రగిలింది విప్లవాగ్ని ఈరోజే! | Hundred years of Alluri Sitarama Raju revolution | Sakshi
Sakshi News home page

రగిలింది విప్లవాగ్ని ఈరోజే!

Published Mon, Aug 22 2022 12:46 AM | Last Updated on Mon, Aug 22 2022 12:36 PM

Hundred years of Alluri Sitarama Raju revolution - Sakshi

భారత స్వాతంత్య్ర ఉద్యమానికి అతివాద, మితవాద, విప్లవ వాద మార్గాలను ఎన్నుకున్న అనేకమంది దేశ భక్తులు తమ జీవితాలను అంకితం చేశారు. ఈ ఉద్యమ స్రవంతుల్లో ఆయుధం పట్టి బ్రిటిష్‌వాళ్ల భరతం పట్టాలన్న వర్గానికి చెందినవారు అల్లూరి సీతారామరాజు. అమాయక గిరిజనుల బాధలను దగ్గర నుంచి గమనించి, విజ్ఞాపనల ద్వారా వారి సమస్యలు పరిష్కారం కావని గ్రహించారు. అందుకే మన్యం ప్రాంతంలో అద్భుతమైన గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. అల్లూరి సీతారామరాజు చేసిన ఈ సంచలన యుద్ధానికి నేటితో నూరు వసంతాలు.

అడవి నుంచీ, పూర్వీకుల నుంచీ వచ్చిన స్వేచ్ఛా జీవనానికి సంకెళ్లు వేయాలని చూసిన చట్టాలకు ప్రతిఘటనలే గిరిజనోద్యమాలు. దేశం నలుమూలలా జరిగిన అలాంటి ఉద్యమాలలో 1922–24 నడుమ విశాఖ మన్యంలో అల్లూరి సీతారామరాజు (శ్రీరామరాజు) నిర్వహించిన పోరాటం ప్రత్యేకమైనది. అవన్నీ కొండా కోనా మీద హక్కు కోసం కొన్ని తరాల ఆదివాసీలు పడిన తపన, వేదనలే. స్థానిక సమస్యల మీద తలెత్తినట్టు కనిపించినా నిజానికి అవి ప్రభుత్వాల మీద యుద్ధాలే. విశాఖ మన్య పోరాటంలో మైదాన ప్రాంత రాజకీయ స్పృహ, సైద్ధాంతిక ఛాయ ఉన్నాయి. 

శ్రీరామరాజు ఉద్యమకారునిగా అవతరించడం ఒక చారిత్రక నేపథ్యంలో జరిగింది. మొదటి ప్రపంచయుద్ధం, గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం పిలుపు, ఉపసంహరణ; ఉత్తర భారత యాత్ర ఆ నేపథ్యాన్ని ఇచ్చాయి. తన కుటుంబం తునిలో ఉన్నప్పుడే 1915లో ఉద్యోగాణ్వేషణ పేరుతో  రామరాజు ఉత్తర భారతదేశం వెళ్లారు. ఆ యాత్రలోనే రామరాజు కలకత్తా వెళ్లి ప్రముఖ జాతీయ ఉద్యమ నేత సురేంద్రనాథ్‌ బెనర్జీని కలుసుకున్నారు. ఆ తరువాత అల్లూరి తూర్పు కనుమలలోని కృష్ణ్ణదేవిపేటకు 1917 జూలై 24న ఒక ఆధ్యాత్మికవేత్తగా చేరుకున్నారు. ఈ ఊరే ఆయన కార్యక్షేత్రమయింది. ఇక ఆయన ఆయుధం పట్టి, ఉద్యమం ప్రారంభించడానికి చాలా కారణాలు ఉన్నాయి.

1920లో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమానికి పిలుపూ, ‘ఒక్క ఏడాదిలోనే స్వాతంత్య్రం’ అన్న నినాదమూ ఇచ్చారు. రాళ్లపల్లి కాశన్న, నర్సీపట్నం ప్రాంత కాంగ్రెస్‌ కార్యకర్తలు కృష్ణదేవిపేటలోనూ సహాయ నిరాకరణోద్యమ ప్రచారం చేశారు. 1921లో రామరాజు కాలినడకన నాసికాత్రయంబకం వెళ్లారు. అక్కడ ‘అభినవ్‌ భారత్‌’ విప్లవ సంస్థ ప్రభావం ఆయనపై గాఢంగా పడింది. అప్పటికే రామరాజు మన్యవాసులలో కొన్ని సంస్కరణలు తెచ్చారు. గాంధీజీ కార్యక్రమమంతటిలోను మద్యపాన నిషేధం, కోర్టుల బహి ష్కారం... ఈ రెండూ ఆయనకు నచ్చాయి. ఇవే రామరాజు ‘సహాయ నిరాకరణ వాది’ అన్న అనుమానం కలిగించాయి.  

మొదటి ప్రపంచ యుద్ధం ఆగిన తర్వాత కరవు విజృంభించ డంతో మద్రాస్‌ ప్రెసిడెన్సీలో ఆకలి దాడులు జరిగాయి. ప్రభుత్వం ఉపాధి కల్పన ఆరంభించింది. మన్యంలో రోడ్ల నిర్మాణం అందులో ఒకటి.  ఆసియా చరిత్రలోనే ఈ రోడ్ల నిర్మాణం ఓ అమానుష ఘట్టం. ఇందుకు బాధ్యుడు గూడెం డిప్యూటీ తహసీల్దార్‌ అల్ఫ్‌ బాస్టియన్‌. నిజానికి 1882 చట్టంతో అడవిలో ప్రవేశం కోల్పోయిన ఆదివాసీలు కూలీలుగా మారిపోయారు. పెద్దవలస మాజీ ముఠాదారు కంకిపాటి బాలయ్యపడాలు (ఎండు పడాలు), బట్టిపనుకుల మునసబు గాం గంతన్న దొర, అతని తమ్ముడు గాం మల్లు దొర, గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు వంటివారు 1922 జనవరిలో రాజు దగ్గరికి వచ్చి గోడు వినిపించుకున్నారు.

బాస్టియన్‌ మీద పై అధికారులకు శ్రీరామరాజు ఫిర్యాదు రాశారు. రామరాజు మన్యంలో సహాయ నిరాకరణ ఆరంభించాడన్న ఆరోపణకు ఈ ఫిర్యాదు దోహదం చేసింది. రామరాజును ఆ ఫిబ్రవరి 3న నిర్బంధంలోకి తీసుకున్నది కూడా సహాయ నిరాకరణవాది అన్న ఆరోపణతోనే! ఆ ఒకటో తేదీనే సహాయ నిరాకరణను తీవ్రం చేస్తున్నట్టు గాంధీజీ ప్రకటించారు. 5వ తేదీన జరిగిన ‘చౌరీచౌరా’ ఉదంతంతో గాంధీ ఆ పిలుపును ఉపసంహరించుకున్నారు. అహింసాయుతంగా పోరాడే సంస్కారం భారతీయులకు లేదని నింద మోపారు. ఇదే యువతను ఇతర పంథాల వైపు నడిపించింది. అలాంటి వారిలో రామరాజు ఒకరు. 

సంప్రదాయ, ఆధునిక ఆయుధాలతో గెరిల్లా పోరు జరపాలని అనుకున్న రాజు... ఆయుధాల కోసం మన్యంలోని పోలీస్‌ స్టేషన్లను దోచుకోవాలని నిర్ణయించారు. అనుచరులను మూడు దళాలుగా విభజించారు. 1922 ఆగస్ట్‌ 22న పట్టపగలు చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌ మీద 300 మందితో దాడి చేశారు. ఆయుధాలు తీసుకు వెళుతున్నానని ఒక లేఖ రాసి వచ్చారు రాజు. తొలి దాడితోనే మన్య ఉద్యమ తత్త్వం తెలుస్తుంది. కొండదళం ‘వందేమాతరం... మనదే రాజ్యం’, ‘గాంధీజీకి జై’ అంటూ నినదించింది.

ఆగస్టు 23న కృష్ణదేవిపేట పోలీస్‌ స్టేషన్‌ మీద దాడి జరిగింది. ఆగస్ట్‌ 24న రాజవొమ్మంగి స్టేషన్‌ (తూర్పు గోదావరి)ను ఎంచు కున్నారు. లాగరాయి పితూరీని సమర్థించిన నేరానికి అరెస్టయిన మొట్టడం వీరయ్యదొర అప్పుడు ఆ స్టేషన్‌లోనే ఉన్నారు. ఆయనను విడిపించడం కూడా ఈ దాడి ఆశయాలలో ఒకటి. తొలి రెండు దాడులతోనే మద్రాస్‌ ప్రెసిడెన్సీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఏ గ్రాహవ్‌ుకు టెలిగ్రావ్‌ులు వెళ్లాయి. 26 తుపాకులు, వేలాది తూటాలు  కొండదళం చేతికి చిక్కాయి. ఎంత ప్రమాదం! ఏజెన్సీ జిల్లా పోలీసు సూపరిం టెండెంట్‌ సాండర్స్, కలెక్టర్‌ వాయువేగంతో నర్సీపట్నం చేరు కున్నారు. నర్సీపట్నం కేంద్రంగా మన్యం ఖాకీవనమైంది.

అలాంటి వాతావరణంలోనే జైపూర్‌ మహారాజు ఐదు ఏనుగుల మీద పోలీసుల కోసం పంపిన సామగ్రిని సెప్టెంబర్‌ 3న ఒంజేరి ఘాట్‌లో రాజుదళం వశం చేసుకుంది. తరువాత జరిగిన ఘటన మద్రాస్‌ ప్రెసిడెన్సీని మరీ కలవరపెట్టింది. రామరాజు పేరు మొదటిసారి తెలుగునేలంతా వినిపించింది. దామనపల్లి అనే కొండమార్గంలో 1924 సెప్టెంబర్‌ 24న గాలింపు జరుపుతున్న స్కాట్‌ కవర్ట్, నెవెల్లి హైటర్‌ అనే ఒరిస్సా పోలీసు ఉన్నతాధికారులను రాజు దళం చంపింది. వీరిలో హైటర్‌ మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొన్నాడు. తరువాత అడ్డతీగల, చోడవరం, మల్కనగిరి, పాడేరు స్టేషన్‌ల మీద చేసిన దాడులు విఫల మయ్యాయి. బ్రిటిష్‌వాళ్లు ఆయుధాలను ట్రెజరీలకు పంపి జాగ్రత్త పడ్డారు. మన్యం మీద పట్టు బిగించడానికి మద్రాస్‌ ప్రెసిడెన్సీ మరొక అడుగు ముందుకు వేసి, 1922 సెప్టెంబర్‌ 23న మలబార్‌ పోలీసు దళాలను దించింది. కానీ రామవరం అనే చోట ఆ దళమూ వీగిపోయింది.

1922 డిసెంబర్‌ 6న పెద్దగడ్డపాలెం, లింగాపురం అనేచోట్ల రాజుదళం మీద లూయీ ఫిరంగులతో మలబార్‌ దళం యుద్ధానికి దిగింది. ఎనిమిది మంది రాజు అనుచరులు వీరమరణం చెందారు. ఆ డిసెంబర్‌ 23న ఉద్యమకారుల తలలకు ప్రభుత్వం వెలలు ప్రకటించింది. నాలుగు మాసాల అనంతరం 1923 ఏప్రిల్‌ 17న రామరాజు దళం ఆకస్మాత్తుగా అన్నవరం పోలీస్‌ స్టేషన్‌లో ప్రత్యక్షమై మొత్తం యంత్రాంగాన్ని కలవరపరిచింది. ఆ సంవత్సరం డిసెం బర్‌లో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలకు రామరాజు మారువేషంలో హాజరయ్యారు. నడిపేది గిరిజనోద్యమమే అయినా, ఆయన మైదాన ప్రాంత ఉద్యమాన్ని గమనిస్తూనే ఉన్నారు. 

1924 జనవరికి అస్సాం రైఫిల్స్‌ను దించారు. వీరికి మొదటి ప్రపంచ యుద్ధంలో అనుభవం ఉంది. అస్సాం రైఫిల్స్‌ అధిపతే మేజర్‌ గుడాల్‌. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న థామస్‌ జార్జ్‌ రూథర్‌ఫర్డ్‌ను ఆ ఏప్రిల్‌లో మన్యం స్పెషల్‌ కమిషనర్‌గా నియమిం చారు. మే ఐదు లేదా ఆరున ‘రేవుల కంతారం’ దగ్గర పోలీసుల దాడి నుంచి తప్పించుకున్న రాజు ఒక్కడే రాత్రివేళ ‘మంప’ అనే గ్రామం వచ్చి, ఒక చేనులోని మంచె మీద గడిపారు. మే 7వ తేదీ వేకువనే ఓ కుంటలో స్నానం చేస్తుండగా రాజును ఈస్ట్‌కోస్ట్‌ దళానికి చెందిన కంచుమేనన్, ఇంటెలిజెన్స్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆళ్వార్‌నాయుడు అరెస్టు చేశారు. రాజును ఒక నులక మంచానికి కట్టి, కృష్ణదేవిపేటకు పయన మయ్యారు. దారిలోనే ఉంది కొయ్యూరు. అక్కడే  మేజర్‌ గుడాల్‌... రాజుతో మాట్లాడాలని గుడారంలోకి తీసుకువెళ్లాడు. ఒక చెట్టుకు కట్టి కాల్చి చంపాడు. జూన్‌ 7న గాం గంతన్నను కాల్చి చంపారు.

దాదాపు రెండేళ్ల ఉద్యమం, పోలీస్‌ వేధింపులతో మన్యవాసులు భీతిల్లి పోయారు. కొందరు ఉద్యమకారులను స్థానికులే చంపారు. పోలీసు లకు పట్టించారు. సరైన విచారణ లేకుండానే 270 మంది వరకు ఉద్యమకారులకు శిక్షలు విధించింది మిలిటరీ ట్రిబ్యునల్‌. 12 మందిని అండమాన్‌ పంపారు. చివరిగా... దేశం కోసం పోరాడిన ఏ వర్గం త్యాగమైనా విలువైనదే. అవన్నీ నమోదైతేనే స్వరాజ్య సమర చరిత్రకు పరిపూర్ణత. ఉద్యమ నూరేళ్ల సందర్భం ఇచ్చే సందేశం అదే!


డా‘‘ గోపరాజు నారాయణరావు 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ 
(అల్లూరి సీతారామరాజు పోరాటానికి నూరు వసంతాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement