
గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడంలో అందరికన్నా పెద్దవారని, నిజాలు చెప్పడంలో అందరికన్నా చిన్నవాడంటూ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి గుంటూరు నుంచి ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంబటి.. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి పోలవరం వెళ్ళారని,. చంద్రబాబు అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు పరుగులు తీస్తుందని ఆయన అనుకూల పత్రికలు రాసిన విషయాన్ని అంబటి గుర్తు చేశారు.
‘2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని 2018కి పూర్తి చేస్తామని అప్పటి మంత్రులు చెప్పారు. వైఎస్ జగన్ పాలనలో పోలవరం నత్తనడకన నడిచిందని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు అవకాశం వచ్చినప్పుడల్లా వైఎస్ జగన్ పై బురుద జల్లుతున్నారు. 2019లో మళ్లీ మేము అధికారంలోకి వచ్చినట్లయితే 2020- 21లో పోలవరాన్ని పూర్తిచేసే వాళ్ళమని ఆయన చెప్పటం విడ్డూరంగా ఉంది.
అసలు పోలవరాన్ని సర్వనాశనం చేసింది విధ్వంసం చేసింది చంద్రబాబు నాయుడు. వైఎస్ జగన్ హయాంలో పోలవరం పనులు శరవేగంగా నడిచాయి. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పటంలో అందరికన్నా పెద్దవాడు. నిజాలు చెప్పటంలో అందరికన్నా చిన్నవాడు. జగన్ పాలనలో పోలవరం నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళించారని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు.
పోలవరం నిధులు ప్రభుత్వానికి మళ్ళించినట్లు రుజువు చేస్తే చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తాను. పోలవరం నిర్మాణ సమయంలో చంద్రబాబు చేసుకున్న ఒప్పందం ఏంటో తెలుసా?, ముందు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం కోసం డబ్బులు ఖర్చు పెడుతుంది ఆ డబ్బులను కేంద్రం తర్వాత రీయింబర్స్ చేస్తుంది. అలాంటప్పుడు నిధులు మళ్ళించడం ఎలా సాధ్యమవుతుంది?, పోలవరం రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పోలవరానికి అన్ని అనుమతులు తీసుకువచ్చారు. అసలు కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన పోలవరాన్ని చంద్రబాబు నాయుడు మేమే కడతావని ఎందుకు ఒప్పందం చేసుకున్నారు’? అని అంబటి ప్రశించారు.