
అణువణువున రగిలే దేశభక్తిని కళ్లకు కట్టినట్టు చూపడం, తన ముఖం త్రివర్ణ రూపమని చాటి చెప్పడం, ఆకలివేట సాగించే పక్షి ఆతృతను ఒడిసి పట్టుకోవడం, పచ్చని పంట పొలాల్లో సైతం త్రివర్ణ రెపరెపలు కనువిందు చేయడం, సముద్రపు నీటిరాళ్లపై త్రివర్ణాలు అద్దడం.. లాంటి అద్భుతమైన చిత్రాలను కడప నగరంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ విశ్వవిద్యాలయం విద్యార్థులు తీసి ఆకట్టుకున్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో సమన్వయకర్త సతీష్ ఆధ్వర్యంలో విద్యార్థులు కడప నగరంలోని పాతకడప తదితర ప్రాంతాల్లో తీసిన చిత్రాలు.. భళా అనిపించేలా ఉన్నాయి. వీరి కళను ఇన్‌చార్జి వైస్ చాన్సలర్ ఆచార్య మునగాల సూర్యకళావతి, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.సి. సురేంద్రనాథ్‌రెడ్డి అభినందించారు.
– ఏఎఫ్‌యూ