భూసేకరణపై భగ్గుమన్న గిరిజనులు
Published Mon, Sep 19 2016 9:40 PM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
జీలుగుమిల్లి :
గిరిజనులు సాగు చేస్తున్న భూములను పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం సేకరించడంపై గిరిజన సంఘాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో మూడు గంటల పాటు ధర్నా చేసి తహసీల్దార్ డీవీఎస్ సుబ్బారావును ఘోరావ్ చేశారు. రెవెన్యూ అధికారులు గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. పి.నారాయణపురంలో స్థానిక గిరిజనులు సాగు చేసుకున్న భూములను నిర్వాసిత గిరిజనులు పోలీస్ రక్షణలో దున్నివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు వేసుకున్న పంటకు అధికారులు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని గిరిజనులు బైఠాయించారు. భూసేకరణ అధికారి ఐటీడీఏ పీవోతో తహసీల్దార్ ఫోన్‌లో మాట్లాడారు. స్థానిక గిరిజనుల డిమాండ్లను వివరించారు. న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో గిరిజనులు ఆందోళన విరమించారు. గిరిజన సంఘం నాయకులు తెల్లం దుర్గారావు, సీపీఎం మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ,వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి సిరిబత్తుల సీతారామయ్య,రాజమండ్రి దానియేలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement