
ప్రకృతి సృష్టించిన కొన్ని అందాలను ఎంత చూసినా తనివి తీరదు. ఒకింత ఆనందం, ఒకింత ఆశ్చర్యం కలగలిసిన అద్భుతాన్ని మనసారా ఆస్వాదించాలంటే, తప్పకుండా ‘ది టర్కోయిస్ పూల్స్’కి వెళ్లాల్సిందే అంటారు పర్యాటకులు.
టర్కీలోని డెనిజ్లీ ప్రావిన్స్ పముక్కలేలో కనిపించే అందమైన నీలిరంగు కొలనులు ఆహ్లాదానికే కాదు, ఆరోగ్యానికీ ఉత్తమమట! ‘పముక్కలే’ అంటే, ‘పత్తి కోట’ అని అర్థం. ఈ ప్రదేశంలో కాల్షియం కార్బొనేట్ సహా అరుదైన ఖనిజాలతో నిండిన నీరు కొండల మీదుగా నెమ్మదిగా జారుతూ, తెల్లటి సున్నపురాతి కొండలను తొలచడంతో అక్కడక్కడా కొలనుల్లాంటి వేడినీటి బుగ్గలు ఏర్పడ్డాయి.
ఈ వేడినీటిలో స్నానం చేస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సమీపంలో పురాతన హియెరాపోలిస్ నగరం ఉంది. దాంతో అక్కడ పురాతన శిథిలాలు, థియేటర్లు ఇతర చారిత్రక కట్టడాలను చూడవచ్చు. అందుకే ఈ ప్రాంతాన్ని ‘యునెస్కో’ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.