పేదింట పెను విషాదం
విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
తల్లి, ఇద్దరు బిడ్డల మరణంతో శోకసంద్రంలో గడుగుపల్లి
వ్యవసాయ పనులు చేసుకుంటూ.. ఊరికి దూరంగా నిర్మించుకున్న చిన్న ఇంట్లో నివాసముంటున్న ఆ కుటుంబంలో విద్యుత్ ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. తల్లీ,అభం,శుభం తెలియని ఇద్దరు బిడ్డలను కరెంట్ కాటేసింది. విద్యుత్ తీగలే యమపాశాలై వారి ప్రాణాలను హరించివేశాయి. కళ్లముందే తన పెద్ద బిడ్డ విద్యుత్ షాక్‌కు గురై గిలగిలాకొట్టుకుంటూ ఉండగా తల్లడిల్లిన ఆ తల్లి కూడా కాపాడే ప్రయత్నంలో మరణించింది. ఏమైందో తెలియక వారిని వద్దకు చేరిన మరో ఆడబిడ్డ వారితో పాటు పరలోకానికి పయనమైంది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత పడడంతో గడుగుపల్లిలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
సాక్షి,పాడేరు/పెదబయలు: పెదబయలు మండలం మారుమూల కిముడుపల్లి పంచాయతీ గడుగుపల్లి గ్రామంలో ఊరికి దూరంగా మట్టిగోడలతో చిన్న ఇల్లు నిర్మించుకుని కొర్రా మోహనరావు అనే ఆదివాసీ గిరిజనుడు భార్య,నలుగురు బిడ్డలు, తన తల్లితో నివాసముంటున్నాడు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం ఉదయం నిత్యావసర సామగ్రి కోసం పెదబయలు సంతకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంటి వద్ద అతని భార్య లక్ష్మి (35),పెద్ద కుమారుడు సంతో‹Ùకుమార్(13),పెద్ద కుమార్తె అంజలి(10) ఉండగా, ఇంటికి సమీపంలో మరో ఇద్దరు బిడ్డలు కోమలి,నగేష్, మోహన్‌రావు తల్లి కొర్ర సన్నయ్ ఉన్నారు. లక్ష్మి దుస్తులు ఉతికి ఆరబెడుతున్న సమయంలో ఇంటి వరండాలో ఉన్న విద్యుత్ వైర్లను పెద్దకుమారుడు సంతోష్‌కుమార్ తాకడంతో షాక్‌కు గురయ్యాడు.
గమనించిన లక్ష్మి, కుమారుడిని కాపాడే ప్రయత్నంలో విద్యుత్‌ఘాతానికి గురైంది. వీరిద్దరికీ ఏమైందో తెలియక వారి చెంతకు వెళ్లి అంజలి కూడా షాక్‌కు గురైంది. దీంతో ముగ్గురూ మరణించారు. ఇంటి వరండాలో విద్యుత్ వైర్లు సక్రమంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు గ్రామస్తులు తెలిపారు. ఊరికి దూరంగా వీరి నివాసం ఉండడంతో ప్రమాదాన్ని సకాలంలో గ్రామస్తులు గుర్తించ లేకపోయారు.పశువుల కాపరి కోటేశ్వరరావు దూరం నుంచి ఈ ముగ్గురిని గమనించి, గ్రామస్తులకు తెలియజేయడంతో పాటు మోహన రావు తల్లి,మరో ఇద్దరు బిడ్డలు కోమలి,నగేష్ లను కాపాడాడు.
భార్య,ఇద్దరు పిల్లల మృతి చెందడంతో మోహనరావు గుండెలవిసేలా రోదించాడు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే తహసీల్దార్ రంగారావు,ఎస్‌ఐ రమణ,సర్పంచ్ శోభరాణి,వీఆర్వో సంధ్య అక్కడకు చేరుకున్నారు.తల్లీబిడ్డల మృతదేహాలను పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి, శవ పరీక్షల గదిలో భద్రపరిచారు. ఆస్పత్రికి విద్యుత్‌శాఖ అధికారులు చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
విచారం వ్యక్తం చేసిన అరకు ఎంపీ,ఎమ్మెల్యేలు
విద్యుత్ ప్రమాదంలో తల్లి, ఇద్దరు బిడ్డలు మృతిచెందడంపై అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి,అరకు,పాడేరు ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం,మత్స్యరాస విశ్వేశ్వరరాజు,ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు,ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్రలు విచారం వ్యక్తం చేశారు.బాధిత ఆదివాసీ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment