Azadi Ka Amrit Mahotsav
-
Meri Maati Mera Desh: దేశ రాజధానికి చేరుకున్న తెలుగునేల మట్టి కలశాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని నలు మూలల నుంచి సేకరించిన మట్టి కలశాలు ఆదివారం ప్రత్యేక రైలులో ఢిల్లీకి చేరుకున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నా నేల నా మట్టి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వందలాది గ్రామాల నుంచి సేకరించిన మట్టిని తీసుకొచ్చారు. ఈ క్రమంలో ప్రత్యేక రైలులో ఏపీ నుంచి 800 మంది, తెలంగాణ నుంచి 150 మంది వచ్చారు. సోమవారం ఇండియా గేట్ దగ్గర నిర్వహించే కార్యక్రమంలో ఉంచే కలశంలో ఈ మట్టిని పోస్తారు. తర్వాత ఆజాదీ కా మహోత్సవ్ గుర్తుగా చేపట్టే నిర్మాణాల్లో ఈ మట్టిని వినియోగించనున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి నిజాముద్దీన్ రైల్వేస్టేషన్లో ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ ఆధ్వర్యంలో సిబ్బంది సంప్రదాయ దుస్తులతో çఘన స్వాగతం పలికారు. ఏపీ ప్రభుత్వం వారందరికీ వసతి, బస సౌకర్యాలు ఏర్పాటు చేసింది. లైజన్ ఆఫీసర్ సురేశ్‌బాబు, ఓఎస్డీ రవిశంకర్, జీవీఆర్ మురళి పాల్గొన్నారు. -
మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం: 7.5 శాతం వడ్డీరేటు, ఎలా అప్లై చేయాలి?
సాక్షి, ముంబై: 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్', మహిళా సాధికారత,భాగంగా ప్రకటించిన 2023-24 కేంద్ర బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మహిళా పెట్టుబడిదారుల కోసం కొత్త చిన్న పొదుపు పథకాన్ని ప్రకటించారు. ఆ పథకమే మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం.కేవలం ఆడపిల్లలు, మహిళలు మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టేలా పోస్టాఫీసుల్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2025 ఏప్రిల్ వరకూ స్థిర వడ్డీరేటును అందిస్తుంది. (షాకింగ్ న్యూస్: యాపిల్ ఉద్యోగుల గుండెల్లో గుబులు) మహిళల పెట్టుబడిలో భాగస్వామ్యాన్ని పెంచడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి చిన్న పొదుపు పథకం కింద కేంద్రం మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్‌ను అందిస్తోంది. ఇందులో మహిళలకు తక్కువ సమయంలో ఎక్కువ రాబడి రానుంది. మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2 సంవత్సరాలలో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్‌పై 7.5 శాతం వడ్డీ అందిస్తోంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ ప్రయోజనాలు: మహిళలకు, బాలికలకు మాత్రమే ఖాతా తెరిచే అవకాశం. ఒక్క ఖాతా మాత్రమే తెరవవచ్చు. మహిళలు లేదా బాలికల రూ.1000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ రెండేళ్ల కాలపరిమితి పథకం ఆకర్షణీయమైనయు స్థిరమైన వడ్డీని 7.5 శాతం వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన ఖాతాకు వడ్డీ బదిలీ ఉదా: రెండేళ్ల కాలానికి రెండు లక్షలు డిపాజిట్ చేస్తే.. 7.5 శాతం వడ్డీ ప్రకారం రెండు లక్షలకు రెండేళ్లకు రూ.30వేలు వడ్డీ రూపంలో అందుతుందన్నమాట. ఎలా నమోదు చేయాలి స్థానిక బ్యాంక్ లేదా పోస్టాఫీసు నుండి మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన ఫారమ్ తీసుకోవాలి దరఖాస్తులో ఆధార్ కార్డ్ ,పాన్ కార్డ్ , నామినీ లాంటి వివరాలను నమోదు చేయాలి అవసరమైన డాక్యుమెంటేషన్‌తో దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి నగదు లేదా చెక్ రూపంలో సంబంధిత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి ఈ ప్రక్రియ పూర్తైన తరువాత పప్రూఫ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికెట్ మీ చేతికి వస్తుంది డిపాజిట్ చేసిన తేదీ నుండి రెండేళ్లు పూర్తయిన తర్వాత డిపాజిట్ మెచ్యూర్ అవుతుంది ఒక సంవత్సరం గడువు ముగిసిన తర్వాత కానీ మెచ్యూరిటీకి ముందు, బ్యాలెన్స్‌లో గరిష్టంగా 40 శాతం వరకు ఒకసారి విత్‌డ్రా చేసుకోవవచ్చు. చిన్న పొదుపు వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా పోస్టాఫీసుల ద్వారా, గ్రామీణ ప్రాంతాలలోని బాలికలు, మహిళా రైతులు, కళాకారులు, సీనియర్ సిటిజన్లు, ఫ్యాక్టరీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న వ్యాపారులకు చిన్న మెత్తంలో పెట్టుబడితో మంచి రాబడిని పొందుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. (ఇదీ చదవండి: స్టార్ బ్యాటర్ కోహ్లీ అరుదైన ఘనత: గిఫ్ట్‌గా అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్) -
Roundup 2022: మెరుపులు..మరకలు
ప్రగతి పథంలో సాగుతున్న ‘స్వతంత్ర’ కవాతుకు అమృతోత్సవ సంబరాలు... ఆదివాసీ మహిళను దేశ అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టిన ప్రజాస్వామ్య సొగసులు... ‘ఆత్మ నిర్భర్’ లక్ష్యంతో రక్షణ రంగంలో అగ్ని, ప్రచండ, విక్రాంత్ మెరుపులు... అంతరిక్ష రంగంలో ఇతర దేశాలతో పోటీ పడేలా తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్–ఎస్ చిమ్మిన నిప్పులు... బ్రిటన్ను దాటేసి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వడివడిగా పెట్టిన పరుగులు... కంటికి కనిపించని క్రిమిపై పోరాటంలో ప్రపంచ దేశాలకు చూపిన ఆదర్శం... ...ఇవన్నీ ఈ ఏడాది మనం సాధించిన ఘన విజయాల్లో కొన్ని. సైన్యంలో తాత్కాలిక నియామకాలకు తెరలేపిన ‘అగ్ని’పథం, మైనార్టీ మహిళల హిజాబ్ ధారణపై వివాదం ...వంటి కొన్ని మరకలు. ఎంతో ఇష్టం, కొంచెం కష్టంగా సాగిన 2022లో ముఖ్య ఘటనలపై విహంగ వీక్షణం... మెరుపులు ► దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఒక ఆదివాసీ మహిళ అత్యున్నత పదవిని అధిష్టించడం ఒక చరిత్రగా నిలిచింది. సంతాల్ గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము (64) అధికార ఎన్డీయే అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గి కొత్త చరిత్ర లిఖించారు. దేశ 15వ రాష్ట్రపతిగా సగర్వంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఒడిశాలో మయూర్భంజ్ జిల్లాకు చెందినవారు. ► భారత్ ఈ ఏడాది ఆర్థికంగా పుంజుకొని యూకేను కూడా దాటేసి ప్రపంచంలోని అతి పెద్ద అయిదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని నవంబర్ 15న అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) తన నివేదికలో వెల్లడించింది. ► భారత్ తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్–ఎస్ నవంబర్ 18న శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా దూసుకుపోయింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అనే స్టార్టప్ కంపెనీ రూపొందించిన ఈ రాకెట్ మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకువెళ్లింది. ► దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచడానికి, కాగితం కరెన్సీ నిర్వహణకయ్యే ఖర్చుని తగ్గించడం కోసం ఆర్బీఐ డిసెంబర్ 1 నుంచి ప్రయోగాత్మకంగా డిజిటల్ రుపీని అమల్లోకి తీసుకువచ్చింది. ► ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిస్తూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బాహుబలి యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2న కొచ్చితీరంలో జాతికి అంకితం చేశారు. రూ.20వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ నౌక క్షిపణి దాడుల్ని తట్టుకోగలదు. ఇలాంటి సామర్థ్యం కలిగిన యుద్ధనౌకలున్న అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ సరసన సగర్వంగా తలెత్తుకొని నిల్చున్నాం. భారత వాయుసేనలో తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండని అక్టోబర్‌లో ప్రవేశపెట్టారు. ఇక అణు పేలోడ్లను మోసుకువెళ్లే సామర్థ్యం కలిగిన అగ్ని–5 క్షిపణిని డిసెంబర్ 15న విజయవంతంగా ప్రయోగించడంతో త్రివిధ బలగాలు బలోపేతమయ్యాయి. మరకలు ► సైన్యంలో తాత్కాలిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం దేశవ్యాప్తంగా అగ్గిరాజేసింది. యువకులకు నాలుగేళ్లు సైన్యంలో పనిచేసే అవకాశం మాత్రమే కల్పించడంతో పాటు పింఛన్ సదుపాయం కూడా లేని ఈ పథకానికి జూన్ 14న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, తెలంగాణ, ఒడిశా, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆందోళనలు హింసకు దారితీశాయి. ► కర్ణాటకలో ఉడిపిలో కళాశాలలో జనవరిలో హిజాబ్ ధరించి వచ్చినందుకు కొందరు ముస్లిం అమ్మాయిలను తరగతి గదుల్లోకి రానివ్వకపోవడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. వీరికి పోటీగా కొందరు విద్యార్థులు కాషాయ దుస్తులు ధరించి రావడంతో మతఘర్షణలకు దారి తీసింది. కర్ణాటక ప్రభుత్వం ఫిబ్రవరి 5న హిజాబ్‌పై నిషేధం విధిస్తే మార్చి 15న హైకోర్టు దానిని సమర్థిస్తూ తీర్పు చెప్పింది. అక్టోబర్ 13న సుప్రీంకోర్టు భిన్న తీర్పులు వెలువరించడంతో తుది నిర్ణయం భారత ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని బెంచ్ చేతుల్లోకి వెళ్లింది. ► గుజరాత్‌లోని మోర్బిలో అక్టోబర్ 30 కుప్పకూలిపోయిన కేబుల్ వంతెన దుర్ఘటనలో 138 మంది మరణించారు. మానవ తప్పిదాల కారణంగానే ఈ వంతెన కుప్పకూలిపోయింది. ఒకేసారి వంతెనపైకి వంద మంది వెళ్లడానికి మాత్రమే వీలుంటే, నిర్వాహకులు 500 మందిని పంపడంతో ప్రమాదం జరిగింది. ► ఢిల్లీలో నివాసముంటున్న శ్రద్ధా వాకర్ అనే యువతిని ఆమెతో సహజీవనం చేస్తున్న అఫ్తాబ్ పూనెవాలె మే 18న గొంతు కోసి హత్య చేయడంతో పాటు ఆమె మృతదేహాన్ని 35 ముక్కలు చేసి చుట్టుపక్కల అడవుల్లో పారేసిన ఘటన దేశంలో సంచలనం సృష్టించింది. మృతదేహం ముక్కల్ని ఫ్రిజ్‌లో ఉంచి రోజుకి కొన్ని పారేసిన వైనం ఒళ్లు జలదరించేలా చేసింది. నవంబర్ 11న అఫ్తాబ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విషాదాలు ► యావత్ భారతావనిని దుఃఖసాగరంలో ముంచేస్తూ భారతరత్న, గానకోకిల లతామంగేష్కర్ (92); పద్మవిభూషణ్, కథక్ దిగ్గజం పండిట్ బిర్జు మహరాజ్ (83) తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ► సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ములాయం సింగ్ యాదవ్ కన్నుమూయడంతో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఉజ్జ్వల శకానికి తెర పడింది. యాత్రలు, విజయాలు, చీలికలు ► కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 12 రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన 150 రోజుల భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న ప్రారంభమైంది. ఇటీవల వంద రోజులు పూర్తి చేసుకుంది. ► గాంధీ కుటుంబానికి చెందని సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టి రికార్డు సృష్టించారు. ► ఈ ఏడాది మొదట్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా; చివర్లో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా... ఇలా ఐదు రాష్ట్రాల్లో నెగ్గి బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కాంగ్రెస్ హిమాచల్‌తో సరిపెట్టుకోగా ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా పంజాబ్‌లో అఖండ విజయం సాధించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ నెగ్గి బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెరదించింది. జాతీయ పార్టీగానూ అవతరించింది! ► బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి యూ టర్న్ తీసుకున్నారు. ఆగస్టులో ఎన్డీయేకి గుడ్ బైకొట్టి తిరిగి మహాఘట్బంధన్లో చేరి ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతుతో మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. ► మహారాష్ట్రలో శివసేన కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంది. పార్టీని ఏక్నాథ్ షిండే రెండు ముక్కలు చేశారు. భారీగా ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ మద్దతుతో సీఎం అయ్యారు. ► నేషనల్ హెరాల్డ్ కేసు గాంధీ కుటుంబాన్ని వెంటాడుతోంది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు తొలిసారిగా ఈ ఏడాది ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. కేంద్ర విచారణ సంస్థలైన ఈడీ, సీబీఐ ఈ ఏడాదంతా బిజీగా గడిపాయి. పలు విపక్ష పార్టీల నేతలను విచారించాయి. పలువురిని అరెస్టు చేశాయి. దీని వెనక రాజకీయ కక్షసాధింపు ఉందంటూ విపక్షాలు మండిపడ్డాయి. చరిత్రాత్మక తీర్పులు... ► అత్యంత వివాదాస్పదమైన దేశద్రోహ చట్టంపై 124ఏ అమలుపై స్టే విధిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం మే 11న తీర్పు చెప్పింది. 124ఏపై కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన పూర్తయ్యేవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ► మహిళల శరీరంపై వారికే హక్కు ఉందని అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. పెళ్లితో సంబంధం లేకుండా మహిళలందరూ 24 వారాలవరకు సురక్షిత గర్భవిచ్ఛిత్తికి అనుమతినిచ్చింది. సెప్టెంబర్ 29న ఈ తీర్పు చెప్పిన సుప్రీం అబార్షన్ చట్టాల ప్రకారం పెళ్లయినవారు, కాని వారు అన్న తేడా ఉండదని స్పష్టం చేసింది. ► భార్య ఇష్టానికి వ్యతిరేకంగా భర్త శృంగారం చేసినా అది అత్యాచారం కిందకే వస్తుందని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఎంటీపీ చట్టం ప్రకారం మారిటల్ రేప్‌లు కూడా అత్యాచారం కిందకే వస్తాయని స్పష్టం చేసింది. ► ఇంటి అల్లుడు ఇంటి నిర్మాణం కోసం డబ్బులు డిమాండ్ చేసినా అది కట్నం కిందకే వస్తుందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. విశ్వవేదికపై... ► ప్రపంచంలో అత్యంత శక్తిమంతదేశాల కూటమి జీ20కి అధ్యక్ష బాధ్యతల్ని భారత్ స్వీకరించింది. 2023 నవంబర్ 30 దాకా ఈ బాధ్యతల్లో కొనసాగనుంది. 50 నగరాల్లో 200 సన్నాహక భేటీల అనంతరం 2023 సెప్టెంబర్‌లో ఢిల్లీలో జీ20 సదస్సును నిర్వహించనుంది. ► ఐరాస భద్రతా మండలి అధ్యక్ష హోదాలో కౌంటర్ టెర్రరిజం కమిటీ (సీటీసీ) సదస్సును అక్టోబర్ 28, 29 తేదీల్లో ముంబై, ఢిల్లీల్లో జరిగింది. ► అరుణాచల్‌ప్రదేశ్‌లో తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల మధ్య డిసెంబర్ 9న ఘర్షణలు జరిగాయి. వాస్తవాధీన రేఖ దాటి చొచ్చుకొచ్చేందుకు చైనా చేసిన ప్రయత్నాలను మన బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. -
స్వాతంత్య్ర సంగ్రామ స్పూర్తితో.. విశాఖలో జేపీఎల్
సాక్షి, విశాఖపట్నం: క్రీడలతో సనాతన ధర్మం సందేశంలో భాగంగా సేవ్ టెంపుల్స్ భారత్ ఆధ్వర్యంలో అజాదీ కా అమృత్ మహోత్సవాల స్పూర్తితో డా. గజల్ శ్రీనివాస్ ‘‘జైహింద్ ప్రీమియర్ లీగ్ (జేపీఎల్)’’ నిర్వహించడం స్ఫూర్తి దాయకమని శాసన మండలి సభ్యులు పీవీ మాధవ్ అన్నారు. ఈ క్రీడలు నిర్వహించడం ద్వారా సనాతన ధర్మ, దేశ భక్తిని ప్రచారం చేయడం గొప్ప విషయమని కొనియాడారు. జైహింద్ ప్రీమియర్ లీగ్ ఇన్విటేషన్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ విశాఖపట్నంలోని పి.ఎమ్.పాలెం, బి. గ్రౌండ్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌ను శ్రీ శ్రీ శ్రీ శ్రీనివాసానంద స్వామి గోపూజ నిర్వహించి ప్రారంభించారు. పరిమిత ఓవర్ల టోర్నమెంట్లో షహీద్ వీర సావర్కర్ లెవెన్, షహీద్ అల్లూరి లెవెన్, షహీద్ భగత్ సింగ్ లెవెన్, షహీద్ చంద్ర శేఖర్ ఆజాద్ లెవెన్ శ్రీ బిర్సా ముండా లెవెన్ జట్లు ఆడుతున్నాయని సేవ్ టెంపుల్స్ భారత్, జైహింద్ ప్రీమియర్ లీగ్ ఛైర్మన్ డా. గజల్ శ్రీనివాస్, జేపీఎల్ కన్వీనర్ శ్రీ ఫణీంద్ర తెలిపారు. భారతీయ క్రీడా సుహృద్భావం, స్వాతంత్య్ర సంగ్రామ, సనాతన ధర్మ ప్రచారాలు ముఖ్య లక్ష్యంగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. అనేకమంది సాధు, సంత్ పరివారం ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషమని జేపీల్ డైరెక్టర్స్ శ్రీ ఎ. హేమంత్ శర్మ, శ్రీ మేడికొండ శ్రీనివాస్, శ్రీ డి.ఎస్ వర్మ, సంచాలకులు శ్రీ పట్టా రమేష్ తదితరులు తెలిపారు. -
గాంధీజీ, శాస్త్రిలకు ప్రముఖుల నివాళి
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిలకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఇద్దరు నేతల జయంతిని పురస్కరించుకుని ప్రధాని ఆదివారం వారి సమాధులున్న రాజ్‌ఘాట్, విజయ్‌ఘాట్‌లను సందర్శించి పుష్పాంజలి ఘటించారు. ప్రతి ఒక్కరూ ఖాదీ, హస్తకళల ఉత్పత్తులను కొనుగోలు చేసి గాంధీజీకి నివాళులర్పించాలని ప్రధాని ప్రజలను కోరారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ గాంధీ జయంతి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. బాపు సిద్ధాంతాలను అన్ని వేళలా ఆచరించాలి’అని ట్వీట్ చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి నిరాడంబరత, స్థిరమైన నిర్ణయాలు తీసుకోగల శక్తి దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు. ‘కీలకమైన సమయంలో శాస్త్రి నాయకత్వ పటిమ దేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను’ అని మరో ట్వీట్లో పేర్కొన్నారు. శాస్త్రి జీవన ప్రయాణం, సాధించిన విజయాలపై ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’లో ఉంచిన కొన్ని చిత్రాలను ప్రధాని షేర్ చేశారు. గాంధీజీకి కాంగ్రెస్ నేత రాహుల్ ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు. ‘అన్యాయానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేసిన గాంధీజీ మాదిరిగా దేశాన్ని ఐక్యంగా ఉంచుతామంటూ ప్రతిన బూనుదాం. సత్యం, అహింసా మార్గంలో నడవాలని ఆయన మనకు నేర్పించారు. ప్రేమ, కరుణ, సామరస్యం, మానవత్వం అర్థాన్ని బాపు వివరించారు’ అని ట్వీట్ చేశారు. -
వైఎస్సార్ జిల్లా యువతికి అరుదైన అవకాశం.. పార్లమెంట్లో ప్రసంగించే చాన్స్
వైవీయూ: ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది కడపకు చెందిన యువతి మిద్దె రూప. ఆర్థిక ఇబ్బందులు వెక్కిరిస్తున్నా.. అధ్యాపకుల తోడ్పాటుతో అన్ని రంగాల్లో రాణిస్తూ సత్తా చాటుతున్న ఆమెకు అరుదైన అవకాశం దక్కింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా మహాత్మాగాంధీ, లాల్ బహదూర్‌శాస్త్రి జయంత్యుత్సవాలను పురస్కరించుకుని అక్టోబర్ రెండో తేదీన పార్లమెంట్లో ప్రసంగించే అరుదైన చాన్స్ పొందింది. దేశవ్యాప్తంగా 15 మంది యువతీ యువకులను పార్లమెంట్లో ప్రసంగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయగా, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కడప జిల్లాకు చెందిన మిద్దె రూప ఒక్కరే ఉండటం విశేషం. వైఎస్సార్ జిల్లా రైల్వే కొండాపురానికి చెందిన మిద్దె సత్యనారాయణ (లారీ డ్రైవర్), రమాదేవి (గృహిణి) దంపతుల కుమార్తె మిద్దె రూప కడపలోని ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఏ టూరిజం కోర్సును ఇటీవల పూర్తి చేసింది. అధ్యాపకులు, ప్రిన్సిపాల్ తోడ్పాటుతో రూప చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణిస్తూ పోటీ ఏదైనా విజేతగా నిలుస్తూ వచ్చింది. ప్రస్తుతం ఆమె దాతల సహకారంతో హైదరాబాద్‌లోని ఓ స్టడీ సర్కిల్లో సివిల్స్‌కు సన్నద్ధం అవుతోంది. ప్రభుత్వ కళాశాల నుంచి పార్లమెంట్ వరకు... అక్టోబర్ రెండో తేదీన పార్లమెంట్లో ప్రసంగించే విద్యార్థులు, యువతీ యువకులను ఎంపిక చేసేందుకు నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19న తొలుత జిల్లాస్థాయిలో వక్తృత్వ పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 30 మందిని ఎంపిక చేయగా, వీరిలో రూప అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన నలుగురిలో ఒకరిగా నిలిచింది. అనంతరం జాతీయ స్థాయిలో 35 మంది పోటీపడ్డారు. చివరగా టాప్–15 అభ్యర్థులను పార్లమెంట్లో ప్రసంగించేందుకు ఎంపిక చేశారు. ఈ 15 మంది జాబితాలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థిని మిద్దె రూప కావడం విశేషం. రూప పార్లమెంట్లో అక్టోబర్ 2వ తేదీన మహాత్మాగాంధీ గురించి ఇంగ్లిష్‌లో ప్రసంగించనుంది. కడప విద్యార్థినికి పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం లభించడంపై నెహ్రూ యువకేంద్రం జిల్లా సమన్వయకర్త మణికంఠ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సుబ్బలక్షుమ్మ, చరిత్ర అధ్యాపకుడు బాలగొండ గంగాధర్ తదితరులు సంతోషం వ్యక్తంచేశారు. (క్లిక్ చేయండి: దళిత సాహిత్య కృషికి దక్కిన గౌరవం) -
ఇకెబానా ఒహారా స్కూల్లో మినీ ఎగ్జిబిషన్.. ప్రత్యేక అతిథులు హాజరు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యావత్ దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. ఇకెబానా (పూలు అమర్చే జపనీస్ కళ)ను నేర్పించే హైదరాబాద్‌లోని ఒహారా స్కూల్ కూడా ఈ ఏడాది తమ మొదటి ఈవెంట్‌ను దీనికే అంకితం చేసింది. ఈ సందర్భంగా ఓ మినీ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. స్కూల్ ప్రెసిడెంట్ శ్రీమతి నిర్మలా అగర్వాల్ నేతృత్వంలోని బృందం థీమ్‌ను రూపొందించి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులను ఆహ్వానించింది. శత్రువులతో పోరాడుతూ కార్గిల్ యుద్ధంలో అమరులైన మేజర్ పద్మపణి ఆచార్య సతీమణి చారులత ఆచార్య ఈ మినీ ఎగ్జిబిషన్‌కు అతిథిగా హాజరయ్యారు. సైన్యంలో వైద్య సేవలందించిన లెఫ్టినెంట్ కల్నల్, పీడియాట్రిషన్ ఉమ రామచంద్రన్ కూడా పాల్గొన్నారు. ఆర్మీ స్కూల్స్‌లో టీచర్‌గా పనిచేసిన శ్యామల ఖన్నా అతిథిగా వచ్చారు. ఈమె 'కౌ ఇన్ కార్గిల్', 'ది లాహోర్ కనెక్షన్' వంటి పుస్తకాలు కూడా రాశారు. చదవండి: నెహ్రూ జూపార్కులోనే ఓ చీతా ఉంది తెలుసా! -
దేశాభివృద్ధి పథంలో అమెరికా కీలకపాత్ర
వాషింగ్టన్: వచ్చే పాతికేళ్ల భారత అభివృద్ధి పయనంలో అమెరికా కీలక పాత్ర పోషించగలదని ప్రధాని మోదీ అభిలషించారు. అమెరికా పార్లమెంట్లో భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు.. ఇరు దేశాల మైత్రీబంధంలో మైలురాయిగా నిలిచిపోవాలని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. వాషింగ్టన్‌లోని యూఎస్ క్యాపిటల్‌లో ఆజాదీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని భారతీయ సంతతి అమెరికన్లకు ప్రధాని మోదీ సందేశం పంపారు. ప్రధాని సందేశంలోని ముఖ్యాంశాలు కొన్ని ఆయన మాటల్లో.. ‘ భారత్ అనే పదం వినగానే ఎన్నో అంశాలు స్ఫురిస్తాయి. అధునాతన ప్రజాస్వామ్య దేశం, భిన్నజాతులు, ప్రాచీన నాగరికతల ఇండియాను ప్రపంచం గుర్తుచేసుకుంటుంది. ఇదే రీతిలో భిన్న అంశాల్లో గ్లోబల్ ఇండియన్‌తో భారత్ మమేకమైంది. వచ్చే పాతికేళ్ల అమృతకాలంలో భారత సుస్థిరాభివృద్ధికి అమెరికా ఎంతగానో సాయపడనుందని భావిస్తున్నా. అమెరికాలో మీరంతా భారత్ తరఫున అత్యద్భుతమైన ప్రతినిధులుగా ఉంటారని ఆశిస్తున్నా’ అని మోదీ అన్నారు. యూఎస్ ఇండియా రిలేషన్షిప్ కౌన్సిల్, సేవా ఇంటర్నేషనల్, హిందూ స్వయంసేవా సంఘ్, జీఓపీఐఓ సిలికాన్ వ్యాలీ, యూఎస్ ఇండియా ఫ్రెండ్షిప్ కౌన్సిల్, సనాతన్ సంస్కృతి సర్దార్ పటేల్ ఫండ్ తదితర 75 భారతీయ అమెరికన్ సంఘాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. ఇదీ చదవండి: సచివాలయానికి అంబేడ్కర్ పేరు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం -
స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో దేశాభివృద్ధికి పాటుపడాలి
ఉంగుటూరు (గన్నవరం): భారత స్వరాజ్యం కోసం ఎందరో మహానుభావులు చేసిన ఆత్మత్యాగాలను తెలుసుకోవడంతోపాటు, స్వాతంత్య్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకుని యువత దేశాభివృద్ధిలో భాగస్వామి కావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్లో శ్రీవాణి మాసపత్రిక ప్రత్యేక సంచికను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృతమహోత్సవ్ నేపథ్యంలో స్వాతంత్య్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన 75 మంది జీవితగాథలతో రూపొందించిన శ్రీవాణి సాంస్కృతిక మాసపత్రిక ప్రత్యేక సంచికను ఆవిష్కరిచడం ఆనందంగా ఉందన్నారు. సినీనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ శ్రీవాణి సాంస్కృతిక మాసపత్రిక ఇలాంటి పుస్తకం ఆవిష్కరిచండం శుభపరిణామమన్నారు. రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్షీప్రసాద్, సత్యసాయిబాబా సేవాసంస్థల రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.లక్ష్మణ్‌రావు, సినీగేయ రచయిత భువనచంద్ర శ్రీవాణి మాసపత్రిక సంపాదకురాలు కొమరగిరి జయప్రద, సహ సంపాదకుడు శ్యామ్‌ప్రసాద్ పాల్గొన్నారు. -
నెల్లూరు జిల్లాకు జాతీయ అవార్డు
నెల్లూరు (పొగతోట): అజాదీకా అమృత్ మహోత్సవం కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. దేశవ్యాప్తంగా 780 జిల్లాలో120 రోజులపాటు ఈ కార్యక్రమాల అమలు తీరును కేంద్ర ప్రభుత్వం పరిశీలించింది. ఉత్తమ పనితీరు కనబర్చిన టాప్ 10 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 4వ స్థానంలో నిలిచింది. త్వరలో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు ఢిల్లీలో ఈ అవార్డు అందుకోనున్నారు. చదవండి: (దశాబ్దాల స్వప్నం సాకారం) -
పోషకాహార లోపాన్ని నివారించేందుకు కృషి చేయాలి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశంలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రజలు కృషి చేయాలని, దానికి సామాజిక అవగాహన కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రతినెల చివరి ఆదివారం నిర్వహించే ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్ స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన ‘అమృత్ మహోత్సవ్’ అమృత ధారలు దేశం నలుమూలలా ప్రవహించాయని పేర్కొన్నారు. ‘పండుగలతోపాటు ఈ సారి సెప్టెంబర్ నెలను పోషకాహారంపై ప్రచారానికి అంకితం చేద్దాం. మనం సెప్టెంబర్ 1 నుంచి 30 తేదీ వరకూ ‘షోషణ్ మాహ్’ ( పోషకాహార మాసం)గా పాటిద్దాం. పోషకాహార నివారణకు చాలా సృజనాత్మక, విభిన్నమైన ప్రయత్నాలు చేస్తున్నాం. పోషణ్ అభియాన్‌లో సాంకేతిక, ప్రజాభాగస్వామ్యాన్ని మెరుగైన పద్ధతుల్లో వాడటం చాలా కీలకం. భారత్‌లో పోషకాహార లోపాన్ని రూపుమాపడంలో ‘జల్‌జీవన్ మిషన్’ భారీగా ప్రభావం చూపనుంది. పోషకాహార లోపాన్ని రూపుమాపటంలో సామాజిక అవగాహన కీలక పాత్ర పోషిస్తుంది.’ అని ప్రధాని మోదీ తెలిపారు. దూరదర్శన్‌లో స్వతంత్ర సమరయోధుల త్యాగాలపై వచ్చే ‘స్వరాజ్’ సీరియల్‌ను వీక్షించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు ప్రధాని మోదీ. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న యోధుల కృషిని యువతరానికి తెలియజేయడానికి ఇదో గొప్ప ప్రయత్నమన్నారు. ఇదీ చదవండి: బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతిపై సీబీఐ దర్యాప్తు? -
స్వావలంబనకు స్ఫూర్తి ఖాదీ
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం గుజరాత్‌కు చేరుకున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అహ్మదాబాద్‌లోని సబర్మతీ రివర్‌ఫ్రంట్ వద్ద నిర్వహించిన ‘ఖాదీ ఉత్సవ్’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధి లక్ష్యాల సాధనకు, ఆత్మనిర్భర్ భారత్(స్వాలంబన)నకు ఖాదీ స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఒకప్పుడు మన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఖాదీని దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేశారని వాపోయారు. ఖాదీ ఉత్పత్తులను విస్తృతంగా వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే పండుగ సీజన్లో బంధుమిత్రులకు ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులను బహుమతులుగా అందజేయాలని అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని 7,500 మంది ఇక్కడ చరఖా తిప్పి సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రధాని మోదీ సైతం స్వయంగా చరఖా తిప్పారు. అహ్మదాబాద్‌లో నూతన ఖాదీ గ్రామోద్యోగ్ భవనాన్ని ప్రారంభించారు. సబర్మతీపై అటల్ బ్రిడ్జి ప్రారంభం గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో సబర్మతీ నదిపై పాదచారులు, సైక్లిస్ట్ల సౌకర్యార్థం నిర్మించిన ‘అటల్ బ్రిడ్జి’ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి స్థానికులు అర్పిస్తున్న నివాళి ఈ వారధి అని చెప్పారు. అటల్ బ్రిడ్జిపై మోదీతోపాటు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సి.ఆర్.పాటిల్ కాసేపు సరదాగా నడిచారు. ప్రజలకు అభివాదం చేశారు. అటల్ బ్రిడ్జి సబర్మతీ నది రెండు ఒడ్డులను అనుసంధానించడమే కాదు, విశిష్టమైన, వినూత్నమైన డిజైన్‌తో ఆకట్టుకుంటోందని మోదీ అన్నారు. అటల్‌జీని గుజరాత్ ఎంతగానో ప్రేమించిందని చెప్పారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన గాంధీనగర్ నుంచి పోటీచేసి, రికార్డుస్థాయిలో ఓట్లు సాధించి, ఘన విజయం సాధించారని గుర్తుచేశారు. ► అటల్ బ్రిడ్జి పొడవు 300 మీటర్లు. మధ్యభాగంలో దీని వెడల్పు 14 మీటర్లు. ► పాదచారులు, సైకిల్ ప్రయాణికులు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ► విభిన్నమైన డిజైన్, ఎల్ఈడీ లైటింగ్‌తో చూపరులకు కనువిందు చేస్తోంది. ► సబర్మతీ రివర్‌ఫ్రంట్ పశ్చిమ భాగంలోని ఫ్లవర్ గార్డెన్‌ను, తూర్పు భాగంలో రాబోయే ఆర్ట్స్ అండ్ కల్చరల్ సెంటర్‌ను అనుసంధానిస్తుంది. ► 2,600 మెట్రిక్ టన్నుల స్టీల్ పైపులు ఉపయోగించి అటల్ బ్రిడ్జి నిర్మించారు. ► పైకప్పును రంగుల వస్త్రంతో అలంకరించారు. సబర్మతీ నదిపై అటల్ వంతెన (ఇన్సెట్లో) వంతెనను ప్రారంభిస్తున మోదీ -
నేతాజీ అంగరక్షకుడు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ రాజకీయాలను వదిలేసి విదేశాలకు వెళ్లి బ్రిటిష్ వాళ్లపై యుద్ధం ప్రకటించిన రోజులవి. అప్పట్లో ఆయన అంగరక్షకునిగా పనిచేసిన అచంచల దేశభక్తుడు గోపరాజు వేంకట అనంత శర్మ, ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఆలమూరులో 1920లో జన్మించిన ఆయన 1941లో బ్రిటిష్ ఇండియా ఆర్మీ (బీఐఏ)లో గుమాస్తాగా చేరారు. తరువాత ఆఫీసర్‌గా ఎంపికై శిక్షణ నిమిత్తం మలేషియాలోని కోటాబహార్‌కు వెళ్లారు. బ్రిటన్– జపాన్ల మధ్య జరిగిన యుద్ధంలో వేలాదిమంది బీఐఏ సైనికులు యుద్ధ ఖైదీలుగా జపాన్‌కు చిక్కారు. అందులో గోపరాజు ఒకరు. జపాన్‌తో ఒప్పందం కుదుర్చుకొని ఆ దేశస్థుల సాయంతో భారత మాతకు విముక్తి కలిగించాలని నేతాజీ తన ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ) ద్వారా ప్రయత్నించారు. ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితులైన గోపరాజు నేతాజీని బ్యాంకాక్‌లోని రత్నకోసిన్ హోటల్లో కలిసి ఐఎన్ ఏలో చేరారు. నేతాజీ అంగరక్షకులలో ఒకరుగా పనిచేశారు. ఎప్పుడూ మిలటరీ దుస్తులలో ఉండే నేతాజీని చూసి ఎంతో ప్రేరణ, గౌరవం కలిగేదని గోపరాజు అంటూ ఉండేవారు. బ్రిటిష్ వాళ్లు ఇండియన్ నేషనల్ ఆర్మీవారిని యుద్ధఖైదీలుగా ఫిరోజ్‌పూర్ కంటోన్మెంటుకు తరలించారు. వారిలో గోపరాజు అనంత శర్మ కూడా ఉన్నారు. (క్లిక్: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) స్వాతంత్య్రోద్యమ దీప్తి నేతాజీ... కనుసన్నలలో గడిపిన మూడేళ్ల కాలం తన జీవితంలో స్వర్ణమయ సమయం అనేవారు వేంకట అనంత శర్మ. ఈయన కొంతకాలం పాటు స్వాతంత్య్ర సమరయోధుల సంఘానికి కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రోత్సాహంతో భారతీయ రైల్వేలో ఉద్యోగిగా చేరి ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్గా పదవీవిరమణ చేశారు. ఈమధ్య జూలై నెలలో ఐకానిక్ వారోత్సవాల వేడుకలలో అమృతోత్సవమును పురస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే వారు విజయవాడలో స్వాతంత్య్ర సమరవీరులైన శర్మ కుటుంబ సభ్యులను ఉచిత రీతిన గౌరవించడం ముదావహం. (క్లిక్: సమానతా భారత్ సాకారమయ్యేనా?) – డాక్టర్ ధర్మాల సూర్యనారాయణ మూర్తి, చాంగీ కాండో, సింగపూర్ -
AP: 27న స్కూళ్లకు సెలవు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కూళ్లకు ఈ నెల 27(నాలుగో శనివారం)ను సెలవు దినంగా పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు కమిషనర్ కె.సురేష్‌కుమార్ గురువారం సర్క్యులర్ జారీ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకుని స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల కోసం ఆగస్టు 13వ తేదీ(రెండో శనివారం) నాడు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలు పనిచేశాయి.సెలవు దినంలో స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలు పనిచేసినందున దానికి ప్రత్యామ్నాయంగా 27వ తేదీని సెలవు దినంగా పరిగణించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!
జెండా పండుగ అయిపోయింది.. ఇక ఆ రంగు లైట్లు ఆర్పేసి ఇటు రండి.. తొమ్మిదేళ్ల దళిత విద్యార్థి ఇంద్రా మేఘ్వాల్ చిత్రపటం వద్ద పెట్టిన కొవ్వొత్తుల వెలుగులో... చీకట్లు చూద్దాం. ఒక గ్లాసుడు నీళ్లు.. పోయిన చిన్న ప్రాణం. అగ్రవర్ణం దాహార్తికి చిన్నబోయిన త్రివర్ణాలు కనిపిస్తాయి. ఇది ‘..అనుకోని సంఘ టన’ అని సర్దిచెప్పుకునే లోపే.. ‘కాదు.. అనునిత్యమే’ అన్నమాట రీసౌండ్‌లా ‘జనగణమన’కన్నా ఎక్కువ శబ్దంతో మన చెవుల్లో మారుమోగుతుంది. – ఇదీ సామాజిక భారతం రోడ్లపై వేలాది జెండాల ప్రదర్శనలు, వాట్సాప్ డీపీలు, ధగధగా మెరిసే కాంతుల అలంకరణలు, గొప్పగా సంబురాలు.. వీటన్నిటి మధ్య బిల్కిస్ బానో సామూహిక అత్యాచార దోషులకు స్వాతంత్య్ర దినోత్సవం ఇచ్చిన స్వేచ్ఛా వాయువులు. వారి మెడలో పూలదండలు, పంచుకున్న మిఠాయిలు.. అమృతోత్సవాలను చేదెక్కించ లేదూ! – ఇదీ రాజకీయ భారతం ‘కలకత్తా ఫుట్‌పాత్‌లపై ఎందరో గాలివానల్లో తడుస్తున్నారు వాళ్లను అడగండి పదిహేను ఆగస్టు గురించి ఏమంటారో..’ .. 1947లో స్వాతంత్య్రం వచ్చిన రోజున మాజీ ప్రధాని వాజ్‌పేయి రాసుకున్న కవిత ఇది.. ఉత్సవాలు జరిగిన మరునాడే (ఆగస్టు 16న) వాజ్‌పేయి వర్ధంతి జరిపినవారిలో ఎవరైనా.. ఆయన గుర్తుగానైనా.. ఫుట్‌పాత్‌లపై ఉన్న వారిని అడిగి ఉంటారా ‘..ఆగస్టు 15 గురించి ఏమంటారూ’ అని.. – వృద్ధిరేటు 75 ఏళ్లుగా పెరిగీ పెరిగీ హైరైజ్ భవనాల్లో చిక్కుకునిపోయిందని, అక్కడి నుంచి ఫుట్‌పాత్ దాకా రాలేదని తెలిసేది కదా! – ఇదీ ఆర్థిక భారతం ‘..దేశభక్తి, అఖండత అని ఒకటే అంటున్నారు.. మేం దేశభక్తి ఎలా చాటుకోవాలి? మా ఇంటిపై జెండా ఎగురవేసే కదా..? మరి జెండా ఎగురవేయడానికి మాకు ఇల్లు ఏది?..’ ..ఇది ఏ సామాన్యుడో అన్నది కాదు.. గరీబోళ్ల సీఎం టంగుటూరి అంజయ్య 1970లో అన్నమాట! మరి ‘ఇంటింటికీ జెండా పండుగ’.. అంటూ జెండాలు పంచిన నాయకులకు ఈ ప్రశ్న ఏమైనా ఎదురై ఉంటుందా.. బధిర శంఖారావంలా! – ఇదీ నేటి జన భారతం హుందాతనం, ఆత్మగౌరవం, సమన్యాయం.. చైతన్యం, సమున్నత మానవ విలువలు, సామాజిక న్యాయం, లౌకిక భావన, సౌభ్రాతృత్వం.. ఆదా యాల్లో, అంతస్థుల్లో, అవకాశాల్లో, సౌకర్యాల్లో.. సమానత్వం తెచ్చుకుందాం అని 75 ఏళ్ల క్రితం రాసుకున్న రాతలు రాజ్యాంగం పుస్తకాన్ని దాటి బయటికి రానట్టున్నాయ్.. – ఇదీ గణతంత్ర భారతం ... వీటన్నింటినీ అంబేద్కర్‌కు వదిలేసి మన నేతలు ఏం చేస్తున్నారో చూడండి. ► గాంధీ, గాడ్సేల ఎత్తును భారతీయత స్కేలుతో కొలిచి.. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువని తేల్చు కునే పనిలో తీరిక లేకుండా మునిగిపోయారు. ► ఇన్నేళ్లూ నెహ్రూ, గాంధీల పాలనలోనే భారతావని నడిచినా.. ఇప్పుడు క్విట్ ఇండియా స్ఫూర్తిగా దేశాన్ని ఏకం చేస్తామంటూ అదే గాంధీలు కొత్తగా ‘జోడో యాత్రలు’ చేస్తున్నారు. ► గాంధీ, నెహ్రూలపై విద్వేషం చిమ్ముతూ కొందరు.. నెహ్రూ కూడళ్లలో జనగణమన పాడుతూ గాంధీకి వెకిలి మకిలి పూస్తే జాగ్రత అని హెచ్చరిస్తూ మరికొందరు.. 75 ఏళ్ల తర్వాత కూడా అవే పేర్లు, అదే స్మరణ, అదే రాజకీయం.. ► 75 ఏళ్ల క్రితం గీసిన విభజన రేఖలు.. ఇప్పుడా దూరాన్ని మరింత పెంచాయి. రెండు వర్గాల మధ్య అపనమ్మకాన్ని, అగాధాన్ని ఎగదోస్తూ.. ‘లౌకికం’ అన్న మాటను ఫక్తు రాజకీయం చేశాయి. మన మట్టి మీదే పుట్టి పెరిగినా.. త్రివర్ణ పతాకం చేతపట్టి మేమూ భారతీయులమే అని చెప్పుకోవాల్సిన దుఃస్థితికి తెచ్చాయి. ► దేశ విభజన నాటి హింసాకాండ, విధ్వంసాలు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. మానిపోతున్న గాయాలను కెలుకుతూ విభే దాలకు ఆజ్యం పోస్తూనే ఉన్నాయి. నాటి దాష్టీకాన్ని నేటికీ అంటగడుతూ.. విచ్ఛిన్నకర శక్తులంటూ పాత కాలపు చర్చను లేవదీస్తూనే ఉన్నాయి. .. ఇదీ 75 ఏళ్ల భారతం.. స్వేచ్ఛ వచ్చిందనుకున్న తొలిరోజున ఉన్నకాడే.. ఇప్పటికీ ఉన్నామని చెప్పకనే చెబుతున్న తీరు.. ఇది స్వప్నం.. స్వాతంత్య్రోత్సవాల సందర్భంగా సోషల్ మీడియాలో యువతతో నడిచిన ఓ చిట్‌ఛాట్ ఇది. ‘..నేను పుణెలో చదివా, నాలుగేళ్లు బెంగళూరులో, ఇప్పుడు తిరువనంతపురంలో ఉద్యోగం. రేపు ఎక్కడికి వెళ్తానో తెలియదు. నన్ను ఏ ప్రాంతం వాడని అడక్కండి..’ ‘..ఇదిగో వీడు అబ్దుల్లా.. అమెరికా నుంచి ఈమధ్యే దిగుమతి అయ్యాడు, ఢిల్లీ వాడే అనుకోండి. ఈ అమ్మాయి సారిక, వీడి ఫియాన్సీ. వాళ్లు రాజు, అభిషేక్, శ్రవణ్.. మేమంతా హాస్టల్ మేట్స్.. మమ్మల్ని ఏ కులం, ఏ మతం అని ప్రశ్నించకండి. అవన్నీ పాలిటిక్స్ కోసమే.. మేం భారతీయులం..’ ... కెరీర్ గోలలో కొట్టుకుపోతూ దేశం గురించి పట్టించుకోవడం లేదని యువతపై వేస్తున్న అపవాదు నిజం కాదనిపిస్తోంది. వీరిని చూస్తుంటే.. కులం, ప్రాంతం, మతం హద్దులు చెరిపేసుకుని.. అన్ని వర్ణాలనూ త్రివర్ణంలో కలుపుకొని పోతారనే ఆశలు ఇంకా మిణుకుమిణుకుమంటున్నాయి. ఇది నిజం... అట్టడుగు వర్గాలను అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టి ఆనందపడ్డా, వారి పరిస్థితి ఉన్నకాడే ఉన్నదనడానికి ఇదొక్క ‘చిత్రం’ చాలదా! -
అల్లు అర్జున్ హాజరైన ‘ఇండియా డే పరేడ్’కు 2 గిన్నిస్ రికార్డులు
వాషింగ్టన్: భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. అమెరిక, న్యూయార్క్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్(ఎఫ్ఐఏ) ఆధ్వర్యంలో ఆగస్టు 15, 21వ తేదీల్లో న్యూయార్క్‌లో ‘ఇండియా డే పరేడ్’ చేపట్టారు. దీనికి గ్రాండ్ మార్షల్‌గా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ వ్యవహరించారు. ఈ పరేడ్ రెండు గిన్నిస్ రికార్డులు కొల్లగొట్టినట్లు అక్కడి ప్రవస భారతీయుల సంఘం ఎఫ్ఐఏ తాజాగా వెల్లడించింది. ఒకటి.. అత్యధికంగా వివిధ రకాల జెండాలను ప్రదర్శించటం, రెండోది.. పెద్ద ఎత్తున ఢమరుకాన్ని వినియోగించటంపై రికార్డులు సాధించినట్లు పేర్కొంది. ఈ రికార్డుల కోసం ఎఫ్ఐఏ వెబ్సైట్లో 1500 మందికిపైగా వాలంటీర్లు తమ పేరును నమోదు చేసుకున్నట్లు తెలిపింది. గిన్నిస్ రికార్డులు సాధించటంపై గత ఆదివారం ఓ ప్రకటన చేసింది ఎఫ్ఐఏ. భారత స్వాతంత్య్రం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా రికార్డ్‌లకు ప్రయత్నించినట్లు పేర్కొంది. ఆగస్టు 15, 21 తేదీల్లో నిర్వహించి వివిధ కార్యక్రమాల కోసం 180 మంది వాలంటీర్ల బృందం అహర్నిశలు కృషి చేసిందని తెలిపింది. న్యూయార్క్‌లోని హుడ్సన్ నదిపై 220 అడుగుల పొడవైన భారీ ఖాదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినట్లు తెలిపింది ఎఫ్ఐఏ. మాడిసన్ అవెన్యూలో పాన్ ఇండియా స్టార్ అల్లుఅర్జున్, న్యూయార్క్ సిటీ మేయర్ సహా పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నట్లు వెల్లడించింది. భారత్ వెలుపలు దేశ స్వాతంత్య్రంపై చేపట్టిన అతిపెద్ద పరేడ్‌గా గుర్తింపు లభించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: Allu Arjun: 'భారత్ కా తిరంగా.. కభీ ఝుకేగా నహీ'.. పుష్ప డైలాగ్‌తో అదరగొట్టిన బన్నీ -
వైభవంగా స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు (ఫొటోలు)
-
గాంధీ గురించి ఈ తరం పిల్లలకు తెలియాలి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: 75 ఏళ్ల స్వాతంత్య్ర ఫలాలను భారత ప్రజలు ఆస్వాదిస్తున్న వేళ.. నాటి అమరవీరులను త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఎల్బీ స్టేడియంలో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ.. 'ఎంతో మంది త్యాగాలతోనే స్వాతంత్య్రం వచ్చింది. గాంధీ గురించి ఈ తరం పిల్లలకు తెలియాల్సి ఉంది. దేశాన్ని ఉన్మాద స్థితిలోకి మారుస్తున్నారు. దీన్ని చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదు. దేశం అనుకున్నంత పురోగతి సాధించలేదు. ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు కరదీపికలుగా మారి ఏ సమాజాన్ని అయితే సరైన మార్గంలో నడిపిస్తారో ఆ సమాజం గొప్పగా పురోగమించే అవకాశం ఉంటుందని' సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చదవండి: (సీఎం జగన్ నిర్ణయంతో మంచి జరుగుతుందని భావిస్తున్నా: ఉండవల్లి) -
కెనడాలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. వేలాది మంది హాజరు
Azadi Ka Amrit Mahotsav in Canada: గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులు కెనడాలో వర్చువల్‌గా జరిగాయి. కానీ ఈసారి స్వాతంత్య్ర వేడుకలు కెనడాలోని టోరంటోలోని నాథన్ ఫిలిప్స్‌లో చాలా అంగ రంగ వైభవంగా జరిగాయి. ఈ మేరకు టోరంటోన్ నాథన్ ఫిలిప్స్‌లో జరిగిన భారత స్వాతంత్య్ర వేడుకలకి దాదాపు 25 భారతీయ రాష్ట్రాల నుంచి సుమారు 15కు పైగా కవాతు బృందాలు తరలి వచ్చాయి. ఈ వేడుకలకు సుమారు పదివేలమందికి పైగా ఇండో కెనడియన్లు హాజరయ్యారు. అంతేకాదు ఈ వేడుకలకు హాజరయ్యేవారి కోసం ఏర్పాటు చేసిన భారతీయ వంటకాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో లాభప్రేక్షలేని సంస్థ పనోరమా ఇండియా చైర్మన్ వైదేహి భగత్ భారత్‌లోని మొత్తం కవాతును ఒక చోటకు చేర్చి పాల్గొనేలా చేశారు. సుమారు 553 మీటర్ల ఎత్తైన సీఎన్ టవర్ పై త్రివర్ణ పతాక వెలుగులుతో దేదీప్యమానంగా విరజిమ్మిలా చేశారు. ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించిందంటూ భగత్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానిక ముఖ్య అతిథిగా కెనడా జాతీయ రక్షణ మంత్రి అనితా ఆనంద్ హజరయ్యారు. ఈ మహత్తర సందర్భాన్ని గుర్తించేందకు కలిసి వచ్చిన ఇండో కెనడియన్లందరికీ ధన్యావాదాలు అని ట్వీట్ చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి ఎలాంటి అంతరాయ కలగకుండా ఉండేలా టోరంటో పోలీసు సిబ్బంది గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఇండియా డే పరేడ్, సాంప్రదాయకంగా ఆగస్టు 15 తర్వాత ఆదివారం నిర్వహిస్తారు. అక్కడ ఉండే భారతీయలు ఈ నెల మొత్తం దేశవ్యాప్తంగా ఈ వేడుకులను ఘనంగా నిర్వహించుకుంటారు. అంతేకాదు ఆగస్టు 15 స్వాతంత్య్ర వేడుకలు ఆల్బెర్టా ప్రావిన్స్‌లోని కాల్గరీలో నిర్వహించారు. ఈ వేడుకను 22 కమ్యూనిటి సంస్థలు నిర్వహించాయి. సుమారు ఐదు వేల మంది హాజరయ్యారు. అలాగే గురుకుల ఇంటర్ కల్చరల్ సొసైటీ గత ఆదివారం బ్రిటిష్ కొలంబియాలో దాదాపు 300 వాహనాలతో తిరంగ యాత్ర కార్ ర్యాలీని నిర్వహించింది. (చదవండి: కిలిమంజారో పర్వతంపై వైఫై.. ఎవరెస్ట్‌పై ఏనాడో!) -
రగిలింది విప్లవాగ్ని ఈరోజే!
భారత స్వాతంత్య్ర ఉద్యమానికి అతివాద, మితవాద, విప్లవ వాద మార్గాలను ఎన్నుకున్న అనేకమంది దేశ భక్తులు తమ జీవితాలను అంకితం చేశారు. ఈ ఉద్యమ స్రవంతుల్లో ఆయుధం పట్టి బ్రిటిష్‌వాళ్ల భరతం పట్టాలన్న వర్గానికి చెందినవారు అల్లూరి సీతారామరాజు. అమాయక గిరిజనుల బాధలను దగ్గర నుంచి గమనించి, విజ్ఞాపనల ద్వారా వారి సమస్యలు పరిష్కారం కావని గ్రహించారు. అందుకే మన్యం ప్రాంతంలో అద్భుతమైన గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. అల్లూరి సీతారామరాజు చేసిన ఈ సంచలన యుద్ధానికి నేటితో నూరు వసంతాలు. ► అడవి నుంచీ, పూర్వీకుల నుంచీ వచ్చిన స్వేచ్ఛా జీవనానికి సంకెళ్లు వేయాలని చూసిన చట్టాలకు ప్రతిఘటనలే గిరిజనోద్యమాలు. దేశం నలుమూలలా జరిగిన అలాంటి ఉద్యమాలలో 1922–24 నడుమ విశాఖ మన్యంలో అల్లూరి సీతారామరాజు (శ్రీరామరాజు) నిర్వహించిన పోరాటం ప్రత్యేకమైనది. అవన్నీ కొండా కోనా మీద హక్కు కోసం కొన్ని తరాల ఆదివాసీలు పడిన తపన, వేదనలే. స్థానిక సమస్యల మీద తలెత్తినట్టు కనిపించినా నిజానికి అవి ప్రభుత్వాల మీద యుద్ధాలే. విశాఖ మన్య పోరాటంలో మైదాన ప్రాంత రాజకీయ స్పృహ, సైద్ధాంతిక ఛాయ ఉన్నాయి. ► శ్రీరామరాజు ఉద్యమకారునిగా అవతరించడం ఒక చారిత్రక నేపథ్యంలో జరిగింది. మొదటి ప్రపంచయుద్ధం, గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం పిలుపు, ఉపసంహరణ; ఉత్తర భారత యాత్ర ఆ నేపథ్యాన్ని ఇచ్చాయి. తన కుటుంబం తునిలో ఉన్నప్పుడే 1915లో ఉద్యోగాణ్వేషణ పేరుతో రామరాజు ఉత్తర భారతదేశం వెళ్లారు. ఆ యాత్రలోనే రామరాజు కలకత్తా వెళ్లి ప్రముఖ జాతీయ ఉద్యమ నేత సురేంద్రనాథ్ బెనర్జీని కలుసుకున్నారు. ఆ తరువాత అల్లూరి తూర్పు కనుమలలోని కృష్ణ్ణదేవిపేటకు 1917 జూలై 24న ఒక ఆధ్యాత్మికవేత్తగా చేరుకున్నారు. ఈ ఊరే ఆయన కార్యక్షేత్రమయింది. ఇక ఆయన ఆయుధం పట్టి, ఉద్యమం ప్రారంభించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ► 1920లో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమానికి పిలుపూ, ‘ఒక్క ఏడాదిలోనే స్వాతంత్య్రం’ అన్న నినాదమూ ఇచ్చారు. రాళ్లపల్లి కాశన్న, నర్సీపట్నం ప్రాంత కాంగ్రెస్ కార్యకర్తలు కృష్ణదేవిపేటలోనూ సహాయ నిరాకరణోద్యమ ప్రచారం చేశారు. 1921లో రామరాజు కాలినడకన నాసికాత్రయంబకం వెళ్లారు. అక్కడ ‘అభినవ్ భారత్’ విప్లవ సంస్థ ప్రభావం ఆయనపై గాఢంగా పడింది. అప్పటికే రామరాజు మన్యవాసులలో కొన్ని సంస్కరణలు తెచ్చారు. గాంధీజీ కార్యక్రమమంతటిలోను మద్యపాన నిషేధం, కోర్టుల బహి ష్కారం... ఈ రెండూ ఆయనకు నచ్చాయి. ఇవే రామరాజు ‘సహాయ నిరాకరణ వాది’ అన్న అనుమానం కలిగించాయి. ► మొదటి ప్రపంచ యుద్ధం ఆగిన తర్వాత కరవు విజృంభించ డంతో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆకలి దాడులు జరిగాయి. ప్రభుత్వం ఉపాధి కల్పన ఆరంభించింది. మన్యంలో రోడ్ల నిర్మాణం అందులో ఒకటి. ఆసియా చరిత్రలోనే ఈ రోడ్ల నిర్మాణం ఓ అమానుష ఘట్టం. ఇందుకు బాధ్యుడు గూడెం డిప్యూటీ తహసీల్దార్ అల్ఫ్ బాస్టియన్. నిజానికి 1882 చట్టంతో అడవిలో ప్రవేశం కోల్పోయిన ఆదివాసీలు కూలీలుగా మారిపోయారు. పెద్దవలస మాజీ ముఠాదారు కంకిపాటి బాలయ్యపడాలు (ఎండు పడాలు), బట్టిపనుకుల మునసబు గాం గంతన్న దొర, అతని తమ్ముడు గాం మల్లు దొర, గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు వంటివారు 1922 జనవరిలో రాజు దగ్గరికి వచ్చి గోడు వినిపించుకున్నారు. ► బాస్టియన్ మీద పై అధికారులకు శ్రీరామరాజు ఫిర్యాదు రాశారు. రామరాజు మన్యంలో సహాయ నిరాకరణ ఆరంభించాడన్న ఆరోపణకు ఈ ఫిర్యాదు దోహదం చేసింది. రామరాజును ఆ ఫిబ్రవరి 3న నిర్బంధంలోకి తీసుకున్నది కూడా సహాయ నిరాకరణవాది అన్న ఆరోపణతోనే! ఆ ఒకటో తేదీనే సహాయ నిరాకరణను తీవ్రం చేస్తున్నట్టు గాంధీజీ ప్రకటించారు. 5వ తేదీన జరిగిన ‘చౌరీచౌరా’ ఉదంతంతో గాంధీ ఆ పిలుపును ఉపసంహరించుకున్నారు. అహింసాయుతంగా పోరాడే సంస్కారం భారతీయులకు లేదని నింద మోపారు. ఇదే యువతను ఇతర పంథాల వైపు నడిపించింది. అలాంటి వారిలో రామరాజు ఒకరు. ► సంప్రదాయ, ఆధునిక ఆయుధాలతో గెరిల్లా పోరు జరపాలని అనుకున్న రాజు... ఆయుధాల కోసం మన్యంలోని పోలీస్ స్టేషన్లను దోచుకోవాలని నిర్ణయించారు. అనుచరులను మూడు దళాలుగా విభజించారు. 1922 ఆగస్ట్ 22న పట్టపగలు చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద 300 మందితో దాడి చేశారు. ఆయుధాలు తీసుకు వెళుతున్నానని ఒక లేఖ రాసి వచ్చారు రాజు. తొలి దాడితోనే మన్య ఉద్యమ తత్త్వం తెలుస్తుంది. కొండదళం ‘వందేమాతరం... మనదే రాజ్యం’, ‘గాంధీజీకి జై’ అంటూ నినదించింది. ► ఆగస్టు 23న కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగింది. ఆగస్ట్ 24న రాజవొమ్మంగి స్టేషన్ (తూర్పు గోదావరి)ను ఎంచు కున్నారు. లాగరాయి పితూరీని సమర్థించిన నేరానికి అరెస్టయిన మొట్టడం వీరయ్యదొర అప్పుడు ఆ స్టేషన్లోనే ఉన్నారు. ఆయనను విడిపించడం కూడా ఈ దాడి ఆశయాలలో ఒకటి. తొలి రెండు దాడులతోనే మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రధాన కార్యదర్శి ఆర్ఏ గ్రాహవ్ుకు టెలిగ్రావ్ులు వెళ్లాయి. 26 తుపాకులు, వేలాది తూటాలు కొండదళం చేతికి చిక్కాయి. ఎంత ప్రమాదం! ఏజెన్సీ జిల్లా పోలీసు సూపరిం టెండెంట్ సాండర్స్, కలెక్టర్ వాయువేగంతో నర్సీపట్నం చేరు కున్నారు. నర్సీపట్నం కేంద్రంగా మన్యం ఖాకీవనమైంది. ► అలాంటి వాతావరణంలోనే జైపూర్ మహారాజు ఐదు ఏనుగుల మీద పోలీసుల కోసం పంపిన సామగ్రిని సెప్టెంబర్ 3న ఒంజేరి ఘాట్‌లో రాజుదళం వశం చేసుకుంది. తరువాత జరిగిన ఘటన మద్రాస్ ప్రెసిడెన్సీని మరీ కలవరపెట్టింది. రామరాజు పేరు మొదటిసారి తెలుగునేలంతా వినిపించింది. దామనపల్లి అనే కొండమార్గంలో 1924 సెప్టెంబర్ 24న గాలింపు జరుపుతున్న స్కాట్ కవర్ట్, నెవెల్లి హైటర్ అనే ఒరిస్సా పోలీసు ఉన్నతాధికారులను రాజు దళం చంపింది. వీరిలో హైటర్ మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొన్నాడు. తరువాత అడ్డతీగల, చోడవరం, మల్కనగిరి, పాడేరు స్టేషన్ల మీద చేసిన దాడులు విఫల మయ్యాయి. బ్రిటిష్‌వాళ్లు ఆయుధాలను ట్రెజరీలకు పంపి జాగ్రత్త పడ్డారు. మన్యం మీద పట్టు బిగించడానికి మద్రాస్ ప్రెసిడెన్సీ మరొక అడుగు ముందుకు వేసి, 1922 సెప్టెంబర్ 23న మలబార్ పోలీసు దళాలను దించింది. కానీ రామవరం అనే చోట ఆ దళమూ వీగిపోయింది. ► 1922 డిసెంబర్ 6న పెద్దగడ్డపాలెం, లింగాపురం అనేచోట్ల రాజుదళం మీద లూయీ ఫిరంగులతో మలబార్ దళం యుద్ధానికి దిగింది. ఎనిమిది మంది రాజు అనుచరులు వీరమరణం చెందారు. ఆ డిసెంబర్ 23న ఉద్యమకారుల తలలకు ప్రభుత్వం వెలలు ప్రకటించింది. నాలుగు మాసాల అనంతరం 1923 ఏప్రిల్ 17న రామరాజు దళం ఆకస్మాత్తుగా అన్నవరం పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమై మొత్తం యంత్రాంగాన్ని కలవరపరిచింది. ఆ సంవత్సరం డిసెం బర్లో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు రామరాజు మారువేషంలో హాజరయ్యారు. నడిపేది గిరిజనోద్యమమే అయినా, ఆయన మైదాన ప్రాంత ఉద్యమాన్ని గమనిస్తూనే ఉన్నారు. ► 1924 జనవరికి అస్సాం రైఫిల్స్‌ను దించారు. వీరికి మొదటి ప్రపంచ యుద్ధంలో అనుభవం ఉంది. అస్సాం రైఫిల్స్ అధిపతే మేజర్ గుడాల్. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న థామస్ జార్జ్ రూథర్‌ఫర్డ్‌ను ఆ ఏప్రిల్‌లో మన్యం స్పెషల్ కమిషనర్‌గా నియమిం చారు. మే ఐదు లేదా ఆరున ‘రేవుల కంతారం’ దగ్గర పోలీసుల దాడి నుంచి తప్పించుకున్న రాజు ఒక్కడే రాత్రివేళ ‘మంప’ అనే గ్రామం వచ్చి, ఒక చేనులోని మంచె మీద గడిపారు. మే 7వ తేదీ వేకువనే ఓ కుంటలో స్నానం చేస్తుండగా రాజును ఈస్ట్‌కోస్ట్ దళానికి చెందిన కంచుమేనన్, ఇంటెలిజెన్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఆళ్వార్‌నాయుడు అరెస్టు చేశారు. రాజును ఒక నులక మంచానికి కట్టి, కృష్ణదేవిపేటకు పయన మయ్యారు. దారిలోనే ఉంది కొయ్యూరు. అక్కడే మేజర్ గుడాల్... రాజుతో మాట్లాడాలని గుడారంలోకి తీసుకువెళ్లాడు. ఒక చెట్టుకు కట్టి కాల్చి చంపాడు. జూన్ 7న గాం గంతన్నను కాల్చి చంపారు. ► దాదాపు రెండేళ్ల ఉద్యమం, పోలీస్ వేధింపులతో మన్యవాసులు భీతిల్లి పోయారు. కొందరు ఉద్యమకారులను స్థానికులే చంపారు. పోలీసు లకు పట్టించారు. సరైన విచారణ లేకుండానే 270 మంది వరకు ఉద్యమకారులకు శిక్షలు విధించింది మిలిటరీ ట్రిబ్యునల్. 12 మందిని అండమాన్ పంపారు. చివరిగా... దేశం కోసం పోరాడిన ఏ వర్గం త్యాగమైనా విలువైనదే. అవన్నీ నమోదైతేనే స్వరాజ్య సమర చరిత్రకు పరిపూర్ణత. ఉద్యమ నూరేళ్ల సందర్భం ఇచ్చే సందేశం అదే! డా‘‘ గోపరాజు నారాయణరావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (అల్లూరి సీతారామరాజు పోరాటానికి నూరు వసంతాలు) -
Azadi Ka Amrit Mahotsav: 7 రోజుల్లో 450 జాతీయ జెండాలు
పట్నా: 91 ఏళ్ల వృద్ధుడు కేవలం వారం రోజుల్లో ఏకంగా 450 జాతీయ జెండాలను తన కుట్టుమెషీన్‌పై కుట్టాడు. ఈ అరుదైన సంఘటన బిహార్ రాష్ట్రం సుపౌల్ జిల్లా నిర్మాలీలో చోటుచేసుకుంది. లాల్మోహన్ పాశ్వాన్(91) అచ్ఛమైన గాంధేయవాది. దర్జీగా జీవనం సాగిస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంందర్భంగా ‘హెల్ప్ ఏజ్ ఇండియా’ అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ జాతీయ జెండాల కోసం లాల్మోహన్కు ఆర్డర్ ఇచ్చింది. కేవలం 7 రోజుల్లో 450 జెండాలు కుట్టి హెల్ప్ ఏజ్ ఇండియాకు అందజేశారు. రోజుకు 12 గంటలపాటు పనిచేసి, జెండాలు కుట్టానని లాల్మోహన్ చెప్పారు. జెండాలు కుట్టడాన్ని పవిత్రమైన బాధ్యతగా భావించానని, స్వాతంత్య్ర దినోత్సవ కంటే ముందు రోజే జెండాలను అందజేసినందుకు చాలా గర్వించానని అన్నారు. -
Peddavadugur: గాంధీజీ మెచ్చిన ఊరు
అనంతపురం జిల్లా గుత్తికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘పెద్ద వడుగూరు’ గ్రామం స్వాతంత్య్ర ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించింది. ఆ ఊళ్లో గొప్ప పారిశ్రామికవేత్త కె. చిన్నారప రెడ్డి. ఎన్నో ఆదర్శ భావాలు కలిగినవాడు. ఆయన పనిపై మద్రాస్ వెళుతూ ఉండేవారు. 1934లో ఒకరోజు ఆయన మద్రాసు మెరీనా బీచ్‌లో మహాత్మాగాంధీ ఉపన్యాసం విన్నారు. ఆ రోజు గాంధీ ఉపన్యసిస్తూ స్వాతంత్ర పోరాటానికి నిధులు కొరతగా ఉన్నాయనీ, దాతలు సహాయం చేయాలనీ విజ్ఞప్తి చేశారు. ఆ మాటలు నారపరెడ్డిని ఆలోచనలో పడవేశాయి. తమ ఊరికి రావాలని గాంధీజీని సంప్రదించారు. స్వాతంత్రోద్య మానికి రూ. 12 వేల నిధి ఇస్తే వస్తానని హామీ ఇచ్చారు. అన్నట్టుగానే బాపు 1934 సెప్టెంబర్ 21న మద్రాసు నుండి రైలులో ఉదయం 7 గంటలకు గుత్తి రైల్వేస్టేషన్లో దిగారు. ప్రజలు పెద వడుగూరుకు ఘన స్వాగతం పలికారు. చిన్నారప రెడ్డే గాంధీకి వసతి చేకూర్చారు. తిరుపతిరావు అనే వ్యక్తి గాంధీజీని తన భుజస్కంధాలపై ఎత్తుకొని వేదికపైకి చేర్చాడు. హిందీ పండిట్ సత్యనారాయణ... గాంధీ ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించారు. నిధులు అందించి స్వాతంత్ర పోరాటాన్ని విజయవంతం చేయాలని అక్కడ చేరిన ప్రజలను కోరారు గాంధీ. అందరూ కలిసి దాదాపు రూ. 27 వేలు ఇచ్చారు. సభాస్థలికి 11 కిలోమీటర్ల దూరం నుంచి విచ్చేసిన భూస్వామి హంపమ్మ రూ. 1,116 అంద జేశారు. ఆమె అంతటితో ఆగకుండా మరో అరగంట గడుస్తుండగా తన ఒంటిపై ఉన్న బంగారు నగలన్నీ విరాళంగా ఇచ్చేశారు. అలా ఒకరికొకరు పోటీలు పడుతూ దాదాపు 5 కేజీల బంగారాన్ని గాంధీకి ఇచ్చారు. ఈ ఊరిని కేంద్రంగా చేసుకుని గాంధీ అనేక గ్రామాలు సందర్శించారు. ఉరవకొండ, హిందూపురం, కదిరి సమావేశాల్లో కూడా ప్రసంగించారు. రాత్రి అయ్యే సరికి తిరిగి పెద్ద వడుగూరులోని తన విడిది గృహానికి చేరుకునేవారు. ఈ నాలుగు రోజులూ గాంధీ చిన్నారప రెడ్డి కారులోనే తిరిగేవారు. ఆఖరు రోజున చిన్నారప రెడ్డి తనకున్న 32 ఎకరాల పొలాన్ని, తన కారును కూడా విరాళంగా ప్రకటించి గొప్ప మనసును చాటుకున్నారు. గాంధీజీని గ్రామానికి పిలవద్దని కూడా అప్పట్లో బ్రిటిష్‌వాళ్లు ఆయనను బెదిరించారు. అయినా ఆయన భయపడకుండా ధైర్యంగా నిలబడి తన నిర్ణయాన్ని అమలుపరిచారు. ఇక్కడ ఇల్లూరి కేశమ్మ అనే మహిళను కూడా మనం స్మరించుకోవాలి. ఇల్లూరు కేశమ్మ పోలీసుల బెదిరింపులకు భయపడకుండా గ్రామ గ్రామం తిరిగి, గాంధీ సభలకు రావాల్సిందిగా వేసిన కరపత్రాలు పంచింది. ఆమెను ఒకసారి అరెస్టు కూడా చేశారు. అయినా జడవక విడుదల కాగానే తిరిగి ప్రచారం మొదలు పెట్టింది. గాంధీ వెంట నారాయణమ్మ, సుభద్రమ్మ అనే మహిళలు సైతం 4 రోజులు తిరిగారు. ఆరోజు గాంధీ సభకు తోరణాలు కట్టి, అలంకరణ చేసి అందరికీ మంచినీళ్లు అందించిన వెంకటరెడ్డి వయసు నేడు 110 ఏళ్లు. ఆ గ్రామానికి 3 దశాబ్దాలు సర్పంచ్‌గా సేవలందించిన శరభా రెడ్డి కూడా ఆ కాలంలో గాంధీకి రూ. 1,116 విరాళంగా ఇచ్చారు. ఆయన కొడుకు సూర్యనారాయణరెడ్డి (88 ఏళ్ళు)... గాంధీ తమ ఊరికి వచ్చినపుడు తాను చిన్న పిల్లవాడిననీ, అప్పటి విశేషాలు ఎన్నో తన మనసులో దాగివున్నాయనీ పూస గుచ్చినట్లు వివరించారు. 1947 ఆగస్టు 15న గ్రామమంతా పండుగ చేసుకున్నామనీ, అందరికీ పిప్పరమెంట్లు, బోరుగులు పంచామనీ చెప్పుకొచ్చారు. గాంధీజీ పెద వడుగూరును ప్రశంసిస్తూ తన డైరీలో ప్రత్యేకంగా రాసుకున్నారనీ ఆయన అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఆనాటి కోట్లాదిమందిని స్మరిస్తూ, జీవించివున్న స్వాతంత్య్ర సమరయోధులకు పాదాభివందనాలు తెలియజేద్దాం. (క్లిక్: ఉద్యమ వారసత్వమే ఊపిరి) - డాక్టర్ సమ్మెట విజయ్‌కుమార్ సామాజిక శాస్త్రవేత్త -
భరతమాత తొలి వెలుగులకు దూరమైన తెలంగాణ
1600 సంవత్సరంలో భారత గడ్డపై వ్యాపార నిమిత్తం కాలు మోపి, ఇంతింతై వటుడింతై అన్నట్లు అంచెలంచెలుగా తమ ఆధిపత్యాన్ని పెంచుకుంటూ, భారతీయుల, పాలకుల అమాయకత్వాన్ని తమకు అనువుగా మలచుకొంటూ సాగిన ఈస్ట్ ఇండియా కంపెనీ జైత్రయాత్ర ప్లాసీ యుద్ధం అనంతరం మరింతగా విస్తరించి, బెంగాల్ ప్రాంతాన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంది. భారతదేశ స్వయం సిద్ధ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ప్రకృతిని కాపాడుకుంటూ సాగే జీవన విధానం, విద్యా వ్యవస్థ మరియు ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచే ధార్మిక మూలాలు, వాటి విశిష్టతని అర్థం చేసుకున్న కంపెనీ పాలకులు, వారి వ్యాపార విస్తరణకు అడ్డుగా ఉంటుందన్న భావనతో దేశం మొత్తాన్ని ముందుగా తమ చేతుల్లోకి తీసుకుంది. అనంతరం భారతీయ మూలాల్ని పెకిలించే కంపెనీ ప్రక్రియ యథేఛ్చగా సాగడం వల్ల దేశ ప్రజల్లో రాజుకున్న స్వతంత్ర కాంక్ష 1857 లో సిపాయి రెబెల్లియన్గా ,తొలి స్వాతంత్య్ర పోరాటంగా మారడం గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం, అఖండ భారత పాలన కేవలం కంపెనీతో సాధ్య పడదని తెలుసుకుని నేరుగా దేశాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. భారతీయులకి ఈ స్థితి నేరుగా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయ్యింది. మెల్లిమెల్లిగా రాజుకుంటున్న స్వాతంత్ర కాంక్షని ముందుగానే అంచనా వేసిన బ్రిటిష్ ప్రభుత్వం 1861, 1892, 1909, 1919 లలో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్ రూపంలో దేశ ప్రజలకి ఎంగిలి మెతుకుల్ని విదిల్చినట్టు అధికారంలో, పాలనలో తమకు అడ్డు రాకుండా కొద్దిపాటి భాగ స్వామ్యాన్ని కల్పించింది. అరకొరగా ఇచ్చిన పాలనా భాగస్వామ్యం ప్రజల్లో పెరుగుతున్న స్వాతంత్య్ర భావనని తగ్గించక పోగా మరింత తీవ్రరూపం దాల్చడంతో ఇండియన్ యాక్ట్ 1935 రూపంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకి పూర్తి పాలన స్వేఛ్చని ఇచ్చినట్లు ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. అత్యంత దారుణమైన స్థితి ఏంటంటే తమ సోదరులు, మిగిలిన భారతీయులు తమ స్వాతంత్య్రాన్ని చాటుతూ ముందుకు సాగుతుంటే, తెలంగాణ, మరట్వాడ మరియు కల్యాణ కర్ణాటక (ఉత్తర కర్ణాటక ) ప్రాంత వాసులు మాత్రం, 1724 లో మొగలు రాజుల నుండి సొంత జెండా ఎగరవేసిన అసిఫ్ జాహి నిజాం పాలకుల కబంధ హస్తాల్లోకి వెళ్లి, విద్యకి ,వైద్యానికి, చివరికి తమ సంస్కృతి సాంప్రదాయాల్ని, మత స్వేచ్ఛని కోల్పోయి మానవ సమాజంపై జరిగే దాడి నుంచి తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో మునిగి పోయారు.15 ఆగష్టు, 1947, దేశం పూర్తి స్వేచ్చా వాయువుల్ని పీల్చుకునే సమయంలో హైదరాబాద్ సంస్థానం మాత్రం రజాకార్ల రూపంలో ఉన్న మానవ మృగాల పైశాచిక దాడిని ఎదుర్కొంటూ, తమను తాము రక్షించేకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. విలాసాలు , వినోదాలతో సాగిన నిజాం పాలన ప్రజల కనీస హక్కులు కాలరాస్తూ సాగి, చివరకి అప్పు కట్టలేక తన రాజ్యాన్ని కొద్ది కొద్దిగా ముక్కలు చేస్తూ, కంపెనీకి , బ్రిటిష్ పాలకులకు అప్పగించే స్థితి దాపురించింది . 1768లో మచిలీపట్టణం సంధి ద్వారా కోస్తా ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించిన నిజాం, 1903 లో బేరార్ ప్రాంతాన్ని బ్రిటిష్ పాలకులకి అప్పజెప్పాడు. ఇదే క్రమంలో సీడెడ్ ప్రాంతాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. జులై 4 1946 వరంగల్ జిల్లాలోని కడవేని గ్రామంలో దొడ్డ కొమరయ్య అనే రైతు హత్య ఘటన, నిజాం అనుచరులైన దొరలపై రైతుల తిరుగుబాటుకి దారి తీసింది. రజాకార్ల పైన ఆత్మ రక్షణ యుద్ధంలో తెలంగాణ ప్రజలంతా ఏకమై, కుల సంఘాలు, వామపక్షాలు, రైతులు, విద్యావంతులు గెరిల్లా యుద్దాన్ని చేబట్టారు. గోండు జాతిని రక్షించే బాధ్యత, 1900-1949 సమయంలో కొమరం భీంపై పడి, జమిందార్ లక్ష్మణ్ రావు దాష్టికాలపై, నిజాంపై 1900-1949 మధ్య కాలంలో సాగిన అస్తిత్వ పోరాటం..‘జల్, జంగిల్ జమీన్’ నినాదంతో సాగి 1940 లో భీం ప్రాణాలని హరించింది. విసునూరు రామ చంద్రా రెడ్డి విశృంఖల దౌర్జన్యానికి, నిజాం దోపిడీ విధానానికి వ్యతిరేకంగా సాగిన చాకలి ఐలమ్మ పోరాటం మనకి సదా ప్రాతఃస్మరణీయం. ఈ హైదరాబాద్ సంస్థాన వాసుల దయానీయ స్థితిని గమనించిన భారత ప్రభుత్వం, మన ప్రథమ హోం శాఖామాత్యులు, స్వర్గీయ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో సాగించిన పోలీస్ ఆక్షన్ 13 సెప్టెంబర్ 1948 లో మొదలై 17 సెప్టెంబర్ 1948న నైజాం దాస్య శృంకలాల నుంచి స్వేఛ్చ వాయువుల్ని పీల్చుకునే వరకు సాగింది. దేశం ఎన్నో బలిదానాల ఫలితంగా ఏర్పడ్డ స్వాతంత్రం, ఆ మధురమైన అమృత ఘడియలు, ఆ అద్భుత మైన అనుభూతికి దూరంగా, హైదరాబాద్ సంస్థాన వాసులు మాత్రం తీర్చలేని వెలితితో భరతమాత తొలి వెలుగులకు దూరంగా ఉండిపోయింది. దొర్లి పోయిన కాలంలో గాయపడ్డ తెలంగాణ మరకలు అలాగే మిగిలి పోయాయి. -వేముల శ్రీకర్, ఐఆర్ఎస్, కమిషనర్, ఇన్‌కంటాక్స్ -
Super Vasuki: ఈ గూడ్స్‌కు 295 వ్యాగన్లు!
న్యూఢిల్లీ: సాధారణ గూడ్స్ రైలు కంటే 3 రెట్లు పెద్దదైన ‘సూపర్ వాసుకి’ని ఆగ్నేయ మధ్య(సౌత్ ఈస్ట్ సెంట్రల్) రైల్వే ప్రయోగాత్మకంగా నడిపింది. మూడున్నర కిలోమీటర్ల పొడవు, 295 వ్యాగన్లతో 27 వేల టన్నులకు పైగా బొగ్గును తీసుకుని ఈ భారీ రైలు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నుంచి నాగ్‌పూర్ సమీపంలోని రాజ్‌నంద్‌గావ్‌కు చేరుకుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సోమవారం సూపర్ వాసుకిని నడిపి చూసినట్లు అధికారులు చెప్పారు. కోర్బా నుంచి మధ్యాహ్నం 1.50 గంటలకు బయలుదేరిన ఈ గూడ్స్ 267 కిలోమీటర్ల దూరాన్ని 11.20 గంటల్లో చేరుకుంది. ఒక్కో స్టేషన్‌ను దాటేందుకు వాసుకికి సుమారు 4 నిమిషాలు పట్టింది. ఇప్పటి వరకు నడిపిన అత్యంత పొడవైన, అతి భారీ గూడ్స్ రైలు ఇదేనని రైల్వే శాఖ వెల్లడించింది. సూపర్ వాసుకి తీసుకువచ్చిన బొగ్గుతో 3,000 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఒక రోజంతా నడుస్తుందని అధికారులు చెప్పారు. సాధారణ గూడ్స్ రైలు 90 వ్యాగన్లలో 9 వేల టన్నుల బొగ్గును మాత్రమే రవాణా చేయగలుగుతుంది. -
చెమటోడుస్తున్న యువీ.. ఇదంతా ఆ మ్యాచ్ కోసమేనా?
టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ నెట్స్‌లో త్రీవంగా చెమటోడుస్తున్నాడు. యువీ బ్యాటింగ్‌లో శ్రమిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి యువరాజ్ ఇంతకు దేనికోసం ఇంత ప్రాక్టీస్ చేస్తున్నట్లు.. అనే డౌట్ వచ్చిందా. అక్కడికే వస్తున్నాం.భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా బీసీసీఐ ఒక స్పెషల్ మ్యాచ్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇండియా మహారాజాస్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్ మధ్య సెప్టెంబర్ 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ జట్టుకు గంగూలీ నాయకత్వం వహించనున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్, హర్బజన్ సింగ్, మహ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్, అజయ్ జడేజా, యూసఫ్ పఠాన్ సహా మరికొంత మంది ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. అయితే, యువీ పేరు ఇటీవల ప్రకటించిన జట్టులో లేనప్పటికీ ఈ మేరకు ఈ మాజీ డాషింగ్ ఆల్కరౌండర్ నెట్స్‌లో శ్రమించడం విశేషం. దీంతో ఆఖరి నిమిషంలోనైనా యువీ ఎంట్రీ ఇవ్వనున్నాడా అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. వరల్డ్ జెయింట్స్‌కు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ నాయకత్వం వహించనున్నాడు. కాగా యువరాజ్ ప్రాక్టీస్‌కు ముందు ఒక అభిమాని.. ''మీ కార్లో క్రికెట్ కిట్ ఏం చేస్తోంది'' అని అడిగాడు. యువీ స్పందిస్తూ.. నాకు కొంచెం ప్రాక్టీస్ అవసరం. ఏదైనా మ్యాచ్‌లో బరిలోకి దిగడానికి ప్రాక్టీస్ చేయడం అవసరం. పేర్కొన్నాడు. ఆ తర్వాత యువరాజ్ తన కిట్ ఓపెన్ చేసి తన ప్యాడ్లను చూపిస్తూ ''వారియర్ ఈజ్ బ్యాక్''.. రానున్న జరగబోయే మ్యాచ్‌కోసం నేను మంచి ఉత్సాహంతో ఉన్నా.. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం వెళ్తున్నా అంటూ తెలిపాడు. ఇక ప్రాక్టీస్ ముగిసిన అనంతరం.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి బాగా అలసిపోయా.. కొద్దిసేపు నాకు ఊపిరి తీసుకోవడం కష్టమయింది. ఆల్ ది బెస్ట్.. ఇండియన్ మహరాజాస్ అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక యువరాజ్ టీమిండియా తరపున గ్రేటెస్ట్ ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. 19 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన యువరాజ్ 2007, 2011 ప్రపంచకప్‌లు గెలవడంలో కీలకపాత్ర పోషించారు. అంతేకాదు 2007 టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి యువరాజ్ చరిత్ర సృష్టించాడు. కాగా జూన్ 10, 2019లో యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 19 ఏళ్ల కెరీర్లో యువరాజ్ టీమిండియా తరపున 40 టెస్టుల్లో 3 సెంచరీలు.. 11 అర్థసెంచరీల సాయంతో 1900 పరుగులు.. 10 వికెట్లు తీశాడు. ఇక 304 వన్డేల్లో 14 సెంచరీలు.. 52 హాఫ్‌సెంచరీలతో కలిపి 8701 పరుగులతో పాటు 111 వికెట్లు పడగొట్టాడు. ఇక 58 టి20ల్లో 8 అర్థసెంచరీల సాయంతో 1177 పరుగులు చేశాడు. Didn’t do too bad, did I? 🤪 Super excited for what’s coming up! pic.twitter.com/MztAU5nyZJ — Yuvraj Singh (@YUVSTRONG12) August 16, 2022 Are you as excited about the special India@75 match between India @IndMaharajasLLC and World @WorldGiantsLLC? Announcing the full squads of #Legends in the next tweet! #LegendsLeagueCricket #AzadiKaAmritMahotsav@Souravganguly @Eoin16 @AmritMahotsav @cabcricket @DasSanjay1812 pic.twitter.com/oUZZQaOUFv — Legends League Cricket (@llct20) August 12, 2022 ఇండియా మహరాజాస్: సౌరవ్ గంగూలీ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్, ఎస్ బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ, ఎస్ శ్రీశాంత్, హర్భజన్ సింగ్, నమన్ ఓజా, అశోక్ దిండా, ప్రజ్ఞాన్ ఓజా, అజయ్ సింగ్ జడేజా,ఆర్ పీ సింగ్ , జోగిందర్ శర్మ వరల్డ్ జెయింట్స్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), లెండిల్ సిమన్స్, హెర్షెల్ గిబ్స్, జాక్వెస్ కల్లిస్, సనత్ జయసూర్య, మాట్ ప్రియర్, నాథన్ మెకల్లమ్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్, హామిల్టన్ మసకద్జా, మష్రాఫ్ మోర్టాజా, అస్గ్హర్ మోర్టాజా, అస్గ్హర్ట్జాన్ అఫ్ట్సన్, , కెవిన్ ఓ'బ్రియన్, దినేష్ రామ్‌దిన్ చదవండి: ఇండియా మహరాజాస్ కెప్టెన్‌గా గంగూలీ.. పోటీకి సన్నద్ధం! LLC 2022: ఇండియా మహరాజాస్‌తో మ్యాచ్.. సనత్ జయసూర్య అవుట్! షేన్ వాట్సన్ ఇన్