డౌట్‌గానే ఓకే చెప్పారు. అయితే, పని పట్ల శ్రద్ధ అవసరం అని తరచూ చెబుతుండేవారు. కన్నడ సీరియల్లో నటించినప్పుడు ఆ రోల్‌కి అవార్డ్ రావడంతో నాన్నకు ధైర్యం వచ్చింది. తర్వాత వచ్చిన సీరియల్స్ అవకాశాలకు ఓకే చెప్పారు. అలా ఈ రంగంలో ఆరేళ్ల నుంచి వున్నాను. సీ‘రియల్ మలుపులు’... సీరియల్స్‌లో కొన్ని ఊహించని మలుపులు ఉంటాయి. అలాగే నా జీవితంలోనూ ఓ మలుపు.. కిందటేడాది క్యాన్సర్ వచ్చి నాన్న నాకు దూరమయ్యారు. క్యాన్సర్ ఉన్నట్టుగా 5–6 నెలల వరకు నాకీ విషయం తెలియనివ్వలేదు నాన్న. రక్తసంబంధం, కళ్యాణవైభోగం సీరియల్‌తో సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉండి మైసూరుకు ఎక్కువ వెళ్లేదాన్ని కాదు. నా వర్క్ ఎక్కడ డిస్ట్రబ్ అవుతుందో అని నాకా విషయం చెప్పద్దన్నారట నాన్న. క్యాన్సర్ చివరి స్టేజ్‌లో నాకా విషయం తెలిసింది. అప్పటికే ఆలస్యం అయ్యింది. నాకు అమ్మ, అన్నయ్య, అమ్మమ్మ ఉన్నారు. ఎప్పుడు పెళ్లి అనే ఆలోచన వచ్చినా నాకు ఓ సమాధానం వస్తుంది. మా నాన్నలా నన్ను కేరింగ్‌గా, ప్రొటెక్టివ్‌గా చూసుకోవాలని. అంతగా లేకపోయినా ప్రేమగా ఉంటే చాలు అనుకుంటున్నాను. నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ. ఉన్నవారు కూడా వేరే వేరే చోట్లలో వారి పనుల్లో బిజీ. నేనే మైసూర్ వెళ్లినప్పుడు వారిని కలుస్తుంటాను. ఈ మధ్య ఏడాదికి ఒకసారి స్నేహితులంతా కలిసేలా ప్లాన్ చేసుకున్నాం. సీరియల్స్ అంటే ఏడుపు సీన్లు కాదు చాలా వరకు సీరియల్ నటి అనగానే ఏడుపు సీన్లు ఉంటాయి అంటారు. ఇప్పుడు అలాంటివేవీ లేవు. సీరియల్స్‌లోనూ చాలా మార్పులు వచ్చాయి. రక్తసంబంధం సీరియల్లో తులసి క్యారెక్టర్‌నే తీసుకుంటే తను చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ తరానికి బాగా కనెక్ట్ అయిన పాత్ర అది. స్టోరీ డ్రామా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కళ్యాణ వైభోగం సీరియల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నాను. నిత్య–మంగగా రెండూ రెండు భిన్న పాత్రలు. ఇదో సవాల్‌లా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాను. తెలుగువారు మెచ్చిన మంగతాయారు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లన్నీ ఇష్టమైనవే. అయితే, ‘కళ్యాణవైభోగం’ మంగతాయారు పాత్ర అంటే ఇంకా ఇష్టం. మంగ చాలా అమాయకురాలు. అప్పటివరకు ఓ పల్లెటూరు అమ్మాయి ఎంత అమాయకంగా ఉంటుందో కూడా తెలియదు. అలాంటి ఆ అమ్మాయిలో తర్వాత తర్వాత చాలా ప్రతిభ కనిపిస్తుంటుంది. ఇల్లాలిగా, త్యాగమయిగా.. తనను తాను చాలా మార్చుకుంటూ ప్రూవ్ చేసుకుంటుంది. అన్ని వయసుల వారూ ఈ క్యారెక్టర్‌కి కనెక్ట్ అవుతారు. మంగతాయారు పాత్ర ద్వారా నా జీవితంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ పాత్ర–నేనూ వేరు కాదని అనిపిస్తుంటుంది. శశిరేఖగా అందరికీ పరిచయం అయినా ఈ పాత్ర వల్ల తెలుగువారింట నేనూ ఓ కుటుంబసభ్యురాలినైపోయాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.’’ నిర్మలారెడ్డి -
తెలుగువారితో కిషన్‌రెడ్డి లైవ్
సాక్షి, హైదరాబాద్: ‘భారత్ కీ మన్‌కీ బాత్ మోదీ కే సాథ్’ కార్యక్రమంలో భాగంగా బీజేపీ పూర్వ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫేస్బుక్, ట్విట్టర్లలో లైవ్ కార్యక్రమం ద్వారా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారితో మాట్లాడి బీజేపీ మేనిఫెస్టో కోసం వారి అభిప్రాయాలను బుధవారం సేకరించారు. ఈ లైవ్ కార్యక్రమంలో విద్య, ఉపాధి, వైద్యం, దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, తీవ్ర వాదం, వ్యవసాయం వంటి అంశాలపై ఆన్లైన్లో ప్రజలు కిషన్ రెడ్డితో ముచ్చటించారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డు పడకుండా చూడాలని కోరారు. ఆవాస్ యోజన కింద ఇచ్చే మొత్తాన్ని పెంచాలని, ఎన్నికల్లో డబ్బు ప్రవాహం తగ్గించడానికి ఎన్నికల సంస్కరణలను తీసుకురావాలని చెప్పారు. వీటిపై కిషన్‌రెడ్డి స్పందిస్తూ బీజేపీ ప్రజల అభిప్రాయాల మేరకు నడుచుకునే పార్టీ కానీ ఒక కుటుంబం అభిప్రాయం మేరకు నడుచుకునే పార్టీ కాదన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు మేనిఫెస్టోను రూపొందించి ప్రజల ముందు పెడతామన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలిచినా ఢిల్లీలో వాళ్లు చేసేది ఏమీ లేదు కాబట్టి అత్యధిక స్థానాల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లి శ్రీమావుళ్లమ్మ తల్లి
అమ్మలగన్న అమ్మగా, కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లిగా భీమవరం గ్రామ దేవత శ్రీమావుళ్లమ్మ తల్లి దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారి దైవంగా ప్రసిద్ధి. అమ్మ సన్నిధికి వచ్చి తమ బాధలను చెప్పుకుని ఆర్తితో వేడుకుంటే చాలు... చిటికెలో సమస్యలన్నీ దూరమవుతాయని భక్తుల విశ్వాసం. అందుకే సామాన్య భక్తుడి నుంచి సంపన్నుడి వరకు నిత్యం అమ్మవారి దర్శనం కోసం పరితపిస్తుంటారు. అంతటి మహిమ గల మూర్తి పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువై ఉంది. వ్యాపారం ప్రారంభించినా, వివాహాదివేడుకలు చేస్తున్నా, నూతన వాహనాలు కొన్నా, అంతా శ్రీమావుళ్లమ్మ అమ్మవారి దయ అని చెప్పుకుంటారు స్థానికులు. ఘనంగా ఆరంభమైన వార్షికోత్సవాలుఅమ్మవారి 55వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ఆరంభమైనాయి. జనవరి 13న మొదలైన ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతాయి. అమ్మవారి ఉత్సవాలను తిలకించడానికి తెలంగాణ నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. అమ్మవారి ఆలయం వద్ద ప్రతి రోజు పలు సంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయగా భక్తులు భారీగా తరలి వచ్చి తిలకిస్తున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఉత్సవాల నిర్వాహకులు నీరుల్లి, కూరగాయలు, పండ్లు వర్తకం సంఘం, అమ్మవారి ఉత్సవ కమిటీ వారు రోజుకు సుమారు 800 మంది భక్తులకు అన్నదాన ప్రసాదం వితరణ చేస్తున్నారు. వచ్చే నెల 7 తేదీ శ్రీఆదిలక్ష్మీ అమ్మవారి అలంకరణ నుంచి 15 తేదీ శ్రీ అన్నపూర్ణ దేవి అమ్మవారి అలంకరణ వరకు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు ఉంటాయి. అమ్మవారి ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను ఎంతో అకట్టుకుంటున్నాయి. – బొక్కా రామాంజనేయులు (నాని) ఉత్సవాలు... విశేషాలు ►శ్రీమావుళ్లమ్మ అమ్మవారు విగ్రహం ఎనిమిది అడుగుల మించిన ఎత్తుతో ఉండడం విశేషం. ►అమ్మవారి స్వర్ణ కిరీటం తిరుమల వెంకటేశ్వరస్వామి వారి కిరీటం కంటే పెద్ద కిరీటమని ప్రతీతి. ►శ్రీమావుళ్లమ్మ అమ్మవారు క్రీస్తు శకం 1200 సంవత్సరంలో వెలిసినట్లు చెబుతారు. ►భీమవరం పట్టణంలో ప్రస్తుతం ఉన్న మోటుపల్లి వారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరుచుటకు నిర్మించిన పూరి గుడి ఉన్న ప్రాంతంలో వేప, రావి చెట్టు కలిసి ఉన్న చోట శ్రీమావుళ్లమ్మ అమ్మవారు వెలిశారని తెలుస్తోంది. ►మామిడి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వెలిసిన తల్లి కనుక శుభపద్రమైన మామిడి పేరుమీదగా మామిళ్ళ అమ్మగా... అనంతరం మావుళ్లమ్మగా నామాంతరం చెందిందని చరిత్ర చెబుతుంది. ►చిన్న చిన్న ఊళ్ళ వారంతా కలిసి అమ్మవారిని గ్రామ దేవతగా కొలవడం వల్లే మావుళ్ల అమ్మ మావుళ్లమ్మగా నామాంతరం చెందారని మరి కొందరు అభిప్రాయం. ►ఫిబ్రవరి 15న అమ్మవారి ఆలయం వద్ద సుమారు 60 వేలమందికి అఖండ అన్నసమారాధన జరుగుతుంది. -
కేరళలో తెలుగోడి గోడు
కొచ్చి నుంచి సాక్షి ప్రతినిధి: కేరళ వరద విలయానికి అక్కడ నివసిస్తోన్న వందలాది మంది తెలుగు ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కేరళ వ్యాప్తంగా వేలాది మంది తెలుగువారు ఉండగా.. ఒక్క కొచ్చిలోని ఏలూర్ కాలనీలో 400 నుంచి 450 తెలుగు కుటుంబాలు నివసిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల నుంచి వారంతా అక్కడికి వలస పోయారు. గత వారం కురిసిన భారీ వర్షాలకు వరద చుట్టుముట్టడంతో వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దాదాపు 50 నుంచి 100 తెలుగు కుటుంబాలపై వర్షాలు, వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. అనేక ఇళ్లు మునిగిపోవడంతో సామాన్లు పనికిరాకుండా పోయాయి. వారంతా కట్టుబట్టలతో మిగిలారు. 3 రోజుల పాటు సహాయ శిబిరాల్లో తలదాచుకుని ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు.అయితే రెండడుగుల మేర బురద పేరుకుపోవడంతో ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. మొత్తం వస్తువులన్నీ పాడవడంతో మళ్లీ కొత్త జీవితం ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు, వరదల వల్ల ఒక్కో కుటుంబానికి లక్ష నుంచి రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని కొచ్చి తెలుగు సంఘం నేత నాయుడు చెప్పారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన స్థానిక ఫ్యాక్ట్ కంపెనీలో చిన్న కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. సొంత రాష్ట్రానికి దూరంగా ఉండటం, స్థానిక ప్రభుత్వం సహాయం అందే పరిస్థితి లేకపోవడంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిస్సహాయ స్థితిలో వలస కార్మికులు కొచ్చిలోని ఫ్యాక్ట్ కంపెనీ, షిప్‌యార్డుల్లో దాదాపు వెయ్యి, పదిహేను వందల మంది తెలుగువారు పని చేస్తున్నారు. వర్షాల కారణంగా పది రోజులుగా పనులు లేక రోజు గడవడం కష్టంగా మారిందని వారు వాపోతున్నారు. వీరిని ఆదుకోవడానికి కొచ్చి తెలుగు అసోసియేషన్ విరాళాల సేకరణ చేపడుతోంది. ఇక్కడి తెలుగు ప్రజల్లో చాలా మంది వలస కూలీలు కావడంతో వారికి స్థానికంగా ఎలాంటి అధికార గుర్తింపు కార్డులు లేవు. అందువల్ల ప్రభుత్వం చేస్తున్న సాయం, పరిహారం వీరికి అందే పరిస్థితి లేదు. దాంతో తెలుగు సంఘమే వీరిని ఆదుకోవడానికి నడుం కట్టింది.