girijanulu
-
అడవి బిడ్డలకూ పథకాలు అందాలి
అరకులోయ టౌన్ (అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రభుత్వ సంక్షేమ పథకాలు మారుమూల గిరిజనులకు సైతం అందినప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆదీవాసీల (పీవీటీజీల) సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలతోపాటు పీవీటీజీ గిరిజనులకు 150 రోజుల పనిదినాలు కల్పిస్తున్నామన్నారు. పీఎం కిసాన్, ప్రధాని ఉజ్వల్ యోజనతో ఉచిత గ్యాస్ కనెక్షన్, ఆయుష్మాన్ భారత్ కార్డులు, అటవీ హక్కు పత్రాల పంపిణీ, జన్‌ధన్ ఖాతాలు, వన్‌దన్ వికాస్ కేంద్రాలు, పీఎం జల్ జీవన్ లాంటి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రధాని ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం నిధుల విడుదల సందర్భంగా సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయ మండలం కొత్తభల్లుగుడ ప్రాథమిక పాఠశాల, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కేఆర్‌పురంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆదీవాసీ గిరిజనులతో ప్రధాని వర్చువల్ సమావేశం ద్వారా ముచ్చటించారు. పీవీటీజీ మహిళ: నాపేరు స్వాభి గంగ, మాది గద్యగుడ గ్రామం, అరకులోయ మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నా భర్త పేరు స్వాభి రామచందర్. మాకు ఇద్దరు పిల్లలు.పీఎం: పీఎం జన్మన్ గురించి మీకు ఎలా తెలిసింది? స్వాభి గంగా: జనవరి 5న మా గ్రామంలో అధికారులు అవగాహన సదస్సు నిర్వహించి ప్రధాన మంత్రి జన్మన్ పథకం గురించి వివరించారు. పీఎం: జన్మన్ అవగాహన సదస్సుతో మీరు ఎలాంటి లబ్ధి పొందారు? స్వాభి గంగా: అవగాహన సదస్సు ద్వారా పీఎం ఆవాస్ యోజన కింద ఇంటి కోసం, పీఎం జలçజీవన్ యోజన కింద కుళాయి కోసం, పీఎం జన ఆరోగ్య కింద నా కుటుంబ సభ్యులకు ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం నమోదు చేసుకున్నా. నాకు పథకాలన్నీ మంజూరు చేశారు. పీఎం: మీ జీవనాధారం ఏమిటి? స్వాభి గంగా: ఆర్వోఎఫ్ఆర్ పథకంలో నాకు 35 సెంట్లు భూమికి పట్టా వచ్చింది. అందులో కాఫీ, మిరియాలు సాగు చేస్తూ మంచి గిట్టు బాటు ధర పొందుతున్నాం. పీఎం: అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావడం ఎలా అనిపిస్తోంది? స్వాభి గంగా: చాలా ఆనందంగా ఉంది. గతంలో దళారులకు విక్రయించి మోసపోయేవాళ్లం. ఇప్పుడు మంచి ధర లభిస్తోంది. కొండరెడ్డి గిరిజనులతో ముఖాముఖి పీఎం జన్మన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కేఆర్‌పురం కొండరెడ్డి గిరిజనులతో మాట్లాడారు. పీఎం జనజాతి, ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్మన్) కార్యక్రమం అమలులో భాగంగా అందించే సేవలను వివరించారు. ఈ కార్యక్రమం వల్ల పీవీటీజీ గ్రామాల్లో రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు. -
చేపల వేటపై వివాదం
సాక్షి, మనుబోలు: మండలంలోని లక్ష్మీనరసింహపురంలో బంగారమ్మ చెరువుకు సంబంధించి చేపల వేట విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొంది. దీంతో మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, గూడూరు రూరల్ సీఐ వంశీకృష్ణ, తహసీల్దార్ లక్ష్మీకుమారి ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయంలో బంగారమ్మ చెరువు సొసైటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. నాలుగేళ్ల క్రితం బంగారమ్మ చెరువు చేపల సొసైటీని ఎల్‌ఎన్‌పురం, పిడూరు గ్రామాలకు వేర్వేరుగా విభజించి రెండు సొసైటీలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 30 మంది సభ్యులతో ఎల్‌ఎన్‌పురం సొసైటీని ఏర్పాటు చేశారు. నాలుగేళ్లుగా బంగారమ్మ చెరువులో చేపల వేట సాగిస్తున్నా తమకు రూపాయి కూడా పైకం చెల్లించ లేదని కొందరు సభ్యులు వాపోతున్నారు. ఈ ఏడాదైనా తమకు కూడా వాటా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొనడంతో ఓ వర్గం వారు తరచూ చేపల వేటను అడ్డుకుంటున్నారు. ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారి రాజకీయ రంగు పులుముకుంది. దీంతో వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. దీన్ని రెవెన్యూ కార్యాలయంలో పరిష్కరించుకోవాలని చెప్పడంతో స్పందించిన తహసీల్దార్ లక్ష్మీకుమారి సీఐ, మత్స్యశాఖ ఇన్స్పెక్టర్లను పిలిపించి తన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. మత్స్య సంపదను కొల్లగొడుతున్న టీడీపీ నాయకుడు సమాశంలో కొందరు సభ్యులు మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు సొసైటీని తన గుప్పెట్లో పెట్టుకుని తమకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మత్స్య సంపదను కొల్లగొడుతున్నాడని ఆరోపించారు. కేవలం తనకు అనుకూలంగా ఉండే కొందరికి కొద్దిగా నగదు ఇచ్చి మిగిలినదంతా అతను దోచుకుంటున్నాడని తెలిపారు. అధికారులు స్పందించి చెరువులో చేపలపై అందరికీ హక్కు కల్పించాలని కోరారు. దీనికి స్పందించిన తహసీల్దార్ లక్ష్మీకుమారి మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున చేపల వేటకు ఎవరికీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఈ నెల 28వ తేదీ వరకూ కోడ్ ఉన్నందున ఎవరూ చెరువులో దిగవద్దని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వేట సాగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నెలాఖరు వరకూ ఆగితే చెరువులో నీళ్లు తగ్గి చేపలు చనిపోతాయని కొందరు అధికారుల దృష్టికి తెచ్చారు. దీంతో మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ చెరువులను పరిశీలించి నివేదక ఇవ్వాలని తహసీల్దార్ ఆదేశించారు. నివేదకను కలెక్టర్‌కు పంపించి అనుమతి ఇచ్చిన తరువాతే వేటకు దిగాలని సూచించారు. ఇరు వర్గాల ఘర్షణకు దిగితే కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. -
లోయలో పడిన ఆయిల్ ట్యాంకర్
సాక్షి, అరకులోయ : అరకులోయ–సుంకరమెట్ట రోడ్డులోని కొత్తభల్లుగుడ హాస్టల్ సమీపంలోని మలుపువద్ద ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి లోయలోకి దూసుకుపోయి బోల్తా పడింది. గురువారం రాత్రి 9గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ట్యాంకర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న సమయంలో విద్యుత్ వైర్లు కలిసిపోయి, సమీపంలోని ట్రాన్స్ఫారం వద్ద విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యుత్ సరఫరా జరిగి ఉంటే ఈ ఆయిల్ ట్యాంకర్ పేలిపోయి పెద్దప్రమాదం జరిగి ఉండేది. విశాఖపట్నం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి ఎనిమిది వేల లీటర్ల డీజిల్, నాలుగు వేల లీటర్ల పెట్రోల్‌తో అరకులోయలోని నాయక్ ఆయిల్ బంక్‌కు ట్యాంకర్ బయలుదేరింది. గమ్యస్థానానికి 10 నిమిషాల్లో ట్యాంకర్ చేరుకుంటుందనగా కొత్తభల్లుగుడ హాస్టల్ సమీపంలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయే సమయంలో బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో అదుపు తప్పిన ట్యాంకర్ మలుపులోని రక్షణగోడ, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి లోయలోకి బోల్తా కొట్టింది. ట్యాంకర్ డ్రైవర్ హరి,క్లీనర్ చిన్నలకు గాయాలయ్యాయి. వీరిద్దర్నీ విశాఖపట్నంలోని ఆస్పత్రికి తరలించారు. ఐవోసీ అధికారుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి, సంఘటన స్థలాన్ని పరిశీలించారు రూ.9 లక్షల ఆయిల్ నేలపాలు ఈ ప్రమాదం కారణంగా రూ.9 లక్షల విలువైన డీజిల్, పెట్రోల్ నేలపాలయ్యాయి. ట్యాంకర్ బోల్తా పడిందన్న సమాచారం తెలుసుకున్న కొత్త భల్లుగుడ,సమీపంలోని గ్రామాల గిరిజనులు సంఘటన ప్రాంతానికి చేరుకుని వృథాగా పోతున్న పెట్రోల్,డీజిల్‌ను బిందెలు,డబ్బాలతో పట్టుకున్నారు. ఆయిల్ ట్యాంకర్ కావడంతో మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని ట్యాంకర్వద్దకు వెళ్లవద్దని పోలీసులు గిరిజనులను హెచ్చరించారు. ట్యాంకర్ వద్దకు వెళ్లకుండా నిలువరించారు. అందిన సమాచారం మేరకు పాడేరు అగ్నిమాపక వాహనం రాత్రి 11గంటల సమయంలో సంఘటన స్థలానికి వచ్చింది. మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నం వరకు తగిన చర్యలు తీసుకున్నారు. విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో పాటు, వైర్లు తెగిపడడంతో ఈ ప్రాంతంలో గురువారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
భూసేకరణపై భగ్గుమన్న గిరిజనులు
జీలుగుమిల్లి : గిరిజనులు సాగు చేస్తున్న భూములను పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం సేకరించడంపై గిరిజన సంఘాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో మూడు గంటల పాటు ధర్నా చేసి తహసీల్దార్ డీవీఎస్ సుబ్బారావును ఘోరావ్ చేశారు. రెవెన్యూ అధికారులు గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. పి.నారాయణపురంలో స్థానిక గిరిజనులు సాగు చేసుకున్న భూములను నిర్వాసిత గిరిజనులు పోలీస్ రక్షణలో దున్నివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు వేసుకున్న పంటకు అధికారులు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని గిరిజనులు బైఠాయించారు. భూసేకరణ అధికారి ఐటీడీఏ పీవోతో తహసీల్దార్ ఫోన్లో మాట్లాడారు. స్థానిక గిరిజనుల డిమాండ్లను వివరించారు. న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో గిరిజనులు ఆందోళన విరమించారు. గిరిజన సంఘం నాయకులు తెల్లం దుర్గారావు, సీపీఎం మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ,వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి సిరిబత్తుల సీతారామయ్య,రాజమండ్రి దానియేలు తదితరులు పాల్గొన్నారు. -
జ్వర మరణాలు సంభవిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్
అరకులోయ : ఏజెన్సీ ప్రాంతంలో జర్వాలతో గిరిజనులు మరణిస్తే వైద్య సిబ్బందిపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. అరకులోని పర్యాటక శాఖ పున్నమి వేలీ రిసార్ట్స్ గోష్టి సమావేశ మందిరంలో ఏజెన్సీలోని వైద్యాధికారులు, అరకు నియోజకవర్గం పరిధిలోని వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. గిరిజన గ్రామాలలో జ్వరాలతో ఎవరైనా మరణిస్తే.. డాక్టర్‌తోపాటు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించినట్లు రుజువైతే సస్పెన్షన్‌తోపాటు క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. ఆరోగ్య శిబిరాలు, పిన్ పాయింట్ ప్రోగ్రాంలు నిర్వహించి వ్యాధుల అదుపునకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి ఆస్పత్రిలో మందులు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాలని, మందులు లేవని వారం ముందు చెబితే ఎక్కువ మందులున్న ఆస్పత్రుల నుంచి సర్దుబాటు చేస్తామని చెప్పారు. గ్రామాల్లో రోగులకు వైద్య సేవలందించేందుకు వైద్యులకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. కొంతమంది రోగులు ఆస్పత్రికి వెళ్లడానికి ఇష్టపడరని, అలాంటి వారిని పోలీసుల సాయంతో ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మండలాభివద్ధి అధికారి, వైద్యాధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వారంలో పోస్టుల భర్తీ ఏజెన్సీలో ఖాళీగా ఉన్న వైద్యాధికారులు, వైద్యసిబ్బంది పోస్టులను వారం రోజుల్లో భర్తీ చేస్తామని కలెక్టర్ ప్రవీణ్ చెప్పారు. ఎపిడమిక్ సీజన్‌ను దష్టిలో పెట్టుకొని కొత్తగా 95 మంది వైద్య సిబ్బందిని నియమించామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నివాస్, ఇన్చార్జీ పీఓ లోతేటి శివశంకర్, డీఎంఅండ్ హెచ్ఓ సరోజిని, జెడ్పీ సీఈఓ జయప్రకాష్, డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, టూరిజం ఈడీ శ్రీరాములు నాయుడు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ఉ‘త్తీజ్’..
నిజామాబాద్‌కల్చరల్ : బంజారాలు సంప్రదాయ పండుగైన తీజ్‌ను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. యువతులు గోధుమ మొలకలతో ఉన్న బుట్టలను తలపై ధరించి నగరంలో శోభాయాత్ర నిర్వహించారు. కలెక్టరేట్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ కవిత, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్, మేయర్ సుజాత పాల్గొన్నారు. యువతులతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేశారు. బంజారాలు సంప్రదాయ పండుగైన తీజ్‌ను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ నెల 23 న జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌లో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో బంజారా తీజ్ ఉత్సవం–2016 పేరిట తీజ్ ఉత్సవాలను ప్రారంభించారు. యువతులు బుట్టల్లో గోధుమ మొలకలను వేశారు. శనివారం వరకు రోజూ పూజలు చేశారు. ఆదివారం తీజ్ పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా యువతులు గోధుమ మొలకలతో ఉన్న బుట్టలపై తలపై ధరించి, శోభాయాత్రగా కలెక్టరేట్ వరకు వచ్చారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్, నిజామాబాద్ ఎంపీ కవిత, మేయర్ సుజాత పాల్గొన్నారు. కలెక్టరేట్ మైదానంలో యువతులతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేశారు. ఆ తర్వాత కొందరు అశోక్‌సాగర్‌లో, మరికొందరు బాసర గోదావరి జలాలలో గోధుమ మొలకలను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నాయకుడు ఎస్ఏ అలీం, కార్పొరేటర్లు విశాలినీరెడ్డి, కాపర్తి సుజాత, కడారి శ్రీవాణి, చాంగుబాయి, రైల్వే ఉద్యోగుల సంఘం నాయకుడు జగన్నాయక్, తీజ్ ఉత్సవ నిర్వహణ కమిటీ ప్రతినిధులు డాక్టర్ మోతీలాల్, ప్రేమ్‌లాల్, చాంగుబాయి, సంతోష్‌నాయక్, రవీంద్రనాయక్, శంకర్ నాయక్, తుకారాం నాయక్, గంగాధర్, శ్రీహరినాయక్ తదితరులు పాల్గొన్నారు. తీజ్ వేడుకల్లో శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీ కామారెడ్డి : బంజార సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కామారెడ్డి పట్టణంలో తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ పాల్గొని గిరిజనులతో కలిసి నృత్యాలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పిప్పిరి సుష్మ, బంజార సేవా సంఘం నేతలు గణేశ్ నాయక్, మోతీసింగ్, డాక్టర్ వెంకట్, జమునా రాథోడ్, రాణాప్రతాప్, లస్కర్‌నాయక్, బల్రాం, ప్రవీణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.