అరకులోయ టౌన్ (అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రభుత్వ సంక్షేమ పథకాలు మారుమూల గిరిజనులకు సైతం అందినప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆదీవాసీల (పీవీటీజీల) సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలతోపాటు పీవీటీజీ గిరిజనులకు 150 రోజుల పనిదినాలు కల్పిస్తున్నామన్నారు.
పీఎం కిసాన్, ప్రధాని ఉజ్వల్ యోజనతో ఉచిత గ్యాస్ కనెక్షన్, ఆయుష్మాన్ భారత్ కార్డులు, అటవీ హక్కు పత్రాల పంపిణీ, జన్‌ధన్ ఖాతాలు, వన్‌దన్ వికాస్ కేంద్రాలు, పీఎం జల్ జీవన్ లాంటి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రధాని ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం నిధుల విడుదల సందర్భంగా సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయ మండలం కొత్తభల్లుగుడ ప్రాథమిక పాఠశాల, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కేఆర్‌పురంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆదీవాసీ గిరిజనులతో ప్రధాని వర్చువల్ సమావేశం ద్వారా ముచ్చటించారు.
పీవీటీజీ మహిళ: నాపేరు స్వాభి గంగ, మాది గద్యగుడ గ్రామం, అరకులోయ మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నా భర్త పేరు స్వాభి రామచందర్. మాకు ఇద్దరు పిల్లలు.పీఎం: పీఎం జన్‌మన్ గురించి మీకు ఎలా తెలిసింది?
స్వాభి గంగా: జనవరి 5న మా గ్రామంలో అధికారులు అవగాహన సదస్సు నిర్వహించి ప్రధాన మంత్రి జన్‌మన్ పథకం గురించి వివరించారు.
పీఎం: జన్‌మన్ అవగాహన సదస్సుతో మీరు ఎలాంటి లబ్ధి పొందారు?
స్వాభి గంగా: అవగాహన సదస్సు ద్వారా పీఎం ఆవాస్ యోజన కింద ఇంటి కోసం, పీఎం జలçజీవన్ యోజన కింద కుళాయి కోసం, పీఎం జన ఆరోగ్య కింద నా కుటుంబ సభ్యులకు ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం నమోదు చేసుకున్నా. నాకు పథకాలన్నీ మంజూరు చేశారు.
పీఎం: మీ జీవనాధారం ఏమిటి?
స్వాభి గంగా: ఆర్‌వోఎఫ్‌ఆర్ పథకంలో నాకు 35 సెంట్లు భూమికి పట్టా వచ్చింది. అందులో కాఫీ, మిరియాలు సాగు చేస్తూ మంచి గిట్టు బాటు ధర పొందుతున్నాం.
పీఎం: అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావడం ఎలా అనిపిస్తోంది?
స్వాభి గంగా: చాలా ఆనందంగా ఉంది. గతంలో దళారులకు విక్రయించి మోసపోయేవాళ్లం. ఇప్పుడు మంచి ధర లభిస్తోంది.
కొండరెడ్డి గిరిజనులతో ముఖాముఖి
పీఎం జన్‌మన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కేఆర్‌పురం కొండరెడ్డి గిరిజనులతో మాట్లాడారు. పీఎం జనజాతి, ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్‌మన్) కార్యక్రమం అమలులో భాగంగా అందించే సేవలను వివరించారు. ఈ కార్యక్రమం వల్ల పీవీటీజీ గ్రామాల్లో రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment