manyam
-
గుమ్మడికి పండగే
గుమ్మడి కాయలతో గిరిజనులకు విడదీయరాని బంధం ఉంది. ఒకప్పుడు వారికి నిత్యవంటకంగా ఉండే గుమ్మడి ఇప్పుడు మంచి ఆదాయ వనరుగా మారింది. సహజసిద్ధంగా కాయడం వల్ల వీటికి మంచి డిమాండ్ ఉంది. వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేసి తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. సంక్రాంతి పండగ నాడు వీటి వినియోగం ఎక్కువకావడంతో మన్యంలోని వారపు సంతల్లో అమ్మకాలు జోరందుకున్నాయి.సాక్షి,పాడేరు: అల్లూరి జిల్లా మన్యంలో గిరిజనులు గుమ్మడిని ప్రత్యేకంగా సాగు చేయరు. ఇంటి పెరట్లో, ఖాళీ స్థలాలు, కొండపోడు భూముల్లో విత్తనాలు చల్లుతారు. పాదుకు 20 నుంచి 30 కాయల వరకు కాస్తాయి. చాలామంది గిరిజనులు గుమ్మడి కాయను నిత్య వంటకానికి ఉపయోగిస్తున్నారు. ఎంతో ఇష్టంగా తినడం వల్ల ఇంటికి వచ్చే అతిథులకు గుమ్మడి కూర వండి పెడుతుంటారు. లేత పిందెలతో కొంతమంది కూర తయారు చేస్తుంటారు. గుమ్మడిలో పోషక విలువలు ఎక్కువ ఉన్నందున వినియోగం పెరిగింది. కొంతమంది గిరిజనులు పిందె దశలో ఒకొక్కటి రూ.20 నుంచి రూ.30కు విక్రయిస్తున్నారు. బాగా పండిన కాయను రూ.50 నుంచి రూ.80కు అమ్ముతున్నారు. ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా ఒకొక్క గిరిజనుడు రూ.2వేల వరకు ఆదాయం పొందుతున్నారు. ఏజెన్సీలో జరుగుతున్న వారపు సంతల్లో గుమ్మడి అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ ప్రాంతం నుంచి నాలుగు రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. మంగళవారం జి.మాడుగుల, బుధవారం కించుమండ, చింతపల్లి, గురువారం గుత్తులపుట్టు, మజ్జిగరువు, శుక్రవారం పాడేరు, అరకు వారపు సంతల్లో గుమ్మడికాయల వ్యాపారం భారీగా జరిగింది. వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేశారు. పుణ్యక్షేత్రాలకు.. తిరుమల తిరుపతి, సింహాచలం, అన్నవరం, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లోని నిత్యాన్నదానంకు మన్యం గుమ్మడికాయలను వినియోగిస్తున్నారు. స్థానికంగా కొనుగోలు చేసి దేవస్థానాలకు సరఫరా చేస్తుంటారు. సేంద్రియ పద్ధతిలో గిరిజనులు సాగు చేయడం వల్ల దేశవాళి గుమ్మడికాయలు మంచి రుచికరంగా ఉంటాయి. అందువల్ల మార్కెట్లలో కూడా మంచి డిమాండ్ ఉంది. పండగ సీజన్లో..: సంక్రాంతి సీజన్లో వినియోగం ఎక్కువగా ఉన్నందున వ్యాపారులు గిరిజనుల వద్ద పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. దీంతో వారు మంచి ధర పొందుతున్నారు. ప్రస్తుతం సీజన్ మొదలవడంతో గిరిజనులు అమ్మకాల్లో నిమగ్నమయ్యా రు. వారపు సంతల్లో వ్యా పారం జోరందుకుంది. గుమ్మడి బంధం సంక్రాంతి పండగతో గుమ్మడి కాయకు సంబంధం ఉంది. మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశికి అధిపతి శని భగవానుడు. ఆ రోజు తెలకపిండి నలుగుతో స్నానం చేసి శనీశ్వరుని ప్రీతి కోసం నువ్వులు, గుమ్మడి కాయలు దానం చేయడం మైదాన ప్రాంతాల్లో పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తోంది. గుమ్మడి పండు భూమండలానికి ప్రతీక. దీనిని పేదలకు, బ్రాహ్మణులకు దానం చేస్తే భూదేవితో పాటు శ్రీమహా విష్ణువు అనుగ్రహం లభిస్తుందని ప్రజల విశ్వసిస్తుంటారు. పోషక విలువలెన్నో.. గుమ్మడికాయను తరచూ తీసుకోవడం వల్ల ఎముకల దృఢత్వానికి కావాల్సిన కాల్షియం పుష్కలంగా అందుతుంది. దీనివల్ల కీళ్లనొప్పులు, మోకాళ్లనొప్పులు, బోలు ఎముకల వ్యాధి వంటి రోగాలు దరి చేరవు. ఫైబర్ జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి దోహదపడుతుంది. కంటి ఆరోగ్యం మెరుగుకు ఉపయోగపడుతుంది. విటమిన్ సి, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నందున రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఉపయోగపడుతుంది. శరీరంలోని చెడు కొలె్రస్టాల్‌ను కరిగించడమే కాకుండా, అధిక బరువును నియంత్రణలోకి తెస్తుందని పోషణ నిపుణులు చెబుతున్నారు.నిత్య వంటకంగిరిజనులంతా గుమ్మడికాయలను ఏడాది పొడవునా దాచుకుంటూ నిత్య వంటకంగా వినియోగిస్తుంటారు.అలాగే ఇంటికి వచ్చే చుట్టాలు, బంధువులకు కూడా వీటి వండి పెడుతారు. సంక్రాంతి, ఇతర పండగల సమయంలోను గుమ్మడికాయలను కోసి గ్రామాల్లో ఒకరికొకరు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ముదిరిన గుమ్మడికాయలు పాడవకుండా ఉండేలే ఇంటి పరిసరాల్లో ఉండే జామ, మామిడి, పనసవంటి చెట్లకు వేలాడిదీసి భద్ర పరుస్తారు. చెట్టుకు కట్టిన గుమ్మడికాయలను దొంగిలించే పరిస్థితి కూడా ఉండదు.రూ.50 ధరకు అమ్మా ఇంటి పరిసరాలతో పాటు కొండపోడులో గుమ్మడి విత్తనాలు చల్లాం. దిగుబడి బాగానే ఉంది. గుమ్మడికాయలను పిందెల సమయంలోనే వంట వండుకుతిన్నాం. బాగా పండిన తరువాత అరకు సంతలో రెండు దఫాలుగా అమ్మాం. ఒకొక్క కాయ రూ.50కు విక్రయించగా రూ.వెయ్యి ఆదాయం వచ్చింది. కొన్ని కాయలను తిండి అవసరాలకు దాచుకున్నాం. – వంతాల చంపా,నందివలస, డుంబ్రిగుడ మండలం గ్రామాల్లోకి వచ్చి కొంటున్నారు గతంలో గుమ్మడికాయలను అమ్మేవారిమి కాదు. వ్యాపారులు గ్రామాలకే వచ్చి గుమ్మడికాయలను కొంటుండడంతో పాదులు ఎక్కు వ వేస్తున్నాం. గుమ్మడికా యలు సాగు చేయడం ద్వారా వచ్చే నగదును తమ అవసరాలకు ఉపయోగించుకుంటాం. గుమ్మడితో తమకు విడదీయరాని బంధం ఉంది. ఆచార సంప్రదాయంలో భాగంగా పండిస్తుంటాం. – కిల్లో కమలమ్మ, జోడిగుడ, హుకుంపేట మండలం పెరుగుతున్న వినియోగం సహజసిద్ధంగా పండుతున్న గుమ్మడి పండ్లను నాలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్లకు మాత్రమే ఎగుమతి చేసేవాళ్లం. ఇప్పుడు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్రాల్లో వినియోగం భాగా పెరిగింది. పోషక విలువలు ఎక్కువగా ఉండటంతో ఆయా రాష్ట్రాల ప్రజలు కూడా వంటకాల్లో వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల మార్కెట్లలో పోటీపడి కొనుగోలు చేస్తున్నాం. – వెంకట అప్పారావు, గుమ్మడి వ్యాపారి, పాడేరు -
YSRCP ఫ్లెక్సీలను చించేసిన దుండగులు
-
తాటి.. ఆదాయంలో మేటి
గ్రామీణ భారతంలో తాటిచెట్టుది ప్రత్యేక స్థానం. పేదవాడి కల్పవృక్షంగా పిలిచే తాటిచెట్టులో ఉపయోగపడని భాగమే ఉండదు. మనదేశంలో తీరప్రాంత రాష్ట్రాల్లో తాటిచెట్లు అత్యధికంగా కనిపిస్తుంటాయి. తమిళనాడులో తాటిచెట్లు అధిక సంఖ్యలో ఉండగా తరువాతి స్థానం ఆంధ్రప్రదేశ్‌దే. తాటిచెట్టు (Palm Tree) ప్రయోజనాలను గుర్తించిన మన పూర్వికులు దాన్ని ఇంటికి పెద్దకొడుకుగా భావించేవారు. పొలం గట్టున పది తాటిచెట్లుంటే ప్రశాంతంగా జీవించొచ్చు అనుకునేవారు. ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లో వీటిపై ఆసక్తి కొంత తగ్గినప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో విరివిగా కనిపించే తాటిచెట్ల నుంచి గిరిజనులకు ఆదాయ మార్గాలను చూపించాలనే లక్ష్యంతో ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రి కల్చర్ రీసెర్చ్ (న్యూఢిల్లీ) ద్వారా అఖిల భారత వన్య పంట పథకంలో భాగంగా పరిశోధనలు చేపట్టారు. ఇందులో భాగంగా చేపట్టిన తొలిదశ పరిశోధనలు ఫలించాయి. భారతదేశంలో (India) 2010 సంవత్సరంలో తాటి చెట్లపై పరిశోధనకు రెండు చోట్ల అనుమతులు ఇచ్చారు. ఒకటి అల్లూరి జిల్లా పందిరిమామిడిలోని డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్, రెండోది తమిళనాడులోని కిలికులం. ఈ రెండు చోట్ల తాటిపై పరిశోధనలు ప్రారంభించారు. తక్కువ సమయంలో కాపునకు వచ్చే రకాలను అభివృద్ధి చేసేందుకు అనేక చోట్ల నుంచి మేలైన తాటి విత్తనాలను సేకరించి అభివృద్ధి పరిచారు. తాటి ఉప ఉత్పత్తులపైనా పరిశోధనలు జరిగాయి. ఇందులో భాగంగా తాటి తేగలతో ఉప ఉత్పత్తులు తయారుచేయడంపై జరిపిన పరిశోధనలు పూర్తయ్యాయి. రెండో దశలో యంత్రాలను ఉపయోగించి వాణిజ్యపరంగా ఉప ఉత్పత్తులు తయారు చేయడంపై పరిశోధనలు ప్రారంభించారు. రెండేళ్ల కిందట తెలంగాణలోని నల్గొండ జిల్లా మల్లేపల్లి, బిహార్‌లోని సబుర్లో ఈ పరిశోధనలు ప్రారంభమయ్యాయి. – రంపచోడవరం(అల్లూరి జిల్లా) లండన్‌కు తేగల పిండి చింతూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆశ స్వచ్ఛంద సంస్థ పందిరిమామిడి (Pandiri Mamidi) హెచ్ఆర్ఎస్ హెడ్.. డాక్టర్ పి.సి. వెంగయ్య సహకారంతో 2019–20 సంవత్సరంలో మూడు టన్నుల తేగల పిండిని లండన్‌కు పంపించింది. తరువాత కోవిడ్ కారణంగా ఈ రవాణాకు బ్రేక్ పడింది. తిరిగి మారోమారు లండన్‌కు తేగల పిండిని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.రెండో దశ వాణిజ్య ప్రయోజనాల కోసం ఇప్పటి వరకు తాటి ఉప ఆహారోత్పత్తులపై పరిశోధనలు జరిగాయి. రెండో దశలో వాణిజ్యపరంగా ప్రయోజనం చేకూర్చేందుకు పరిశోధనలు ప్రారంభమయ్యాయి. తాటి తేగల కోత నుంచి పిండి, రవ్వ తయారీ వంటివాటిని భారీ ఎత్తున యంత్రాలతో చేపట్టడంపై పరిశోధనలు సాగుతున్నాయి. ఆంద్రప్రదేశ్‌లో 3 కోట్ల వరకు తాటి చెట్లు ఉన్నాయి. వీటిలో ఒక్క శాతం ఉపయోగించుకున్నా కోట్ల రూపాయల ఆదాయం పొందవచ్చు. పందిరిమామిడి పరిశోధన స్థానంలో 272 రకాల తాటి చెట్లను అభివృద్ధి చేశాం. – డాక్టర్ పి.సి. వెంగయ్య, అధిపతి, డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్, పందిరిమామిడి తేగలతో 12 రకాల ఆహార పదార్థాలు అల్లూరి జిల్లా పందిరి మామిడి పరిశోధన స్థానంలో తాటి తేగలతో పిండి, నూక(రవ్వ) తయారు చేసి, మైదా స్థానంలో వీటిని వినియోగించి పోషక విలువలతో కూడిన ఆహారపదార్థాలు తయారు చేశారు. వీటితో కేకులు, బిస్కెట్లు, జంతికలు, బ్రెడ్, నూడుల్స్, రవ్వలడ్డు, పిజ్జా బేస్ తదితర పదార్థాలు తయారు చేస్తున్నారు. తాటి పండు టెంకలు నాటిన 135 రోజుల తరువాత తాటి తేగలు కోతకు వస్తాయి. తేగలు 30 నుంచి 55 సెంటీమీటర్ల పొడువు, 70 గ్రాముల వరకు బరువు ఉంటాయి. తాటి తేగలు ముక్కులు శుభ్రం చేసి కడిగి ఒక ట్రేలో అరబెట్టాలి. వీటిని నాలుగు గంటల పాటు డ్రయ్యర్లో ఉంచాలి. తేగల పిండి తయారుచేయడానికి ఎండిన తేగలను మెత్తగా రుబ్బి జల్లెడ పట్టాలి. తరువాత పిండిని నానబెట్టి చేదు రుచి పోగొట్టేందుకు డిస్టల్డ్ వాటర్‌తో విశ్లేషణ చేయాలి. ఈ తేగల పిండిలో ప్రొటీన్ 3.40 శాతం, ఫైబర్ 8.80 శాతం, కాపర్ 0.05 శాతం, జింక్ 0.41 శాతం, ఐరన్ 2.40 శాతం, మెగ్నీషియమ్ 0.05 శాతం ఉంటాయి. బేకరీ ఉత్పత్తుల తయారీలో మైదాకు బదులు తేగల పిండి(ఫ్లోర్) వినియోగించవచ్చు. దీని ద్వారా అధిక పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పొందవచ్చు. పందిరిమామిడి పరిశోధన స్థానంలో తేగల పిండితో బిస్కెట్లు, నూడిల్స్, నూకతో కేక్‌లు తయారు చేశారు. మార్కెట్లో కేజీ తేగల రవ్వ ధర రూ. 170 వరకు ఉంది. పది తాటి చెట్ల ద్వారా ఏడాదిలో రూ. 35 వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. -
దొరా.. ఇళ్లు రెడీ!
కొయ్యూరు: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుతో కలసి తెల్లదొరలపై సాయుధ పోరాటం చేసిన గంటందొర, మల్లుదొర వారసుల సొంతింటి కల అతి త్వరలోనే సాకారం కానుంది. సామాజిక బాధ్యతగా నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ(ఎన్సీసీ) రూ.2 కోట్లతో మల్లుదొర సొంత ఊరు అయిన కొయ్యూరు మండలం నడింపాలెం పంచాయతీలోని లంకవీధిలో నిర్మిస్తున్న ఇళ్లు దాదాపు పూర్తయ్యాయి. నెల రోజుల్లో గంటందొర, మల్లుదొర వారసులు 11 మందికి వాటిని అందజేస్తారు. స్వాతంత్య్ర సమరయోధులు గాం గంటందొర, మల్లుదొర వారసుల కుటుంబాలకు సొంతిళ్లు లేక, గుడిసెల్లో నివసిస్తూ ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ద్వారా క్షత్రియ సేవా సమితి నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ దృష్టికి తీసుకెళ్లింది.సామాజిక బాధ్యతగా సమరయోధుల వారసులకు ఇళ్లు నిర్మించానలి కోరారు. ఈ మేరకు 11 మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఎన్సీసీ ముందుకొచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో అప్పటి అరకు ఎంపీ జి.మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మమ్మ, ఐటీడీఏ పీవో అభిషేక్ గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని సంస్థ నిలబెట్టుకుంది. రూ.2 కోట్లు వెచ్చింది రెండు భవనాలను నిర్మించింది. ఒక్కో భవనంలో ఆరు ఫ్లాట్లు... ఒక్కో భవనంలో ఆరు ఫ్లాట్లను ఎన్సీసీ నిర్మించింది. ఒక్కో ఫ్లాట్‌లో రెండు బెడ్ రూమ్‌లు, అటాచ్డ్ బాత్రూమ్లు, హాలు, వంటగదితో సహా అన్ని వసతులు కల్పించింది.మల్లుదొర , గంటందొర వారసులు 11 మందికి 11 ఫా్లట్లు కేటాయించి, ఒక ఫ్లాట్‌ను ఎన్సీసీ తమ కార్యకలాపాల కోసం వినియోగించుకోనుంది. ఈ నిర్మాణ పనులను క్షత్రియ సేవా సమితి పర్యవేక్షిస్తోంది. ఆనందంగా ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి సరైన గూడు లేక అవస్థలు పడుతున్నాం. ఇప్పటికి మా నిరీక్షణ ఫలించింది. చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి గృహాలు నిర్మించి ఇస్తున్న సంస్థకు కృతజ్ఞతలు. – గాం గంగరాజు, లంకవీధిసొంతిల్లు అదృష్టం ఎట్టకేలకు సొంత గూటికి చేరుతున్నామన్న ఆనందంలో ఉన్నాం. ఇంత అద్భుతంగా ఇళ్లు నిర్మించి ఇస్తారని అనుకోలేదు. రెండు బెడ్ రూమ్‌లతోపాటు హాలు, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్లు నిర్మించడం ఆనందంగా ఉంది. – గాం సన్యాసమ్మ, లంకవీధిసమస్యను పరిష్కరించాం ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని స్వాతంత్య్ర సమరయోధుల పక్కా ఇళ్ల నిర్మాణం మా హయాంలో చేపట్టినందుకు ఆనందంగా ఉంది. నాగార్జున కన్స్ట్రక్షన్స్ సంస్థ బాధ్యత తీసుకుని ఇంత అద్భుతంగా గృహాలను నిర్మించడం మరిచిపోలేని విషయం. లబ్ధిదారులు జీవితకాలం ఆ కంపెనీకి రుణపడి ఉంటారు. – జి.మాధవి, మాజీ ఎంపీ, అరకు -
పార్వతీపురంలో గజ రాజుల బీభత్సం
సాక్షి,మన్యం: పార్వతీపురంలో గజ రాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పార్వతీపురం మండలం నర్సి పురం సమీపంలో ఏనుగుల గుంపు కొబ్బరి తోటల్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. దాదాపు రెండు వందల కొబ్బరి చెట్లను లాగి విసిరేశాయి. పంటపొలాలను ధ్వంసం చేశాయి. గజరాజుల బీభత్సాన్ని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా అడ్డుగా వచ్చిన వాహనాల్ని పక్కకు నెట్టాయి. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల గుంపుతో స్థానికులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మన్యం జిల్లాలో గజరాజుల గుంపు బీభత్సం
-
శ్రీకాకుళం, మన్యం జిల్లాలో ఏనుగులు హల్ చల్
-
మన్యం గజగజ! భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు.. అరకులోయలో 8.6 డిగ్రీలు..
సాక్షి, పాడేరు: చలి తీవ్రతకు మన్యం ప్రాంతం గజగజ వణుకుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పొగమంచు, చలిగాలుల తీవ్రత పెరగడంతోపాటు ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. అరకులోయలోని కేంద్ర కాఫీబోర్డు వద్ద సోమవారం ఉదయం 8.6 డిగ్రీలు, పాడేరుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 9డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 13.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మినుములూరులో ఆదివారం 10 డిగ్రీలు, అరకులోయలో 15.2 డిగ్రీలు, చింతపల్లిలో 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, ఒక్కరోజులోనే మినుములూరు మినహా, అరకులోయ, చింతపల్లి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గి చలిగాలులు పెరిగాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి చలి తీవ్రత పెరగడంతో స్థానికులతోపాటు ఏజెన్సీని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఏజెన్సీ అంతటా పొగమంచు దట్టంగా కురుస్తోంది. సోమవారం ఉదయం 10గంటల వరకు అరకులోయ, పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, చింతపల్లి ప్రాంతాల్లో పొగమంచు కురిసింది. పది గంటల తర్వాతే సూర్యుడు కనిపించాడు. పొగమంచు కారణంగా లంబసింగి, పాడేరు, అనంతగిరి, దారకొండ, రంపుల, మోతుగూడెం, మారేడుమిల్లి ఘాట్‌రోడ్లలో వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
మన్యంలో చలి విజృంభణ
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా చలి గాలులు అధికమయ్యాయి. ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకులోయలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. బుధవారం అరకులోయ కేంద్ర కాఫీ బోర్డు వద్ద 9.8 డిగ్రీలు నెలకొనగా గురువారం ఉదయం 6.8 డిగ్రీలకు పడిపోవడంతో చలి అధికమైంది. ఒక్కరోజు వ్యవధిలోనే 3 డిగ్రీలు ఉష్ణోగ్రత తగ్గడంతో అరకు ప్రాంత వాసులు చలితో ఇబ్బందులు పడుతున్నారు. పొగ మంచు దట్టంగా కురవడంతో పాటు చలి పెరగడంతో స్థానికులు, పర్యాటకులు అవస్థలు పడ్డారు. ఉదయం 10 గంటల వరకు మంచు కమ్ముకుంది. అలాగే పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 10 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 10.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో కూడా పొగ మంచు దట్టంగానే కురిసింది. -
మన్యం గజగజ
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు): ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలిపులితో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. మంగళవారంతో పోల్చుకుంటే బుధవారం మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 13 డిగ్రీల నుంచి 8.2 డిగ్రీలకు, పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డులో 12 డిగ్రీల నుంచి 9 డిగ్రీలకు, అరకులోయ కేంద్ర కాఫీబోర్డులో 12.7 డిగ్రీల నుంచి 9.7 డిగ్రీలకు పడిపోయింది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో ఏజెన్సీ గ్రామాల్లో చలిగాలులు అధికమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి చలి తీవ్రతకు ప్రజలు తాళలేకపోయారు. ఒక వైపు బంగాళాఖాతంలో అల్పపీడనంపై వాతావరణ శాఖ ప్రచారం చేసినా మన్యంలో మాత్రం పొగమంచు దట్టంగా కురిసి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం విశేషం. బుధవారం ఉదయం 9.30 గంటల వరకు ఏజెన్సీ వ్యాప్తంగా పొగమంచు దట్టంగా కురిసింది. సూర్యోదయం ఆలస్యమైంది. మన్యంలో వృద్ధులు, చిన్నారులు చలితో అవస్థలు పడుతున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు పొగమంచు, చలితీవ్రతతో వణుకుతున్నారు. మారేడుమిల్లి, రాజవొమ్మంగి, అడ్డతీగల, మోతుగూడెం, చింతూరు ప్రాంతాల్లో కూడా చలితీవ్రత నెలకొంది. ఘాట్ ప్రాంతాల్లో పొగమంచు తీవ్రతతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. అయితే చలిగాలులు విజృంభించినప్పటికీ పర్యాటకుల తాకిడి మన్యానికి ఏమాత్రం తగ్గలేదు. పొగమంచు ప్రకృతి అందాలను తనివితీరా వీక్షిస్తూ మధురానుభూతి పొందుతున్నారు. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 8.2 డిగ్రీలు మినుములూరు కేంద్ర కాఫీబోర్డులో 9.0 డిగ్రీలు అరకులోయ కేంద్ర కాఫీబోర్డులో 9.7 డిగ్రీలు -
రగిలింది విప్లవాగ్ని ఈరోజే!
భారత స్వాతంత్య్ర ఉద్యమానికి అతివాద, మితవాద, విప్లవ వాద మార్గాలను ఎన్నుకున్న అనేకమంది దేశ భక్తులు తమ జీవితాలను అంకితం చేశారు. ఈ ఉద్యమ స్రవంతుల్లో ఆయుధం పట్టి బ్రిటిష్‌వాళ్ల భరతం పట్టాలన్న వర్గానికి చెందినవారు అల్లూరి సీతారామరాజు. అమాయక గిరిజనుల బాధలను దగ్గర నుంచి గమనించి, విజ్ఞాపనల ద్వారా వారి సమస్యలు పరిష్కారం కావని గ్రహించారు. అందుకే మన్యం ప్రాంతంలో అద్భుతమైన గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. అల్లూరి సీతారామరాజు చేసిన ఈ సంచలన యుద్ధానికి నేటితో నూరు వసంతాలు. ► అడవి నుంచీ, పూర్వీకుల నుంచీ వచ్చిన స్వేచ్ఛా జీవనానికి సంకెళ్లు వేయాలని చూసిన చట్టాలకు ప్రతిఘటనలే గిరిజనోద్యమాలు. దేశం నలుమూలలా జరిగిన అలాంటి ఉద్యమాలలో 1922–24 నడుమ విశాఖ మన్యంలో అల్లూరి సీతారామరాజు (శ్రీరామరాజు) నిర్వహించిన పోరాటం ప్రత్యేకమైనది. అవన్నీ కొండా కోనా మీద హక్కు కోసం కొన్ని తరాల ఆదివాసీలు పడిన తపన, వేదనలే. స్థానిక సమస్యల మీద తలెత్తినట్టు కనిపించినా నిజానికి అవి ప్రభుత్వాల మీద యుద్ధాలే. విశాఖ మన్య పోరాటంలో మైదాన ప్రాంత రాజకీయ స్పృహ, సైద్ధాంతిక ఛాయ ఉన్నాయి. ► శ్రీరామరాజు ఉద్యమకారునిగా అవతరించడం ఒక చారిత్రక నేపథ్యంలో జరిగింది. మొదటి ప్రపంచయుద్ధం, గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం పిలుపు, ఉపసంహరణ; ఉత్తర భారత యాత్ర ఆ నేపథ్యాన్ని ఇచ్చాయి. తన కుటుంబం తునిలో ఉన్నప్పుడే 1915లో ఉద్యోగాణ్వేషణ పేరుతో రామరాజు ఉత్తర భారతదేశం వెళ్లారు. ఆ యాత్రలోనే రామరాజు కలకత్తా వెళ్లి ప్రముఖ జాతీయ ఉద్యమ నేత సురేంద్రనాథ్ బెనర్జీని కలుసుకున్నారు. ఆ తరువాత అల్లూరి తూర్పు కనుమలలోని కృష్ణ్ణదేవిపేటకు 1917 జూలై 24న ఒక ఆధ్యాత్మికవేత్తగా చేరుకున్నారు. ఈ ఊరే ఆయన కార్యక్షేత్రమయింది. ఇక ఆయన ఆయుధం పట్టి, ఉద్యమం ప్రారంభించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ► 1920లో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమానికి పిలుపూ, ‘ఒక్క ఏడాదిలోనే స్వాతంత్య్రం’ అన్న నినాదమూ ఇచ్చారు. రాళ్లపల్లి కాశన్న, నర్సీపట్నం ప్రాంత కాంగ్రెస్ కార్యకర్తలు కృష్ణదేవిపేటలోనూ సహాయ నిరాకరణోద్యమ ప్రచారం చేశారు. 1921లో రామరాజు కాలినడకన నాసికాత్రయంబకం వెళ్లారు. అక్కడ ‘అభినవ్ భారత్’ విప్లవ సంస్థ ప్రభావం ఆయనపై గాఢంగా పడింది. అప్పటికే రామరాజు మన్యవాసులలో కొన్ని సంస్కరణలు తెచ్చారు. గాంధీజీ కార్యక్రమమంతటిలోను మద్యపాన నిషేధం, కోర్టుల బహి ష్కారం... ఈ రెండూ ఆయనకు నచ్చాయి. ఇవే రామరాజు ‘సహాయ నిరాకరణ వాది’ అన్న అనుమానం కలిగించాయి. ► మొదటి ప్రపంచ యుద్ధం ఆగిన తర్వాత కరవు విజృంభించ డంతో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆకలి దాడులు జరిగాయి. ప్రభుత్వం ఉపాధి కల్పన ఆరంభించింది. మన్యంలో రోడ్ల నిర్మాణం అందులో ఒకటి. ఆసియా చరిత్రలోనే ఈ రోడ్ల నిర్మాణం ఓ అమానుష ఘట్టం. ఇందుకు బాధ్యుడు గూడెం డిప్యూటీ తహసీల్దార్ అల్ఫ్ బాస్టియన్. నిజానికి 1882 చట్టంతో అడవిలో ప్రవేశం కోల్పోయిన ఆదివాసీలు కూలీలుగా మారిపోయారు. పెద్దవలస మాజీ ముఠాదారు కంకిపాటి బాలయ్యపడాలు (ఎండు పడాలు), బట్టిపనుకుల మునసబు గాం గంతన్న దొర, అతని తమ్ముడు గాం మల్లు దొర, గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు వంటివారు 1922 జనవరిలో రాజు దగ్గరికి వచ్చి గోడు వినిపించుకున్నారు. ► బాస్టియన్ మీద పై అధికారులకు శ్రీరామరాజు ఫిర్యాదు రాశారు. రామరాజు మన్యంలో సహాయ నిరాకరణ ఆరంభించాడన్న ఆరోపణకు ఈ ఫిర్యాదు దోహదం చేసింది. రామరాజును ఆ ఫిబ్రవరి 3న నిర్బంధంలోకి తీసుకున్నది కూడా సహాయ నిరాకరణవాది అన్న ఆరోపణతోనే! ఆ ఒకటో తేదీనే సహాయ నిరాకరణను తీవ్రం చేస్తున్నట్టు గాంధీజీ ప్రకటించారు. 5వ తేదీన జరిగిన ‘చౌరీచౌరా’ ఉదంతంతో గాంధీ ఆ పిలుపును ఉపసంహరించుకున్నారు. అహింసాయుతంగా పోరాడే సంస్కారం భారతీయులకు లేదని నింద మోపారు. ఇదే యువతను ఇతర పంథాల వైపు నడిపించింది. అలాంటి వారిలో రామరాజు ఒకరు. ► సంప్రదాయ, ఆధునిక ఆయుధాలతో గెరిల్లా పోరు జరపాలని అనుకున్న రాజు... ఆయుధాల కోసం మన్యంలోని పోలీస్ స్టేషన్లను దోచుకోవాలని నిర్ణయించారు. అనుచరులను మూడు దళాలుగా విభజించారు. 1922 ఆగస్ట్ 22న పట్టపగలు చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద 300 మందితో దాడి చేశారు. ఆయుధాలు తీసుకు వెళుతున్నానని ఒక లేఖ రాసి వచ్చారు రాజు. తొలి దాడితోనే మన్య ఉద్యమ తత్త్వం తెలుస్తుంది. కొండదళం ‘వందేమాతరం... మనదే రాజ్యం’, ‘గాంధీజీకి జై’ అంటూ నినదించింది. ► ఆగస్టు 23న కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగింది. ఆగస్ట్ 24న రాజవొమ్మంగి స్టేషన్ (తూర్పు గోదావరి)ను ఎంచు కున్నారు. లాగరాయి పితూరీని సమర్థించిన నేరానికి అరెస్టయిన మొట్టడం వీరయ్యదొర అప్పుడు ఆ స్టేషన్లోనే ఉన్నారు. ఆయనను విడిపించడం కూడా ఈ దాడి ఆశయాలలో ఒకటి. తొలి రెండు దాడులతోనే మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రధాన కార్యదర్శి ఆర్ఏ గ్రాహవ్ుకు టెలిగ్రావ్ులు వెళ్లాయి. 26 తుపాకులు, వేలాది తూటాలు కొండదళం చేతికి చిక్కాయి. ఎంత ప్రమాదం! ఏజెన్సీ జిల్లా పోలీసు సూపరిం టెండెంట్ సాండర్స్, కలెక్టర్ వాయువేగంతో నర్సీపట్నం చేరు కున్నారు. నర్సీపట్నం కేంద్రంగా మన్యం ఖాకీవనమైంది. ► అలాంటి వాతావరణంలోనే జైపూర్ మహారాజు ఐదు ఏనుగుల మీద పోలీసుల కోసం పంపిన సామగ్రిని సెప్టెంబర్ 3న ఒంజేరి ఘాట్‌లో రాజుదళం వశం చేసుకుంది. తరువాత జరిగిన ఘటన మద్రాస్ ప్రెసిడెన్సీని మరీ కలవరపెట్టింది. రామరాజు పేరు మొదటిసారి తెలుగునేలంతా వినిపించింది. దామనపల్లి అనే కొండమార్గంలో 1924 సెప్టెంబర్ 24న గాలింపు జరుపుతున్న స్కాట్ కవర్ట్, నెవెల్లి హైటర్ అనే ఒరిస్సా పోలీసు ఉన్నతాధికారులను రాజు దళం చంపింది. వీరిలో హైటర్ మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొన్నాడు. తరువాత అడ్డతీగల, చోడవరం, మల్కనగిరి, పాడేరు స్టేషన్ల మీద చేసిన దాడులు విఫల మయ్యాయి. బ్రిటిష్‌వాళ్లు ఆయుధాలను ట్రెజరీలకు పంపి జాగ్రత్త పడ్డారు. మన్యం మీద పట్టు బిగించడానికి మద్రాస్ ప్రెసిడెన్సీ మరొక అడుగు ముందుకు వేసి, 1922 సెప్టెంబర్ 23న మలబార్ పోలీసు దళాలను దించింది. కానీ రామవరం అనే చోట ఆ దళమూ వీగిపోయింది. ► 1922 డిసెంబర్ 6న పెద్దగడ్డపాలెం, లింగాపురం అనేచోట్ల రాజుదళం మీద లూయీ ఫిరంగులతో మలబార్ దళం యుద్ధానికి దిగింది. ఎనిమిది మంది రాజు అనుచరులు వీరమరణం చెందారు. ఆ డిసెంబర్ 23న ఉద్యమకారుల తలలకు ప్రభుత్వం వెలలు ప్రకటించింది. నాలుగు మాసాల అనంతరం 1923 ఏప్రిల్ 17న రామరాజు దళం ఆకస్మాత్తుగా అన్నవరం పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమై మొత్తం యంత్రాంగాన్ని కలవరపరిచింది. ఆ సంవత్సరం డిసెం బర్లో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు రామరాజు మారువేషంలో హాజరయ్యారు. నడిపేది గిరిజనోద్యమమే అయినా, ఆయన మైదాన ప్రాంత ఉద్యమాన్ని గమనిస్తూనే ఉన్నారు. ► 1924 జనవరికి అస్సాం రైఫిల్స్‌ను దించారు. వీరికి మొదటి ప్రపంచ యుద్ధంలో అనుభవం ఉంది. అస్సాం రైఫిల్స్ అధిపతే మేజర్ గుడాల్. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న థామస్ జార్జ్ రూథర్‌ఫర్డ్‌ను ఆ ఏప్రిల్‌లో మన్యం స్పెషల్ కమిషనర్‌గా నియమిం చారు. మే ఐదు లేదా ఆరున ‘రేవుల కంతారం’ దగ్గర పోలీసుల దాడి నుంచి తప్పించుకున్న రాజు ఒక్కడే రాత్రివేళ ‘మంప’ అనే గ్రామం వచ్చి, ఒక చేనులోని మంచె మీద గడిపారు. మే 7వ తేదీ వేకువనే ఓ కుంటలో స్నానం చేస్తుండగా రాజును ఈస్ట్‌కోస్ట్ దళానికి చెందిన కంచుమేనన్, ఇంటెలిజెన్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఆళ్వార్‌నాయుడు అరెస్టు చేశారు. రాజును ఒక నులక మంచానికి కట్టి, కృష్ణదేవిపేటకు పయన మయ్యారు. దారిలోనే ఉంది కొయ్యూరు. అక్కడే మేజర్ గుడాల్... రాజుతో మాట్లాడాలని గుడారంలోకి తీసుకువెళ్లాడు. ఒక చెట్టుకు కట్టి కాల్చి చంపాడు. జూన్ 7న గాం గంతన్నను కాల్చి చంపారు. ► దాదాపు రెండేళ్ల ఉద్యమం, పోలీస్ వేధింపులతో మన్యవాసులు భీతిల్లి పోయారు. కొందరు ఉద్యమకారులను స్థానికులే చంపారు. పోలీసు లకు పట్టించారు. సరైన విచారణ లేకుండానే 270 మంది వరకు ఉద్యమకారులకు శిక్షలు విధించింది మిలిటరీ ట్రిబ్యునల్. 12 మందిని అండమాన్ పంపారు. చివరిగా... దేశం కోసం పోరాడిన ఏ వర్గం త్యాగమైనా విలువైనదే. అవన్నీ నమోదైతేనే స్వరాజ్య సమర చరిత్రకు పరిపూర్ణత. ఉద్యమ నూరేళ్ల సందర్భం ఇచ్చే సందేశం అదే! డా‘‘ గోపరాజు నారాయణరావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (అల్లూరి సీతారామరాజు పోరాటానికి నూరు వసంతాలు) -
Mamidi Tandra: ఎంత తిన్నా.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..
ముంచంగిపుట్టు(అరకులోయ)అల్లూరి సీతారామరాజు జిల్లా: ఒక్కసారి కొరికితే.. నోటినిండా తియ్యటి తేనెలూరుతుంది. ఎంత తిన్నా జిహ్వ చాపల్యం తీరక.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజనులు తయారుచేసే మామిడి తాండ్ర రుచి అలాంటిది మరి. వేసవి వచ్చిందంటే చాలు. మన్యంలో మామిడి తాండ్ర హడావుడి మొదలవుతుంది. ఇక్కడ తయారయ్యే తాండ్ర రుచులు మైదాన ప్రాంత ప్రజల మనసునూ దోచుకుంటున్నాయి. కొండ, అటవీ ప్రాంతాల్లో లభించే మామిడి పండ్లతో తయారు చేసే తాండ్ర.. చాలా రుచిగా ఉంటుంది. గిరిజన మహిళలు తయారు చేసే ఈ తాండ్రకు మన్యంతో పాటు మైదానంలో మంచి గిరాకీ ఉంది. చదవండి: హమ్మ తొండా.. ఎంత పనిచేశావే! ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా గ్రామాల్లోని చాపలు, ప్లేట్లలో మామిడి తాండ్ర తయారు చేసే పనిలో గిరిజన మహిళలు బిజీగా ఉన్నారు. వారపు సంతలో కిలో తాండ్ర రూ.100 వరకు పలుకుతున్నా.. ఎంతో రుచిగా ఉండడంతో కొనుగోలుదారులు ధరను లెక్క చేయడం లేదు. మామిడి పండ్ల సీజన్ అయిపోయిన తర్వాత కూడా తాండ్రను భద్ర పరుచుకుని తినే అవకాశం ఉండడంతో కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్ తగ్గట్టుగా మన్యం మహిళలు తాండ్రను తయారు చేస్తున్నారు. తాండ్రను తయారు చేస్తున్న గిరిజన మహిళ సహజసిద్ధంగా తయారీ గిరిజన గ్రామాలకు అనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో మామిడి చెట్లకు కాసే కొండ మామిడి పండ్లను ఇంటిల్లిపాదీ సేకరిస్తారు. వాటిని శుభ్రపరిచి పెద్ద డబ్బాలు, బిందెలలో వేసి రోకలితో దంచుతారు. మామిడి రసాన్ని చాటలు, ప్లేట్లు, చాపలపై పలుచగా ఆరబెడతారు. వీటిలో ఎటువంటి రసాయనాలు కలపకుండానే పొరలు, పొరలుగా వేస్తారు. వారం, పది రోజుల పాటు ఆరబెట్టి.. తర్వాత తాండ్రగా ప్యాక్ చేస్తారు. తాండ్ర తయారీకి కొండ మామిడి పండ్లను సేకరిస్తున్న చిన్నారులు తొక్కతో పచ్చడి మామిడి పండ్ల నుంచి వచ్చిన రసాన్ని తాండ్రగా తయారు చేస్తుండగా.. మిగిలిన మామిడి తొక్కలు, టెంకలను వేరు చేస్తారు. తొక్కలను కొందరు కారంతో, మరికొందరు బెల్లంతో కలిసి ఎండ బెడతారు. బాగా ఎండిన తర్వాత వీటిని డబ్బాల్లో నిల్వ చేసుకుంటారు. ఏడాది పొడవునా గంజి అన్నంతో పచ్చడి మాదిరిగా వినియోగిస్తారు. కొన్ని గ్రామాల్లో మామిడి టెంకలను ఎండబెట్టి పిండిగా చేస్తారు. దీన్ని ఉడగబెట్టి అంబలిగా చేసుకుని ఆరగిస్తారు. మామిడి టెంకలతో కూరను కూడా తయారు చేస్తారు. ఈ కూరను లొట్టలేసుకుని మరీ తింటారు. వారపు సంతల్లో విక్రయాలు మన్యంలో గిరిజనులు తయారు చేసే తాండ్రకు మంచి డిమాండ్ ఉంది. మైదాన ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కిలో రూ.100 నుంచి రూ.120 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఎటువంటి రసాయనాలు కలపకుండా తయారు చేయడంతో ఇక్కడ తయారైన తాండ్రపై వ్యాపారులు మక్కువ చూపిస్తున్నారు. తాండ్రను ముక్కలుగా చేసి.. ముక్క రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. వారపు సంతల్లో విక్రయాలు మన్యంలో గిరిజనులు తయారు చేసే తాండ్రకు మంచి డిమాండ్ ఉంది. మైదాన ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కిలో రూ.100 నుంచి రూ.120 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఎటువంటి రసాయనాలు కలపకుండా తయారు చేయడంతో ఇక్కడ తయారైన తాండ్రపై వ్యాపారులు మక్కువ చూపిస్తున్నారు. తాండ్రను ముక్కలుగా చేసి.. ముక్క రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. డిమాండ్ తగ్గట్టుగా ఉత్పత్తి ఏటా మామిడితో ఆదాయం సంపాదిస్తున్నాం. మొదట్లో మామిడి తాండ్రను ఇంట్లో వాడకం కోసం మాత్రమే తయారు చేసుకునేవాళ్లం. వారపు సంతల్లో తాండ్రకు డిమాండ్ పెరగడంతో ఉత్పత్తి పెంచాం. కొంత మంది వ్యాపారులు ఇంటికి వచ్చి మరీ తాండ్రను కొనుగోలు చేస్తున్నారు. సహజసిద్ధంగా తయారుచేయడం వల్ల రుచిగా ఉంటుంది. ఈ సీజన్లో ఆదాయం బాగుంటుంది. –రాధమ్మ, సుజనకోట, ముంచంగిపుట్టు మండలం -
శీకాయతో సిరులు
మన్యంలో అటవీ ఉత్పత్తులకు మంచి ధర లభించే రోజులు వచ్చాయి. వీటిలో ప్రధానంగా గిరిజనులు సేకరిస్తున్న శీకాయను విదేశాల్లో మార్కెటింగ్ చేసేందుకు గిరిజన సహకార సంస్థ కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే ఏటా శీకాయ విక్రయం ద్వారా సుమారు రూ.50 లక్షల మేర వ్యాపారం చేస్తున్న జీసీసీ.. తలపెట్టిన విదేశీ మార్కెటింగ్ కార్యరూపం దాల్చితే అధిక ఆదాయం ఆర్జించడమే కాకుండా గిరిజనులకు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. రంపచోడవరం: మన్యంలో గిరిజనులు సేకరిస్తున్న శీకాయ కాసులు కురిపించనుంది. అడవుల్లో పెరిగే ఈ మొక్కలకు గిరిజనుల ఎటువంటి పురుగు మందులు, ఎరువులు వినియోగించరు. సహజసిద్ధంగా పెరగడం వల్ల శీకాయకు సేంద్రియ ఉత్పత్తిగా మంచి డిమాండ్ ఉంది. దీనికి విదేశాల్లో మంచి మార్కెటింగ్ ఉన్నందున ఈ దిశగా గిరిజన సహకార సంస్థ కసరత్తు మొదలు పెట్టింది. గిరిజనులు సేకరించే శీకాయ సేంద్రియ ఉత్పత్తిగా ధ్రువీకరించేందుకు బెంగళూరు ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ (ఐఎంవో) బృందం ఈ నెల మారేడుమిల్లి రానుంది. బృందం సభ్యులు ధ్రువీకరణతో.. ఏజెన్సీలో మారేడుమిల్లి, వై.రామవరం, రంపచోడవరం, రాజవొమ్మంగి, నెల్లిపాక అటవీ ప్రాంతాల్లో గిరిజనులు శీకాయను సేకరిస్తుంటారు. మారేడుమిల్లి రానున్న ఐఎంవో బృందం సభ్యులు మండలంలో శీకాయ విరివిగా లభించే బొడ్లంక, పాతకోట ప్రాంతాలను ఈనెల 20న సందర్శిస్తారు. గిరిజనులు సేకరిస్తున్న శీకాయను పరిశీలిస్తారు. ఎటువంటి పురుగు మందులు, ఎరువులు వినియోగించలేనట్టుగా నిర్థారణ అయిన వెంటనే ధ్రువపత్రం జారీ చేస్తారు. దీని ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన వెంచూరియా కంపెనీ ద్వారా శీకాయను ప్రోసెసెంగ్ చేసి విదేశాలకు మార్కెటింగ్ ప్రారంభిస్తామని జీసీసీ అధికారవర్గాలు తెలిపాయి. రెట్టింపు ధరకు అవకాశం ప్రస్తుతం గిరిజనులు సేకరిస్తున్న శీకాయకు గిరిజన సహకార సంస్థ కిలోకు రూ. 55 చెల్లిస్తోంది. సేంద్రియ శీకాయగా ధ్రువీకరణ అనంతరం గిరిజనులకు జీసీసీ రెట్టింపు ధర చెల్లించే అవకాశం ఉంది. శీకాయను విదేశాలకు మార్కెట్ చేయడం ద్వారా సేకరించిన గిరిజనులకు 35 శాతం, మార్కెటింగ్ చేయడం వల్ల 15 శాతం లాభాలు వస్తాయని జీసీసీ అంచనా వేస్తోంది. ఏటా వంద టన్నుల సేకరణ.. ఏటా గిరిజన సహకార సంస్థ ఏజెన్సీలో గిరిజనుల నుంచి 100 టన్నుల శీకాకాయను సేకరిస్తోంది. ఐఎంవో గుర్తింపు తరువాత విదేశాల్లో మార్కెటింగ్ చేసేందుకు ఆర్గానిక్ శీకాయను గింజలు తొలగించి ఫౌడర్‌గా తయారు చేయాల్సి ఉంటుంది. కుంకుడుకు పెరిగిన ధర గిరిజనులు సేకరించే కుంకుడు ధరను పెంచుతూ గిరిజన సహకార సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కిలోకు రూ. 35 చెల్లిస్తే ఇక నుంచి రూ. 45 చెల్లించనున్నట్టు ప్రకటించింది. జీసీసీ రిటైల్ మార్కెట్లో కుంకుడు కాయ పౌడర్, షాంపులకు మంచి డిమాండ్ ఉంది. దీంతో ఏటా 150 టన్నుల వరకు కుంకుడు కాయలను గిరిజనుల నుంచి జీసీసీ సేకరిస్తోంది. పచోడవరంలోనే జీసీసీ ఆధ్వర్యంలో కుంకుడు కాయ పౌడరు తయారు చేస్తున్నారు. జీసీసీ సూపర్ మార్కెట్లు, జీసీసీ అవుట్ లెట్ ద్వారా విక్రయిస్తున్నారు. ఇతర అటవీ ఉత్పత్తులకు.. గిరిజనులు సేకరించే కోవెల జిగురు మొదటి రకం కేజీకి రూ. 200 చొప్పున గిరిజన సహకార సంస్థ చెల్లిస్తోంది. ఉసిరిపప్పునకు కేజీకి రూ. 60, పిక్కతీసిన చింతపండుకు రూ. 63, తేనెకు రూ. 170, కొండచీపుర్లు కట్టకు రూ.55 చొప్పున చెల్లిస్తోంది. గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఈ ఏడాది శీకాయను విదేశాలకు మార్కెట్ చేయడం ద్వారా గిరిజనులకు అధిక రేట్లు లభిస్తాయి. అగ్రిమెంట్ దశలో ఉంది. త్వరలో పూర్తవుతుంది. ప్రస్తుతం కోల్డ్ స్టోరేజీలో వంద టన్నుల వరకు ఉంది. పిక్క తీయని చింతపండును కొనుగోలు చేయడం వల్ల మార్కెటింగ్ ఇబ్బందిగా ఉంది. –జె.యూస్టస్, జీసీసీ డీఎం, రంపచోడవరం -
ఏపీలో అదిరిపోయే టూరిస్ట్ స్పాట్స్.. ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు..
రంపచోడవరం(తూర్పుగోదావరి): మనసు దోచే ప్రకృతి అందాలు.. పరవళ్లుతొక్కే నది సోయగాలు.. ఎటూ చూసినా పచ్చని అడవులు.. ఎత్తైన కొండలు, గుట్టలు.. రారమ్మని పిలిచే చిరుగాలులు.. మధురానుభూతి కలిగించే పడవ ప్రయాణం. ఇలాంటి అందమైన లొకేషన్‌కు వెళ్లాలంటే ఏ గోవానో, ఏ మాల్దీవులకో వెళ్లాల్సిన అవసరం లేదు. రంపచోడవరం వెళితే.. ఈ అనుభూతులన్నీ ఆస్వాదించవచ్చు. అలుపెరగకుండా ప్రయాణం సాగిస్తున్న గోదావరికి ఇరువైపులా ఉన్న పాపికొండల అందాలు అదరహో అనిపిస్తాయి. నది తీరంలో దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తాయి. మారేడుమిల్లి మండలంలోని జలపాతాల సోయగాలు ఎంత సేపు చూసినా.. తనివితీరవు. తూర్పు కనుమల్లోని పచ్చని గడ్డి కొండల్లో (గ్రాస్ ల్యాండ్) గుడిసె ప్రాంతం ఇక్కడ మరో ఆకర్షణ. ఇలా కనుచూపు మేర ప్రకృతి రమణీయ దృశ్యాలు మరెన్నో ఉన్నాయి. వీటిని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు తరలివస్తారు. రాత్రి సమయాల్లో ఇక్కడే బస చేసి.. ప్రకృతి ఒడిలో సేదతీరుతుంటారు. పాపికొండలు మధ్య బోట్లో ప్రయాణం.. పురాతన ఆలయం రంప శివాలయం రెడ్డిరాజుల కాలం నాటి పురాతన శివాలయం రంపలో ఉంది. రంపచోడవరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. రాతితో ఆలయాన్ని నిర్మించారు. ఆలయానికి అనుకుని ఉన్న కొండపై రంప జలపాతం ఉంది. ఏడాది పొడవున జలపాతం ప్రహిస్తునే ఉంటుంది. రంపచోడవరంలో పర్యాటకులు బస చేసేందుకు పర్యాటక శాఖకు చెందిన అతిథి గృహాలు ఉన్నాయి. మారేడుమిల్లి సమీపంలో జలతరంగణి పొల్లూరు జలపాతం ప్రకృతి గుడి..సందడి మారేడుమిల్లి మండలానికి ఓ ప్రత్యేకత ఉంది. రాజమండ్రికి 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం విలక్షణమైన గిరిజన జీవనశైలి, విభిన్నమైన ప్రకృతి అందాలకు నిలయం. సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండడంతో ఈ ప్రాంతం ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. వివిధ రకాల పంటలకు అనుకూలమైన ప్రాంతం ఇది. పుల్లంగి పంచాయతీలో గుడిసె ప్రాంతం ఉంది. మారేడుమిల్లికి 40 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది. ఆకాశాన్ని హత్తుకునేలా ఎత్తైన కొండలు.. పచ్చని గడ్డితో విశాలంగా ఉంటాయి. సూర్యోదయం వేళ గుడిసె అందాలు తిలకించేందుకు పర్యాటకులు రాత్రికే అక్కడకు చేరుకుని గుడారాల్లో బస చేస్తారు. ఎత్తైన కొండలను తాకుతూ వెళ్లే మబ్బులు పర్యాటకులను అబ్బురపరుస్తాయి. గుడిసె ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు వేలాది తరలివస్తున్నారు. కొంత మంది మారేడుమిల్లిలో బస చేసి తెల్లవారుజామున గుడిసెకు వాహనాల్లో చేరుకుంటారు. మారేడుమిల్లిలో పర్యాటశాఖకు చెందిన త్రీస్టార్ వసతులతో ఉడ్ రిసార్ట్స్, ఎకో టూరిజం ఆధ్వర్యంలో అతిథి గృహాలు పర్యాటకులకు వసతి కల్పిస్తున్నాయి. ఇక్కడ సుమారు 300 వరకు అతిథి గృహాలు ఉన్నాయి. మారేడుమిల్లి నుంచి భద్రాచలం వైపు ఘాట్‌రోడ్డులో 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. జలతరంగణి జలపాతం, వ్యూ పాయింట్, అమృతధార జలపాతం వస్తాయి. ఇక్కడే పాములేరు వద్ద జంగిల్ స్టార్ ఎకో రిసార్ట్స్ కూడా ఉన్నాయి. చింతూరు నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే పొల్లూరు జలపాతం వస్తుంది. ఇక్కడకు ఏడాది పొడవున పర్యాటకులు వస్తారు. ఎత్తైన కొండల నుంచి జాలువారే నీటిధారలు మైమరిపిస్తాయి. పాములేరు రోప్ బ్రిడ్జి మరపురాని మధుర ప్రయాణం దేవీపట్నం–వీఆర్‌పురం మండలాల మధ్య పాపికొండలు విస్తరించి ఉన్నాయి. పాపికొండలు అందాలు తిలకించేందుకు పర్యాటకులకు రెండు ప్రాంతాల్లో బోట్ పాయింట్లను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. దేవీపట్నం మండలం పోశమ్మ గండి వద్ద ఒకటి, వీఆర్‌పురం మండలం పోచవరం వద్ద మరో బోట్ పాయింట్ ఉంది. ముందుగా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న పర్యాటకులు రాజమహేంద్రవరం నుంచి పోశమ్మ గండికి చేరుకుంటారు. అక్కడ నుంచి బోట్లు పర్యాటకులతో బయలుదేరుతాయి. సుమారు నాలుగు గంటల పాటు బోట్‌పై ప్రయాణం చేసి పాపికొండలకు చేరుకుంటారు. జంగిల్ స్టార్ రిసార్ట్స్ ఎత్తైన కొండల మధ్య గోదావరిపై నుంచి వచ్చే చల్లని గాలులు మధ్య బోట్లో ప్రయాణం పర్యాటకులకు ఆహ్లాదం పంచుతుంది. పోలవరం ప్రాజెక్ట్ కారణంగా ముంపునకు గురైన గిరిజన గ్రామాలను దాటుకుంటూ బోట్లు ముందుకెళ్తాయి. ఈ ప్రయాణంలో పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్‌ను చూడవచ్చు. వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పాపికొండలు అందాలు చూసేందుకు వస్తుంటారు. పోచవరం బోట్ పాయింట్ నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి పర్యాటకులు పాపికొండల విహారయాత్ర చేస్తారు. వీఆర్‌పురం మీదుగా వాహనాల్లో పోచవరం చేరుకుని బోట్లో పాపికొండలకు వెళతారు. కొల్లూరులో రాత్రి బస చేసేందుకు వీలుగా నైట్‌హాల్ట్ హట్స్(వెదురు కుటీరాలు) ఉన్నాయి. -
గంజాయి.. ఇక గతమే
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గతేడాది వరకు గంజాయి పండించిన పొలాలు ఉద్యాన పంటల క్షేత్రాలుగా మా రుతున్నాయి. గిరి శిఖరాల నడుమ మారుమూలన ఉండే ఆ పొలాల్లో ఇప్పుడు విదేశీ కూరగాయలతో పా టు కాఫీ, పసుపు, స్ట్రాబెర్రీ వంటి పంటలు పురుడు పో సుకుంటున్నాయి. గంజాయి సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడమే కాకుండా ఆ పొలాల్లో ఉద్యాన పంటలు పండించేలా గిరిజనులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. గంజాయి సాగును సమూలంగా నిర్మూలించాలని సంకల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయానికి అనుగుణంగా.. లక్ష ఎకరాల్లో ప్రత్యామ్నాయ సాగువైపు అడుగులు పడుతున్నాయి. గిరిజనులకు ప్రోత్సాహకాలందిస్తూ.. వాణిజ్య పంటల సాగుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అప్పటి పాలకులు పట్టించుకోక.. మన్యంలో గిరిజనులు పండించే పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడం, ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్నా అప్పటి పాలకులు సరిగ్గా పట్టించుకోకపోవడం వంటి పరిస్థితుల్లో అక్కడి గిరిజన రైతుల్లో కొం దరు గంజాయి సాగువైపు ఆకర్షితులయ్యారు. అలా విశాఖ మన్యంలో గంజాయి సాగు సుమారు 10 వేలకు పైగా ఎకరాల్లో విస్తరించింది. ఎట్టిపరిస్థితుల్లో గంజా యి సాగుపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాలతో యంత్రాంగం రంగంలోకి దిగింది. ఫలితంగా గతేడాది వరకు సగటున 10 వేల ఎకరాల్లో సాగయ్యే గంజాయి పంట రెండేళ్లలో 7 వేల ఎకరాలకు పడిపోయింది. పోలీసులు, సెబ్, ఐటీడీఏ, సచివాలయ సిబ్బంది డ్రోన్ల సహాయంతో గంజాయి సాగును గుర్తించి.. ఆ భూముల్లో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించకపోతే తిరిగి గంజాయి వైపు గిరి జనులు మొగ్గుచూపే ప్రమాదం ఉండటంతో మూడేళ్లలో లక్షకు పైగా ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సా గు చేపటేఊ్టలా ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా 62 వేల మంది గిరిజనులకు 98 వేల ఎకరాలను ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల ద్వారా అందించి ఆ భూములపై వారికి యాజమాన్య హక్కులు కల్పిం చింది. వీటితో పాటు గంజాయి సాగైన 7 వేల ఎకరాల్లో వాణిజ్య పంటలను సాగు చేయిస్తోంది. శిక్షణ ఇచ్చి మరీ.. వాణిజ్య పంటలపై గిరిజనులకు అవగాహన కల్పించడంతో పాటు సాగు రీతులు, సస్యరక్షణపై పూర్తి స్థాయిలో శిక్షణ అందించేలా ప్రభుత్వం చేర్యలు చేపట్టింది. ముఖ్యంగా వేరుశనగ, రాజ్మా, రాగులు వంటి పంట లతో పాటు డ్రాగన్ ఫ్రూట్, లిచీ, పైనాపిల్, అవకాడో, స్ట్రాబెర్రీ, అల్లం, నల్ల మిరియాలు, పొద మిరియాలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బంగాళాదుంప, టమోటా, కాకర, బీర, బెండ వంటి ఉద్యాన పంటలను 46,650 ఎకరాల్లో సాగు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటితో పాటు రానున్న రెండేళ్లలో 34 వేల ఎకరాల్లో కాఫీ గింజల సాగుకు సన్నద్ధం చేయాలని అధికారులు భావి స్తున్నారు. మరో 5 వేల ఎకరాల్లో రూ.100 కోట్లతో పసుపు పండించనున్నారు. గిరిజనుల ఆర్థికాభివృద్ధికి రూ.144 కోట్లు ప్రతి గిరిజనుడు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా మూడేళ్లకు అభివృద్ధి ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ఇందుకోసం రూ.144 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. స్వచ్ఛందంగా సాగు వైపు.. ప్రభుత్వం చేపడుతున్న చైతన్య కార్యక్రమాలు, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంతో గిరిజనులు ఈ ఏడాది స్వచ్ఛందంగా గంజాయి సాగును విడనాడారు. ప్రభుత్వం కేవలం ప్రత్యామ్నాయ పంటలు పండించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసి చేతులు దులిపేసుకోకుండా.. గిరిజన రైతులకు పూర్తిస్థాయి సహకారం అందించాలని నిర్ణయించింది. విత్తనాలు సరఫరా చేయడంతోపాటు పంట చేతికి వచ్చేంత వరకు సహకారం అందిస్తామని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గోపాలకృష్ణ తెలిపారు. జామ్, జ్యూస్‌గా మార్చడం, పల్పింగ్, ఆహార ఉత్పత్తుల తయారీ వంటి పనులు చేపట్టేలా వారిని ప్రోత్సహిస్తామన్నారు. దళారుల చేతిలో మోసపోకుండా.. పంట ఆదాయం చేతికొచ్చేంత వరకూ గిరిజన రైతులకు అండగా నిలుస్తామని చెప్పారు. -
భక్తి విత్తుగా...ఆనందం మొలకెత్తగా
పెదబయలు (అరకులోయ): మన్యంలో ఆదివాసీ గిరిజన గ్రామాల్లో నిర్వహించే పండగలు, పెళ్లిళ్లు, జీవన విధానం, ఆచార సంప్రదాయాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. విశాఖ మన్యంలో ఆదివాసీ గిరిజనులు (పీవీటీజీ) తెగలకు చెందిన వారు పుష్య మాసంలో జరుపుకునే పండగల్లో ముఖ్యమైనది ‘విత్తనాల పండగ’. మిగతా వారికి సంక్రాంతి పండగ ఎంత ముఖ్యమో వీరికి ఈ పండగ అంత ముఖ్యం. తాము పండించిన పంటల్లో చోడి (రాగులు) రాజ్మా, సామలు, ధాన్యం నాలుగు రకాలతో ప్రతి ఇంటి నుంచి కొద్దికొద్దిగా సేకరించి కొంత భాగం శుంకుదేవునికి నైవేద్యంగా సమర్పించి..మరో సగం శంకుదేవుని సన్నిధిలో విత్తనాలు ఉంచి నాలుగు రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. ఈ నాలుగు రోజులూ సందడి వాతావరణం ఉంటుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి నెల 15 తేదీలోపు పండగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 5వ తేదీ శనివారం ప్రతి ఇంటి నుంచి గ్రామ పూజారి, దీసారి, మరో ఏడుగురు గుర్మవ్‌లు కలిసి తొమ్మిది మంది వెదురుతో చేసిన కొత్త బుట్టలో ప్రతి ఇంటి నుంచి రాగులు, సామలు, కందులు, ధాన్యాన్ని నాలుగు రకాలను సేకరించి శంకుదేవుని సన్నిధికి చేర్చి ప్రత్యేక పూజలు చేశారు. రెండో రోజు ఆదివారం శంకుదేవుని వద్దకు డప్పు వాయిద్యాలతో తొమ్మిది మందితో గ్రామంలో అందరూ పూజలు చేశారు. అలాగే గ్రామ పొలిమేరలో పూజలు చేసి అక్కడ నుంచి మట్టి సేకరించి శంకుదేవునికి పెట్టి పూజలు చేశారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి పూజలు ప్రారంభించారు. ప్రతి ఇంటి నుంచి చిన్న వెదురు బుట్టలో బియ్యం పోసి అందులో ప్రమిద పెట్టి దీపం వెలిగించి రెండు చేతులతో దీపం కొండెక్కకుండా శంకుదేవుని వద్ద మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చారు. దీపం మధ్యలో కొండెక్కితే అశుభంగా భావిస్తారు. ప్రతి ఇంటి నుంచి ఇలా వచ్చి సమర్పించిన తరువాత పూజారి, దీసారి, మరో ఏడుగురు గుర్మవ్‌లు పూజలు చేశారు. గిరిజన వాయిద్యాలు మోగగానే గుర్మవ్‌లు శుంకుదేవుని సన్నిధిలో నృత్యం చేశారు. శంకుదేవునికి కోడి..మేక.. పితృదేవతలకు పందిని బలిస్తారు మంగళవారం ఉదయం నుంచి పూజలు చేసిన తరువాత సాయంత్రం శంకుదేవుని కోడి, మేక బలిచ్చారు. పితృదేవతలకు పందిని బలిచ్చారు. జంతువుల రక్తాన్ని విత్తనాల్లో కలిపి, విత్తనాలు కొంత భాగం శంకుదేవుని వద్ద చిన్న గుంత తీసి పెట్టిన తరువాత మరికొంత భాగం విత్తనాలు ఇంటింటా నైవేద్యంగా పంచుతారు. వారు ఈ ఏడాది వేసే పంటల్లో వాడే విత్తనాల్లో కలుపుతారు. తరువాత బలిచ్చిన జంతువులను వండుకుని నైవేద్యంగా గ్రామస్తులు తీసుకుంటారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారికి కూడా భోజనాలు పెడతారు. కన్నె గుర్మవ్‌ల నియామకం గ్రామంలో ఏడుగురు గుర్మవ్‌లు మహిళలే ఉంటారు. వీరు ఎక్కువగా ముసలివారే ఉంటారు. అయితే ప్రతి మూడేళ్లకు ఒకసారి కన్నె గుర్మవ్‌ల నియమిస్తుంటారు. గ్రామంలో పదేళ్లలోపు ఆడపిల్లను తల్లితండ్రుల అనుమతితో ఎంపిక చేస్తారు. బాలిక స్నానం చేసిన అనంతరం నూతన వస్త్రాలు ధరించిన తరువాత బావి నుంచి కన్నె గుర్మవ్ తెచ్చిన నీటిని వినియోగించి శంకుదేవునికి నైవేద్యం వండి, చెట్టుకు బోనం కుండను ఉట్టిలో ఉంచి వేలాడదీస్తారు. నాలుగు రోజుల పాటు జరిగే వేడుకల్లో కన్నె గుర్మవ్ పాల్గొంటుంది. వారు చేసే పూజలను అనుసరిస్తుంది. గ్రామాల్లో దింసా నృత్యం సందడి విత్తనాల పండగ సందర్భంగా గ్రామాల్లో మహిళలు, చిన్నపెద్ద తేడా లేకుండా దింసా నృత్యం చేయడం ఆనవాయితీ. గిరిజన డప్పు వాయిద్యాల నడుమ ఆదివాసీ గ్రామాల్లో సందడి నెలకొంటుంది. పూర్వీకుల ఆచారం ప్రకారం విత్తనాల పండగ పూర్వీకుల ఆచారం ప్రకారం విత్తనాల పండగ నిర్వహిస్తారు. పంటలు బాగా పండాలని, గ్రామంలో పశుసంపద బాగుండాలని, ప్రకృతి దేవతలకు పూజలు చేస్తాం. తాము పండించిన కొత్త పంటను శుంకుదేవుని దగ్గర ఉంచి కోడి, మేక, పందిని బలి ఇచ్చిన తరువాత ఆ రక్తాన్ని విత్తనాల్లో కలిపి శంకుదేవుని వద్దకు చిన్న గుంత తీసి విత్తనాలు వేస్తాం. మిగిలిన సగం విత్తనాలు ఇంటింటికి పంచుతాం. వారు ఈ ఏడాడి పంటకు ఉపయోగించే విత్తనాల్లో వాటిని కలిపి ఉపయోగిస్తారు. –వంతాల కళ్యాణం, గ్రామ పూజారి, కప్పాడ గ్రామం పంటలకు మేలు విత్తనాల పండగ ప్రతి ఏడాది నిర్వహిస్తాం. శంకుదేవుని సన్నిధిలో విత్తనాలు ఉంచి పూజలు చేసిన తరువాత అదే విత్తనాలు తీసుకుని నూతన పంటలకు ఉపయోగించే విత్తనాల్లో కలిపి సాగు ప్రారంభించడం ఆనవాయితీ. విత్తనాల పండగ ప్రతి కుటుంబానికి ఎంతో ముఖ్యం. గుర్మవ్గా 55 ఏళ్ల నుంచి చేస్తున్నాను. –కిల్లో లక్ష్మి, గుర్మవ్, కప్పాడ -
స్వాతంత్య్రం వచ్చాక మన్యంలో తొలిసారి!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రెండేళ్ల క్రితం వరకు అడవి బిడ్డల ఆరోగ్య పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. చిన్నపాటి జ్వరం వస్తే మన్యం వీడి.. మైదానం వైపు పరుగులు తీసే ఏజెన్సీ ప్రజలకు ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. సాధారణ జ్వరాలకు మాత్రలందించేందుకూ వీల్లేని దుస్థితి నుంచి అరుదైన శస్త్ర చికిత్సలు విజయవంతంగా చేయగలిగే స్థాయికి ఏజెన్సీ ఆస్పత్రులు చేరుకున్నాయి. కాన్పుల కోసం అనకాపల్లి, వైజాగ్ వైపు అష్టకష్టాలు పడి గర్భిణుల్ని తీసుకొచ్చేవారు. ఇప్పుడు మన్యంలోని ప్రభుత్వాసుపత్రుల్లో రెండు నెలలుగా కాన్పులు నిర్వహిస్తూ తల్లీబిడ్డల్ని కాపాడుకోగలుగుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. మొట్టమొదటి సారిగా రెండు రోజుల వ్యవధిలో రెండు మేజర్ ఆపరేషన్లు పాడేరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో నిర్వహించి రికార్డు సష్టించారు. కాలిలో సిరలు ఉబ్బి నడవడం కష్టంగా మారి ఆస్పత్రిలో చేరిన ఏజెన్సీకి చెందిన వి.చంద్రకళ (30)కు పాడేరు జిల్లా ఆస్పత్రి వైద్యులు సోమవారం వెరికోస్ వెయిన్స్ ట్రెండెలెన్‌బర్గ్ చికిత్సని విజయవంతంగా పూర్తి చేశారు. అదేవిధంగా హెర్నియా సమస్యతో ఆస్పత్రిలో చేరిన జి.నన్నారావు (48)కు మంగళవారం హెర్నియా రిపేర్ శస్త్రచికిత్సను చేశారు. పాడేరు జిల్లా ఆస్పత్రి చరిత్రలో ఈ తరహా ఆపరేషన్లు నిర్వహించడం ఇదే ప్రథమం. ప్రస్తుతం ఇద్దరు రోగులు ఆరోగ్యంగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. కలెక్టర్ అభినందన మేజర్ ఆపరేషన్లను మారుమూల మన్యంలో విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బందాన్ని జిల్లా కలెక్టర్ డా.మల్లికార్జున అభినందించారు. ‘ఏజెన్సీ ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషలిస్టు డాక్టర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించారు. దీంతో ఏజెన్సీలోనే మేజర్ ఆపరేషన్లను చేసే స్థాయికి వచ్చాం’ అని పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకష్ణ ‘సాక్షి’కి తెలిపారు. -
పర్యాటకుల మనసు దోచుకొంటున్న మన్యం అందాలు
-
బావ కోసం దళంలో చేరి...
సాక్షి, హైదరాబాద్/గంగారం: మన్యంలో పుట్టిన ప్రేమకథ.. దండకారణ్యంలో సమాప్తమైంది. కష్టాలు, కన్నీళ్లు, తూటాలు, చట్టాలు, అనారోగ్యం, బంధాలు, బంధువులు ఏవీ వారిని ఆపలేకపోయాయి. చనిపోతావని బంధువులు బెదిరించినా.. ఆమె లెక్కచేయలేదు. బంధాలను తెంచుకుంది. అడవిలో ఉన్న బావను వెతుక్కుంటూ వెళ్లింది. బావ కోసం, పార్టీ కోసం పిల్లలను వద్దనుకుని మాతృత్వాన్ని త్యాగం చేసింది. చివరికి అతనితోపాటే కరోనా వైరస్‌కు బలైపోయింది. యాప నారాయణ అలియాస్ హరిభూషణ్–జజ్జర్ల సమ్మక్క అలియాస్ శారదలు సొంత బావా మరదళ్లు. ఈనెల 21న హరిభూషణ్ కరోనాతో మరణించాడు. 24న సమ్మక్క కూడా వైరస్‌తో పోరాడుతూ చనిపోయింది. 25న దండకారణ్యంలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. 30ఏళ్ల ప్రేమ ప్రయాణం ముగిసి పోయింది. సమ్మక్క మరణవార్తను ఛత్తీస్‌గఢ్ పోలీసులు ధ్రువీకరించారు. కానీ, మావోయిస్టు పార్టీ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. బావ వెంటే బతుకు అంటూ... వీరిద్దరి మరణంతో మహబూబాబాద్ జిల్లా సొంతూరు గంగారం మండలం మడగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నారాయణ– సమ్మక్కలు చిన్ననాటి నుంచి ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో యాప నారాయణ డిగ్రీ పూర్తి చేశాడు. విద్యార్థిగా రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ)తో ప్రభావితమై 1991 తరువాత దళంలో చేరాడు. బావ చదువు పూర్తయ్యాక.. పెళ్లి చేసుకుందామనుకుని ఎన్నో కలలు గన్న సమ్మక్కకు ఈ పరిణామం మింగుడుపడలేదు. పెద్దలు వారించినా వినకుండా అడవిలో ఉన్న నారాయణ వద్దకు వెళ్లిపోయింది. అక్కడే వివాహం చేసుకుంది. బావ కోసం, పార్టీ కోసం పిల్లలు వద్దనుకుంది. ఈ దేశంలోని అభాగ్యులంతా తన పిల్లలే అనుకునే ఆదర్శ మనస్తత్వం సమ్మక్కదని బంధువులు ‘సాక్షి’కి చెప్పారు. భర్త వెంటే అనేకసార్లు ఎన్కౌంటర్లలో తూటాల నుంచి త్రుటిలో తప్పించుకుంది. 2012లో తిరిగి అడవిలోకి.. సమ్మక్క 2008లో అనారోగ్య కారణాలతో వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. అప్పటికి ఆమె పేరు మీద ఉన్న రూ.5 లక్షల రివార్డు తనకే ఇచ్చారు పోలీసులు. శస్త్రచికిత్స అనంతరం 2012 వరకు బంధువులతోనే కలిసి ఉంది. అడవిని వదిలివచ్చినా.. సమ్మక్క బావను మరువలేదు. అతన్ని వదిలి ఉండలేక.. నాలుగేళ్ల అనంతరం 2012లో ఎవరికీ చెప్పకుండా తిరిగి నారాయణ వద్దకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి వదినను తాము చూడలేదని ఆమె మరిది, హరిభూషణ్ తమ్ముడు అశోక్ చెప్పాడు. ఆదర్శ భావాలున్న అన్నావదినలను స్వల్ప వ్యవధిలో కోల్పోవడం ఎంతో బాధ కలిగించిందని, కడచూపునకు నోచుకోకపోవడం వేదనకు గురిచేస్తోందని వాపోయాడు. ఒకవేళ తన వదిన మరణ వార్త వాస్తవమే అయితే, కనీసం ఆమె మృతదేహాన్నైనా అప్పగించాలని ఆయన మావోయిస్టు పార్టీకి విజ్ఞప్తి చేశాడు. -
Organic Coffee: ‘మన్యం’ కాఫీ.. రైతు హ్యాపీ
సాక్షి, విశాఖపట్నం: రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు లేకుండా.. విశాఖ మన్యంలో ప్రకృతి సిద్ధంగా పండుతున్న కాఫీ గింజలకు డిమాండ్ పెరిగింది. పల్ప్ తీసిన (క్లీన్) కాఫీ గింజలకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధర పలికింది. గత ఏడాది కిలోకు రూ. 90 నుంచి రూ. 110 వరకూ ఉన్న ధర ఈ ఏడాది రూ. 150 వరకూ పెరిగింది. ప్రస్తుతం అనుకూల వాతావరణ పరిస్థితుల్లో కాఫీ గింజల దిగుబడి కూడా బాగా పెరిగింది. దీంతో గిరిజన రైతులు కాఫీ తోటల సాగుపై మక్కువ చూపిస్తున్నారు. ఫలితంగా ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. 1985లో 10,107 ఎకరాల్లో ఉన్న కాఫీ తోటలు.. గతేడాది నాటికి 2,22,390 ఎకరాలకు విస్తరించాయి. ఈ సీజన్లో 1.65 లక్షల ఎకరాల్లో కాఫీ గింజల పంట వచ్చింది. దాదాపు 11,500 మెట్రిక్ టన్నుల మేర దిగుబడి వచ్చిందని పాడేరు ఐటీడీఏ కాఫీ ప్రాజెక్టు సహాయ సంచాలకులు రాధాకృష్ణ చెప్పారు. ఈ ఏడాది మరో 15 వేల ఎకరాల్లో కాఫీగింజల సాగును విస్తరిస్తామని తెలిపారు. రానున్న ఆగస్టు నెలలో నాటేందుకు వీలుగా నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేస్తున్నారు. మొక్కలు నాటిన ఐదేళ్ల తర్వాత ఫలసాయం చేతికొస్తుంది. ఏటా కాఫీ తోటల విస్తరణ.... సాధారణంగా మార్చి–ఏప్రిల్ నెలల్లో ఐదారు పెద్ద వర్షాలు, పూత దశలో 15 డిగ్రీల నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, నీరు నిలవని సారవంతమైన ఏటవాలు భూములు కాఫీ సాగుకు అనుకూలం. ఇటువంటి అనుకూల పరిస్థితులున్న విశాఖ మన్యంలో 2025–26 సంవత్సరం నాటికి మరో 58 వేల ఎకరాలకు కాఫీ తోటలను విస్తరించాలనే లక్ష్యంతో ఐటీడీఏ కృషి చేస్తోంది. ప్రస్తుతం ఏజెన్సీలో దాదాపు 1.20 లక్షల విస్తీర్ణంలో వరి, చోడి, రాజ్మా, సామలు, మొక్కజొన్న, కందులు వంటి పంటలు సాగు చేస్తున్నారు. వాటి సాగు కన్నా కాఫీ, అంతరపంటగా మిరియాల సాగు లాభసాటిగా ఉండటంతో గిరిజన రైతులు కాఫీ సాగు వైపు మొగ్గు చూపిస్తున్నారు. విదేశాల్లో పెరుగుతున్న ప్రాచుర్యం... మన్యంలో పూర్తిగా సేంద్రియ విధానంలో పండుతున్న అరబికా రకం కాఫీ.. విదేశాల్లో అరకు కాఫీగా ప్రాచుర్యం పొందుతోంది. ఇక్కడి ఉత్పత్తిలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని జీసీసీ ఏటా వెయ్యి టన్నుల వరకూ క్లీన్ కాఫీ గింజలు కొనుగోలు చేస్తోంది. మరో పది శాతం స్థానిక ప్రైవేట్ వ్యాపారులు కొంటున్నారు. మిగతా 80 శాతం విదేశాలకు ఎగుమతి అవుతోంది. మహీంద్ర గ్రూప్‌నకు చెందిన అరకు గ్లోబల్ హోల్డింగ్స్ అనే సంస్థ ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ‘అరకు కాఫీ’ పేరుతో కాఫీ షాప్ ఏర్పాటు చేసింది. ధర అదుర్స్.. ఈ ఏడాది ఎకరానికి సగటున 100 నుంచి 120 కిలోల క్లీన్ కాఫీ గింజల దిగుబడి వచ్చింది. కిలోకు రూ. 140 నుంచి రూ. 150 వరకూ ధర ఉంది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కూడా ధర పెంచడంతో ప్రైవేట్ వ్యాపారులు, సంస్థలు పెంచక తప్పలేదు. ఇక కాఫీలో అంతరపంటగా ఒక్కో ఎకరాకు 150 నుంచి 160 మిరియం పాదులు ఉంటే అదనంగా రూ. 40 వేల వరకూ ఆదాయం రైతులకు వస్తోంది. విశాఖ మన్యంలోని 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటి పరిధిలోని 3,952 గ్రామాల్లో 1.34 లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. దాదాపుగా 200 గ్రామ పంచాయతీల పరిధిలో కాఫీ తోటలు ఉన్నాయి. 80 శాతం కుటుంబాలు వాటిపై ఆధారపడుతున్నాయి. విశాఖ మన్యంలో కాఫీ గింజల సాగును ప్రోత్సహించడానికి పాడేరు ఐటీడీఏ, కాఫీ బోర్డు ప్రాంతీయ పరిశోధన కేంద్రం (ఆర్‌సీఆర్‌ఎస్) విశేష కృషి చేస్తున్నాయి. విత్తనాలు, నర్సరీల ఏర్పాటుకు అవసరమైన సామగ్రిని రాయితీపై ఐటీడీఏ అందిస్తోంది. నర్సరీలను గిరిజన రైతులే స్వయంగా అభివృద్ధి చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం... గిరిజనుల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహాలు అందిస్తోంది. చింతపల్లి ట్రైబల్ ఆర్గానిక్ కాఫీ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. చింతపల్లి మండలంలో చిన్న, సన్నకారు కాఫీ రైతులను సంఘటితం చేసి రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్‌పీఓ)ను ఏర్పాటు చేసింది. దీన్ని మాక్స్ (ఎంఏసీఎస్) యాక్ట్ కింద రిజిస్టర్ చేశారు. తద్వారా రైతులే తాము ఉత్పత్తి చేసిన కాఫీ పంటను మేలైన పద్ధతుల్లో పల్పింగ్ చేయించుకునే అవకాశం ఏర్పడింది. ఆ కాఫీ గింజలను టాటా కాఫీ లిమిటెడ్ తదితర పెద్ద సంస్థలకు విక్రయించడం ద్వారా అధిక ధర పొందుతున్నారు. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో కాఫీ దిగుబడి వచ్చింది. వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం వంటి అనుకూల వాతావరణమే దీనికి కారణం. – రాధాకృష్ణ, సహాయ సంచాలకులు, పాడేరు ఐటీడీఏ కాఫీ ప్రాజెక్టు చదవండి: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మే 31న ఉద్యోగ క్యాలెండర్ 104కు మరింత ప్రాచుర్యం: సీఎం వైఎస్ జగన్ -
అడవిలో అలజడి
-
టీడీపీ నేతలను మన్యం నుంచి తరిమికొట్టాలి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జిత్తులమారి చంద్రబాబునాయుడు, అతని మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి రాష్ట్రాన్ని దోచుకుని అక్రమ ఆస్తులను కూడబెట్టుకున్నారని సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి గోపి ఆరోపించారు. ముఖ్యమంత్రి అంటున్నట్టుగా రాష్ట్రం వెలిగిపోవడం లేదన్నారు. బుధవారం పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో.. క్వారీల ముసుగులో మన్యాన్ని ధ్వంసం చేస్తున్న టీడీపీ నాయకులను మన్యం నుంచి తరమికొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబునాయుడు 2019లో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు పాకులాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజల జీవన పరిస్థితి దిగజారిందని, రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆరోపించారు. విశాఖ డివిజన్లో అత్యధికంగా అనధికారిక క్వారీలు నడుస్తున్నాయన్నారు. అనకాపల్లి మండలం సీతానగరం రెవెన్యూ పరిధిలో వెంకుపాలెం పంచాయతీ సర్వే నెంబర్ 193లో 2.7 ఎకరాలు, సర్వే నెంబర్ 251లో 7.5 హెక్టార్ల ప్రభుత్వ భూమిలో నిబంధనలు ఉల్లంఘించి దర్జాగా క్వారీ పనులు చేస్తున్నారన్నారు. టీడీపీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు పీలా గోవింద, కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, కిడారి సర్వేశ్వరరావు, అతని బంధువు బుక్కా రాజేంద్ర, కిమిడి రాంబాబు ఇష్టారాజ్యంగా క్వారీల్లో బ్లాస్టింగ్లు చేస్తున్నారన్నారు. దీని వల్ల వందల ఎకరాల్లో భూములు సాగుకు దూరమయ్యాయన్నారు. గూడెం మండలం గుమ్మిరేవుల సమీపంలో నల్ల మెటల్ క్వారీలో పేలుళ్లకు వాడే మూడు రకాల రసాయనాల కారణంగా అక్కడ చెరువు కలుషితమై 2,050 ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. క్వారీల మూలంగా అనకాపల్లి డివిజన్లో పదిమంది, మన్యంలో ఆరుగురు మరణించారన్నారు. గాలిలో దీపం గిరిజనుల ఆరోగ్యం జిల్లాలో ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 290 మలేరియా, 1100 టైఫాయిడ్, 21,800 డయేరియా, 1,660 డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. మన్యంలో వైద్యులు అందుబాటులో లేక గిరిజనుల పరిస్థితి గాలిలో దీపంలా మారిందన్నారు. కడుపు నింపే పౌష్టికాహారం లేక పిట్టాల్లా రాలిపోతున్నారన్నారు. అధికారాన్ని, పదవులను, ధనబలాన్ని అడ్డంపెట్టుని 1/70 చట్టం, పెసాలో 5, 6 షెడ్యూల్, అటవీ హక్కుల చట్టాలను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. ఆదివాసీ ద్రోహులుగా మారిన పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి, మణికుమారి, ఎం.వి.వి.ప్రసాద్, నాగరాజు, అయ్యన్నపాత్రుడు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని విమర్శించారు. ఓట్ల కోసం వచ్చే నాయకులను బాక్సైట్, ఈవో 97, ఏపీఎప్డీసీ కాఫీ తోటల పంపకం లాంటి అంశాలపై నిలదీయాలని గిరిజనులను కోరారు. బీజేపీ, టీడీపీ నాయకుల ఇళ్లను ముట్టడించాలని, మంత్రి అయ్యన్న, ఎమ్మెల్యేలు ఈశ్వరి, పీలా గోవిందతోపాటు రాంబాబు, రాజేంద్ర, నాగరాజు, ప్రసాద్, మణికుమారిలను తరమికొట్టాలని కోరారు. దున్నేవాడిదే భూమి, ఆదివాసీలకే అటవీ హక్కు, గ్రామరాజ్య కమిటీలకే సర్వాధికారం అనే నినాదాలతో మావోయిస్టుల ఆధ్వర్యంలో భూస్వామ్య, దళారీ, నిరంకుశ పెట్టుబడిదారి వర్గంపై మూడు రకాల పోరాటం ఉధృతం చేయాలన్నారు. -
పోలీసుల చేతికి ‘మావోల ఆపరేషన్’ కీలక వీడియో!
సాక్షి, అమరావతి : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హత్య చేసిన మన్యంలో డీజీపీ పర్యటించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే మావోల ముప్పు పొంచి ఉంటుందనే ఆందోళనలో పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ పర్యటనకు ఇంకా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని చెబుతున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన గ్రేహౌండ్స్‌తోపాటు నిఘా వర్గాలు మావోల కదలికలపై అంచనా వేస్తున్నట్టు సమాచారం. మావోయిస్టులకు సంబంధించిన తాజా సమాచారం సేకరించిన అనంతరం బుధవారం ఉదయం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి డీజీపీ మన్యం పర్యటనపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలో మావోయిస్టులు నిర్వహించిన ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో పోలీసులకు చిక్కినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ముందస్తు జాగ్రత్తగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గన్‌మెన్, డ్రైవర్, పార్టీ నాయకుల నుంచి సెల్‌ఫోన్‌ను మావోయిస్టులు ముందే తీసుకుని, వారిని దూరంగా ఉండాలంటూ గన్లతో కాపలా ఉన్నారు. అయితే ఘటన జరిగిన ప్రాంతంలో రోడ్డుపై బైక్‌పై వెళుతున్న వారిని మావోయిస్టులు అడ్డగించినట్టు చెబుతున్నారు. వారిలో ఒకరు మావోయిస్టుల కన్నుగప్పి సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించినట్టు తెలిసింది. అందులో మావోయిస్టులు దారి అడ్డగించడం, ఘటన తర్వాత పారిపోతున్న క్లిప్పింగ్‌ను పోలీసులు వ్యూహాత్మకంగానే మంగళవారం విడుదల చేసినట్టు తెలిసింది. ఇంకా కీలక ఆధారాలతో ఉన్న వీడియో పోలీసుల వద్ద ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేని పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపిన మావోయిస్టుల్లో కొందరిని వీడియో ద్వారా గుర్తించే ప్రయత్నం జరుగుతోంది. స్తంభించిన మన్యం.. స్వచ్ఛందంగా బంద్ అరకు/పాడేరు: అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విఫ్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమ హత్యకాండకు నిరసనగా సోమవారం మన్యంలో స్వచ్ఛందంగా బంద్ జరిగింది. అరకు పట్టణంలోని దుకాణాలు, షాపులు మూతపడ్డాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించింది. బంద్ వల్ల అరకు పర్యాటక కేంద్రం బోసిపోయింది. పలు రాష్ట్రాలతోపాటు ఏపీలోని పలు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు స్థానికంగా రిజర్వ్ చేసుకున్న అతిథి గృహాలు, ప్రైవేట్ రిసార్ట్స్, టూరిజం, పలు లాడ్జీల గదులన్నింటినీ ఆన్లైన్లోనే రద్దు చేసుకున్నారు. దీంతో మూడ్రోజుల నుంచి అరకులోయ ప్రాంతంలోని అతిథి గృహాలన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఉన్న పర్యాటకులు కూడా భయంతో గదుల నుంచి బయటకు రాలేదు. పాడేరులో కిడారి, సోమకు ఐటీడీఏ అధికారులు, సిబ్బంది మంగళవారం సంతాపాన్ని తెలియజేశారు. అరకు అంటే బెరుకు! విశాఖపట్నం : అరకు ఈ పేరు వింటేనే పర్యాటకులు అక్కడి అందాలు చూడడానికి పరుగులు పెడతారు. ప్రకృతి సోయగాలు, అందాల లోయలు, మంచుకమ్మిన పర్వతాలు, మెలికలు తిరుగుతూ కనిపించే రహదారులు, జలజల జాలువారే జలపాతాలు.. ఇలా ఒకటేమిటి? ఎన్నో సౌందర్యాల సమాహారం విశాఖ మన్యం! అలాంటి రమణీయతలో అలరారే ఏజెన్సీ ఇప్పుడు పర్యాటక ప్రియులను భయపెడుతోంది. మూడు రోజుల క్రితం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపడంతో మన్యం వణుకుతోంది. ఇప్పుడు ఏజెన్సీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మావోయిస్టుల కోసం భారీ సంఖ్యలో పోలీసులు కూంబిగ్ చేపట్టారు. సాయుధ భద్రతా దళాలు అడవుల్లోనూ, మారుమూల పల్లెలు, గూడేల్లోనూ అణువణువునా జల్లెడ పడుతున్నాయి. ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో పర్యాటకులు విశాఖ ఏజెన్సీకి వెళ్లడానికి సాహసించలేక పోతున్నారు. అరకులోని పద్మావతి గార్డెన్స్, డుంబ్రిగుడ మండలం చాపరాయి, అనంతగిరి మండలం బొర్రా గుహలు, టైడా, ఇంకా పలు జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అటు వైపు పర్యాటకులెవరూ తొంగి చూడడం లేదు. నిత్యం వేలాది మందితో కిక్కిరిసే బొర్రా గుహలు బోసిపోతూ కనిపిస్తున్నాయి. విశాఖ నుంచి పర్యాటకశాఖ నడిపే టూర్ ప్యాకేజీ బస్సులను కూడా సోమ, మంగళవారాలు రద్దు చేసింది. మరోవైపు అరకు పరిధిలో ఉన్న 180 పర్యాటకశాఖ గదులు ఆక్యుపెన్సీ 40 శాతం కంటే తక్కువకు పడిపోయింది. ఇక అనంతగిరిలోని పర్యాటక గదుల పరిస్థితి కూడా అదే. పక్షుల కిలకిలరావాలతో అలరించే టైడా జంగిల్‌బెల్స్ కూడా జనంలేక వెలవెలబోతోంది. విశాఖ మన్యంలో సామాన్య పరిస్థితులు నెలకొనడానికి మరికొన్నాళ్లు పట్టే అవకాశం ఉంది. ప్రయోగాత్మకంగా బుధవారం నుంచి పర్యాటక ప్యాకేజీ బస్సులను నడపనున్నట్టు పర్యాటకాభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ ప్రసాదరెడ్డి మంగళవారం రాత్రి సాక్షి’కి చెప్పారు. -
అమ్మాయి ఆత్మకథ
అటవీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మన్యం’. ‘బాహుబలి’ ప్రభాకర్ ముఖ్య పాత్రలో నటించారు. రమణ ఎస్.వి (వెంకట్రావ్) దర్శకత్వంలో సాయి సంహిత క్రియేషన్స్ పతాకంపై శ్రీసత్య జయ కోమలీదేవి నిర్మించారు. రఘువీర్, వర్ష, శ్రావణ్, జీవా, గిరిధర్ తదితరులు నటించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పగ, ప్రతీకారాల మధ్య అడవిని, తన జాతిని కాపాడుకునే ఓ అమ్మాయి ఆత్మకథతో ఈ చిత్రం రూపొందించాం. ఖర్చుకు ఎక్కడా వెనకాడలేదు. మా సినిమా పాటలను దర్శక–నిర్మాత వైవీఎస్ చౌదరిగారు రిలీజ్ చేసి, బాగున్నాయని అభినందించారు. ఈ చిత్రానికి చంద్రబోస్‌గారు పాటలు రాయడంతో పాటు ఓ ప్రత్యేక గీతం ఆలపించడం విశేషం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జి. అమర్, లైన్ ప్రొడ్యూసర్స్: భాస్కర్, రామారావు. -
జోరు వానలో.. 12 కి.మీ.లు డోలీలో..
సాలూరు రూరల్: మన్యంలో రహదారులు లేకపోవటంతో అడవి బిడ్డలు నానా అగచాట్లు పడుతున్నారు. అనారోగ్యానికి గురైతే కిలోమీటర్ల కొద్దీ డోలీల్లో నడిచి వెళ్లాల్సిన దుస్థితి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా సాలూరు మండలం గిరిశిఖర కొడమ పంచాయతీ సిరివర గ్రామంలో ఓ బాలింత అనుభవించిన నరకయాతన గిరిజనుల అవస్థలకు అద్దంపట్టింది. గ్రామానికి చెందిన గిందెకు ఆదివారం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. నెలలు నిండకుండానే మూడో కాన్పు కావడంతో పుట్టిన కొద్దిసేపటికే శిశువు కన్నుమూసింది. మరోవైపు గిందెకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో.. భర్త డుంబ్రి, స్థానికులు డోలీకట్టి అందులో గిందెను ఉంచి సోమవారం 12 కి.మీ.కు పైగా కొండ మార్గంలో జోరు వర్షంలో నడిచి దుగ్గేరుకు తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యాధికారుల సూచనల మేరకు ఆమెను 108లో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరానికి తరలించనున్నట్లు సమాచారం.