
- రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు
- స్థానిక ఉప ఎన్నికల్లో 'కూటమి' దౌర్జన్యాలు
- బలం లేకపోయినా గెలవడానికి అడ్డదోవలు
- 51 చోట్ల జరిగిన ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగంతో అరాచకాలు
- అన్ని ఒత్తిళ్ళను అధిగమించి 30కి పైగా చోట్ల వైఎస్సార్‌సీపీ విజయం
- చంద్రబాబు దుర్మార్గాలకు ప్రజలే గుణపాఠం నేర్పుతారు
- ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆగ్రహం
తాడేపల్లి : కూటమి నేతల అరాచకాలతో ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు వైఎస్సార్‌సీపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తాజా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అడ్డదోవలో పదవులను దక్కించుకునేందుకు కూటమి పార్టీలు అత్యంత నీచమైన దిగజారుడు రాజకీయానికి పాల్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు బలం లేకపోయినా బెదిరింపులు, కేసులతో, వేధింపులతో ఏదో ఒక విధంగా పదవులను చేజిక్కించుకునేందుకు కుటిల రాజకీయంతో బరితెగించారని ధ్వజమెత్తారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా దానిలో ఏదో ఒక విధంగా అడ్డదారిలో గెలవాలనే తలంపుతో రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదకాలు ఇస్తూ కూటమి పార్టీలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయి. ఏపీలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను చూసి ప్రజాస్వామికవాదులు సిగ్గు పడుతున్నారు. ఏపీలో ప్రజాస్వామిక విలువలు ఉండవా అని ప్రశ్నిస్తున్నారు. స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకోలేని దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అధికార కూటమి పార్టీలు పదవులను దక్కరించుకునేందుకు అడ్డదోవలు తొక్కుతున్నాయి. పదవుల్లో పోటీకి సిద్దమైన వారిని భయపెట్టి, కేసులతో వేధింపులకు పాల్పడుతూ వారిని పోటీకి దూరంగా ఉంచుతున్నాయి.
నాలుగుసార్లు సీఎంగా ఉండి, రాజకీయాల్లో సీనియర్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నిస్సిగ్గుగా ఇలా వ్యవహరిస్తున్నారు. తమ పార్టీలో చేరాలంటే ప్రస్తుతం వారు ఉన్న పార్టీకి, ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించే పదవులకు రాజీనామా చేసిన తరువాతే రావాలంటూ చాలాసార్లు చంద్రబాబు గొప్పగా ప్రకటించారు. కానీ వాస్తవం చూస్తూ ఫిరాయింపు రాజకీయాలు, అడ్డదోవలో బెదిరించి, కేసులు పెట్టి మరీ ఎన్నికల్లో తమకు బలం లేకపోయినా పదవులను చేజిక్కించుకుంటున్న కుటిల రాజకీయం కనిపిస్తోంది. ఇదీ చంద్రబాబు నిజస్వరూపం. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు అనేవి స్థానికసంస్ధలకు చెందినవి. వాటిల్లో గెలపు ఓటముల వల్ల రాష్ట్రంపై ఎటువంటి ప్రభావం ఉండదు. అయినా కూడా చంద్రబాబు దిగజారుడు రాజకీయాలతో ఇటువంటి చిన్నచిన్న పదవులను కూడా అప్రజాస్వామికంగా దక్కించుకునే ప్రయత్నం చేయడం దారుణం.
కూటమి బెదిరింపులకు వైఎస్సార్‌సీపీ భయపడదు
కూటమి పార్టీల బెదిరింపులకు వైఎస్సార్‌సీపీ భయడపదు. రాష్ట్రంలో 51 చోట్ల ఎన్నికలు జరిగితే అన్నిచోట్లా వైఎస్సార్‌సీపీకి సంపూర్ణ బలం ఉంది. అయినా కూడా ఏ విధంగా గెలవాలని తమ పార్టీ అభ్యర్ధులను పోటీగా చంద్రబాబు నిలబెట్టారు? ఈ రోజు జరిగిన ఉప ఎన్నికల బలాబలాలను చూస్తే రాజంపేట, అత్తిలి, ఏలూరు రూరల్, నరసరావుపేట, దగదర్తి, రాప్తాడు, రామకుప్పం ఇలా ప్రతిచోటా వైఎస్సార్‌సీపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. కానీ చంద్రబాబు అన్నిచోట్లా అభ్యర్ధులను నిలబెట్టి, వైఎస్సార్‌సీపీ వారిని బెదిరించి మరీ పదవులను చేజిక్కించుకోవాలని ప్రయత్నించారు.

యాబై ఒక్క చోట్ల ఎన్నికలు జరిగితే 30 చోట్లకు పైగా వైఎస్సార్‌సీపీ అన్ని ఒత్తిళ్ళను అధిగమించి పదవులను గెలుచుకున్నాయి. టీడీపీ 11, జనసేన ఒక చోట మాత్రమే గెలిచాయి. మరో పదిచోట్ల ఎన్నికలను వాయిదా వేయించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎంత బలవంతం చేసినా, బెదిరించినా, భయపెట్టినా కూడా వైఎస్సార్‌సీపీ శ్రేణులు మొక్కవోని పట్టుదలతో తమ బలాన్ని ప్రదర్శించి పదవులను కాపాడుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టులా వ్యవహరించారు. భయపెట్టి, బెదిరింపులతో అధికారంను చేజిక్కించుకోవాలనుకునే కూటమి ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు సరైన సమయంలో సరైన గుణపాఠం నేర్పడానికి సిద్దంగా ఉన్నారు.
ఎన్నిక నిలుపుదలకు టీడీపీ కుట్రలు
వైఎస్స్సార్ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ ద్వంద్వనీతి ప్రదర్శించింది. సంఖ్యాబలం లేని కారణంగా ప్రజాతీర్పుకు గౌరవించి చైర్మన్ ఎన్నికలో పోటీలో లేమంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. వాస్తవాలు పరిశీలిస్తే అందుకు విరుద్ధమైన సంకేతాలు తెరపైకి వచ్చాయి. జిల్లా అధ్యక్షుడు పోటీలో లేమంటూనే మరోవైపు టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డి ద్వారా ఎన్నికలను నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.
బరిలో నిలిచే శక్తి లేకపోవడంతో చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు కుట్రలు పన్నారు. టీడీపీ జెడ్పీటీసీతోపాటు మరో 7మంది తెలుగుదేశం పార్టీ వర్గీయులు హైకోర్టును ఆశ్రయించారు. చైర్మన్ ఎన్నిక అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. స్టేటస్ కో తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు.
వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి వైఎస్సార్‌సీపీ కైవసం
కూటమి కుట్రలు పటాపంచలు.. ఈ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం