![Kishan Reddy at Independence celebrations Telugu People - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/16/KISHAN-REDDY.jpg.webp?itok=CPzayj_i)
సాక్షి, న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో దేశవ్యాప్తంగా ఎందరో వీరులు, వీర వనితలు ఆత్మ త్యాగాలు చేశారని, ఈ పోరాటంలో తెలుగువారి పాత్రను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా జాతీయవాద చైతన్యం పెరుగుతోందని చెప్పారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలోనూ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతోపాటు స్వచ్ఛంద సంస్థలు చాలా ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశాయని కిషన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. భారతదేశ స్వాతంత్య్ర సిద్ధికి ఘనమైన చరిత్ర ఉన్నట్టుగానే, ఆంధ్రా అసోసియేషన్‌కు సైతం గొప్ప చరిత్ర ఉందని చెప్పారు. తెలుగు తేజం విప్లవ వీరుడైన అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో జరిగిన పోరాట స్ఫూర్తిని యావత్ దేశానికి తెలియజేసే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి ద్వారా అల్లూరి 125వ జయంతి కార్యక్రమాలను భీమవరంలో ఘనంగా నిర్వహించి, విగ్రహాన్ని ఆవిష్కరింపజేశామని తెలిపారు.
ఈ నెల 22న అల్లూరి నడయాడిన ప్రాంతాల్లో పర్యటించి రూ.50 కోట్లతో ఒక సర్క్యూట్ ఏర్పాటు చేయనున్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. ప్రముఖ తెలుగు గాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడైన ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతిని కూడా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉన్నప్పటికీ.. భారతదేశంపై ఆ ప్రభావం లేకుండా ప్రజలపై ఆర్థిక మాంద్యం భారం పడకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోటగిరి సత్యనారాయణ, అసోసియేషన్ ప్రతినిధులు, ఢిల్లీలోని తెలుగు ప్రజలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment