
జేమ్స్ స్టీఫెన్ జిమ్మీ డొనాల్డ్‌సన్ అంటే ఎవరికీ తెలియదు. ‘మిస్టర్ బీస్ట్’ (MrBeast) అనండి... వెంటనే గుర్తుపట్టేస్తారు. అతను ప్రఖ్యాత యూట్యూబర్. ప్రపంచవ్యాప్తంగా 383 మిలియన్ల సబ్‌స్క్రైబర్లను కలిగిన యూట్యూబ్ ఛానెల్ ‘MrBeast’ ని అతనే నిర్వహిస్తున్నాడు. యూట్యూబ్ ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్న బీస్ట్ ప్రపంచంలోని అనేకమంది ధనవంతులను మించిపోతున్నాడు. అతని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా?
మిస్టర్ బీస్ట్ పుట్టింది 1998 మే 7న. అమెరికాలోని కాన్సస్‌లో పుట్టి, ఉత్తర కరోలినాలోని గ్రీస్‌విల్లేలో పెరిగారు. 2012 నుంచి యూట్యూబ్‌లో వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. ఐదేళ్ల తర్వాత, 2017లో అతను చేసిన ‘కౌంటింగ్ టు 1,00,000’ వీడియో కొన్ని రోజుల్లోనే 10 వేల దాకా వ్యూస్ సాధించి, అతని ఛానెల్‌కి ప్రాచుర్యం తీసుకొచ్చింది. అలా మెల్లగా అతని వీడియోలకు వీక్షకులు పెరిగారు. విచిత్రమైన విన్యాసాలు, కొత్త కొత్త ప్రయోగాలు వంటివి మిస్టర్ బీస్ట్ ఛానెల్లో ప్రధానంగా కనిపిస్తాయి.
ఫోర్బ్ నివేదిక ప్రకారం, మిస్టర్ బీస్ట్ 2023–2024లో సంపాదించిన మొత్తం 85 మిలియన్ డాలర్లు(సుమారు రూ.732 కోట్లు). ఇంత ఆదాయం కలిగిన మరొక యూట్యూబర్ ప్రపంచంలో మరెవరూ లేరు. యూట్యూబ్ వీడియోల ద్వారా అతను నెలకు సుమారు 50 మిలియన్ డాలర్లు (సుమారు రూ.430 కోట్లు) సంపాదిస్తున్నాడని అంచనా. ఛానెల్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఆయన మరికొన్ని వ్యాపారాలను ప్రారంభించారు. వాటి ద్వారా రూ.కోట్లలో ఆదాయం వస్తోంది. అన్నీ కలిపి అతణ్ని అత్యంత ధనవంతుణ్ని చేశాయి.
ఇదీ చదవండి: రోజులో 7 గంటలు దానికే : శాపమా, వరమా?!