Krishi Vigyan Kendra
-
రైతుల సేవలో కేవీకే
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రాన్ని (Krishi Vigyan Kendra) 1989లో ఏర్పాటు చేశారు. 36 ఏళ్లుగా ఈ కేంద్రం రైతులకు సేవలందిస్తోంది. జెన్నారెడ్డి రఘోత్తంరెడ్డి తన తండ్రి వెంకటరెడ్డి పేరు మీద మల్యాల గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రానికి 46.6 ఎకరాల భూమిని కేటాయించారు. మల్యాల కేవీకేలో సమన్వయకర్తగా డాక్టర్ ఎస్.మాలతి, విస్తరణ విభాగ అధిపతిగా డాక్టర్ ఎన్.కిషోర్ కుమార్, పంట సేద్యం ఉత్పత్తి శాస్త్రవేత్తగా బి.క్రాంతికుమార్, ఉద్యాన శాస్త్రవేత్తగా డాక్టర్ ఈ.రాంబాబు పనిచేస్తున్నారు. సస్యరక్షణ విభాగం, వెటర్నరీ, గృహ విజ్ఞాన విభాగాల శాస్త్రవేత్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రైతులకు అవగాహన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిపిన పరిశోధనలపై మల్యాల కేవీకే ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. స్థానిక భూముల నాణ్యతను బట్టి వాటికి అనువుగా ఉంటే ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలుగా ఎంపిక చేసి పరీక్షలు నిర్వహిస్తారు. మళ్లీ వాటిని పరిశోధనకు తీసుకువెళ్లి ఇతర రైతులకు ఉపయోగపడే విధంగా తెలియజేస్తున్నారు. రైతు దినోత్సవాలు, కిసాన్ మేళాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఉన్న ప్రధాన పంటలపైన రైతులకు శిక్షణ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలను సమన్వయం చేస్తూ సీజన్లో రైతులు సాగుచేస్తున్న పంట క్షేత్రాలను సందర్శించి పురుగులు, తెగుళ్ల నివారణ విషయంలో రైతులను చైతన్యపరుస్తున్నారు. చిరు సంచుల్లో వంగడాలు.. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన వంగడాలను చిరు సంచుల రూపంలో రైతులకు అందజేస్తున్నారు. రైతులు చిరు సంచుల ధాన్యం అభివృద్ధి బాగా ఉందని చెబితే కొత్తగా మరింత మంది రైతులకు ఇస్తున్నారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ, చీడపీడల నివారణ, పురుగుమందుల వాడకంపై మల్యాల కేవీకే శాస్త్రవేత్తలు క్షేత్ర దినోత్సవాలు, ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతుల క్షేత్రాల్లో వరి, పత్తి, మిరప, మొక్కజొన్న పంటలతోపాటు ఆరుతడి పంటలపై క్షేత్ర ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మట్టి పరీక్షలు.. భూసార పరీక్ష కేంద్రం ద్వారా రైతులకు మట్టి, నీళ్ల పరీక్షలు నిర్వహించి ఫలితాలు తెలియజేస్తున్నారు. వ్యవసాయ రంగంలో రోజురోజుకూ కొత్తకొత్త మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడంతోపాటు సేంద్రియ సాగుపై ఆసక్తి పెరిగే విధంగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. పెట్టుబడులు తగ్గించి అధిక దిగుబడులు పొందడం కోసం రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ వ్యవసాయంలో రాణించే విధంగా శిక్షణ ఇస్తున్నారు. వరి విత్తన ఉత్పత్తి.. మల్యాల కేవీకేలోని ఫాంలో వరి విత్తన ఉత్పత్తిలో భాగంగా సిద్ధి సన్న రకం, ఆర్ఎన్ఆర్ 15048 (తెలంగాణ సోనా), కునారం 118 సన్నాలు, డబ్ల్యూజీఎల్ 962 సన్నాలు తయారు చేస్తున్నారు. వరిలో విత్తన ఉత్పత్తి ద్వారా జిల్లాలోని రైతాంగానికి నాణ్యమైన విత్తనాలను అందిస్తున్నారు. గిరిజన ఉప ప్రణాళిక, ఎస్సీ ఉప ప్రణాళిక పథకంలో భాగంగా ఎంపిక చేసిన గ్రామాల రైతులకు పంటల సాగులో మెళకువలపై శిక్షణ ఇస్తున్నారు. అదే విధంగా స్కిల్ ట్రైనింగ్‌లు, ఒకేషనల్ ట్రైనింగ్‌లు, గుర్తించబడిన అంశాలపై ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆర్య (అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ రూరల్ యూత్ ఇన్ అగ్రికల్చర్) పథకంలో భాగంగా గ్రామాలను దత్తత తీసుకుని 18 నుంచి 35 ఏళ్ల వయసుగల వారిని ఎంపిక చేసి పురుష, మహిళా రైతులకు శిక్షణ ఇస్తున్నారు. కూరగాయల సాగు, పెరటికోళ్ల పెంపకం.. కేవీకేలోని షేడ్ నెట్లలో కూరగాయల సాగు పెంపకం, వర్మి కంపోస్టు తయారీ, పెరటి కోళ్ల పెంపకం, చిరుధాన్యాలతో వంటకాలు తయారు చేయడంపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. గిరిజనులు, దళితులు ఎక్కువగా ఉండే గ్రామాలను ఎంపిక చేసి, దత్తత తీసుకొని అక్కడి స్థానికులకు కుట్టు మెషీన్లపై శిక్షణ ఇచ్చారు. మూడు నుంచి నాలుగు సంవత్సరాలకుగాను జిల్లాలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని శిక్షణ ఇస్తున్నారు. కాటన్ స్పెషల్ ప్రాజెక్టులో భాగంగా నాగ్‌పూర్ అఖిల భారత పత్తి పరిశోధన సంస్థ (సీఐసీఆర్) సహకారంతో అధిక సాంద్రత పత్తి సాగు వల్ల జరిగే మేలుపై రైతులకు శిక్షణ ఇచ్చారు. తద్వారా రోజురోజుకూ రైతులు అధిక సాంద్రత పత్తి సాగుపై మక్కువ కనబరుస్తున్నారు. దీంతో మొక్కల సంఖ్య పెరిగి పంట దిగుబడి పెరగటంతో పాటుగా ఆర్థికంగా చేయూత వచ్చే విధంగా కృషి చేస్తున్నారు.మరిన్ని విశేషాలు.. » పెసర, మినుము, కందిలో కొత్త రకాలను చిరు సంచుల రూపంలో రైతులకు అందజేసి పంటల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. » కిసాన్ సారథి మొబైల్ యాప్ ద్వారా జిల్లా వ్యాప్తంగా 1,12,124 మంది రైతులను అందులో సభ్యులుగా చేర్చారు. పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలను కిసాన్ సారథి మొబైల్ యాప్ ద్వారా సమాచారాన్ని రైతులకు చేరవేస్తున్నారు. » డిస్ట్రిక్ట్ ఆగ్రో మెటరాలజీ యూనిట్ (దాము) వాట్సాప్ గ్రూపు ద్వారా 2023–24 సంవత్సరంలో రైతులకు వాతావరణ సూచనలు చేరవేశారు. »మల్యాల కేవీకే అనుసంధానంలో రైతులకు మిరపలో సాగు జాగ్రత్త చర్యలో భాగంగా నీలిరంగు, పసుపు రంగు జిగురు అట్టలను మిరప పంట చేలలో ఏర్పాటు చేసుకుని పంటను కాపాడుకునే విధానాలపై తెలియజేస్తున్నారు. మిరపలో సమగ్ర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ మల్చింగ్ విధానం వల్ల కలిగే లాభాలు, మిరప పంట చేనుల చుట్టూ బంతి పూల చెట్లు, మొక్కజొన్న వేసుకుంటే మేలుదాయకమని అవగాహన కల్పిస్తున్నారు. » వరిలో నేరుగా వెదజల్లే పద్ధతి ద్వారా రైతులకు లాభాలు చేకూరుస్తున్నారు. » మొక్కజొన్నలో జంటసాళ్ల పద్ధతిపై అవగాహన కల్పిస్తున్నారు. » యాసంగిలో జీరో టిల్లేట్ పద్ధతిలో మొక్కజొన్న సాగు లాభదాయకంపై తెలియజేస్తున్నారు. » వరి, మిరప పంటలకు ముందుగా పచ్చిరొట్ట పంటలు సాగు చేయాలని అవగాహన కల్పించటం వల్ల 40 శాతం వరకు రైతులు వృద్ధి సాధిస్తుండగా సూడోమోనోస్ జీవ నియంత్రికల వాడకాన్ని పెంచారు.మందుల వాడకం తగ్గించాలి రైతులు పంటల సాగు సమయంలో పురుగు మందులు, తెగుళ్ల మందులు అధికంగా వాడటం వల్ల భూసారం దెబ్బతింటుంది. పురుగు మందులు, తెగుళ్ల మందుల వాడకం తగ్గించడం శుభసూచకం. తద్వారా మనం సాగుచేసే నేల పాడైపోకుండా భావితరాల వారికి అందించే విధంగా ఉంటుంది. విచక్షణారహితంగా మందుల వాడకాన్ని తగ్గించాలి. సమీకృత వ్యవసాయాన్ని ఆచరించాలి. భావితరాల పురోగతికి నాంది పలకాలి. – డాక్టర్ ఎస్.మాలతి, మల్యాల కేవీకే సమన్వయకర్త గ్రామీణ యువతకు అవగాహన కల్పిస్తున్నాం... మల్యాల కేవీకే ద్వారా నిర్వహించే వివిధ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలతో గ్రామీణ యువతకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై అవగాహన కల్పిస్తున్నాం. తద్వారా వారు ఉపాధి అవకాశాలు పొందే విధంగా ప్రోత్సహిస్తున్నాం. జిల్లాలోని రైతులకు సమగ్ర ఎరువులు, పురుగు మందుల వాడకంపై తెలియజేస్తూ వారు సమగ్ర వ్యవసాయం చేసే విధంగా అవగాహన కల్పిస్తున్నాం. - డాక్టర్ ఎన్.కిషోర్ కుమార్, మల్యాల కేవీకే శాస్త్రవేత్త కొత్త రకాల విత్తనాలతో దిగుబడి సాధించా.. మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా నేను కొత్త రకాలైన వరి, పెసర విత్తనాలను తీసుకున్నాను. వాటి ద్వారా అధిక దిగుబడి సాధిస్తూ నాతోటి రైతులకు కొత్త రకం వరి, పెసర రకాలను పరిచయం చేస్తున్నాను. కేవీకే ద్వారా ఏర్పాటు చేస్తున్న అనేక శిక్షణ కార్యక్రమాలు, రైతు సదస్సులకు హాజరవుతున్నాను. తద్వారా రైతులు కొత్త విషయాలను తెలుసుకునే విధంగా సాయం చేస్తున్నాను. ముఖ్యంగా నేరుగా వరిలో విత్తేపద్ధతి, సమగ్ర వ్యవసాయం, కొత్త రకాలు, వివిధ పంటల్లో జంటసాళ్ల పద్ధతి మొక్కజొన్నలో అవలంబిస్తూ ఆర్థిక లబ్ధి పొందుతున్నాను. –గండ్రాతి భాస్కర్‌రెడ్డి, రైతు, బయ్యారం అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తున్నాను మల్యాల కేవీకే ద్వారా గత మూడు సంవత్సరాలుగా నేను అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తున్నాను. దీని ద్వారా ఎకరాకు పది నుంచి 11 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తుండగా ఆర్థికంగా అభివృద్ధి ఉంటోంది. పత్తి తర్వాత జొన్న, బొబ్బెర పంటలను సాగుచేసి ఆదాయాన్ని పొందుతున్నాను. మల్యాల కేవీకే ద్వారా ముఖ్యంగా సమగ్ర ఎరువులు, పురుగు మందుల యాజమాన్యం, అధిక సాంద్రత పత్తిసాగు, కొత్త రకాలైన విత్తనాలు, సమగ్ర వ్యవసాయంపై విషయాలు తెలుసుకుని తోటి రైతులు అవలంబించే విధంగా ప్రోత్సహిస్తున్నాను. –మాలోతు బాలాజీ, రైతు, చంద్రుతండా -
వంట పండింది!
జీవితంలో సమస్యలు రావడం సాధారణం. ఒక్కోసారి ఇవి ఊపిరాడనివ్వవు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా వాటిని ఎదుర్కొనాలి. తానేమిటో నిరూపించుకోవాలి. అలానే చేసింది బిందు. తన కూతుళ్లకు మంచి చదువును అందించేందుకు ఒక పక్క గరిట తిప్పుతూనే మరోపక్క నాగలి పట్టి పొలం సాగు చేస్తూ ‘‘మనం కూడా ఇలా వ్యవసాయం చేస్తే బావుంటుంది’’ అనేంతగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. తమిళనాడులోని తెనై జిల్లా బొమ్మినాయకన్పట్టి గ్రామానికి చెందిన బిందు, పిచ్చయ్య దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పిచ్చయ్య సొంత పొలంలో చెరకు పండించేవాడు. అయితే ఏటా అప్పులు తప్ప ఆదాయం వచ్చేది కాదు. గ్రామంలో చాలామంది రైతులు చెరకు, పత్తిని పండించి నష్టపోవడాన్ని చూసి ఇతర పంటలను పండించాలని నిర్ణయించుకుంది బిందు. మొక్కజొన్న, వంగ పంటను పొలంలో వేసింది. మరోపక్క సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్‌లో చేరి చుట్టుపక్కల రైతులు ఏం పండిస్తున్నారో తెలుసుకునేది. ఇతర రైతుల సలహాలు, సూచనలతో సాగును మెరుగు పరుచుకుంటూ, ఎస్‌హెచ్‌జీ ద్వారా కృషి విజ్ఞాన్ నిర్వహించే వ్యవసాయ కార్యక్రమాలకు హాజరవుతూ మెలకువలు నేర్చుకుంది. అధికారులు చెప్పిన విధంగా పప్పుధాన్యాలు, మిల్లెట్స్, మినుములు కూడా సేంద్రియ పద్ధతి లో సాగుచేసింది. దీంతో మంచి లాభాలు వచ్చాయి. విరామంలో... పంటకు పంటకు మధ్య వచ్చే విరామంలో కూరగాయలు పండించడం మొదలు పెట్టింది. అవి నాలుగు నెలల్లోనే చేతికి రావడంతో మంచి ఆదాయం వచ్చేది. విరామ పంటలు చక్కగా పండుతుండడంతో.. కొత్తిమీర, కాకర, ఇతర కూరగాయలను పండిస్తోంది. పంటను పసుమయిగా ... ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతో చాలా కూరగాయలు వృథా అయ్యేవి. అలా వ్యర్థంగా పోకుండా ఉండేందుకు ‘పసుమయి’ పేరిట ఎండబెట్టిన కూరగాయలు, పొడులను విక్రయిస్తోంది. ఇడ్లీ పొడి, నిమ్మపొడి, ధనియాల పొడి వంటి అనేక రకాల పొడులను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. నెలకు వందల సంఖ్యలో విక్రయాలు జరుగుతున్నాయి. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యాపారవేత్తగా ఎదిగింది బిందు. ఆమె పెద్దకూతురు ఎం.ఎస్. పూర్తి చేస్తే, చిన్నకూతురు బీఎస్సీ నర్సింగ్ చేస్తోంది. అలా సేద్యంతో పిల్లల చదువులనూ పండించుకుంది బిందు. -
పనసతో విలువ ఆధారిత పదార్థాల తయారీ
రంపచోడవరం: ఏజెన్సీ ప్రాంతంలో విరివిగా లభించే పనస ద్వారా గిరిజనులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా పనసతో వివిధ విలువ ఆధారిత పదార్థాల తయారీలో గిరిజన యువత శిక్షణ ఇస్తోంది. రెండేళ్ల కాలంలో వంద మంది ఆసక్తి కలిగిన గిరిజన యువత ఇందులో శిక్షణ తీసుకుంది. పనసలో విటమిన్–సి, కాల్షియం, ఐరన్, పోటాషియం, మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. ప్రస్తుత కాలంలో పచ్చికాయలు, పండ్లకు మంచి గిరాకీ ఉంది. ఈ నేపథ్యంలో కృషి విజ్ఞాన కేంద్రం వృతి నైపుణ్య శిక్షణ ఉచితంగా ఇస్తోంది. ఆగస్టు మొదటి వారంలో కొత్త బ్యాచ్‌కు శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. 1164 హెక్టార్లలో పనస విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పనస ఎక్కువగా లభ్యమవుతుంది. ఈ ప్రాంతాల్లో సుమారుగా 1,164 హెకార్లలో పనస చెట్లు ఉన్నాయి. రంపచోడవరం ఏజెన్సీలో మారేడుమిల్లి, వై.రామవరం మండలాల్లో సుమారు 120 హెక్టార్ల విస్తీర్ణంలో పనస సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి 4,332 టన్నుల పనస దిగుబడి వస్తుంది. పనస కాయ తొనలు, పనస పొట్టుతో కూరను ఎక్కువగా తయారు చేస్తారు. అయితే కేవీకే శాస్త్రవేత్తలు పనస కాయలు, పండ్లతో చిప్స్, తాండ్ర, హల్వా, జామ్, ఐస్‌క్రీమ్, పనస తొనల పొడి, పనస పిక్కల పొడి, బజ్జీలు, పకోడి వంటి వాటి తయారీపై శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే శిక్షణ పొందిన గిరిజనులు స్వయం ఉపాధి పొందుతున్నారు. పనసలో పైబర్ ఎక్కువగా ఉండడంతో కేవీకే శాస్త్రవేత్తలు పిక్కలు, తొనలతో మన్యం జాక్‌ప్రూట్ పిండిని తయారు చేశారు. శరీరానికి పైబర్ అవసరమైన వారు ఈ పిండిని ప్రతి రోజూ చపాతీ, అన్నం, దోసెల పిండిలో 20 గ్రాముల వరకు కలుపుకుని తీసుకోవడం ద్వారా.. శరీరానికి పైబర్ పుష్కలంగా అందించవచ్చు. (క్లిక్: విద్యుత్ ఉత్పత్తిలో మేటిగా నిలిచి.. మహారత్న బిరుదు) శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు ఏజెన్సీలో ఎటువంటి పెట్టుబడి లేకుండా రైతులుకు పనస లభిస్తోంది. ఇక్కడ పండే పనస ద్వారా రైతులు పూర్తిగా ఆదాయాన్ని పొందలేకపోతున్నారు. పనసకు విలువ ఆధారితం జోడించడం ద్వారా మార్కెట్ విలువ పెరుగుతుంది. ఇందులో భాగంగా ఆసక్తి ఉన్న వారికి ఏటా పనసతో తయారు చేసే పదార్థాలపై శిక్షణ ఇస్తున్నాం. – ఆదర్శ, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, పందిరిమామిడి -
సిరులు కురిపిస్తున్న నల్లబియ్యం
గువాహటి: బియ్యం ఏ రంగులో ఉంటాయి ? అదేం ప్రశ్న.. తెల్లగా ఉంటాయంటారా. అయితే మీ అభిప్రాయం మార్చుకోవాల్సిందే. అస్సాంలోని గోల్పరా రాష్ట్రంలో రైతులు నలుపురంగు బియ్యాన్ని సాగు చేస్తూ అధిక దిగుబడి పొందుతున్నారు. సుమారు రెండు వందల మంది రైతులు ఈ పంటను పండిస్తున్నారు. అమ్గురిపరా గ్రామానికి చెందిన యువ రైతు ఉపేంద్ర కృషి ఫలితమే నల్లబియ్యం సాగు. స్థానిక కృషి విజ్ఞాన్ కేంద్ర (కేవీకే) సంస్థ సహకారంతో ఉపేంద్ర 2011లో నలుపు రంగు బియ్యం పంటని సాగు చేయడం ప్రారంభించాడు. ‘2011లో కేవీకే సంస్థకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ఉత్తమ్ కుమార్ బారువా నాకు నలుపు రంగు బియ్యం విత్తనాలను అందించారు. నాకున్న కొంత స్థలంలో ఈ విత్తనాలను సాగు చేశాను. మంచి ఫలితం వచ్చింది’ అని ఈ రైతు అన్నారు. నల్లబియ్యం ఇక్కడి రైతుల జీవితాలను మార్చేసింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో బియ్యం రూ.100 పలుకుతోంది. బ్లాక్ రైస్‌లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్వీట్స్ తయారీల్లో కూడా నల్లబియ్యాన్ని ఉపయోగిస్తున్నారని ఉపేంద్ర వివరించారు. -
అరటి నారలో అర్థముంది!
అరటి బొందల నుంచి తీసే నారకు దేశవిదేశాల్లో గిరాకీ ఎకరానికి రూ. 30 వేల విలువైన నార తీసేందుకు అవకాశం.. ఖర్చులు పోను రూ. 10 వేల వరకు నికరాదాయం కలవచర్ల కేవీకే రూపొందించిన యంత్రంతో అరటి నార తీత చాలా సులువు.. దేశవిదేశాల నుంచి ఆర్డర్లు సృష్టిలో వృథా అనేదేదీ లేదు. వృథా అనిపించే వాటికి కూడా ఒక ప్రయోజనం ఉంటుంది. అరటి రైతుకు గెలల అమ్మకం ద్వారానే కాదు.. వృథాగా పారేసే అరటి బొందల ద్వారా కూడా అదనపు ఆదాయం పొందే మార్గం ఉంది. అరటి బొందల నుంచి తీసే నారకు దేశ విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. తూర్పు గోదావరి జిల్లా కలవచర్లలోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్తలు అరటి నార తీసే యంత్రాన్ని రూపొందించింది. దీంతో అరటి రైతులకు అదనపు ఆదాయం సమకూరుతోంది. అరటి తోటలో గెలలు నరికిన తర్వాత బొంద(చెట్టు)లను వృథాగా పారేయడం పరిపాటి. వీటి నుంచి తీసే నార వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. హేండ్ మేడ్ టిష్యూ పేపర్, డెకరేషన్ పేపర్, నర్సరీ పౌచెస్, క్యారీ బ్యాగ్స్, డోర్ మేట్స్, కార్పెట్స్, తాళ్లు, ఆర్ట్ పేపర్, క్రాఫ్ట్ పేపర్, బాండ్ పేపర్లు, పెన్ స్టాండ్స్, టేబుల్ డెకరేటివ్స్, ల్యాంప్ షేడ్స్తోపాటు వస్త్రాల తయారీలోనూ అరటి నారను వాడుతున్నారు. యంత్ర సహాయం లేకుండా ఒక మనిషి రోజుకు అర కేజీ వరకు మాత్రమే పొట్టుతో కూడిన నారను తీయడం సాధ్యం. దీంతో రైతులు నార తీతపై పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కలవచర్లలోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్తల కృషి ఫలితంగా దేశంలోనే మొట్టమొదటిగా అరటి నార తీసే యంత్రం అందుబాటులోకి వచ్చింది. నలుగురు వ్యక్తులు ఈ యంత్రం ద్వారా రోజులో 12 నుంచి 15 కిలోల నాణ్యమైన నారను తీయగలుగుతున్నారు. తద్వారా వృథాగా పారేసే అరటి బొందల నుంచి నార తీయడంతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుండడం విశేషం. కేవీకే యంత్రానికి జాతీయ అవార్డు అరటి బొందల ద్వారా నారను తీసే యంత్రం తయారు చేస్తే చెత్త సమస్య పరిష్కారం కావడంతోపాటు.. అరటి రైతులకు అదనపు ఆదాయం కూడా సమకూరుతుందన్న దృష్టితో కలవచర్ల కేవీకేకు చెందిన శాస్త్రవేత్తలు యంత్రం రూపకల్పనకు కృషి చేశారు. దేశంలోనే మొట్టమొదటిగా 2002లో అరటి నార తీసే యంత్రాన్ని విజయవంతంగా రూపొందించారు. డా. వెంకట సుబ్రమణియన్, డాక్టర్ దేవ్‌సింగ్, ఇంజినీర్ ఐ. శ్రీనివాస్‌ల తోడ్పాటుతో డాక్టర్ రూపాకుల సుధాకర్ చేసిన కృషి ఫలితంగా ఈ యంత్రం రూపుదాల్చింది. ఒన్ హెచ్‌పీ సామర్థ్యంతో ఇది పనిచేస్తుంది. దీని నిర్వహణ వ్యయం స్వల్పం కావడం విశేషం. 2005లో జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ(ఎన్ఆర్డీసీ) డా. సుధాకర్‌కు మెరిటోరియస్ ఇన్వెన్షన్ అవార్డుతోపాటు రూ. లక్ష నగదు బహుమతిని అందించి సత్కరించింది. ఈ యంత్రం ప్రస్తుత ఖరీదు రూ. 55 వేలు. ఇప్పటికి 350 యంత్రాలను కేవీకే విక్రయించింది. మన రాష్టంలో పలువురు రైతు బృందాలతోపాటు 19 రాష్ట్రాలు, వెస్టిండీస్, శ్రీలంక దేశాల్లోని వారికి కూడా ఈ యంత్రాంలను విక్రయించినట్లు డా. సుధాకర్ తెలిపారు. ఆస్ట్రేలియాకూ త్వరలో ఈ యంత్రాన్ని పంపనున్నట్లు చెప్పారు. రాజమండ్రి సీటీఆర్ఐ డెరైక్టర్ కె.దామోదరరెడ్డి, కల్వచర్ల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ విఎస్జీఆర్ నాయుడు ప్రోత్సాహంతో కేవీకే శాస్త్రవేత్తలు అరటి నార తీయడంతో పాటు వివిధ చేతి వృత్తుల్లో రైతు మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ఎకరానికి 150 కిలోల అరటి నార.. పక్వానికి వచ్చిన గెలలు నరికిన తర్వాత బొందలను కేవీకే రూపొందించిన యంత్రంతో నార తీయడానికి నలుగురు మనుషులు అవసరమవుతారు. ఎకరంలో 1200 వరకు అరటి చెట్లుంటాయి. వీటి నుంచి కనీసం 150 కిలోల నాణ్యమైన అరటి నారను తీయవచ్చు. సాధారణమైన అరటి నారను హేండ్ మేడ్ పేపర్ తయారీదారులు కిలో రూ. 200కు కొనుగోలు చేస్తున్నారు. నారను చక్కగా దువ్వి, పొట్టు లేకుండా ప్రాసెస్ చేసి అమ్మితే కిలోకు రూ. 300 నుంచి 400 వరకు ధర లభిస్తుంది. దేశంలో ఏటా వంద కోట్ల అరటి బొందలను నార తీయకుండానే వృథాగా పారేస్తున్నారని అంచనా. తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల అరటి బొందలను చెత్తకుప్పలో వృథాగా పడేస్తున్నట్లు అంచనా. ఏడాది పొడవునా అరటి దిగుబడి వస్తుంటుంది కాబట్టి అన్ని కాలాల్లోనూ అరటి నార ఉత్పత్తికి అవకాశం ఉంది. అరటి నార ఎగుమతిలో ఫిలిప్పీన్స్ ముందంజలో ఉంది. జపాన్, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలు, అమెరికా తదితర దేశాల్లో అరటి నారను విస్తృతంగా వినియోగిస్తున్నారు. కాబట్టి, అరటి నార ఎగుమతులకు అవకాశాలు చాలా ఉన్నాయి. - ఎల్. శ్రీనివాసరావు, బ్యూరో చీఫ్, రాజమండ్రి ఫొటోలు: గంధం వెంకట రమణ డొప్పలు తీసిన రోజే నార తీయాలి బలంగా, దృఢంగా ఉన్న చెట్టు నుంచి నాణ్యమైన నార వస్తుంది. తక్కువ రసాయనిక ఎరువులతో లేదా ప్రకృతి సేద్య పద్ధతిలో సాగైన అరటి చెట్ల నార బలంగా ఉంటుంది. ఏ రకం అరటి బొందల నుంచైనా 150 గ్రాముల చొప్పున నార తీయవచ్చు. కూర అరటి, అమృతపాణి చెట్ల నుంచి 200 గ్రాముల వరకు వస్తుంది. అరటి తోటలున్న రైతులు బృందాలుగా ఏర్పడి ఈ యంత్రాన్ని కొనుగోలు చేసి ఉపయోగించుకోవచ్చు. అరటి డొప్పలు తీసిన రోజునే నార తీసి నీడపట్టున ఆరబెట్టాలి. ఆలస్యమైతే నార రంగు మారి నాణ్యత తగ్గుతుంది. - డాక్టర్ రూపాకుల సుధాకర్ (98661 06885), అరటి నార తీసే యంత్రం రూపకర్త, కృషి విజ్ఞాన కేంద్రం, కలవచర్ల, తూ.గో. జిల్లా -
నాన్ టీచింగ్ ఉద్యోగుల ఆందోళన
ఆదిలాబాద్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : వ్యవసాయ పరిశోధన స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, ఏరువాక కేంద్రం నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం ఎదుట ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాన్ టీచింగ్ ఉ ద్యోగుల సంఘం కన్వీనర్ చక్రధర్ మాట్లాడు తూ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగుల మా దిరిగా హెల్త్‌కార్డులు, అర్హులకు ఇళ్లస్థలాలు మం జూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉ ద్యోగులతో సమానంగా మధ్యంతర భృతి 2014 జనవరి నుంచి చెల్లించాలని అన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాల ని, ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో జి.వెంకటి, అశోక్, రాజమౌళి, దేవానంద్, మహేశ్, గంగారాం, తదితరులు పాల్గొన్నారు.