లోయలో పడిన ఆయిల్‌ ట్యాంకర్‌ | Sakshi
Sakshi News home page

లోయలో పడిన ఆయిల్‌ ట్యాంకర్‌

Published Sat, Jun 16 2018 12:18 PM

Oil Tanker Put Down In The Valley - Sakshi

సాక్షి, అరకులోయ : అరకులోయ–సుంకరమెట్ట రోడ్డులోని కొత్తభల్లుగుడ హాస్టల్‌ సమీపంలోని మలుపువద్ద  ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ అదుపు తప్పి లోయలోకి  దూసుకుపోయి బోల్తా పడింది. గురువారం రాత్రి 9గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ట్యాంకర్‌  విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న సమయంలో విద్యుత్‌ వైర్లు కలిసిపోయి, సమీపంలోని ట్రాన్స్‌ఫారం వద్ద విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యుత్‌ సరఫరా జరిగి ఉంటే ఈ ఆయిల్‌ ట్యాంకర్‌ పేలిపోయి పెద్దప్రమాదం జరిగి ఉండేది. విశాఖపట్నం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ నుంచి ఎనిమిది వేల లీటర్ల డీజిల్, నాలుగు వేల లీటర్ల పెట్రోల్‌తో అరకులోయలోని నాయక్‌ ఆయిల్‌ బంక్‌కు ట్యాంకర్‌ బయలుదేరింది. గమ్యస్థానానికి 10 నిమిషాల్లో  ట్యాంకర్‌ చేరుకుంటుందనగా కొత్తభల్లుగుడ హాస్టల్‌ సమీపంలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయే సమయంలో బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయి. దీంతో అదుపు తప్పిన ట్యాంకర్‌ మలుపులోని రక్షణగోడ, విద్యుత్‌  స్తంభాన్ని ఢీకొట్టి లోయలోకి బోల్తా కొట్టింది. ట్యాంకర్‌ డ్రైవర్‌ హరి,క్లీనర్‌ చిన్నలకు గాయాలయ్యాయి. వీరిద్దర్నీ విశాఖపట్నంలోని ఆస్పత్రికి తరలించారు. ఐవోసీ అధికారుల ఫిర్యాదు మేరకు  ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదు చేసి, సంఘటన స్థలాన్ని పరిశీలించారు


రూ.9 లక్షల ఆయిల్‌ నేలపాలు
ఈ ప్రమాదం కారణంగా రూ.9 లక్షల విలువైన డీజిల్, పెట్రోల్‌ నేలపాలయ్యాయి. ట్యాంకర్‌ బోల్తా పడిందన్న సమాచారం తెలుసుకున్న కొత్త భల్లుగుడ,సమీపంలోని గ్రామాల గిరిజనులు సంఘటన ప్రాంతానికి చేరుకుని వృథాగా పోతున్న పెట్రోల్,డీజిల్‌ను బిందెలు,డబ్బాలతో పట్టుకున్నారు. ఆయిల్‌ ట్యాంకర్‌ కావడంతో మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని ట్యాంకర్‌వద్దకు వెళ్లవద్దని పోలీసులు గిరిజనులను  హెచ్చరించారు. ట్యాంకర్‌ వద్దకు వెళ్లకుండా నిలువరించారు. అందిన సమాచారం మేరకు పాడేరు అగ్నిమాపక వాహనం రాత్రి 11గంటల సమయంలో సంఘటన స్థలానికి వచ్చింది. మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నం వరకు తగిన చర్యలు తీసుకున్నారు. విద్యుత్‌ స్తంభం విరిగిపోవడంతో పాటు, వైర్లు తెగిపడడంతో ఈ ప్రాంతంలో గురువారం రాత్రి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

Advertisement
 
Advertisement
 
Advertisement