ఢిల్లీలో తెలుగు ఓట్ల కోసం వేట‌! | Lok Sabha Elections 2024: Parties Try To Grab Telugu Voters | Sakshi
Sakshi News home page

Lok Sabha Elections 2024: ఢిల్లీలో తెలుగు ఓట్ల కోసం పార్టీల వేట‌

Published Mon, May 20 2024 12:34 PM | Last Updated on Mon, May 20 2024 3:31 PM

Lok Sabha Elections 2024: Parties Try To Grab Telugu Voters

మీట్ అండ్ గ్రీట్ అంటూ బీజేపీ వ‌ల‌

ఢిల్లీని సొంతిళ్లులా భావించేలా చేస్తామంటున్న ఆప్

ఢిల్లీ ఎన్నిక‌ల్లో తెలుగు వారి పాత్ర త‌క్కువేం కాదు. దేశ రాజ‌ధానిలో కోటిన్న‌ర ఓట‌ర్లుంటే అందులో మ‌న‌వారి వాటా అయిదున్న‌ర శాతం. తెలుగు ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు అన్ని పార్టీలు త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. మీట్ అండ్ గ్రీట్ పేరుతో బిజెపి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నంచేస్తుండ‌గా, త‌మ సొంత ప్రాంతాన్ని వ‌దిలి ఇక్క‌డ ఉంటున్న తెలుగువారికి ఢిల్లీ త‌మ ఇళ్లే అన్న భ‌ద్ర‌త భ‌రోసా ఇస్తామంటోంది ఆప్‌.

దేశ‌రాజ‌ధాని ఢిల్లీని మిని ఇండియాగా అభివ‌ర్ణిస్తుంటారు. అన్ని రాష్ట్రాల ప్ర‌జ‌లు ఇక్క‌డ నివ‌సిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఏకంగా 15 భాషల్లో ఎన్నికల ప్రచారం జరిగే చోటు ఏదైనా ఉందంటే అది ఢిల్లీనే. చాలా ఏళ్ల కిందటే దేశం నలుమూలల నుంచి వచ్చి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ ఢిల్లీలో స్థిరపడిపోయినవాళ్లు కొందరైతే.. కేంద్ర ఉద్యోగులు, ప్రొఫెషనల్, నాన్ ఫ్రొఫెషనల్ రంగాల్లో పనిచేస్తున్నవాళ్లూ ఉన్నారు. 

ఢిల్లీ అసెంబ్లీ పరిధిలో సంఖ్యాపరంగా ఆధిపత్యం ఉత్తరాదివాళ్లదే అయినా.. 25 లక్షల పైచిలుకు ఓట్లతో దక్షిణాదిప్రజలు కూడా తమదైన ప్రభావం చూపిస్తున్నారు. కోటిన్న‌ర ఓట‌ర్ల‌లో  తెలుగువారు దాదాపు అయిదుశాతానికి పైనే ఉన్నారు.  తెలుగువాళ్లు ప్ర‌ధానంగా ఢిల్లీలోని షాద్రా, మయూర్ విహార్, లజ్పత్ నగర్, సరితా విహార్, ద్వారక, వికాస్పురి, కేశవపురం, రోహిని, మునిర్కా, వసంత్ విహార్ నివ‌సిస్తుంటారు. పలు తెలుగు సంఘాలు, సంస్థల లెక్కల ప్రకారం అక్కడ సుమారు 9 లక్షల మంది తెలుగువాళ్లున్నారు. తెలుగువారికి సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం ఇక్కడ లోటుగా కనిపిస్తోంది.

తెలుగు ప్రజలను కలుస్తున్న  పార్టీలు వారిని ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి.  సొంతూళ్ల‌కు దూరంగా ఉంటున్న ఢిల్లీలోని తెలుగువారికి త‌గిన భ‌ద్ర‌త‌, ప్ర‌యోజ‌నాలు ఇస్తామంటూ ఆప్ భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తోంది.

ఢిల్లీలో తెలుగువారి సంక్షేమం కోసం ప‌లు తెలుగుసంఘాలు ప‌నిచేస్తున్నాయి. ఆంధ్రా అసోసియేష‌న్‌, ఢిల్లీ తెలుగు సంఘం, ఆదిలీలా ఫౌండేష‌న్ పేరుతో పండుగ‌ల స‌మ‌యంలో ప‌లు సాంస్కృతిక కార్యక్ర‌మాలు నిర్వ‌హిస్తుంటాయి. తెలుగువారిని ఒక వేదిక‌పైకి తీసుకువ‌స్తుంటాయి. అయితే తెలుగు ప్ర‌జ‌లు సైతం త‌మ‌కంటూ కొంత రాజ‌కీయ ప్రాతినిధ్యం కోసం ప్ర‌య‌త్నం చేసినా పెద్ద‌గా ఎవ‌రు స‌క్సెస్ కాలేదు.

18వ లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరవ దశలో మే 25వ తేదీ శనివారం నాడు ఢిల్లీ 7 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది

:::సాక్షి, ఢిల్లీ ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement