36 ఏళ్లుగా మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం సేవలు
రైతులకు పంటల సాగుపై అవగాహన సదస్సులు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రాన్ని (Krishi Vigyan Kendra) 1989లో ఏర్పాటు చేశారు. 36 ఏళ్లుగా ఈ కేంద్రం రైతులకు సేవలందిస్తోంది. జెన్నారెడ్డి రఘోత్తంరెడ్డి తన తండ్రి వెంకటరెడ్డి పేరు మీద మల్యాల గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రానికి 46.6 ఎకరాల భూమిని కేటాయించారు.
మల్యాల కేవీకేలో సమన్వయకర్తగా డాక్టర్ ఎస్.మాలతి, విస్తరణ విభాగ అధిపతిగా డాక్టర్ ఎన్.కిషోర్ కుమార్, పంట సేద్యం ఉత్పత్తి శాస్త్రవేత్తగా బి.క్రాంతికుమార్, ఉద్యాన శాస్త్రవేత్తగా డాక్టర్ ఈ.రాంబాబు పనిచేస్తున్నారు. సస్యరక్షణ విభాగం, వెటర్నరీ, గృహ విజ్ఞాన విభాగాల శాస్త్రవేత్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
రైతులకు అవగాహన
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిపిన పరిశోధనలపై మల్యాల కేవీకే ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. స్థానిక భూముల నాణ్యతను బట్టి వాటికి అనువుగా ఉంటే ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలుగా ఎంపిక చేసి పరీక్షలు నిర్వహిస్తారు. మళ్లీ వాటిని పరిశోధనకు తీసుకువెళ్లి ఇతర రైతులకు ఉపయోగపడే విధంగా తెలియజేస్తున్నారు.
రైతు దినోత్సవాలు, కిసాన్ మేళాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఉన్న ప్రధాన పంటలపైన రైతులకు శిక్షణ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలను సమన్వయం చేస్తూ సీజన్‌లో రైతులు సాగుచేస్తున్న పంట క్షేత్రాలను సందర్శించి పురుగులు, తెగుళ్ల నివారణ విషయంలో రైతులను చైతన్యపరుస్తున్నారు.
చిరు సంచుల్లో వంగడాలు..
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన వంగడాలను చిరు సంచుల రూపంలో రైతులకు అందజేస్తున్నారు. రైతులు చిరు సంచుల ధాన్యం అభివృద్ధి బాగా ఉందని చెబితే కొత్తగా మరింత మంది రైతులకు ఇస్తున్నారు.
వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ, చీడపీడల నివారణ, పురుగుమందుల వాడకంపై మల్యాల కేవీకే శాస్త్రవేత్తలు క్షేత్ర దినోత్సవాలు, ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతుల క్షేత్రాల్లో వరి, పత్తి, మిరప, మొక్కజొన్న పంటలతోపాటు ఆరుతడి పంటలపై క్షేత్ర ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
మట్టి పరీక్షలు..
భూసార పరీక్ష కేంద్రం ద్వారా రైతులకు మట్టి, నీళ్ల పరీక్షలు నిర్వహించి ఫలితాలు తెలియజేస్తున్నారు. వ్యవసాయ రంగంలో రోజురోజుకూ కొత్తకొత్త మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడంతోపాటు సేంద్రియ సాగుపై ఆసక్తి పెరిగే విధంగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. పెట్టుబడులు తగ్గించి అధిక దిగుబడులు పొందడం కోసం రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ వ్యవసాయంలో రాణించే విధంగా శిక్షణ ఇస్తున్నారు.
వరి విత్తన ఉత్పత్తి..
మల్యాల కేవీకేలోని ఫాంలో వరి విత్తన ఉత్పత్తిలో భాగంగా సిద్ధి సన్న రకం, ఆర్‌ఎన్‌ఆర్ 15048 (తెలంగాణ సోనా), కునారం 118 సన్నాలు, డబ్ల్యూజీఎల్ 962 సన్నాలు తయారు చేస్తున్నారు. వరిలో విత్తన ఉత్పత్తి ద్వారా జిల్లాలోని రైతాంగానికి నాణ్యమైన విత్తనాలను అందిస్తున్నారు.
గిరిజన ఉప ప్రణాళిక, ఎస్సీ ఉప ప్రణాళిక పథకంలో భాగంగా ఎంపిక చేసిన గ్రామాల రైతులకు పంటల సాగులో మెళకువలపై శిక్షణ ఇస్తున్నారు. అదే విధంగా స్కిల్ ట్రైనింగ్‌లు, ఒకేషనల్ ట్రైనింగ్‌లు, గుర్తించబడిన అంశాలపై ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆర్య (అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ రూరల్ యూత్ ఇన్ అగ్రికల్చర్) పథకంలో భాగంగా గ్రామాలను దత్తత తీసుకుని 18 నుంచి 35 ఏళ్ల వయసుగల వారిని ఎంపిక చేసి పురుష, మహిళా రైతులకు శిక్షణ ఇస్తున్నారు.
కూరగాయల సాగు, పెరటికోళ్ల పెంపకం..
కేవీకేలోని షేడ్ నెట్లలో కూరగాయల సాగు పెంపకం, వర్మి కంపోస్టు తయారీ, పెరటి కోళ్ల పెంపకం, చిరుధాన్యాలతో వంటకాలు తయారు చేయడంపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. గిరిజనులు, దళితులు ఎక్కువగా ఉండే గ్రామాలను ఎంపిక చేసి, దత్తత తీసుకొని అక్కడి స్థానికులకు కుట్టు మెషీన్లపై శిక్షణ ఇచ్చారు. మూడు నుంచి నాలుగు సంవత్సరాలకుగాను జిల్లాలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని శిక్షణ ఇస్తున్నారు.
కాటన్ స్పెషల్ ప్రాజెక్టులో భాగంగా నాగ్‌పూర్ అఖిల భారత పత్తి పరిశోధన సంస్థ (సీఐసీఆర్) సహకారంతో అధిక సాంద్రత పత్తి సాగు వల్ల జరిగే మేలుపై రైతులకు శిక్షణ ఇచ్చారు. తద్వారా రోజురోజుకూ రైతులు అధిక సాంద్రత పత్తి సాగుపై మక్కువ కనబరుస్తున్నారు. దీంతో మొక్కల సంఖ్య పెరిగి పంట దిగుబడి పెరగటంతో పాటుగా ఆర్థికంగా చేయూత వచ్చే విధంగా కృషి చేస్తున్నారు.
మరిన్ని విశేషాలు..
» పెసర, మినుము, కందిలో కొత్త రకాలను చిరు సంచుల రూపంలో రైతులకు అందజేసి పంటల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు.
» కిసాన్ సారథి మొబైల్ యాప్ ద్వారా జిల్లా వ్యాప్తంగా 1,12,124 మంది రైతులను అందులో సభ్యులుగా చేర్చారు. పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలను కిసాన్ సారథి మొబైల్ యాప్ ద్వారా సమాచారాన్ని రైతులకు చేరవేస్తున్నారు.
» డిస్ట్రిక్ట్ ఆగ్రో మెటరాలజీ యూనిట్ (దాము) వాట్సాప్ గ్రూపు ద్వారా 2023–24 సంవత్సరంలో రైతులకు వాతావరణ సూచనలు చేరవేశారు.
»మల్యాల కేవీకే అనుసంధానంలో రైతులకు మిరపలో సాగు జాగ్రత్త చర్యలో భాగంగా నీలిరంగు, పసుపు రంగు జిగురు అట్టలను మిరప పంట చేలలో ఏర్పాటు చేసుకుని పంటను కాపాడుకునే విధానాలపై తెలియజేస్తున్నారు. మిరపలో సమగ్ర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ మల్చింగ్ విధానం వల్ల కలిగే లాభాలు, మిరప పంట చేనుల చుట్టూ బంతి పూల చెట్లు, మొక్కజొన్న వేసుకుంటే మేలుదాయకమని అవగాహన కల్పిస్తున్నారు.
» వరిలో నేరుగా వెదజల్లే పద్ధతి ద్వారా రైతులకు లాభాలు చేకూరుస్తున్నారు.
» మొక్కజొన్నలో జంటసాళ్ల పద్ధతిపై అవగాహన కల్పిస్తున్నారు.
» యాసంగిలో జీరో టిల్లేట్ పద్ధతిలో మొక్కజొన్న సాగు లాభదాయకంపై తెలియజేస్తున్నారు.
» వరి, మిరప పంటలకు ముందుగా పచ్చిరొట్ట పంటలు సాగు చేయాలని అవగాహన కల్పించటం వల్ల 40 శాతం వరకు రైతులు వృద్ధి సాధిస్తుండగా సూడోమోనోస్ జీవ నియంత్రికల వాడకాన్ని పెంచారు.
మందుల వాడకం తగ్గించాలి
రైతులు పంటల సాగు సమయంలో పురుగు మందులు, తెగుళ్ల మందులు అధికంగా వాడటం వల్ల భూసారం దెబ్బతింటుంది. పురుగు మందులు, తెగుళ్ల మందుల వాడకం తగ్గించడం శుభసూచకం. తద్వారా మనం సాగుచేసే నేల పాడైపోకుండా భావితరాల వారికి అందించే విధంగా ఉంటుంది. విచక్షణారహితంగా మందుల వాడకాన్ని తగ్గించాలి. సమీకృత వ్యవసాయాన్ని ఆచరించాలి. భావితరాల పురోగతికి నాంది పలకాలి.
– డాక్టర్ ఎస్.మాలతి, మల్యాల కేవీకే సమన్వయకర్త
గ్రామీణ యువతకు అవగాహన కల్పిస్తున్నాం...
మల్యాల కేవీకే ద్వారా నిర్వహించే వివిధ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలతో గ్రామీణ యువతకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై అవగాహన కల్పిస్తున్నాం. తద్వారా వారు ఉపాధి అవకాశాలు పొందే విధంగా ప్రోత్సహిస్తున్నాం. జిల్లాలోని రైతులకు సమగ్ర ఎరువులు, పురుగు మందుల వాడకంపై తెలియజేస్తూ వారు సమగ్ర వ్యవసాయం చేసే విధంగా అవగాహన కల్పిస్తున్నాం.
- డాక్టర్ ఎన్.కిషోర్ కుమార్, మల్యాల కేవీకే శాస్త్రవేత్త
కొత్త రకాల విత్తనాలతో దిగుబడి సాధించా..
మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా నేను కొత్త రకాలైన వరి, పెసర విత్తనాలను తీసుకున్నాను. వాటి ద్వారా అధిక దిగుబడి సాధిస్తూ నాతోటి రైతులకు కొత్త రకం వరి, పెసర రకాలను పరిచయం చేస్తున్నాను. కేవీకే ద్వారా ఏర్పాటు చేస్తున్న అనేక శిక్షణ కార్యక్రమాలు, రైతు సదస్సులకు హాజరవుతున్నాను. తద్వారా రైతులు కొత్త విషయాలను తెలుసుకునే విధంగా సాయం చేస్తున్నాను. ముఖ్యంగా నేరుగా వరిలో విత్తేపద్ధతి, సమగ్ర వ్యవసాయం, కొత్త రకాలు, వివిధ పంటల్లో జంటసాళ్ల పద్ధతి మొక్కజొన్నలో అవలంబిస్తూ ఆర్థిక లబ్ధి పొందుతున్నాను.
–గండ్రాతి భాస్కర్‌రెడ్డి, రైతు, బయ్యారం
అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తున్నాను
మల్యాల కేవీకే ద్వారా గత మూడు సంవత్సరాలుగా నేను అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తున్నాను. దీని ద్వారా ఎకరాకు పది నుంచి 11 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తుండగా ఆర్థికంగా అభివృద్ధి ఉంటోంది. పత్తి తర్వాత జొన్న, బొబ్బెర పంటలను సాగుచేసి ఆదాయాన్ని పొందుతున్నాను. మల్యాల కేవీకే ద్వారా ముఖ్యంగా సమగ్ర ఎరువులు, పురుగు మందుల యాజమాన్యం, అధిక సాంద్రత పత్తిసాగు, కొత్త రకాలైన విత్తనాలు, సమగ్ర వ్యవసాయంపై విషయాలు తెలుసుకుని తోటి రైతులు అవలంబించే విధంగా ప్రోత్సహిస్తున్నాను.
–మాలోతు బాలాజీ, రైతు, చంద్రుతండా
Comments
Please login to add a commentAdd a comment