
మన భాష, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవటం తెలుగు వారిగా మన గౌరవాన్ని మరింత ఇనుమడింపజేస్తుందని భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ఈ దిశగా తెలుగు వారంతా చొరవ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం మలేషియా, సింగపూర్ పర్యటనల్లో ఉన్న ఆయన, మలేషియా తెలుగు సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలేషియాలోని తెలుగు సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆయన మాట్లాడుతూ.. 41 ఏళ్ళ క్రితం రెండవ ప్రపంచ తెలుగు మహాసభలకు, నాటి విద్యాశాఖ మంత్రి మండలి వెంకట కృష్ణారావు ఆహ్వానం మేరకు మిత్రులు జైపాల్ రెడ్డితో కలిసి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి సంస్కృతిలో జీవన విధానం, విశ్వాసాలు భాగంగా ఉంటాయన్న ఆయన, ఈ రెండు కాలగమనంలో పురోగమించాలే తప్ప, తిరోగమించరాదని సూచించారు. ఇటీవల తమ చెన్నై పర్యటనలో భాగంగా ఉన్నతమైన కుటుంబ విలువలకు చిరునామాగా నిలిచిన బటర్ ఫ్లై గ్రూప్ అధినేత మురుగేశన్ చెట్టియార్ గృహాన్ని సందర్శించారని అన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ ఇంటిలో 65 మంది కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవించడం గొప్పవిషయమని తెలిపారు. ఇలాంటి విలువలను ముందు తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో తమ కుమార్తె, మనుమడిని కూడా వారి ఇంటికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు. ఈ స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షించారు.
భాష మన సంస్కృతికి జీవనాడి అన్న ఆయన, ఉన్నతమైన సంస్కృతి... ఉన్నతమైన సమాజానికి బాటలు వేస్తుందని, భాష ద్వారా సంస్కృతి, సంస్కృతి ద్వారా సమాజం శక్తివంతమౌతాయని పేర్కొన్నారు. భారత్, మలేషియా మధ్య చక్కని బంధం ఏర్పడటంలో ప్రవాస భారతీయుల పాత్ర కీలకమన్నారు. ఈ నేపథ్యంలో 1960ల నుంచి మలేషియా తెలుగు సంఘం పోషిస్తున్న పాత్రను అభినందించిన ఆయన, తెలుగు సాంస్కృతిక వారసత్వం, భాషను పరిరక్షించుకునేందుకు ప్రారంభమైన మలేషియా తెలుగు సంఘం, పేర్లు మార్చుకున్నా ప్రాథాన్యతలను మార్చుకోకుండా అదే స్ఫూర్తితో పని చేస్తుండటం ఆనందదాయకమన్నారు. మలేషియాలోని ఇతర ప్రజల మధ్య సామరస్యంగా జీవించటంలో, బహుళ జాతుల మధ్య తెలుగు సంఘం గౌరవం, గుర్తింపును నిలబెట్టడానికి వారు చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. ఇదే స్పూర్తి భవిష్యత్ లోనూ కొనసాగాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment