![There have Been Many changes in Serial - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/10/megha.jpg.webp?itok=7aSRHJLe)
తెలుగు వారింట ‘శశిరేఖ’గా అడుగుపెట్టి ఇంటిల్లిపాదితో ‘మంగతాయారు’గా ముచ్చట్లుచెప్పి ‘నిత్య’మై వెలుగొందుతున్న మేఘనా లోకేష్ జీ తెలుగులో ‘కళ్యాణవైభోగం, రక్తసం బంధం’ సీరియల్స్‌లో నటిస్తున్నారు. తెలుగువారు మెచ్చిన మేఘన చెబుతున్న ముచ్చట్లు ఇవి.
‘‘సీరియల్స్ అంటే ఏడుపు మాత్రమే ఉంటుందనుకునే రోజులు కావివి. అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో, తమ జీవితాలతో పాటు కుటుంబ బంధాలను ఎలా సరిదిద్దుతారో చూపుతున్నారు. ఆరేళ్లుగా బుల్లితెర నటిగా ఉంటున్న నాకు నేను నటించిన పాత్రలన్నీ ఎంతో మంచిని నేర్పిస్తూనే ఉన్నాయి. స్ట్రాంగ్‌గా మార్చిన పాత్రలూ ఉన్నాయి. నేను పుట్టిపెరిగింది అంతా మైసూరులోనే. కన్నడ అమ్మాయిని. ఆరేళ్ల క్రితం వరకు చదువు, స్టేజ్ షోలే లోకంగా ఉండేవి. చదువు పూర్తి చేశాను.
చదువుతో పాటు స్టేజ్ షోల పట్ల కూడా నాకు ఆసక్తి ఉండేది. నేను వృద్ధిలోకి రావడానికి మా నాన్న చాలా త్యాగాలు చేశారు. స్టేజ్ షోస్‌లో పాల్గొనేటప్పుడు ఆ షోస్ కోసం రోజూ 20 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి, తీసుకొచ్చేవారు. టీవీ సీరియల్స్‌లో అవకాశం వచ్చినప్పుడు నాన్న కాస్త డౌట్‌గానే ఓకే చెప్పారు. అయితే, పని పట్ల శ్రద్ధ అవసరం అని తరచూ చెబుతుండేవారు. కన్నడ సీరియల్‌లో నటించినప్పుడు ఆ రోల్‌కి అవార్డ్ రావడంతో నాన్నకు ధైర్యం వచ్చింది. తర్వాత వచ్చిన సీరియల్స్ అవకాశాలకు ఓకే చెప్పారు. అలా ఈ రంగంలో ఆరేళ్ల నుంచి వున్నాను.
సీ‘రియల్ మలుపులు’... సీరియల్స్‌లో కొన్ని ఊహించని మలుపులు ఉంటాయి. అలాగే నా జీవితంలోనూ ఓ మలుపు.. కిందటేడాది క్యాన్సర్ వచ్చి నాన్న నాకు దూరమయ్యారు. క్యాన్సర్ ఉన్నట్టుగా 5–6 నెలల వరకు నాకీ విషయం తెలియనివ్వలేదు నాన్న. రక్తసంబంధం, కళ్యాణవైభోగం సీరియల్‌తో సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉండి మైసూరుకు ఎక్కువ వెళ్లేదాన్ని కాదు. నా వర్క్ ఎక్కడ డిస్ట్రబ్ అవుతుందో అని నాకా విషయం చెప్పద్దన్నారట నాన్న. క్యాన్సర్ చివరి స్టేజ్‌లో నాకా విషయం తెలిసింది.
అప్పటికే ఆలస్యం అయ్యింది. నాకు అమ్మ, అన్నయ్య, అమ్మమ్మ ఉన్నారు. ఎప్పుడు పెళ్లి అనే ఆలోచన వచ్చినా నాకు ఓ సమాధానం వస్తుంది. మా నాన్నలా నన్ను కేరింగ్‌గా, ప్రొటెక్టివ్‌గా చూసుకోవాలని. అంతగా లేకపోయినా ప్రేమగా ఉంటే చాలు అనుకుంటున్నాను. నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ. ఉన్నవారు కూడా వేరే వేరే చోట్లలో వారి పనుల్లో బిజీ. నేనే మైసూర్ వెళ్లినప్పుడు వారిని కలుస్తుంటాను. ఈ మధ్య ఏడాదికి ఒకసారి స్నేహితులంతా కలిసేలా ప్లాన్ చేసుకున్నాం.
సీరియల్స్ అంటే ఏడుపు సీన్లు కాదు చాలా వరకు సీరియల్ నటి అనగానే ఏడుపు సీన్లు ఉంటాయి అంటారు. ఇప్పుడు అలాంటివేవీ లేవు. సీరియల్స్‌లోనూ చాలా మార్పులు వచ్చాయి. రక్తసంబంధం సీరియల్‌లో తులసి క్యారెక్టర్‌నే తీసుకుంటే తను చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ తరానికి బాగా కనెక్ట్ అయిన పాత్ర అది. స్టోరీ డ్రామా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కళ్యాణ వైభోగం సీరియల్‌లో ద్విపాత్రాభినయం చేస్తున్నాను. నిత్య–మంగగా రెండూ రెండు భిన్న పాత్రలు. ఇదో సవాల్‌లా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాను.
తెలుగువారు మెచ్చిన మంగతాయారు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లన్నీ ఇష్టమైనవే. అయితే, ‘కళ్యాణవైభోగం’ మంగతాయారు పాత్ర అంటే ఇంకా ఇష్టం. మంగ చాలా అమాయకురాలు. అప్పటివరకు ఓ పల్లెటూరు అమ్మాయి ఎంత అమాయకంగా ఉంటుందో కూడా తెలియదు. అలాంటి ఆ అమ్మాయిలో తర్వాత తర్వాత చాలా ప్రతిభ కనిపిస్తుంటుంది. ఇల్లాలిగా, త్యాగమయిగా.. తనను తాను చాలా మార్చుకుంటూ ప్రూవ్ చేసుకుంటుంది. అన్ని వయసుల వారూ ఈ క్యారెక్టర్‌కి కనెక్ట్ అవుతారు. మంగతాయారు పాత్ర ద్వారా నా జీవితంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ పాత్ర–నేనూ వేరు కాదని అనిపిస్తుంటుంది. శశిరేఖగా అందరికీ పరిచయం అయినా ఈ పాత్ర వల్ల తెలుగువారింట నేనూ ఓ కుటుంబసభ్యురాలినైపోయాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.’’
నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment