
ప్రతిపక్ష నేత ఇమామోగ్లు అరెస్టుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు
ఇస్తాంబుల్: అవినీతి ఆరోపణలతో ప్రతిపక్ష నాయకుడు ఎక్రెమ్ ఇమామోగ్లు అరెస్టుతో తుర్కియేలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆయనకు మద్దతుగా వేలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. ఇమామోగ్లును అదుపులోకి తీసుకున్న నాటి నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి ఇస్తాంబుల్ సిటీ హాల్ వద్ద గుమిగూడిన జనం తుర్కియే జెండాలు ఎగరవేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దీంతో ప్రభుత్వం నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువును, రబ్బరు పెల్లెట్లను, పెప్పర్‌స్పేని ప్రయోగించింది. మొత్తంగా తుర్కియేలోని 81 ప్రావిన్సుల్లో కనీసం 55 ప్రావిన్సుల్లో, దేశంలో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు జరిగాయి. ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1,133 మందికి పైగా అరెస్టులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆందోళనల్లో 123 మంది పోలీసులు గాయపడ్డారని వెల్లడించారు.
జర్నలిస్టుల అరెస్టు..
మరోవైపు సోమవారం పలువురు జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎనిమిది మంది రిపోర్టర్లు, ఫోటో జర్నలిస్టులను ప్రభుత్వం నిర్బంధించిందని జర్నలిస్టు యూనియన్ తెలిపింది. ఇది పత్రికా స్వేచ్ఛ, సత్యాన్ని తెలుసుకునే ప్రజల హక్కుపై దాడి చేయడమేనని, జర్నలిస్టులను మౌనంగా ఉంచి నిజాన్ని దాచలేరని పేర్కొంది. వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
రాజకీయ ప్రతీకారంతోనే అరెస్టు : ఇమామోగ్లు
అవినీతి ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా రాజకీయనాకులు, జర్నలిస్టులు వ్యాపారవేత్తలను మొత్తంగా 100 మందిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ (సీహెచ్‌పీ) నేత ఇమామోగ్లు కూడా ఉన్నారు. ఆయనను అరెస్టు చేస్తున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఉగ్రవాద సంస్థతో సంబంధాలు, లంచాలు తీసుకోవడం, దోపిడీ, చట్టవిరుద్ధంగా వ్యక్తిగత డేటాను నమోదు చేయడం, టెండర్ రిగ్గింగ్ వంటి అభియోగాలపై అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సిలివ్రీలోని జైలుకు రిమాండ్‌కు తరలించారు. మరోవైపు ఇమామోగ్లును మేయర్ పదవి నుంచి సస్పెండ్ చేసినట్లు తుర్కియే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అవాంతరాలు..
ఇమామోగ్లును అరెస్టు చేసినా.. 2028 అధ్యక్ష అభ్యర్థి ఎంపిక కోసం ఆదివారం ఓటింగ్ జరిగింది. అధ్యక్ష అభ్యరి్థగా ఇమామోగ్లు ఒక్కరే పోటీ చేశారు. అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల్లో దాదాపు కోటిన్నర మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని సీహెచ్‌పీ తెలిపింది. సుమారు పది లక్షలకు పైగా ఓట్లు తమ సభ్యుల నుంచి రాగా, మిగిలినవి ఇమామోగ్లుకు సంఘీభావంగా తమ సభ్యులు కానివారు వేసినవని సీహెచ్‌పీ వెల్లడించింది.
ఈ అరెస్టు ఇమామోగ్లు అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకోలేదు. అభియోగాలు రుజువైతే మాత్రం అతను ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఇదిలావుండగా, అవకతవకల కారణంగా ఇమామోగ్లు డిగ్రీని రద్దు చేస్తున్నట్లు ఇస్తాంబుల్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. అధ్యక్ష పదవిని నిర్వహించడానికి ఉన్నత విద్యను పూర్తి చేసి ఉండాలని తుర్కియే రాజ్యాంగం చెబుతోంది. ఇదే జరిగితే.. అధ్యక్ష పదవికి పోటీ చేయడం కూడా ప్రశ్నార్థకం అవుతుంది. అయితే ఇమామోగ్లు డిగ్రీ రద్దు నిర్ణయాన్ని రాజ్యాంగ న్యాయస్థానం, యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌లో అప్పీల్ చేస్తామని ఇమామోగ్లు న్యాయవాదులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment