PVTG
-
అడవి బిడ్డలకూ పథకాలు అందాలి
అరకులోయ టౌన్ (అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రభుత్వ సంక్షేమ పథకాలు మారుమూల గిరిజనులకు సైతం అందినప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆదీవాసీల (పీవీటీజీల) సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలతోపాటు పీవీటీజీ గిరిజనులకు 150 రోజుల పనిదినాలు కల్పిస్తున్నామన్నారు. పీఎం కిసాన్, ప్రధాని ఉజ్వల్ యోజనతో ఉచిత గ్యాస్ కనెక్షన్, ఆయుష్మాన్ భారత్ కార్డులు, అటవీ హక్కు పత్రాల పంపిణీ, జన్‌ధన్ ఖాతాలు, వన్‌దన్ వికాస్ కేంద్రాలు, పీఎం జల్ జీవన్ లాంటి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రధాని ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం నిధుల విడుదల సందర్భంగా సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయ మండలం కొత్తభల్లుగుడ ప్రాథమిక పాఠశాల, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కేఆర్‌పురంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆదీవాసీ గిరిజనులతో ప్రధాని వర్చువల్ సమావేశం ద్వారా ముచ్చటించారు. పీవీటీజీ మహిళ: నాపేరు స్వాభి గంగ, మాది గద్యగుడ గ్రామం, అరకులోయ మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నా భర్త పేరు స్వాభి రామచందర్. మాకు ఇద్దరు పిల్లలు.పీఎం: పీఎం జన్మన్ గురించి మీకు ఎలా తెలిసింది? స్వాభి గంగా: జనవరి 5న మా గ్రామంలో అధికారులు అవగాహన సదస్సు నిర్వహించి ప్రధాన మంత్రి జన్మన్ పథకం గురించి వివరించారు. పీఎం: జన్మన్ అవగాహన సదస్సుతో మీరు ఎలాంటి లబ్ధి పొందారు? స్వాభి గంగా: అవగాహన సదస్సు ద్వారా పీఎం ఆవాస్ యోజన కింద ఇంటి కోసం, పీఎం జలçజీవన్ యోజన కింద కుళాయి కోసం, పీఎం జన ఆరోగ్య కింద నా కుటుంబ సభ్యులకు ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం నమోదు చేసుకున్నా. నాకు పథకాలన్నీ మంజూరు చేశారు. పీఎం: మీ జీవనాధారం ఏమిటి? స్వాభి గంగా: ఆర్వోఎఫ్ఆర్ పథకంలో నాకు 35 సెంట్లు భూమికి పట్టా వచ్చింది. అందులో కాఫీ, మిరియాలు సాగు చేస్తూ మంచి గిట్టు బాటు ధర పొందుతున్నాం. పీఎం: అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావడం ఎలా అనిపిస్తోంది? స్వాభి గంగా: చాలా ఆనందంగా ఉంది. గతంలో దళారులకు విక్రయించి మోసపోయేవాళ్లం. ఇప్పుడు మంచి ధర లభిస్తోంది. కొండరెడ్డి గిరిజనులతో ముఖాముఖి పీఎం జన్మన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కేఆర్‌పురం కొండరెడ్డి గిరిజనులతో మాట్లాడారు. పీఎం జనజాతి, ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్మన్) కార్యక్రమం అమలులో భాగంగా అందించే సేవలను వివరించారు. ఈ కార్యక్రమం వల్ల పీవీటీజీ గ్రామాల్లో రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు. -
అత్యంత బలహీన గిరిజన సమూహాల అభివృద్ధికి ఆరు సూత్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యంత బలహీన గిరిజన సమూహాలు (పీవీటీజీ) అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వారి సంక్షేమానికి ఆరు ప్రధాన సూత్రాలను అమలు చేస్తోంది. ఇందుకోసం ప్రాథమికంగా సర్వే నిర్వహించి రాష్ట్రంలో 12 తెగల పీవీటీజీలను గుర్తించింది. ఈ 12 తెగల్లో 2,99,516 మంది ఉన్నట్టు నిర్ధారించింది. ఈ క్రమంలో 3,367 గిరిజన గ్రామాల్లో పీవీటీజీలకు చెందిన లక్షా 528 నివాసాలకు ప్రధాన వసతులు ఏ మేరకు ఉన్నాయి? ఇంకా ఏం చేయాలి? అనే కోణంలో ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా వారికి సురక్షిత గృహాలు, పరిశుభ్రమైన తాగునీరుతోపాటు పారిశుధ్య నిర్వహణ, విద్యకు ప్రాధాన్యత, ఆరోగ్యంతోపాటు పోషకాహారం, రహదారులతోపాటు టెలిఫోన్ అనుసంధానత, స్థిరమైన జీవనోపాధి వంటి ఆరు అంశాలకు ప్రాధాన్యత ఇస్తోంది. కాగా, అత్యంత బలహీన గిరిజన సమూహాల అభివృద్ధికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.20,948.15 కోట్లు ఎస్టీ కాంపోనెంట్ నిధులను ఖర్చు చేసింది. అలాగే అన్ని నవరత్న పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను వారికి అందిస్తోంది. వీటికితోడు కేంద్ర ప్రభుత్వం కూడా పీవీటీజీల కోసం ‘పీఎం పీవీటీజీ డెవలప్మెంట్ మిషన్’ పేరుతో కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో వారి అభివృద్ధికి మరింత ఊతమిచ్చినట్టు అయ్యింది. పీవీటీజీల అభివృద్ధికి ప్రాధాన్యం.. రాష్ట్రంలో పీవీటీజీల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా ఈ వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ‘పీఎం పీవీటీజీ డెవలప్మెంట్ మిషన్’ పేరుతో కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దీని అమలు కోసం పీవీటీజీల స్థితిగతులపై సర్వే నిర్వహించి వారికి ఉన్న ప్రాథమిక సౌకర్యాలు, నివాసాల వివరాలు సేకరించాం. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘బిసాగ్–ఎన్’ మొబైల్ యాప్‌లో ఎప్పటికప్పుడు అధికారులు వివరాలు నమోదు చేస్తారు. యాప్ వినియోగంపై శిక్షణ కూడా ఇస్తాం. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి -
ఎస్టీల్లో అనైక్యత కాదనలేని వాస్తవం
‘ట్రైబ్స్ ఇన్ కాంటెంపరరీ ఇండియా’ సదస్సులో ప్రొ.సరిత్ చౌదరి సాక్షి, హైదరాబాద్: గిరిజనుల అభ్యున్నతికి కొన్ని దశాబ్దాలుగా దేశంలో అమలుచేసిన విధానాల ద్వారా ఆర్థిక, విద్య, ఆరోగ్య రంగాల్లో కొంత మార్పు వచ్చినా వివిధ రాష్ట్రాల్లోని ఎస్టీల మధ్య అనైక్యత పెరగడం కాదనలేని వాస్తవమని ఇందిరాగాంధీ రాష్ట్రీయ మానవ సంగ్రహాలయ (భోపాల్) డెరైక్టర్ ప్రొ. సరిత్ చౌదరి వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు చేపట్టిన పథకాల ద్వారా ఆదిమ గిరిజన తెగలు (పీవీటీజీలు) నివాసముంటున్న గ్రామాల సంఖ్య తగ్గాల్సి ఉండగా, అందుకు భిన్నంగా గతంలో 55 వేలు ఉన్న ఈ సంఖ్య 75 వేలకు పెరిగిందన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆదివాసీలు, గిరిజనుల మధ్యే ఇంకా అంతరాలున్నాయని, ఒక తెగను మరో తెగ గుర్తించే పరిస్థితి లేదన్నారు. గురువారం రామాంతపూర్‌లోని ఆర్నాల్డ్ భవన్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద్రావిడియన్ కల్చర్, రిసెర్చ్ (సంస్కృతి) ఆధ్వర్యంలో ‘‘ట్రైబ్స్ ఇన్ కాంటెంపరరీ ఇండియా.. కాన్సెప్ట్స్ అండ్ కాంటెక్స్ట్’’ అనే అంశంపై మూడో జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో సరిత్ చౌదరి కీలకోపన్యాసం చేస్తూ ఒక రాష్ర్టంలో ఎస్టీలుగా గుర్తింపు పొందిన వారిని పొరుగునే ఉన్న మరో రాష్ట్రంలో ఎస్టీలుగా పరిగణించడం లేదన్నారు. అసోంలో మిషన్ తెగ వారు ఎస్టీలైతే అరుణాచల్ ప్రదేశ్‌లో కాదని, ద్వంద్వత్వమనేది దేశంలో ఇంకా కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సొసైటీ ఆఫ్ డివైన్ వర్డ్ (ఎస్వీడీ) కన్సల్టర్స్ జనరల్ (రోమ్) మజోలా మిడో ఘి మాట్లాడుతూ దేశంలో ఉండే ప్రజలంతా తమకు మిగతావారితో సమానంగా హక్కులు కలిగి ఉండాలని, గుర్తింపును పొందాలని, వివక్షకు గురికాకూడదని కోరుకుంటారన్నారు. ఎస్సీలకు అన్యాయం: కంచ ఐలయ్య గిరిజనుల పట్ల క్రైస్తవమిషనరీలకు నిజంగా సానుభూతి ఉంటే గిరిజన ప్రాంతాల్లో ఇంగ్లిష్‌ను బోధించాలని కంచ ఐలయ్య వ్యాఖ్యానించారు. దేశంలో దళితులు, మహిళలకు గౌరవమనేదే లేదన్నారు. ఎస్సీలకు అన్యాయం జరుగుతోందని, వివక్షకు గురవుతున్నారని చెబుతూ రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ఉదంతాన్ని వివరించారు. ఈ సదస్సుకు సంస్కృతి డెరైక్టర్ డా. జి.లాజర్ అధ్యక్షత వహించగా.. సంస్కృతి చైర్పర్సన్ రెవరెండ్ ఫాదర్ ఆంథోని జోసెఫ్ సందేశమిచ్చారు. కార్యక్రమంలో డా. త్రినాథరావు, జీవన్‌కుమార్ (హ్యూమన్ రైట్స్ ఫోరమ్), థామస్ కావుమ్ కట్టియాల్ పాల్గొన్నారు.