
ఫలించిన కేవీకే శాస్త్రవేత్తల పరిశోధనలు
జీలుగు నీరాతో సిరప్, బెల్లం, ఇతర ఉత్పత్తుల తయారీ
ఆధునిక పద్ధతుల్లో సేకరణపై దృష్టి
గిరిజనులకు ఆదాయవనరుగా మార్చేందుకు చర్యలు
కార్యాచరణకు అల్లూరి జిల్లా కలెక్టర్ ఆదేశం
రంపచోడవరం: నీరా చూసేందుకు కొబ్బరినీళ్లలా ఉంటుంది. సూర్యోదయానికి ముందు చెట్టు నుంచి తీసినదాన్ని నీరా అంటారు. పోషకాలు, ఔషధ గుణాలు మెండుగా ఉండే ఈ పానీయాన్ని ఇష్టపడనివారు ఉండరు. ఇప్పటికే అల్లూరి జిల్లాలో తాటి చెట్ల నుంచి నీరా (Neera) సేకరిస్తున్నారు. జీలుగు నీరాను కూడా శాస్త్రీయ పద్ధతుల్లో సేకరించేందుకు పందిరిమామిడి కేవీకే (pandirimamidi Krishi Vigyan Kendra) శాస్త్రవేత్తలు ఇటీవల పలు పరిశోధనలు జరిపారు.
ఇప్పటి వరకు తాటిపై పరిశోధనలు
పందిరిమామిడి కేవీకే శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు తాటిపై మాత్రమే పరిశోధనలు చేశారు. తాటి నుంచి నీరా సేకరణ, దానితో వివిధ ఆహార ఉత్పత్తులు తయారు చేయడంలో మంచి ఫలితాలను సాధించారు. జిల్లాలో తాటితో పాటు జీలుగు చెట్లు (Jeelugu Tree) అధిక సంఖ్యలో ఉండడంతో జీలుగు చెట్టు నుంచి నీరా సేకరణ, ఇతర ఉత్పత్తుల తయారీపై కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజేంద్రప్రసాద్ దృష్టి సారించారు. కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశాలతో ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.
నీరా... చెట్టు నుంచి సహజంగా లభించే
అద్భుత పానీయం... పోషక విలువలెన్నో ఉన్న ఆరోగ్య ప్రదాయిని. జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న జీలుగు చెట్ల నీరాపై పందిరి మామిడి కేవీకే శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేశారు. నీరా నుంచి సిరప్, బెల్లం, ఇతర పదార్థాలు తయారు చేసి మార్కెటింగ్ చేసి, తద్వారా గిరిజనులకు అధిక ఆదాయాన్ని సమకూర్చాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల పందిరి మామిడి కేవీకేను సందర్శించిన అల్లూరి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.
సేకరణఇలా..
సూర్యోదయానికి ముందే తాటి, జీలుగు చెట్ల గెలలను ట్యాపింగ్ చేసి, కూలింగ్ ఉండే విధంగా కవర్లను, కూలింగ్ క్యాన్‌లను ఏర్పాటు చేసి నీరాను సేకరిస్తారు. చెట్ల నుంచి వచ్చిన ద్రవం చల్లదనంలో కాకుండా ఎక్కువ సేపు బయట ఉంటే కల్లుగా మారుతుంది. శాస్త్రవేత్తలు కల్లుగా కాకుండా నీరాగా తీసే విధంగా ఆధునిక టెక్నాలజీతో చేసిన పరిశోధనలు మంచి ఫలితాలిచ్చాయి. నీరాతో తయారు చేసిన పదార్థాలలో మంచి పోషక విలువలు ఉంటాయి. జీలుగు చెట్లు సముద్ర మట్టానికి 450 నుంచి 500 మీటర్ల ఎత్తు గల కొండ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. మారేడుమిల్లి, వై.రామవరం అప్పర్ పార్ట్ సముద్రమట్టం కంటే ఎత్తులో ఉండడంతో ఈ ప్రాంతంలో జీలుగు చెట్లు అధికంగా ఉన్నాయి.
సిరప్, బెల్లం తయారీ
కేవీకే శాస్త్రవేత్తలు జీలుగు నీరాతో సిరప్, బెల్లం తయారు చేశారు. నీరాను మంట మీద సుమారు మూడు గంటల వరకు మరగపెడతారు. దాని నుంచి మంచి ఆరోమా వస్తూ చిక్కపడిన తరువాత పానకం దశలో ఉండగా మంటమీద నుంచి తీసివేస్తే సిరప్‌గా తయారవుతుంది. పంచదార,చెరకు బెల్లానికి ప్రత్యామ్నాయంగా దీనిని వినియోగించవచ్చు.ఎన్ని రోజులైన నిల్వ ఉంటుంది. జీలుగు నీరాను మూడున్నర గంటల మరగపెడుతూ పానకం దశ దాటిన తరువాత, ఎక్కువ సేపు కలుపుతూ ఉంటే పాకం గట్టిపడి బెల్లంగా మారుతుంది. వీటిని స్వీట్ల తయారీలో ఉపయోగించవచ్చు.
తాటికంటే అధికంగా కల్లు ఉత్పత్తి
జిల్లాలో మారేడుమిల్లి, వై.రామవరం అప్పర్ పార్ట్ మినహా అన్ని చోట్ల తాటి చెట్లు విరివిగా కనిపిస్తాయి. ఒక తాటి చెట్టు నుంచి రోజుకు నాలుగైదు లీటర్ల వరకు మాత్రమే కల్లు సేకరించగలరు. అదే జీలుగు చెట్టు నుంచి రోజుకు 40 నుంచి 60 లీటర్ల వరకు కల్లు ఉత్పత్తి అవుతుంది. తాటి కల్లును సొంతంగా వాడుకోవడంతో పాటు ఎక్కువగా ఉంటే దాని నుంచి చిగురు (కల్లును మరగబెట్టి ఆవిరి నుంచి తయారు చేసే సారా) తయారు చేసుకుంటారు. జీలుగు కల్లును మాత్రం గిరిజనుల నుంచి సేకరించి జిల్లాలో నలుమూలలతో పాటు మైదాన ప్రాంతాలకు వ్యాపారులు రవాణా చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో జీలుగు కల్లు లభించడమే ఇందుకు ప్రధాన కారణం.
చదవండి: ఆధునిక రుషుల తపోవనం
నీరా సేకరణ, ఉత్పత్తులపై శిక్షణ
జీలుగు నీరా, ఉత్పత్తుల తయారీపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు వైఎస్సార్ ఉద్యానవన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.గోవిందరాజులు చర్యలు తీసుకున్నారు. ఇటీవల కేవీకేను సందర్శించిన కలెక్టర్ దినేశ్‌కుమార్‌కు జీలుగు నీరా గురించి వివరించడంతో ఆయన వెంటనే స్పందించి, జిల్లాలో ఎన్ని జీలుగు చెట్లు ఉన్నాయో సమగ్ర సర్వే నిర్వహించాలని దిశ నిర్దేశం చేశారు. నీరా ఉత్పత్తిని జిల్లా అంతా విస్తరించేలా చర్యలు తీసుకోవాలని, అందుకు ప్రణాళికలు తయారీ చేయాలని ఆదేశించారు. తాటి, జీలుగులను కలిపి ఒక బోర్డు ఏర్పాటు చేస్తే భవిష్యత్‌లో మంచి ఫలితాలు ఉంటాయి.
–డాక్టర్ రాజేంద్రప్రసాద్, కేవీకే కోఆర్డినేటర్,సీనియర్ శాస్త్రవేత్త, పందిరిమామిడి
జీలుగు చెట్లపై సర్వే
జిల్లాలో మారేడుమిల్లి, వై.రామవరం, చింతూరు, రాజవొమ్మంగి, పాడేరు, కొయ్యూరు, అరకు, చింతపల్లి ,జీకే వీధి, డుంబ్రిగుడ తదితర మండలాల్లో ఈ చెట్లు అధికంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎన్ని చెట్లు ఉన్నాయో సర్వే చేయనున్నారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా జీలుగు నీరా సేకరణకు కార్యాచరణ రూపొందిస్తారు. కొంతమంది రైతులను కలిపి ఒక యూనిట్‌గా ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి, శాస్త్రీయంగా నీరా సేకరణ జరిపేందుకు చర్యలు తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment