Alluri Sitarama Raju District News
-
సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌కు ఉత్తమ పురస్కారం
● లక్ష్యానికి మించి ఉత్పత్తి ● వెల్లడించిన జలవిద్యుత్ కేంద్రం ఈఈ రాజేంద్రప్రసాద్ సీలేరు: జల విద్యుత్ ఉత్పత్తిలో 2023–2024 సంవత్సరానికి సీలేరు కాంప్లెక్స్‌కు ఓవరాల్‌గా ఉత్తమ పురస్కారం లభించిందని జలవిద్యుత్ కేంద్రం ఈఈ రాజేంద్రప్రసాద్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా పురస్కారాన్ని ఏపీ జెన్కో ఉన్నతాధికారులు ప్రదర్శించారు. సీలేరు కాంప్లెక్స్ పరిధిలో పొల్లూరు, డొంకరాయి, సీలేరు, మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాల్లో ఆర్థిక సంవత్సరంలో మెరుగైన విద్యుత్ ఉత్పత్తి సాధించింది. జలవిద్యుత్ రంగంలో సీలేరు కాంప్లెక్స్ 2,279 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి లక్ష్యంలో 2,308 మిలియన్ యూనిట్లు సాధించిందన్నారు. అదనంగా 39 మిలియన్ యూనిట్లు సాధించి పురస్కారం దక్కించుకున్నట్టు అధికారులు తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుల నుంచి ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీరు సమష్టి కృషి ఫలితమే ఈ పురస్కారమన్నారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులు మిఠాయి లు పంచారు. ఈ కార్యక్రమంలో జెన్కో ఏడీఈలు అప్పారావు, శ్రీధర్ కుమార్, సత్యనారాయణ, సుమన్, ఏఈఈ నాగబాబు, బాషా,విజిలెన్స్ సిబ్బంది సుధాకర్, కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఆనంద హేల
ఉత్సవ్ వేళ.. అరకులోయకు మరింత సొబగులుఅరకులోయ టౌన్/ డుంబ్రిగుడ: అరకు చలి ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు శనివారం నిర్వహించిన కార్యక్రమాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి రోజు కన్నా జనం భారీగా తరలిరావడంతో ఉత్సవ ప్రాంగణం నిండిపోయింది. సందర్శిత ప్రాంతాలు కూడా కిటికిటలాడాయి. పారా గ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్‌కు విశేష స్పందన లభించింది. హెలీకాప్టర్‌లో విహరించి అరకు అందాలను తిలకించి మంత్రముగ్ధులయ్యారు. హెలీరైడ్‌లో పాల్గొనే అవకాశం అందరికీ దక్కకపోవడంతో నిరాశకు గురయ్యారు. పుష్ప ప్రదర్శనలో సెల్ఫీలు, ఫొటోలు.. అరకు పద్మాపురం ఉద్యానవనంలో ఏర్పాటుచేసిన పుష్ప ప్రదర్శనకు సందర్శకులు పోటెత్తారు. పూలతో రూపొందించిన నెమలి, ఏనుగు నమూనాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వాటి వద్ద ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. ఉత్సవ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ దినేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, పీవో అభిషేక్, సబ్‌కలెక్టర్ శౌర్యమన్ పటేల్ సందర్శించారు. రాష్ట్ర చిన్న మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. హెలీకాప్టర్‌లో విహరించి అరకులోయ అందాలను తిలకించారు. సైక్లింగ్‌లో అపశ్రుతి ఉత్సవాల్లో భాగంగా బొర్రా నుంచి అరకులోయ వర కు నిర్వహించిన సైక్లింగ్ పోటీల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. విజయనగరానికి చెందిన అభిషేక్, ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొనడంతో అతనికి గాయాలయ్యాయి. వెంటనే అభిషేక్‌ను 108 వాహనంలో అనంతగిరి ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. నాలుగు నిమిషాలకు రూ.4 వేలా.. చలి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన హెలీరైడ్కు రూ.4 వేలు తీసుకుని నాలుగు నిమిషాలు మాత్రమే తిప్పుతున్నారని పర్యాటకులు అసంతృప్తికి గురయ్యారు. కనీసం పది నిమిషాలైనా విహరించే అవకాశం కల్పిస్తే బాగుండేదని వారు అభిప్రాయపడ్డారు. సమ్మర్ ఫెస్టివల్లో అందుబాటులో ఉండేలా.. హెలీ రైడ్‌కు జనవరి 30 నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఆదివారం కూడా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్టు కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. ఆమోదం వస్తే ఆదివారం కూడా హెలీరైడ్ అందుబాటులో ఉంటుందన్నారు. త్వరలో నిర్వహించే సమ్మర్ ఫెస్టివల్లో హెలీరైడ్ అందరికీ అందుబాటులో ఉండేలా ప్రణాళికపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్ దినేష్ కుమార్ కుటుంబ సభ్యులతోపాటు 5కే రన్ మహిళా విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన జీవనతన్య (7) కుటుంబంతో కలిసి హెలీకాప్టర్‌లో విహరించారు. ప్రకృతి అందాలను తిలకించారు. భవిష్యత్తులో విమానంలో విహరించాలని జీవనతన్య చెప్పిందని, ఈ మేరకు హెలీకాప్టర్‌లో విహారానికి ఆమె కుటుంబానికి అవకాశం కల్పించామన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు చెక్క భజన బృందం, అరకు చొంపి గిరిజనుల థింసా నృత్యాలు, శ్రీకాకుళం తప్పెట గుళ్లు, పార్వతీపుపురం మన్యం జిల్లా నందికొట్ట ప్రదర్శన, డుంబ్రిగుడ బ్యాండ్‌మేళా, ప్రకాశం జిల్లా సంగాలి డ్యాన్స్, సూఫీ డాన్స్, మిర్రం డాన్స్, జబర్దస్కళాకారుల కామిడీ స్కిట్, వందేమాతరం శ్రీనివాస్ సినీ గేయాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కలెక్టర్ దినేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, రంపచోడవరం సబ్‌కలెక్టర్ కల్పనశ్రీ దంపతులు, పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్, పాడేరు సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్ దంపతులు, విశాఖ జిల్లా జడ్జి ఎం.గిరిధర్ దంపతులు,మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు వీక్షించారు. అరకులోయ టౌన్/డుంబ్రిగుడ: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయను పర్యాటకంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని కలెక్టర్ దినేష్‌కుమార్ పేర్కొన్నారు. అరకు చలి ఉత్సవం రెండో రోజు శనివారం స్థానిక మండల పరిషత్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్ నిళుదగల్ అని నామకరణం చేశారు. మాతృమూర్తి షణ్ముగవల్లి పేరిట మొక్క నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అందాల అరకులోయ పూల బొకేలను రాష్ట్రానికి పరిచయం చేస్తామన్నారు. పూల సాగుకు అరకు ప్రాంత వాతావరణం ఎంతో అనుకూలమన్నారు. పూల బొకేల తయారీలో అనుభవం ఉన్నవారిని తీసుకువచ్చి గిరిజనులకు శిక్షణ అందిస్తామన్నారు. బొర్రా గుహల నుంచి నుంచి డిగ్రీ కళాశాల మైదానం వరకు నిర్వహించిన సైక్లింగ్ పోటీల్లో 12 మంది పాల్గొన్నారని తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓపీ అగర్వాల్ (66) ప్రథమ స్థానం, అరకులోయ మండలం దండపాడుకు చెందిన పాంగి అజయ్ (13) ద్వితీయ స్థానం, విశాఖకు చెందిన ప్రియదర్శని తృతీయస్థానంలో నిలిచారన్నారు. వీరిలో అరకు ప్రాంతానికి చెందిన పాంగి అజయ్ సైకిలిస్ట్‌గా జాతీయస్థాయిలో రాణించేలా ప్రోత్సహిస్తామన్నారు. పాడేరు ఐటీడీఏ నుంచి అతనికి రైడ్ సైకిల్ అందజేస్తామని చెప్పారు. ఉత్సవాల్లో భాగంగా 2వ తేదీన సుంకరమెట్ట నుంచి గాలికొండ వ్యూ పాయింట్ వరకు ట్రెక్కింగ్ నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ఫ్యాషన్ షోతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ ఆలపించే గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. సైక్లింగ్ విజేతలకు బహుమతులు అందజేశారు. సబ్ డీఎఫ్‌వో ఉమా మహేశ్వరి, ఎంపీడీవో లవరాజు, డీఎల్పీవో పీఎస్ కుమార్, డీఈ రామం పాల్గొన్నారు. రూ.4వేలు వసూలు సరికాదు హెలీరైడ్కు రూ.4వేల చొప్పున సందర్శకుల నుంచి వసూలు చేయ డం సరికాదు. విశాఖపట్నం నుంచి హైదరా బాద్‌కు విమాన చార్జీ రూ.4 వేలు ఉంది. ఇక్క డ నాలుగు నిమిషాలు హెలికాప్టర్లో తిప్పి రూ.4 వేలు వసూలు చేయడం భారంగా ఉంది. – దంగేటి నానాజీ, పర్యాటకుడు, మాడుగుల మరుపురాని అనుభూతి చాలాసార్లు విమానంలో విదేశాలకు వెళ్లాం. కానీ ఇలాంటి మంచి అనుభూతి ఎప్పుడూ పొందలేదు.హెలీకాప్టర్‌లో అరకు అందాలు తిలకించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇటువంటి అవకాశం కల్పించిన అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు. – రాజమౌళి, జబర్దస్త్ కళాకారుడు రెండో రోజు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు కిటకిటలాడిన సందర్శిత ప్రాంతాలు పుష్ప ప్రదర్శన వద్ద సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ సందడి భారీగా తరలివచ్చిన పర్యాటకులు లోటుపాట్లు లేకుండాపర్యవేక్షించినఅధికార యంత్రాంగం పర్యాటకంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి కలెక్టర్ దినేష్‌కుమార్ మాతృమూర్తి పేరిట మొక్క నాటి పార్కు నిర్మాణానికి శ్రీకారం తనివితీరా వీక్షించా అరకు అందాలను తనివితీరా వీక్షించాం. ఈ ప్రాంతాన్ని ఎన్నిసార్లు సందర్శించినా కొత్తగానే కనిపిస్తుంది. ఈ ఏడాది నిర్వహించిన అరకు చలి ఉత్సవాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సందర్శకుల్లో ఉల్లాసం, ఉత్సాహం నింపాయి. – ఎస్.మోనాలి, పర్యాటకురాలు, విశాఖపట్నం -
స్పీకర్ వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన
హుకుంపేట: అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు 1/70 చట్టం సవరణ చేయాలన్న వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన ప్రజాసంఘాలు ఆందోళన బాట పట్టాయి. దీనిలో భాగంగా శనివారం మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ బంకు నుంచి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల వరకు గిరిజన సంఘం, సీపీఎం, సీపీఐ, వైఎస్సార్సీపీ నేతల ఆధ్వర్యంలో గిరిజనులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మండల గిరిజన సంఘం నేత తాపుల కృష్ణారావు, వైఎస్సార్సీపీ మండల గౌరవ అధ్యక్షుడు మాట్లాడుతూ గండేరు చినసత్యం 1/70 చట్టంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. స్పీకర్ స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆయన తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నామని ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గిరిజన చట్టాల జోలికి వస్తే సహించమని స్పష్టంచేశారు. తప్పుడు వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు గిరిజనులకు క్షమాపణ చెప్పాలని, అప్పటివరకు తగ్గేది లేదని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ నేతలు ఎం.విశ్వేశ్వరరావు, నాయకులు తెడబారికి సురేష్‌కుమార్, తడిగిరి సర్పంచ్ పెనుమల రంజిత్‌కుమార్, సీపీఎం నేతలు వైస్ ఎంపీపీ సుడిపల్లి కొండలరావు, రామారావు, కాంగ్రెస్ నేతలు చిన్నస్వామి, జానకిరావు, సాధు పాల్గొన్నారు. హుకుంపేటలో ప్రజాసంఘాల ఆందోళన అయ్యన్నపాత్రుడు తక్షణం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ -
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా తగ్గని మంచు
● కొనసాగుతున్న చలి తీవ్రత చింతపల్లి: మన్యంలో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నా మంచు తీవ్రత మాత్రం తగ్గడం లేదు. చలి ప్రభావం కొనసాగుతోంది. శనివారం జి.మాడుగులలో 9.8 డిగ్రీలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ పరిధిలోని గూడెంకొత్తవీధిలో 10.5 ,అరకువేలీలో 11.1, చింతపల్లిలో 11.5, డుంబ్రిగుడలో 12.3, హుకుంపేటలో 12.5, పాడేరులో 12.6, పెదబయలులో 13.3, ముంచంగిపుట్టులో 14.0, అనంతగిరిలో 14.5, కొయ్యూరులో 15.4 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన పేర్కొన్నారు. -
58 కిలోల గంజాయి స్వాధీనం
● ఇద్దరు నిందితుల అరెస్టు ● వీరిలో ఒకరు బాలుడు గూడెంకొత్తవీధి: ఒడిశానుంచి కారులో గంజాయి తరలిస్తూ గూడెం కొత్తవీధి వద్ద పోలీసులకు ఇద్దరు పట్టుబడ్డారు. సీఐ వరప్రసాద్ శనివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సీలేరుకు చెందిన ఇద్దరు కారులో గంజాయి తరలిస్తుండగా శుక్రవారం సాయంత్రం సిబ్బంది చేపట్టిన వాహన తనిఖీల్లో పట్టుబడ్డారన్నారు. వారి నుంచి 58 కిలోల స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయిని తరలిస్తున్న వారిలో ఒకరు సీలేరుకు చెందిన పెదపూడి చినబాబు మరొకరు బాలుడు ఉన్నారన్నారు. వీరు ఒడిశాలోని రాజ్బేడాక్ అనే గ్రామంలో కొనుగోలు చేసి తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. నిందితుల నుంచి రెండు సెల్ ఫోన్లు, కారు, రూ.320 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులో ఒకరు బాల నేరస్తుడు కావడంతో అతనిని జువైనల్ హోమ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు. -
బడ్జెట్ కేటాయింపులో ఆదివాసీలకు అన్యాయం
పాడేరు రూరల్: ఆదివాసీల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ వికసిత భారత్ అంటూ ప్రచార్బాటం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలను మరింత దిగజార్చేలా బడ్జెట్ కేటాయింపు చేసిందన్నారు. బడ్జెట్లో దేశ ఆదివాసీ జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాంగబద్దంగా 8.8 శాతం నిధులు కేటయించాలన్నారు. ఆదివాసీ సబ్ ప్లాన్ రూ.3,54,574 కోట్లకు కేవలం రూ,1,29,249 కోట్లు మాత్రమే కేటయించి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఆదివాసీల అభివృద్ధికి నేరుగా ఉపయోగపడే రంగాల్లో కేటాయింపులు పూర్తిగా తగ్గించి కార్పొరేట్, బడా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేలా బడ్జెట్లో నిధులు కేటాయించిందన్నారు. ఆదివాసీల విద్యారంగానికి గత ఏడాది రూ. 240 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ. 2కోట్లు మాత్రమే కేటాయించడం సరికాదన్నారు. ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్‌కు గత ఏడాదిలో రూ.440 కోట్లు కేటయించగా ఈ ఏడాది రూ.313 కోట్లు కేటయించిందన్నారు. దేశవ్యాప్తంగా ఆదివాసీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా విద్యారంగాలకు కేటయించే బడ్జెట్ మొక్కుబడిగా ఉందన్నారు. ఇకనైనా గిరిజన ప్రాంతాల్లో రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధుల కేటాయింపు పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలదేవ్ ఆవేదన -
లంబసింగికి పర్యాటకుల తాకిడి
చింతపల్లి: ప్రముఖ పర్యాటక కేంద్రం లంబసింగికి పర్యాటకుల తాకిడి నెలకొంది. శనివారం భారీగా తరలిరావడంతో రద్దీ నెలకొంది. లంబసింగి, తాజంగి జలాశయం ప్రాంతాల్లో కూడా సందడి వాతావరణం నెలకొంది. చెరువులవేనం వ్యూపాయింట్ నుంచి ప్రకృతి అందాలు తిలకించారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. జి.మాడుగుల: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కొత్తపల్లి జలపాతానికి శనివారం భారీగా పర్యాటకులు తరలివచ్చారు. జలపాతంలో స్నానాలు చేస్తూ కేరింతలు కొట్టారు. సెల్ఫీలు, ఫొటోలు తీసుకుని సందడి చేశారు. -
58 కిలోల గంజాయి స్వాధీనం
తాటిచెట్లపాలెం(విశాఖ): విశాఖపట్నం రైల్వేస్టేషన్లో 58 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ సిహెచ్ ధనుంజయనాయుడు ఆధ్వర్యంలో ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ కె.రామకృష్ణ తన సిబ్బందితో శనివారం స్టేషన్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన ప్రసన్ రాజ్, కిశోర్ బలియర్ సింగ్, రాహుల్ పని, పింటు దాస్ వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి సుమారు రూ.2.9 లక్షలు విలువైన 58 కిలోల గంజాయిని సీజ్ చేశారు. విశాఖపట్నం మీదుగా ముంబయికి గంజాయి రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు ఇన్స్పెక్టర్ కె.రామకృష్ణ తెలిపారు. -
నిరుద్యోగులు, మహిళలకు ఆశాజనకంగా..
ఎంఎస్ఎంఈ రంగానికి చేయూతనిస్తూ, ఎగుమతుల ప్రోత్సాహానికి అధిక ప్రాధాన్యతనివ్వడం ప్రశంసనీయం. క్రెడిట్ పరిమితిని రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు, స్టార్టప్‌లకు రూ.10 కోట్లకు పెంచడంతో పాటు వృద్ధిలో ఉన్న ఎంఎస్ఎంఈ ఎగుమతిదారులకు టర్మ్ లోన్‌ను రూ.20 కోట్లకు పెంచడంతో ఈ రంగాలకు పెట్టుబడి, వర్కింగ్ క్యాపిటల్ బలోపేతమవుతాయి. యువతను సన్నద్ధం చేసేలా 5 నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు ఏర్పాటు అభినందనీయం. బడ్జెట్ ప్రతిపాదనలో గ్లోబల్ స్కిల్లింగ్ భాగస్వామ్యాలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏఐ ఏర్పాటు ఉండటం నిరుద్యోగులు, మహిళలలో నైపుణ్యాన్ని పెంచుతుంది. – కంకటాల మల్లికార్జునరావు, ఫ్యాప్సీ ప్రెసిడెంట్రెండు దశాబ్దాల తర్వాత గణనీయమైన సవరణ దాదాపు 20 ఏళ్లలో మొదటిసారిగా వ్యక్తిగత ఆదాయ పన్ను స్లాబ్‌లలో గణనీయమైన సవరణను సూచించారు. ఈ నిర్ణయంతో ఈ బడ్జెట్ చారిత్రాత్మకమైందిగా నిలిచిపోతుంది. ఇది మధ్య తరగతికి ఒక పెద్ద ప్రోత్సాహకం. ఈ పన్ను ఆదా ప్రజలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడంలో సహాయ పడటమే కాకుండా ఎక్కువ ఆర్థిక సౌలభ్యాన్ని కూడా ఇస్తుంది. వ్యవసాయ రంగానికి అనేక ప్రగతిశీల కార్యక్రమాలు ప్రవేశపెట్టడం ప్రశంసనీయం. –సుధీర్ ములగాడ, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈసీ సభ్యుడు -
ఎంఎస్ఎంఈలకు చేయూతనందించేలా..
వినియోగ ఆధారిత వృద్ధి, సులభతర వ్యాపారం, వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించినట్లు బడ్జెట్లో స్పష్టమవుతోంది. 49 శాతం ప్రభుత్వ సహకారంతో రూ.25,000 కోట్ల సముద్ర అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయడం అద్భుతమనే చెప్పొచ్చు. ఎంఎస్ఎంఈలకు చేయూతనందించేలా పెట్టుబడి, టర్నోవర్ పరిమితులను వరుసగా 2.5, 2 రెట్లు పెంచడం చూస్తే.. అనేక ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉంది. – శ్రీనాథ్ చిట్టూరి, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ విశాఖ జోన్ చైర్మన్ -
మరణంలోనూ వీడని స్నేహ బంధం
ఎటపాక: మరణంలోనూ వారి స్నేహం వీడలేదు. గాయపడిన ప్రాణ స్నేహితుడిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా మరో ఇద్దరు స్నేహితులు కానరాని లోకానికి వెళ్లిపోయారు. శుక్రవారం రాత్రి లారీ రూపంలో మృత్యువు వారిని కబళించింది. ఎటపాక స్టేషన్ సీఐ కన్నపరాజు, ఎస్ఐ అప్పలరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎటపాక మండలం లక్ష్మీపురం పంచాయతీ కన్నాపురం గ్రామంలో శుక్రవారం ఓ శుభకార్యం జరిగింది. ఆ కార్యక్రమంలో గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు కారం సీతారామయ్య, పొడియం రాజారావు, కుర్సం భద్రయ్య ఎంతో సరదాగా గడిపారు. అనుకోనిరీతిలో కింద పడిన సీతారామయ్య కాలికి గాయం కావడంతో బంధువులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. శుభకార్యం ముగిసిన వెంటనే తమ స్నేహితుడిని పరామర్శించేందుకు రాజారావు(31), భద్రయ్య(41) ద్విచక్ర వాహనంపై భద్రాచలం వెళ్లారు. ఈ క్రమంలో రాత్రి 10 గంటల సమయంలో వారు ఇంటికి తిరిగి వస్తుండగా చింతూరు వైపు నుంచి ఐరన్ లోడుతో భద్రాచలం వెళ్తున్న లారీ చోడవరం పంచాయతీ పరిధి భీమవరం వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్నేహితులిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతదేహాలను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తన కోసం వచ్చిన ఇద్దరు మిత్రులు ప్రమాదంలో శవాలుగా మారి తన గది పక్కనే ఉన్న మార్చురీలో ఉన్నారని తెలిసిన సీతారామయ్య భోరున విలపించాడు. మృతుల బంధువుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం మిన్నంటింది. ప్రమాదానికి కారణమైన లారీని, డ్రైవర్‌ను ఎటపాక స్టేషన్‌కు తరలించి సీఐ కన్నపరాజు, ఎస్ఐ అప్పలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజారావుకు భార్య నాగమణి, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. భద్రయ్యకు భార్య సాయమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ రెండు కుటుంబాల సభ్యులు భోరున విలపిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం గాయపడిన స్నేహితుడిని పరామర్శించి వస్తుండగా ఘటన బైక్‌ను ఢీకొట్టిన లారీ కన్నాపురంలో తీవ్ర విషాదం -
No Headline
ఎంఎస్ఎంఈలపై బడ్జెట్లో వరాల జల్లు కురిపించారు. ఎంఎస్ఎంఈ రుణాలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు పెంచారు. తయారీ రంగంలో 36 శాతం వాటా ఉన్న ఎంఎస్ఎంఈలకు ఈ రుణ పరిమితి పెంపు పెద్ద ఊరటనిచ్చే అంశమని పారిశ్రామికవర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో మొత్తం 4450 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉండగా 14,639 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఇందులో దాదాపు 70 శాతం ఎంఎస్ఎంఈలు లబ్ధి పొందే అవకాశాలున్నాయి. గతంలో రూ.కోటి వరకూ ఆడిట్ లేకుండా ఉండగా.. ఇప్పుడు రూ.5 కోట్ల వరకూ ఆడిట్ లేకుండా చేయడంతో మధ్య తరహా పరిశ్రమలు స్వల్పంగా లాభపడతాయి. ఎంఎస్ఎంఈలకు చేయూత -
No Headline
సాక్షి, విశాఖపట్నం: కర్షక, పారిశ్రామిక, మధ్య తరగతి వర్గాలను కాస్తా ఊరడించేలా.. పద్దు లెక్కలు చదివిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. విశాఖను మాత్రం పూర్తిగా విస్మరించారు. డీపీఆర్ ఇచ్చినా.. వైజాగ్ మెట్రో ఊసే లేదు.. రైల్వే జోన్ ప్రస్తావన లేదు.. అంతెందుకు విశాఖ పేరు కూడా బడ్జెట్లో ప్రస్తావించకపోవడం జిల్లా ప్రజల్నే విస్మయానికి గురిచేసింది. కేవలం ఉద్యోగుల్ని ఊరడిస్తూ.. పన్ను చెల్లింపుదారుల్ని పలకరిస్తూ.. రైతులకు భరోసా ఇస్తూ.. యువతకు నైపుణ్యం అందించేలా చెయ్యందిస్తూ.. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ.. సాగిన సుదీర్ఘ ప్రసంగం వల్ల విశాఖకు ఒనగూరిన ప్రయోజనాలేవీ కనిపించలేదంటూ ప్రతి ఒక్కరూ పెదవి విరుస్తున్నారు. అయితే స్టీల్‌ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు, హిందూస్థాన్ షిప్‌యార్డులో జరుగుతున్న అభివృద్ధి పనుల కోసం రూ.150 కోట్లు కేటాయించారు. దేశంలోని మేజర్ పోర్టులకు కేటాయించిన మాదిరిగానే విశాఖ పోర్టు అథారిటీకి రూ.730 కోట్లు విదిలించారు. -
ఫీజు పోరుబాటకు సిద్ధం
● అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం పిలుపు డుంబ్రిగుడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 5న తలపెట్టిన ఫీజు పోరుబాటకు సిద్ధం కావాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు. ఈ మేరకు అరకులోయలోని క్యాంపు కార్యాలయంలో పోరుబాట పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి రూ.3900 కోట్ల బకాయిలను తక్షణయే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. 5న కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేయనున్నామని, ముందుగా ఉదయం 10 గంటలకు అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి, అనంతరం కలెక్టరేట్‌కు వెళ్లి వినతి పత్రం సమర్పిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం తక్షణమే తమ వైఖరి మార్చుకుని విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. ఫీజు పోరులో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పి.చిన్నారావు, ఎంపీటీసీ ఆనంద్, పార్టీ నాయకులు కమ్మిడి అశోక్, నరసింహమూర్తి, అర్జున్, నరసింగరావు, పాల్గొన్నారు. -
సబ్బవరంలో భారీగా గంజాయి పట్టివేత
224 కిలోల గంజాయి స్వాధీనం సబ్బవరం: అనకాపల్లి–ఆనందపురం జాతీయ రహదారిపై మర్రిపాలెం టోల్గేట్ వద్ద రూ.11.20 లక్షల విలువ చేసే 224 కిలోల గంజాయిని శనివారం సబ్బవరం పోలీసులు పట్టుకున్నారు. సీఐ పిన్నింటి రమణ ఆదేశాల మేరకు ఎస్ఐ సింహచలం, సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. వ్యాన్‌లో గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు. సబ్బవరం పోలీస్ స్టేషన్లో పరవాడ డీఎస్పీ వల్లెం విష్ణు స్వరూప్, సీఐ పిన్నింటి రమణతో కలిసి ఈ కేసు వివరాలు వెల్లడించారు. గంజాయి తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు మర్రిపాలెం టోల్గేట్ వద్ద ఎస్ఐ సింహచలం, సిబ్బందితో వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆనందపురం నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న వ్యానును ఆపి తనిఖీ చేయగా, ఐరన్ లోడ్ కింద 108 గంజాయి ప్యాకెట్లు ఉంచి, టార్పాలిన్ కప్పి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 224 కిలోల గంజాయిని వాహనంలో ఉన్న ఐదుగురు వ్యక్తులు ఆనందపురంలో లోడ్ చేసి.. మహారాష్ట్రలోని కోల్హాపూర్‌కు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వారి వద్ద నుంచి రూ. 39.62 లక్షల విలువ చేసే గంజాయి, వ్యాన్, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన వారిలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జి.మాడుగులకు చెందిన డి.రమణమూర్తి, దుర్గా బాలరాజు, మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన అనిల్ సురేష్, కౌలాలంపూర్‌కు చెందిన రాహుల్ రాకేష్, సుమిత్, అమిత్ బాటింగ్లను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ కేసులో 6వ నిందితుడు, వ్యాన్ యజమాని సరజీరావ్ గైక్వాడ్‌ను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. గంజాయిని పట్టుకున్న సీఐ పిన్నింటి రమణ, ఎస్ఐ సింహచలం, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
No Headline
విశాఖ నగరానికి మెట్రో కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం డీపీఆర్‌ని 2024 జనవరిలో కేంద్రానికి పంపించింది. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త డీపీఆర్‌ని కూడా సిద్ధం చేసేసింది. మెట్రో రైలు ప్రాజెక్టుకు బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా విదిలించకపోవడం అందర్నీ ఆగ్రహానికి గురిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టుపై ముందుకెళ్తున్నామని చెబుతున్నా.. కేంద్రంపై మాత్రం ఒత్తిడి తీసుకురాలేదని బడ్జెట్ ప్రసంగంలో స్పష్టమైందని అన్ని వర్గాలూ పెదవి విరుస్తున్నాయి. మెట్రో గాలికేనా.? -
విద్యకు పెరగని కేటాయింపులు
కేంద్రంలో ఎన్ని బడ్జెట్లు ప్రవేశపెట్టినా.. విద్యా రంగానికి కేటాయింపులు పెరగడం లేదు. ఈ సారి కూడా విద్యకు 2.5 శాతం మాత్రమే కేటాయించడం అన్యాయం. కొఠారి కమిషన్ సూచనల ప్రకారం కనీసం 6 శాతం నిధులు కేంద్ర బడ్జెట్లో కేటాయించాల్సి ఉంది. రానున్న ఐదేళ్లలో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ.. అందుకు సంబంధించి సిబ్బంది నియామకం, మౌలిక వసతుల కల్పనపై స్పష్టం ఇవ్వలేదు. – ఏఎస్ నాయుడు, జిల్లా గౌరవాధ్యక్షుడు, ఏపీటీఎఫ్–1938 -
కుటుంబ పోషణకు ఉన్నత ఉద్యోగం తప్పనిసరి
రంపచోడవరం: ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన యువత కోసం పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ప్రేరణ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ కోరారు. రంపచోడవరం పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం పోలీస్, ఇన్నోవ్సోర్స్ ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గతంలో నిర్వహించిన జాబ్ మేళాలో ఎంపికై న రంపచోడవరం ప్రాంతానికి చెందిన గిరిజన యువత శిక్షణ కోసం వెళ్లలేదన్నారు. ఇందుకు కారణాలు తెలుసుకున్నామన్నారు. ఇంటిని, స్నేహితులను వదిలి వెళ్లలేక ఇక్కడే ఏదో పని చేసుకుందామన్న ధోరణిలో ఉన్నారని తెలిపారు. బ్యాచ్‌లర్‌గా ఎంత వచ్చిన సరిపోతుందని, అదే కుటుంబ పోషణకు ఉన్నత ఉద్యోగం చేయడం తప్పనిసరి చెప్పారు. జాబ్‌మేళాకు 387 మంది హాజరు కాగా.. 300 మందిని వివిధ కంపెనీలు ఎంపిక చేసుకున్నాయి. ఎంపికై న వారి జాబితాను రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. సీఐ రవికుమార్, ఎస్ఐ వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు. -
‘ఏజెన్సీలో విధులు మరువలేను’
రంపచోడవరం: ఏజెన్సీ ప్రాంతంలో పని చేసి గిరిజనులకు సేవ చేయడంలో ఎంతో ఆనందంగా ఉందని, మంచి సేవలు అందిస్తే ఏ అధికారికై నా గుర్తింపు ఉంటుందని రంపచోడవరం మొబైల్ కోర్టు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఈ.జాన్‌రాజ్ అన్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మేజిస్ట్రేట్‌ను శనివారం న్యాయవాదులు, గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో డీఎన్వీ రమణ, న్యాయవాదులు ఎంవీఆర్ ప్రకాష్, కోలా సత్యప్రసాద్, భగవాన్, చుక్కా సంతోష్‌కుమార్, కొమ్మిశెట్టి బాలకృష్ణ, భజన వెంకటేశ్వర్లు, శివరంజని, జిలానీ పాల్గొన్నారు. -
ఉక్కు కేటాయింపులు.. ఆ నిధుల్లో భాగమే.?
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు కేటాయింపులు చేస్తున్నట్లు బడ్జెట్లో పొందుపరిచారు. అయితే ఈ కేటాయింపులు ఏ ప్రాతిపదికన ఇస్తున్నారనే దానిపై అందరిలోనూ సందిగ్ధం నెలకొంది. ఇటీవల ప్లాంట్‌కు రూ.11,440 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నిధుల్లో భాగమే ఈ కేటాయింపులు చేశారే తప్ప.. కొత్త కేటాయింపులు కాదని స్టీల్‌ప్లాంట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తొలివిడత కింద కొద్ది నెలల క్రితం రూ.1640 కోట్లు ఇవ్వగా.. తాజాగా శుక్రవారం రాత్రి మరో రూ.6,783 కోట్లు మంజూరు చేశారు. ఇప్పుడు మరో రూ.3,295 కోట్లు కేటాయింపులు చేశారు. ఇవి ఈ ఆర్థిక సంవత్సరం లోపు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నిధులతో ప్లాంట్ ఎలా ముందుకు దూసుకెళ్లగలదని ఉద్యోగ, కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. -
No Headline
ముంచంగిపుట్టు: తూనికల్లో తేడాలుంటే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా తూనికలు,కొలతలశాఖ డిప్యూటీ కంట్రోలర్ కేటీ రవికుమార్ హెచ్చరించారు. మండల కేంద్రంలో శనివారం జరిగిన వారపు సంతలో తూనికలు, కొలతల జిల్లా అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. సంతలో తూనిక కాటాలను పరిశీలించారు. ముగ్గురు వ్యాపారుల కాటాల్లో తూకంలో తేడాను గుర్తించారు. పది కిలోల తూకపు రాయి 9 కిలోల చూపించడంతో వారిపై కేసు నమోదు చేశారు. తూనిక రాళ్లు, కాటాలకు సీళ్లు లేకపోవడంతో గుర్తించిన వారు వ్యాపారులను హెచ్చరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కంట్రోలర్ కేటీ రవికుమార్ మాట్లాడుతూ వ్యాపారులు తూనికల్లో ఎటువంటి మోసాలకు పాల్పడినా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తువుల బరువులను సరి చూసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా తూనికలు, కొలతలశాఖ అసిస్టెంట్ కంట్రోలర్ బి.రామచంద్రయ్య, విశాఖపట్నం జిల్లా పరిశీలకులు వి.రామారావు,సిబ్బంది పాల్గొన్నారు. -
ఏకలవ్యలో ప్రవేశాల దరఖాస్తుకు 19 వరకు గడువు
వై.రామవరం: మండలంలోని పి.యర్రగొండ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ భూరామ్ భైరవ తెలిపారు. ఫిబ్రవరి 19వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు టీడబ్ల్యూఆర్ఈఐఎస్సీఈటీ.ఏపీసీ సీఈటీ ఎఫ్ఎస్ఎస్.ఇన్, ఏపీటీడబ్ల్యూగురుకులమ్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లను సందర్శించాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు 9571424956, 6304101706 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. -
అరకు చలి ఉత్సవ్‌తో ఒదిగేదేమీ లేదు
ఎమ్మెల్యేలు విశ్వేశ్వరాజు, రేగం మత్స్య లింగం డుంబ్రిగుడ : అరకులోయ చలి ఉత్సవ్ వల్ల గిరిజనులకు ఒరిగేదేమీ లేదని, కోట్లాదిరూపాయల ప్రజాధనాన్ని కూటమి ప్రభుత్వం వృథా చేస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎమ్మెల్యే రేగ ం మత్స్యలింగం అన్నారు. ఆదివాసీ ప్రాంతంలో 1/70 చట్ట సవరణ ద్వారానే ఏజెన్సీప్రాంతాల్లో పెట్టుబడులు వస్తాయని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడడం బాధాకరమని చెప్పారు. అయ్యన్న వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేసేందుకు అరకులోయ వస్తుండగా మార్గ మధ్యంలో జైపూర్ జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు రోడ్డుపైనే బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన చట్టాలను పటిష్టంగా అమలుపరిచి, విద్య, వైద్యం, యువతకు ఉపాధి అవకాశాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతే ఏ ఉత్సవాలైనా నిర్వహించాలని తెలిపారు. చలి ఉత్సవాల సందర్భంగా వినోదం అందించేందుకు ఏర్పాటుచేసిన హెలికాప్టర్లో ప్రయాణించడానికి ఒక్కొక్కరి నుంచి రూ.4,000 చార్జీ వసూలు చేయడం దారుణమన్నారు. వ్యాపారం కోసమే గిరిజన సంప్రదాయ ఉత్సవాల ముసుగులో అరకు చలి ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి పాంగి చిన్నారావు, డుంబ్రిగుడ మండలం వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు చిక్కుడు మల్లేశ్వరరావు, డుంబ్రిగడ మండలం సర్పంచ్ కిముడు హరి, సర్పంచ్ ఒరబోయి న సుబ్బారావు, ఎంపీటీసీలు దురియా ఆనంద్,సమర్ది శత్రుగుణ, వైఎస్సార్సీపీ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు తేడబారికి సురేష్ కుమార్, వైఎస్సార్సీపీ అరకు అసెంబ్లీ బీసీ సెల్ అధ్యక్షుడు గెడ్డం నరసింగరావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శి జన్నీ నరసింహమూరి, నాయకులు పాంగి పరశురామ్ , శెట్టి అప్పాలు,కూడ సుబ్రమణ్యం, జాని, బాబూరావు, రామమూర్తి, అర్జున్,బాలకష్ణ,బొంజుబాబు ,గుడివాడ ప్రకాష్, నాగేష్, శివ,మోహన్ రావు, స్థానికులు పాల్గొన్నారు. -
ఆరంభం అదిరింది.. మూడు రోజుల పాటు జరిగే అరకు చలి ఉత్సవ్–2025 శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఉత్సవ్‌ను కలెక్టర్ దినేష్‌కుమార్ ప్రారంభించారు. థింసా నృత్యాలు, డప్పు వాయిద్యాలతో అరకు హోరెత్తింది. పారా గ్లైడింగ్, ఎయిర్ బెలూన్, హెలికాప్టర్ రైడింగ్
గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా అరకు చలి ఉత్సవ్ ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ రైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్, పారా గ్లైడింగ్5కె రన్ మారథాన్ పోటీలతో అట్టహాసంగా ప్రారంభం మారథాన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న పర్యాటకులు, స్థానికులు పద్మాపురం గార్డెన్లో ఆకట్టుకున్న ఫ్లవర్ షో ఉత్సవ్‌ను ప్రారంభించిన కలెక్టర్ దినేష్‌కుమార్ అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు -
అదుర్స్
ఆరంభంఅరకు ఉత్సవం.. అభివృద్ధికి దోహదంసాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా ఊటీ అరకులోయలో చలి ఉత్సవ్ ఆరంభం అదిరింది. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ‘అరకు చలి ఉత్సవ్’ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం 7.30 గంటలకు 5కె రన్ మారథాన్ పోటీలతో కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ ఉత్సవ్‌ను ప్రారంభించారు. అరకులోయ రవ్వలగూడ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన 5కె రన్ మారథాన్‌లో పర్యాటకులు, స్థానిక గిరిజన యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులను అందజేశారు. ఈ ఉత్సవ్‌లో పారా గ్లైడింగ్, ఎయిర్ బెలూన్, హెలికాప్టర్ రైడింగ్, పద్మాపురం గార్డెన్లో ప్లవర్ షో, అరకులోయలో రవ్వలగూడ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు, ఆదివాసీల వంటకాల ఫుడ్ ఫెస్ట్, వివిధ రాష్ట్రాల గిరిజన కళాకారుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకున్న పర్యాటకులు హెలికాప్టర్లో గగనతలం నుంచి మన్యంలో అందాలను వీక్షించారు. సాయంత్రం 6 గంటల నుంచి ప్రదర్శించిన సంప్రదాయ గిరిజన నృత్యాలైన థింసా, నగరభేరి, కూచిపూడి, జముకు పాట, బస్తర్ బ్యాండ్, తోడా డ్యాన్స్, గోండ్ ట్రైబల్ డ్యాన్స్, డప్పు వాయిద్యాల డ్యాన్స్, ఆదివాసీ యువత చేసిన తీన్మార్, కొమ్ముకాయి, సవర, జాతపు, మణిపూర్ డ్యాన్స్, తప్పెటగుళ్ల నృత్యాలు అలరించాయి. అరకు వింటర్ ఫెస్టివల్ తొలి రోజు 5 వేల మంది వరకూ సందర్శకులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినట్టు అధికారులు అంచనా వేశారు. రెండో రోజు, మూడో రోజు వీకెండ్స్ కావడంతో కనీసం 10 వేల నుంచి 20 వేల మంది వరకూ పర్యాటకులు రావచ్చని భావిస్తున్నారు. ఈ ఉత్సవ్ 2వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఐఏఎస్, ఐపీఎస్‌ల స్టెప్లు.. అరకు చలి ఉత్సవంలో భాగంగా సాయంత్రం ట్రైబల్ మ్యూజియంలో ఐఏఎస్, ఐపీఎస్‌లు డ్యాన్స్‌లు వేశారు. కలెక్టర్ దినేష్‌కుమార్, జేసీ అభిషేక్ గౌడ, పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్, అడిషనల్ ఎస్పీ ధీరజ్, మహిళా అధికారులు ఎర్రటి వస్త్రాలను తలపాగాలు కట్టుకుని స్టెప్లు వేశారు. డ్యాన్స్‌లో పలువురు అధికారులు, స్థానిక గిరిజన యువత, సందర్శకులు జతకలిశారు. హాట్ ఎయిర్ బెలూన్.. పారా గ్లైడింగ్ ఈ ఉత్సవ్ సందర్భంగా పద్మాపురం గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన హాట్ ఎయిర్ బెలూన్, మాడగడ వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన పారా గ్లైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిచాయి. హాట్ ఎయిర్ బెలూన్‌కు ఒకరికి రూ.1800 చొప్పున టికెట్ ధర నిర్ణయించారు. హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కేందుకు ఉత్సవ్‌లో తొలిరోజు పర్యాటకులు క్యూ కట్టారు. మాడగడ వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన పారా గ్లైడింగ్ను కలెక్టర్ దినేష్‌కుమార్ ప్రారంభించారు. పూణేలో ప్రైవేట్ సంస్థకు చెందిన ఈ పారా గ్లైడింగ్ బృందం ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తున్నారు. పర్యాటకులెవరికీ పారా గ్లైడింగ్చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. తొలిసారిగా హెలికాప్టర్ రైడ్.. ఉత్సవ్‌లో భాగంగా తొలిసారిగా ప్రైవేటు భాగస్వామ్యంతో అందుబాటులోకి తెచ్చిన హెలికాప్టర్ రైడ్ పర్యాటకులకు తెగ నచ్చేసింది. ఆన్లైన్లో, నేరుగా బుక్ చేసుకున్న 150 మంది వరకూ సందర్శకులు తొలిరోజు హెలికాప్టర్ ఎక్కారు. మంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో 10.30 గంటలకు వరకూ హెలికాప్టర్ రైడింగ్ చేయలేదు. వాతావరణం అనుకూలించిన తరువాత నుంచి సాయంత్రం 4.30 వరకూ హెలికాప్టర్ రైడింగ్ నిర్వహించారు. ధర ఎక్కువైనా ఎక్కడా పర్యాటకులు తగ్గేదే లేదంటూ రైడింగ్‌కు ఆసక్తి చూపారు. అలరించిన ఫ్లవర్ షో అరకు వింటర్ ఉత్సవాల సందర్భంగా పద్మాపురం గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో ఆకర్షించింది. ఐటీడీఏ, హార్టికల్చర్ సంయుక్తంగా ఈ షోను ఏర్పాటుచేశాయి. కడియం, విశాఖపట్నం నుంచి 10 వేలకు పైగా పెద్ద చామంతులు, 5 వేలకు పైగా గులాబీలు, ఏజెన్సీ వాతావరణానికి అనుకూలంగా ఉన్న ఆర్కిడ్స్, బంతి, జరబరాలు పువ్వులు ప్రత్యేకంగా తీసుకువచ్చారు. మొత్తం 15 రకాల పువ్వులను ఏర్పాటు చేశారు. కూరగాయలు, జామ, ఇతర పండ్లతో తయారు చేసిన తాబేలు, షిప్, ట్రైన్, చక్రం, గుమ్మడి కాయలతో తయారు చేసిన పడవ తదితర ఆకారాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. సుమారు రూ.15 లక్షలు వెచ్చించి విద్యుత్ కాంతులతో ఆకట్టుకునేలా ప్రదర్శనను తీర్చిదిద్దారు. ఆకట్టుకున్న 25 రకాల స్టాళ్లు.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన 25 రకాల స్టాళ్లు పర్యాటకులను ఆకట్టుకున్నాయి. ఆదివాసీలు పండించే వివిధ రకాల ఉత్పత్తులు, గిరిజన సంప్రదాయ వస్తువులు, జీసీసీ ఉత్పత్తులు, చిరు ధాన్యాలు, నాగాలాండ్‌కు చెందిన ఉన్ని వస్త్రాలు, ఊటీ నుంచి తెచ్చిన నీలగిరి టీ, పెర్ఫ్యూమ్స్, ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి నుంచి బొండవాలి, మణిపూర్ నుంచి హ్యాండీ క్రాఫ్ట్, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి సవరా ఆర్ట్స్, విజయవాడ నుంచి ఆర్గానిక్ సీడ్స్, చత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి బస్తర్ ఫేమస్ ఆభరణాలు, వెదురు ఫ్లవర్ బొకేలు, గిరిజన సంప్రదాయ దండలు, బ్యాగులతో 25 రకాల స్టాళ్లను ప్రత్యేకంగా నిలిచా యి. ట్రైబల్ మ్యూజియంలో వలే పూరిగుడిసెలో సంప్రదాయ వేషధారణలో నివసించే గిరిజనుల సంస్కృతిని తెలియజేసేలా స్టాల్ ఏర్పాటు చేశారు. ఆహా.. ఏమి రుచి అరకు చలి ఉత్సవాల్లో గిరిజన వంటకాలు ఆహా అనిపించాయి. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిరు ధాన్యాలతో తయారు చేసిన వంటకాలు సందర్శకులకు తెగ నచ్చేశాయి. వీటిలో రాగి పిండితో తయారు చేసిన అంబలి(రాగి జావ), తోప(రాగి సంగటి), సామ, కొర్రల బియ్యంతో అన్నం, రాజ్మా, కందులు, బొబ్బర్లు (అలసందలు) తదితర గిరిజన వ్యవసాయ ఉత్పత్తులతో తయారుచేసిన వంటకాలు సందర్శకులను కట్టిపడేశాయి. రాగి బెల్లం పిట్టు, కందుల పిట్టు, అలసందల కిచిడీ, రాగి తోప, రాగి అంబలి, రాగి బెల్లం ఉండలు, సామ బియ్యం అన్నం, రాజ్మా కూర, వెదుర కొమ్ముల కూర, శంకర లడ్డు, రాగి కుడుము, రాగి సక్కు, కర్ర పెండలం దుంపలు, రాజ్మా పిక్కలతో చేసిన రాబా, సారాకుల కూరతో రాబా, కొర్రల బియ్యం పాయసం, చిలగడ దుంపలు, గుమ్మడి ఆకుల కూర, పిండి దుంపల కూర, అడ్డ పిక్కలు, హల్వా ఆహా అనిపించాయి. కలెక్టర్ దినేష్కుమార్ఫిబ్రవరి 2 వరకు కొనసాగనున్న కార్యక్రమాలు అరకులోయ టౌన్/డుంబ్రిగుడ: అరకులోయ చలి ఉత్సవాలు గిరిజన ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయని కలెక్టర్ ఎ.ఎస్ దినేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు అరకు రైల్వే స్టేసన్ వద్ద 5కె మారథాన్ రన్‌ను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. విజేతలకు బహుమతులతో పాటు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. సేటు నో డ్రగ్స్ పోస్టర్‌ను జేసీ అభిషేక్ గౌడ్, పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్, సబ్‌కలెక్టర్ సౌర్యమాన్ పటేల్, ఏఎస్పీ ధీరజ్‌లతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ వద్ద కలెక్టర్ దినేష్‌కుమార్ పారా గ్లైడింగ్ను ప్రారంభించారు. సాయంత్రం ఢంకా మోగించి, ఉట్టిలో ధాన్యం, నీరు పోసి, ఒడ్లు దంచి స్టాళ్లను ప్రారంభించారు. పూణేలోని ఆరెంజ్లైఫ్ పారా గ్లైడింగ్ పాఠశాల నుంచి వచ్చిన పైలట్ అలీషా ద్వారా మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ వద్ద పారా గ్లైడింగ్ను ప్రారంభించారు. అనంతరం డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో స్టాళ్లను ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 5కె రన్లో 300 మంది పాల్గొన్నట్టు చెప్పారు. ఈఉత్సవాలకు హాజరైన ప్రజల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. 5కె రన్లో విజేతలు వీరే.. 5కె రన్లో పురుషుల విభాగంలో వి.రమేష్ ప్రథమ స్థానం, డి.అభిషేక్ ద్వితీయ స్థానం, శామ్యూల్ తృతీయస్థానంలో నిలిచారు. విద్యార్థినుల విభాగంలో జీవన తన్య ప్రథమస్థానం, ఎస్.మంజుల ద్వితీయస్థానంలో నిలిచారు. వీరికి కలెక్టర్ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. 500 మందితో బందోబస్తు అరకులోయ పరిసర ప్రాంతాల్లో సుమారు ఐదు కిలో మీటర్ల పరిధిలో ఐదు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మారథాన్ 5కె రన్ ప్రారంభమైన అరకు రైల్వే స్టేషన్ నుంచి ఉత్సవ్ వేదిక వరకు ఏఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు అరకులోయ సీఐ ఎల్.హిమగిరి పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.