ఏపీ విద్యార్థులకంటే 140 మార్కులు తక్కువ వచ్చినా తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్
తెలంగాణ కంటే ఏపీలో బీసీ–ఏ విభాగంలో కటాఫ్ 148 మార్కులు ఎక్కువ
పోటీకి తగ్గట్టుగా ఏపీలో పెరగని సీట్లు.. చంద్రబాబు సర్కారు చర్యలతో
700 సీట్లు కోల్పోయిన ఏపీ
విద్యార్థులకు శాపంగా ప్రభుత్వ పాపం
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ సీట్ సాధించాలన్న లక్ష్యంతో ఏపీలో వేలాది విద్యార్థులు పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. కంటి మీద కునుకు లేకుండా రాత్రింబవళ్లు కష్టపడి 500 నుంచి 600 మార్కులు తెచ్చుకున్నా చంద్రబాబు ప్రభుత్వ వైఖరితో విద్యార్థులకు నిరాశే ఎదురైంది. రాష్ట్రానికి కొత్త కళాశాలలు రాకుండా, సీట్లు పెరగకుండా అడ్డుపడి విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది.
దీంతో పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకంటే మన పిల్లలు 150 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నా ఎంబీబీఎస్ సీటు దక్కక మనోవేదనకు గురవుతున్నారు. తెలంగాణలో పోటీకి తగ్గట్టుగా ఎంబీబీఎస్ సీట్లను అక్కడి ప్రభుత్వం పెంచడంతో బీసీ–ఏ విభాగంలో రెండో దశ కౌన్సెలింగ్ ముగిసే సమయానికి 420 స్కోర్ చేసిన వారికి కూడా ఎంబీబీఎస్ ప్రభుత్వ కోటా సీట్ దక్కింది. అదే ఏపీలో 568 మార్కుల వద్దే ఆగిపోయింది. అంటే అక్కడితో పోలిస్తే ఏపీలో కటాఫ్ 148 మార్కులు ఎక్కువ.
బీసీ–సీ విభాగంలో 142, బీసీ–డీలో 103, ఓసీల్లో 101 చొప్పున తెలంగాణకంటే ఏపీలో కటాఫ్ ఎక్కువగా ఉంది. కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం కోసం ఈ విద్యా సంవత్సరం ప్రారంభించాల్సిన ఐదు మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకుంది. పులివెందుల కళాశాలకు అనుమతులు వచ్చి సీట్లు మంజూరైనా.. ఆ సీట్లు వద్దంటూ ప్రభుత్వమే ఎన్‌ఎంసీకి లేఖ రాసింది. ప్రభుత్వ చర్యలతో ఈ ఒక్క ఏడాదే 700 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్ర విద్యార్థులు నష్టపోయారు. బాబు ప్రభుత్వం చేసిన ఆ పాపం విద్యార్థులకు శాపంగా మారింది.
14 వరకూ ఫ్రీ ఎగ్జిట్‌కు అవకాశం
ఎంబీబీఎస్ కన్వినర్ కోటా సీట్లలో 2024–25 విద్యా సంవత్సరానికి మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో సీట్ పొందిన విద్యార్థులకు ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటల వరకూ ఫ్రీ ఎగ్జిట్‌కు అవకాశం కల్పించారు. తొలి 2 కౌన్సెలింగ్‌ల్లో సీట్ పొంది, కళాశాలల్లో రిపోర్ట్ చేసిన విద్యార్థులు గడువు లోగా ఎగ్జిట్ అవ్వవచ్చని హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఎగ్జిట్ అయిన వారిని తదుపరి కన్వినర్ కోటా కౌన్సెలింగ్‌లో అనుమతించబోమని స్పష్టం చేశారు. కేవలం యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశాలకు అనుమతిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment