గల్లంతైన మరో విద్యార్థి కోసం కొనసాగుతున్న గాలింపు
మారేడుమిల్లి: అల్లూరి జిల్లా మారేడుమిల్లి సమీపంలోని పర్యాటక ప్రదేశమైన జలతరంగిణి జలపాతంలో ఆదివారం గల్లంతైన ముగ్గురు వైద్య విద్యార్థుల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. సోమవారం వేకువజామున జలపాతం సమీపంలోని తుప్పల మధ్య కె.సౌమ్య (21), బి.అమృత (21) మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. గల్లంతైన మరో విద్యార్థి సీహెచ్ హరదీప్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఏలూరు ఆశ్రం మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సెకండియర్ విద్యార్థులు 14 మంది ఆదివారం మారేడుమిల్లి వచ్చారు. జలతరంగిణి జలపాతంలో దిగి స్నానాలు చేస్తుండగా జలపాతం ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ఒక్కసారిగా వాగు ఉప్పొంగింది. ప్రవాహంలో సీహెచ్ హరదీప్, కె.సౌమ్య, బి.అమృత కొట్టుకుపోగా.. గాయత్రీపుష్ప, హరిణిప్రియ అనే విద్యార్థినులు జలపాతానికి 6 కిలోమీటర్ల సమీపంలో చెటుకొమ్మకు చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే.
లభ్యమైన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. హరదీప్ ఆచూకీ కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, రెవెన్యూ, అటవీ, పోలీస్ అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ గోపాలకృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment