మన్యంలో ఫలించిన తాటి పరిశోధనలు
తాటి తేగలతో 12 రకాల ఆహార ఉత్పత్తులు
పది తాటి చెట్లతో రూ. 35 వేల వరకు ఆదాయం
గ్రామీణ భారతంలో తాటిచెట్టుది ప్రత్యేక స్థానం. పేదవాడి కల్పవృక్షంగా పిలిచే తాటిచెట్టులో ఉపయోగపడని భాగమే ఉండదు. మనదేశంలో తీరప్రాంత రాష్ట్రాల్లో తాటిచెట్లు అత్యధికంగా కనిపిస్తుంటాయి. తమిళనాడులో తాటిచెట్లు అధిక సంఖ్యలో ఉండగా తరువాతి స్థానం ఆంధ్రప్రదేశ్‌దే. తాటిచెట్టు (Palm Tree) ప్రయోజనాలను గుర్తించిన మన పూర్వికులు దాన్ని ఇంటికి పెద్దకొడుకుగా భావించేవారు. పొలం గట్టున పది తాటిచెట్లుంటే ప్రశాంతంగా జీవించొచ్చు అనుకునేవారు.
ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లో వీటిపై ఆసక్తి కొంత తగ్గినప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో విరివిగా కనిపించే తాటిచెట్ల నుంచి గిరిజనులకు ఆదాయ మార్గాలను చూపించాలనే లక్ష్యంతో ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రి కల్చర్ రీసెర్చ్ (న్యూఢిల్లీ) ద్వారా అఖిల భారత వన్య పంట పథకంలో భాగంగా పరిశోధనలు చేపట్టారు. ఇందులో భాగంగా చేపట్టిన తొలిదశ పరిశోధనలు ఫలించాయి. భారతదేశంలో (India) 2010 సంవత్సరంలో తాటి చెట్లపై పరిశోధనకు రెండు చోట్ల అనుమతులు ఇచ్చారు.
ఒకటి అల్లూరి జిల్లా పందిరిమామిడిలోని డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్, రెండోది తమిళనాడులోని కిలికులం. ఈ రెండు చోట్ల తాటిపై పరిశోధనలు ప్రారంభించారు. తక్కువ సమయంలో కాపునకు వచ్చే రకాలను అభివృద్ధి చేసేందుకు అనేక చోట్ల నుంచి మేలైన తాటి విత్తనాలను సేకరించి అభివృద్ధి పరిచారు. తాటి ఉప ఉత్పత్తులపైనా పరిశోధనలు జరిగాయి. ఇందులో భాగంగా తాటి తేగలతో ఉప ఉత్పత్తులు తయారుచేయడంపై జరిపిన పరిశోధనలు పూర్తయ్యాయి.
రెండో దశలో యంత్రాలను ఉపయోగించి వాణిజ్యపరంగా ఉప ఉత్పత్తులు తయారు చేయడంపై పరిశోధనలు ప్రారంభించారు. రెండేళ్ల కిందట తెలంగాణలోని నల్గొండ జిల్లా మల్లేపల్లి, బిహార్‌లోని సబుర్‌లో ఈ పరిశోధనలు ప్రారంభమయ్యాయి.
– రంపచోడవరం(అల్లూరి జిల్లా)
లండన్‌కు తేగల పిండి
చింతూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆశ స్వచ్ఛంద సంస్థ పందిరిమామిడి (Pandiri Mamidi) హెచ్‌ఆర్‌ఎస్ హెడ్.. డాక్టర్ పి.సి. వెంగయ్య సహకారంతో 2019–20 సంవత్సరంలో మూడు టన్నుల తేగల పిండిని లండన్‌కు పంపించింది. తరువాత కోవిడ్ కారణంగా ఈ రవాణాకు బ్రేక్ పడింది. తిరిగి మారోమారు లండన్‌కు తేగల పిండిని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండో దశ వాణిజ్య ప్రయోజనాల కోసం
ఇప్పటి వరకు తాటి ఉప ఆహారోత్పత్తులపై పరిశోధనలు జరిగాయి. రెండో దశలో వాణిజ్యపరంగా ప్రయోజనం చేకూర్చేందుకు పరిశోధనలు ప్రారంభమయ్యాయి. తాటి తేగల కోత నుంచి పిండి, రవ్వ తయారీ వంటివాటిని భారీ ఎత్తున యంత్రాలతో చేపట్టడంపై పరిశోధనలు సాగుతున్నాయి.
ఆంద్రప్రదేశ్‌లో 3 కోట్ల వరకు తాటి చెట్లు ఉన్నాయి. వీటిలో ఒక్క శాతం ఉపయోగించుకున్నా కోట్ల రూపాయల ఆదాయం పొందవచ్చు. పందిరిమామిడి పరిశోధన స్థానంలో 272 రకాల తాటి చెట్లను అభివృద్ధి చేశాం.
– డాక్టర్ పి.సి. వెంగయ్య, అధిపతి, డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్, పందిరిమామిడి
తేగలతో 12 రకాల ఆహార పదార్థాలు
అల్లూరి జిల్లా పందిరి మామిడి పరిశోధన స్థానంలో తాటి తేగలతో పిండి, నూక(రవ్వ) తయారు చేసి, మైదా స్థానంలో వీటిని వినియోగించి పోషక విలువలతో కూడిన ఆహారపదార్థాలు తయారు చేశారు. వీటితో కేకులు, బిస్కెట్లు, జంతికలు, బ్రెడ్, నూడుల్స్, రవ్వలడ్డు, పిజ్జా బేస్ తదితర పదార్థాలు తయారు చేస్తున్నారు. తాటి పండు టెంకలు నాటిన 135 రోజుల తరువాత తాటి తేగలు కోతకు వస్తాయి. తేగలు 30 నుంచి 55 సెంటీమీటర్ల పొడువు, 70 గ్రాముల వరకు బరువు ఉంటాయి.
తాటి తేగలు ముక్కులు శుభ్రం చేసి కడిగి ఒక ట్రేలో అరబెట్టాలి. వీటిని నాలుగు గంటల పాటు డ్రయ్యర్‌లో ఉంచాలి. తేగల పిండి తయారుచేయడానికి ఎండిన తేగలను మెత్తగా రుబ్బి జల్లెడ పట్టాలి. తరువాత పిండిని నానబెట్టి చేదు రుచి పోగొట్టేందుకు డిస్టల్డ్ వాటర్‌తో విశ్లేషణ చేయాలి. ఈ తేగల పిండిలో ప్రొటీన్ 3.40 శాతం, ఫైబర్ 8.80 శాతం, కాపర్ 0.05 శాతం, జింక్ 0.41 శాతం, ఐరన్ 2.40 శాతం, మెగ్నీషియమ్ 0.05 శాతం ఉంటాయి. బేకరీ ఉత్పత్తుల తయారీలో మైదాకు బదులు తేగల పిండి(ఫ్లోర్) వినియోగించవచ్చు.
దీని ద్వారా అధిక పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పొందవచ్చు. పందిరిమామిడి పరిశోధన స్థానంలో తేగల పిండితో బిస్కెట్లు, నూడిల్స్, నూకతో కేక్‌లు తయారు చేశారు. మార్కెట్‌లో కేజీ తేగల రవ్వ ధర రూ. 170 వరకు ఉంది. పది తాటి చెట్ల ద్వారా ఏడాదిలో రూ. 35 వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment