సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యంత బలహీన గిరిజన సమూహాలు (పీవీటీజీ) అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వారి సంక్షేమానికి ఆరు ప్రధాన సూత్రాలను అమలు చేస్తోంది. ఇందుకోసం ప్రాథమికంగా సర్వే నిర్వహించి రాష్ట్రంలో 12 తెగల పీవీటీజీలను గుర్తించింది. ఈ 12 తెగల్లో 2,99,516 మంది ఉన్నట్టు నిర్ధారించింది. ఈ క్రమంలో 3,367 గిరిజన గ్రామాల్లో పీవీటీజీలకు చెందిన లక్షా 528 నివాసాలకు ప్రధాన వసతులు ఏ మేరకు ఉన్నాయి? ఇంకా ఏం చేయాలి? అనే కోణంలో ప్రభుత్వం దృష్టి సారించింది.
ఇందులో భాగంగా వారికి సురక్షిత గృహాలు, పరిశుభ్రమైన తాగునీరుతోపాటు పారిశుధ్య నిర్వహణ, విద్యకు ప్రాధాన్యత, ఆరోగ్యంతోపాటు పోషకాహారం, రహదారులతోపాటు టెలిఫోన్ అనుసంధానత, స్థిరమైన జీవనోపాధి వంటి ఆరు అంశాలకు ప్రాధాన్యత ఇస్తోంది. కాగా, అత్యంత బలహీన గిరిజన సమూహాల అభివృద్ధికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అనేక చర్యలు చేపట్టింది.
రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.20,948.15 కోట్లు ఎస్టీ కాంపోనెంట్ నిధులను ఖర్చు చేసింది. అలాగే అన్ని నవరత్న పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను వారికి అందిస్తోంది. వీటికితోడు కేంద్ర ప్రభుత్వం కూడా పీవీటీజీల కోసం ‘పీఎం పీవీటీజీ డెవలప్‌మెంట్ మిషన్’ పేరుతో కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో వారి అభివృద్ధికి మరింత ఊతమిచ్చినట్టు అయ్యింది.
పీవీటీజీల అభివృద్ధికి ప్రాధాన్యం..
రాష్ట్రంలో పీవీటీజీల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా ఈ వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ‘పీఎం పీవీటీజీ డెవలప్‌మెంట్ మిషన్’ పేరుతో కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది.
దీని అమలు కోసం పీవీటీజీల స్థితిగతులపై సర్వే నిర్వహించి వారికి ఉన్న ప్రాథమిక సౌకర్యాలు, నివాసాల వివరాలు సేకరించాం. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘బిసాగ్–ఎన్’ మొబైల్ యాప్‌లో ఎప్పటికప్పుడు అధికారులు వివరాలు నమోదు చేస్తారు. యాప్ వినియోగంపై శిక్షణ కూడా ఇస్తాం. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి
Comments
Please login to add a commentAdd a comment