పాడేరు, న్యూస్‌లైన్: మన్యంలో పలు పత్రికల పేర్లు, పోలీసుల పేర్లు చెప్పుకుని నకిలీల దందా కొనసాగుతోంది. ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు గంజాయి భారీగా రవాణా అవుతుండడం నకిలీ విలేకరులు, పోలీసులకు కలిసివస్తోంది. ఆటోలు, జీపులు, కార్లు ద్వారా గంజాయి రవాణా అవుతుండడంతో ఈ వాహనాల డ్రయివర్లను ఇన్‌ఫార్మర్లుగా ఉపయోగించుకుని ప్రధాన రహదారుల్లో పోలీసుల తరహాలో మాటు వేసి దోపిడీ చేస్తున్నారు.
పాడేరు, జి.మాడుగుల, పెదబయలు రోడ్లలోని పలు చోట్ల ఈ నకిలీల దోపిడీ అధికమైంది. జి.మాడుగుల రోడ్డులోని కలెక్టర్ బంగ్లా, పాడేరు సమీపంలోని చింతలవీధి జంక్షన్, లగిశపల్లి రోడ్డు, వంతాడపల్లి చెక్‌పోస్ట్ ప్రాంతాల్లో కొంతమంది విలేకరులు, పోలీసు సిబ్బందిగా చెప్పుకుంటూ దారిన పోయే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. గంజాయి రవాణా అవుతున్నట్టు ముందుగానే సమాచారం అందుకుంటున్న ఈ నకిలీలు ఆయా వాహనాలను అడ్డగించి భారీ మొత్తంలో సొమ్ము వసూలు చేస్తున్నారని సమాచారం.
సొమ్ము ఇవ్వకుంటే వాళ్లను బెదిరించి గంజాయిని స్వాధీనం చేసుకుని వాహనాలను వదిలిపెడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఈ ప్రధాన రోడ్లలో దారి దోపిడీ జరుగుతోంది. గంజాయి వ్యాపారం కావడంతో ఎవరు అడ్డగించిన వ్యాపారులు భయపడి ఈ నకిలీలు డిమాండ్ చేసిన మొత్తం చెల్లించి అక్కడ నుంచి తప్పించుకుంటున్నారు. 8 నెలల క్రితం పాడేరు పోలీసులు ఇలాంటి నకిలీ పోలీసుల గుట్టు రట్టు చేసి నలుగురిని జైలుకు పంపారు. ఇలాంటి నకిలీల హల్‌చల్ తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న తరుణంలో మరలా మరో కొత్త బృందం విలేకరులు, పోలీసుల అవతారం ఎత్తి గంజాయి వ్యాపారుల నుంచి భారీగా వసూలు చేస్తున్నట్టు తెలిసింది.
గంజాయి వ్యాపారులను నిలువు దోపిడీ చేస్తున్నప్పటికీ పోలీసులు, ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు లేకపోవడంతో వారు కూడా పట్టించుకోవడం లేదు. ఈ విషయమై పాడేరు సర్కిల్ మొబైల్ పార్టీ ఎక్సైజ్ సీఐ ఉపేంద్రను న్యూస్‌లైన్ వివరణ కోరగా గంజాయి వ్యాపారుల నుంచి కొంతమంది డబ్బులు గుంజుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వారిపై దృష్టిసారించినట్టు తెలిపారు. గంజాయి సాగుదారులు, వ్యాపారులతో కూడా ఈ నకిలీలకు సంబంధాలు ఉన్నట్టు తెలిసిందన్నారు. వారి గురించి ఎవరు సమాచారం ఇచ్చిన కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని ఆయన చెప్పారు.
నకిలీల దందా!
Published Tue, Oct 1 2013 2:37 AM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM
Advertisement
Advertisement