
అల్లూరి, సాక్షి: మారేడుమిల్లి విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. నిన్న గల్లంతైన ముగ్గురు వైద్య విద్యార్థుల్లో ఇద్దరు మృతిచెందగా.. సోమవారం ఉదయం వాళ్ల మృతదేహాల్ని వెలికి తీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మారేడుమిల్లి పర్యాటక ప్రాంతానికి ఏలూరులోని ఆశ్రం కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 14 మంది వైద్యవిద్యార్థులు ఆదివారం ట్రావెలర్ వాహనంలో వెళ్లారు. మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిలోని ‘జలతరంగిణి’ జలపాతం వద్దకు చేరుకుని అందులో దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీవర్షం కురిసింది. జలపాతం ఉద్ధృతి పెరగడంతో ఐదుగురు కొట్టుకుపోయారు.
హరిణిప్రియ, గాయత్రి పుష్పను ఒడిశా నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరు యువకులు కాపాడి, రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. హరిణిప్రియ పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం తరలించారు. గల్లంతైనవారిలో సౌమ్య, హరదీప్, అమృత, హరిణిప్రియ, గాయత్రి పుష్ప ఉన్నారు. వీరిలో విజయనగరానికి చెందిన గల్లంతైన వారికోసం పోలీసులు, సీబీఈటీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సౌమ్య, అమృత మృతదేహాలు లభ్యమయ్యాయి. హరదీప్ కోసం గాలింపు కొనసాగుతోంది.

కొసిరెడ్డి సౌమ్య (21) ది పార్వతీపురం జిల్లా బొబ్బిలి స్వస్థలంకాగా, బి.అమృత (21) బాపట్లగా పోలీసులు తెలిపారు. సీహెచ్ హరదీప్(20) ప్రకాశం జిల్లా మార్కాపురంగా తెలుస్తోంది. సౌమ్య, అమృత మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment