మలేషియాలో తెలుగు వైభవం.. 5 లక్షల పైమాటే..! | History of Generations of Telugus in Malaysia | Sakshi
Sakshi News home page

మలేషియాలో తెలుగు వైభవం.. 5 లక్షల పైమాటే..!

Published Sun, Jul 24 2022 9:33 AM | Last Updated on Sun, Jul 24 2022 11:07 AM

History of Generations of Telugus in Malaysia - Sakshi

పరిచయంలేని ప్రదేశంలో మన ప్రాంతం వాళ్లు కనిపిస్తే ఆనందం!
పరాయిగడ్డ మీద మన భాష వినిపిస్తే నైతిక బలం..!!
సంఘాలు, సంస్థలను ఏర్పాటుచేసుకునేది ఇలాంటి మద్దతు కోసమే! 
మన మాట, సంస్కృతి, సంప్రదాయాలను పట్టి ఉంచుకోవడానికే!!
నివసిస్తున్న దేశమేదైనా మన ఉనికి చాటుకోవడానికే!! 
ఇదంతా ఓ  పోరాటం.. స్వస్థలాలను వదిలి దేశాంతరం వెళ్లిన వాళ్లంతా చేసే కనిపించని పోరాటం!!
బ్రిటిష్‌ రాజ్యంలో మన తెలుగు వాళ్లు కూడా తెల్లవారి 
కూలీలుగా వాళ్ల కాలనీలకు వలస వెళ్లారు!
అందులో మలేసియా ఒకటి! అక్కడి కొబ్బరి, రబ్బరు తోటలు సహా చాలా చోట్ల పనులకు కుదిరారు. అక్కడే స్థిరపడ్డారు. మాతృభాషను పరిరక్షించుకుంటే అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నట్లేనని భావించారు. 

తెలుగు సంఘం ఏర్పాటు చేసుకున్నారు. 
తెలుగును కాపాడుకుంటున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి 
జరిగే ద్వైవార్షిక సభలు ఇటీవల రవాంగ్‌లో నిర్వహించారు.  
ఆ సందర్భంగానే ఈ స్టోరీ!


అది రవాంగ్‌ పట్టణం.. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌కు  ఇరవై మైళ్ల దూరంలో ఉంటుంది. చుట్టూ ఆకాశపుటంచుల్లోకి కొమ్మలు చాచుకొని పెరిగిన.. ప్రపంచంలోకెల్లా ఎతైన  మహావృక్షాలు, వాటితో పోటీపడే కొండలు, కోనలతో పచ్చగా.. ఆహ్లాదభరింతంగా ఉంటుంది. బహుశా ఆ వాతావరణం వల్లనే రవాంగ్‌ సామాజిక జీవితం కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. నెమ్మదిగా ప్రవహించే నదిలో సాఫీగా సాగిపోయే పడవ ప్రయాణంలా  జనజీవితం కనిపిస్తుంది. ఆ రవాంగ్‌లో జూన్‌ 26వ తేదీ.. ఆదివారం పండగలాంటి  సందడి నెలకొంది. మలేసియాకు నలుదిక్కులా ఉన్న రహదారులు రవాంగ్‌కు ప్రయాణమయ్యాయి.  ఉదయం ఏడింటికే వందలాది మంది అక్కడికి చేరుకున్నారు.

రవాంగ్‌కు వందల మైళ్ల దూరంలోని జోహూర్, క్లింగ్, బాగాన్‌ డత్తో తదితర నగరాలు, పట్టణాలు, గ్రామాల నుంచి ఉదయం తొమ్మిదింటికల్లా వచ్చేశారు. ఇటు సింగపూర్, అటు థాయ్‌లాండ్‌ సరిహద్దు జిల్లాల నుంచి కూడా వందలాది మంది వచ్చారు. వాళ్లంతా ఆ దేశంలో పుట్టిపెరిగిన మలేసియన్‌ తెలుగువాళ్లు. ఎనభై ఏళ్లు దాటిన రెండో తరం పెద్దల నుంచి  ఐదారేళ్ల నేటి తరం చిన్నారుల వరకూ ఉన్నారు. అది వాళ్లు ప్రాణప్రదంగా భావించే  తెలుగుతల్లి ఆలయం. మలేసియా తెలుగు అకాడమీ భవన ప్రాంగణం. గత 50 ఏళ్లుగా ఆ ప్రాంగణంతో మలేసియా తెలుగువాళ్లకు అనుబంధం ఉంది. ఒకప్పుడు  రవాంగ్‌  తెలుగు సంఘం కార్యాలయంగా, తెలుగు సాంస్కృతిక నిలయంగా వెలుగొందిన ఆ ప్రాంతంలోనే ఇప్పుడు ఐదంతస్తుల తెలుగు అకాడమీ భవనాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని తెలుగువాళ్లంతా కలసి  ఒక్కో రింగిట్‌ (అక్కడి కరెన్సీ) పోగు చేసుకొని ఆ భవానాన్ని కట్టుకున్నారు.

అది అక్కడి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. 150 ఏళ్లకు పైగా కాపాడుకుంటున్న తల్లిభాష తెలుగును భవిష్యత్‌ తరాలకు వారసత్వ కానుకగా అందజేసేందుకు మలేసియా తెలుగు సంఘం సకల సదుపాయా లతో ఆ భవనాన్ని నిర్మించింది. విశాలమైన తరగతి గదులు, వసతి కేంద్రాలు, గ్రం«థాలయం, ఆటస్థలం వంటి అన్ని ఏర్పాట్లూ ఉన్నాయి. తెలుగు భాషాభివృద్ధి, బోధన, సాహిత్య అధ్యయనం, మలేసియా తెలుగువారి చరిత్రను గ్రంథస్థం చేయడం వంటి లక్ష్యాలతో ఏర్పాటైన తెలుగు అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్లు ఆ ఆదివారం అక్కడ సమావేశామయ్యారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మలేసియా తెలుగు సంఘం 44వ ద్వైవార్షిక ప్రతినిధుల మహాసభ కూడా అదే రోజు కావడం మరో విశేషం. 



కుటుంబ వేడుకలా...
నిజానికి రెండేళ్ల  క్రితమే తెలుగు అకాడమీ భవనం ప్రారంభం కావలసి ఉంది. కోవిడ్‌ కారణంగా వాయిదా పడింది. గతంలో ఏడాదికి రెండు, మూడు సార్లయినా ఎక్కడో ఒకచోట  కలుసుకొనే తెలుగువాళ్లు గత రెండేళ్లుగా కలవలేకపోయారు. దాంతో జూన్‌ 26వ తేదీ నాటి కార్యక్రమం వారికి ఒక భావోద్వేగభరితమైన వేదికైంది. అందుకే ఇంటిల్లిపాదీ ఆ తెలుగు వేడుకల కోసం తరలివచ్చారు దూరభారాలు లెక్కచేయకుండా! దేశంలోని తెలుగు వాళ్లంతా ఆ రోజు అక్కడ ఒక కుటుంబంలా కలసిపోయారు. ఆత్మీయ పలకరింపులతో తెలుగు భాష తేనెలూరింది. సంప్రదాయ వస్త్రధారణతో తెలుగుదనం ఉట్టిపడింది. మలేసియా మాజీ ప్రధానమంత్రి దత్తో శ్రీ నజీబ్‌తోపాటు అక్కడి తెలుగు ప్రముఖులు అందరూ ఆ వేడుకకు హాజరయ్యారు.

మొదటగా మలేసియా జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులూ’ అంటూ తెలుగుతల్లి ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. అక్కడ తెలుగు సాంస్కృతిక వైభవాన్ని చాటే కార్యక్రమాలు, ప్రసంగాలు, ఆటలు, పాటలతో ఆ ఉదయం.. సాయంకాలంగా ఎప్పుడు కరిగిపోయిందో తెలియలేదు. మలేసియాలోని తెలుగువాళ్లు మొదట్లో  అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. వాళ్లు పనిచేసే తోటల్లో తెలుగు బడులు, గుడులు ఉండేవి. పిల్లలు తెలుగు నేర్చుకొనేవారు. పెద్దవాళ్లు సాయంత్రం పూట  రాముడి సన్నిధిలో చేరి కష్టసుఖాలను పంచుకొనేవారు. కాలక్రమంలో తెలుగు బడులు శిథిలమయ్యాయి. ఆ తదనంతర  తరాలకు చెందినవారు ఉన్నత చదువులు చదువుకొని గొప్ప స్థానాల్లో స్థిరపడ్డప్పటికీ తల్లి భాష తెలుగుకు దూరమయ్యారు. మలేసియా తెలుగు సంఘానికి ఇది మనస్తాపంగా మారింది.

ఈ క్రమంలోనే 2006లో ఆ సంఘం జాతీయ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ అచ్చయ్యకుమార్‌ రావు నేతృత్వంలో తెలుగు భాషాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ప్రారంభించారు. మలేసియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పాఠ్యపుస్తకాలను తయారు చేశారు. పలు చోట్ల నీతిశిబిరాలు, తెలుగు తరగతులు ఏర్పాటు చేశారు. తెలుగు వారిని తిరిగి సంఘటితం చేశారు. మలేసియా అంతటా 30కి పైగా తెలుగు శాఖల్లో ఇది ఒక ఉద్యమంలా సాగింది. ప్రస్తుతం 6 వేల మంది పిల్లలు తెలుగు భాష నేర్చుకుంటున్నారు. ‘మలేసియా భూమిపైన తెలుగు వాడు ఉన్నంత కాలం తెలుగు వర్ధిల్లుతుంది. ఆ లక్ష్యంతోనే అకాడమీ నిర్మించుకున్నాం. భవిష్యత్‌ తరాలకు ఇది బాటలు వేస్తుంది. తెలుగుకు దూరమైన వాళ్లంతా ఇప్పుడు దగ్గరయ్యారు. పిల్లలు  చక్కగా నేర్చుకుంటున్నారు’అని సంతోషం వ్యక్తం చేశారు డాక్టర్‌ అచ్చయ్యకుమార్‌ రావు. ఆయన నేతృత్వంలో మొదలైన తెలుగు భాషోద్యమం ఇప్పుడు చక్కటి ఫలితాలనిస్తోంది. 



తెలుగు వారి ముఖద్వారం బాగాన్‌ డత్తో...
మలేసియా తెలుగువాళ్లకు గొప్ప చరిత్ర ఉంది. 150 ఏళ్లకు పూర్వమే వలస వెళ్లిన తెలుగువాళ్లు ఆ దేశ చరిత్రలో భాగమయ్యారు. ఒకప్పటి మలయా దేశం (ఇప్పుడు మలేసియా)లో కొబ్బరి, కాఫీ, తేయాకు, రబ్బరు, పామాయిల్‌ తోటల్లో పని చేసేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం భారతదేశం నుంచి కార్మికులను తరలించింది. 1850 నుంచే ఈ వలసలు మొదలైనప్పటికి 1890 నాటికి  వేలాది మంది తమిళ, తెలుగు ప్రజలు పిల్లాపాపలతో, కట్టుబట్టలతో పొట్టచేతపట్టుకొని అక్కడికి  చేరుకున్నారు. విశాఖ, చెన్నపట్టణం, తదితర రేవు పట్టణాల నుంచి బయలుదేరి ఓడలు ఏడు రోజుల తరువాత మలేసియాలోని పినాంగ్‌ రేవుకు చేర్చాయి. అలా వెళ్లిన తెలుగువాళ్లు పినాంగ్‌ నుంచి జంగ్‌ అనే చైనా వారి తెరచాప ఓడల్లో మలక్కా జలసంధి గుండా పేరాక్‌ నది ముఖద్వారమైన బాగాన్‌ డత్తోకు చేరుకున్నారు. ఆ రోజుల్లో అది ఒక చేపల రేవు.

బ్రిటన్‌కు చెందిన స్ట్రెయిట్స్‌ ప్లాంటేషన్‌ కంపెనీకి చెందిన వేల ఎకరాల విస్తీర్ణంలోని కొబ్బరి తోటల్లో మొట్టమొదటి తెలుగు తరం పనిలో చేరారు. ఆ తరువాత తెలుగు కుటుంబాలు విస్తరిస్తున్న కొద్దీ వివిధ ప్రాంతాల్లో ఉన్న కొబ్బరి, రబ్బరు, పామాయిల్‌ తోటలకు స్థానికంగా వలసబాట పట్టారు. రబ్బరు తోటలతో నిండి ఉన్న రవాంగ్‌లోనూ బాగాన్‌ డత్తోకు సమాంతరంగా తెలుగు కుటుంబాలు విస్తరించాయి. ఒకప్పుడు గుప్పెడు మంది కూడా లేని తెలుగు జనాభా ఇప్పుడు ఇంచుమించు 5 లక్షలకు చేరుకుంది. ఉపాధి కోసం వెళ్లిన తెలుగు వాళ్లు బ్రిటిష్‌ కంపెనీల లాభాల కోసం నెత్తురు ధారపోశారు. ఆ తదనంతరం మలేసియా అభివృద్ధిలో భాగమయ్యారు. రెండు ప్రపంచయుద్ధాల కాలంలో మలేసియా స్వాతంత్య్రోద్యమంలో తెలుగు ప్రజల త్యాగాలు ఉన్నాయి.



తెలుగు ఒక్కటే అస్తిత్వం...
బ్రిటిష్‌ వారు పంపిన వలస కూలీలుగా మలేసియాకు చేరుకున్న తెలుగువాళ్లు బతుకుతెరువు కోసం తమిళ, మలయ్, చీనా తదితర భాషలను నేర్చుకున్నారు. అయినా మృతృభాష తెలుగును మాత్రం విస్మరించలేదు. ఎక్కడెక్కడో స్థిరడిన తెలుగు వాళ్లను ఆ భాషే ఒక్క గూటి పక్షులను చేసింది. అదొక్కటే వారి అస్తిత్వం. మెజారిటీ భాషల ఆధిపత్యం నుంచి తమ అస్తిత్వాన్ని కాపాడుకొనేందుకు ఎంతో కష్టపడ్డారు. తెలుగు బడులు మూసివేసిన తరువాత ఆ కష్టం మరింత ఎక్కువైంది. ‘ఒకదశలో తెలుగును బతికించుకోవడమే సవాలుగా మారింది. తెలుగు నీతి శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం తెలుగు బోధించాం. క్రమంగా ఫలితాలు కనిపించాయి’ అని చెప్పారు ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన చెగు అక్కయ్య అప్పల్నాయుడు.

74 ఏళ్ల వయస్సులో ఆయన ఇప్పుడు మలేసియాలోని అన్ని తెలుగు శాఖల్లో  తెలుగు భాషా బోధన పర్యవేక్షకులుగా వ్యవహరిస్తున్నారు. ఇంచుమించు 1990 నుంచి 2005 వరకు తెలుగు భాష సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. ఈ క్రమంలోనే ప్రతి కుటుంబంలో పిల్లలు, పెద్దలు  తెలుగు రాయడం, మాట్లాడడం, చదవడం విధిగా అలవరచుకోవాలనే లక్ష్యంతో 2006లో మలేసియా తెలుగు సంఘం 50 ఏళ్ల స్వర్ణోత్సవాల సందర్భంగా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొన్నారు. ఈ ఉద్యమానికి తెలుగు వారి నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభించాయి. ప్రతి ఇల్లు, ప్రతి తెలుగుశాఖ ఒక తెలుగు బడి అయింది. ఆరువేల మంది పిల్లలు ఇప్పుడు తెలుగుభాష పైన పట్టు సాధించారు. మలేసియా తెలుగువారి మహత్తరమైన తెలుగు వెలుగుల ప్రస్థానానికి ప్రతీకగానే  తెలుగు అకాడమీ భవనం ప్రారంభమైంది.

తెలుగుభాషోద్యమ రథసారథి 
2006 నుంచి  2020 వరకు మలేసియా తెలుగు సంఘం అధ్యక్షులుగా వ్యవహరించిన డాక్టర్‌ అచ్చయ్యకుమార్‌ రావు  తెలుగు నీతి శిబిరాలు, తెలుగు తరగతులు ఏర్పాటు చేశారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో  ప్రాథమిక, మాధ్యమిక, ప్రవీణ, విశారద అనే నాలుగు దశల్లో తెలుగు బోధనకు అవసరమైన పాఠ్యప్రణాళికలను రూపొందించడం వెనుక ఆయన కృషి ఉంది. తెలుగు అకాడమీ భవన నిర్మాణాన్ని ఒక సవాలుగా తీసుకొని పూర్తి చేశారు. 



అలుపెరుగని అధ్యాపకుడు
తెలుగు, తమిళ, మలయ్, ఇంగ్లిష్‌ భాషలపైన గట్టి పట్టు ఉన్న చెగు అక్కయ్య చెగు అప్పల్నాయుడు ఉపాధ్యాయ వృత్తిలో చేరినప్పటి నుంచి తెలుగు భాషా బోధన కోసం కృషి చేశారు. ఇప్పటికీ కాలికి బలపం కట్టుకొని మలేసియా అంతటా పర్యటిస్తూ తెలుగుశాఖలను ప్రోత్సహిస్తున్నారు. పాఠ్యప్రణాళికలను రూపొందించడంలోనూ, భాషాబోధనలోనూ ఆయన నిపుణులు. 

 


తెలుగు సాంస్కృతిక వారధి 
రెండో తరానికి చెందిన పెద్దలు, ఎనభై ఏళ్లు దాటినా  తెలుగు భాషాభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్న ప్రముఖ విద్యావేత్త డీవీ శ్రీరాములు. మలేసియాకు, తెలుగు రాష్ట్రాలకు నడుమ సాంస్కృతిక వారధిగా నిలిచారు. 1970ల నుంచే అక్కడి తెలుగు వాళ్లకు హైదరాబాద్, విశాఖ, సహా అన్ని ప్రాంతాలను పరిచయం చేయడంతో పాటు తెలుగు ఆత్మగౌరవాన్ని సమున్నతంగా చాటారు.
∙పగిడిపాల ఆంజనేయులు                            


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement