
సాగులో సరికొత్త ట్రెండ్.. అటవీ వ్యవసాయం
సాధారణ వ్యవసాయానికి ప్రత్యామ్నాయం
బీడు భూముల్లో వెదురు, సరివి, సుబాబుల్ తదితర మొక్కల పెంపకం
ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ తోడ్పాటు
తోటల మాదిరి సాగుతో అధిక ఆదాయం
గజ్వేల్: భూములు కలిగివున్నా ఎప్పటికప్పడు చూసుకోలేని, పంటల్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో.. వ్యవసాయం చేయలేక బీడుగా ఉంచుతున్న రైతులకు అటవీ వ్యవసాయం చక్కని తరుణోపాయంలా మారుతోంది. ఇంతకాలం నిరుపయోగంగా ఉన్న భూముల్లో అటవీ మొక్కలను తోటల మాదిరిగా సాగు చేస్తున్నారు. సమయం చిక్కినప్పుడు వచ్చి చూసుకొని వెళుతున్నారు.
సాధారణ వ్యవసాయంతో పోలిస్తే నామమాత్రపు పెట్టుబడి కావడం అధిక ఆదాయం లభిస్తుండటంతో దీనివైపు మొగ్గుచూపుతున్నారు. నేలలో సారం తగ్గకుండా కాపాడుతున్నారు. వాతావరణ కాలుష్య నియంత్రణకు దోహదపడుతున్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ (సీఈసీ) ఈ కొత్త తరహా సాగుకు శ్రీకారం చుట్టి ఈ మేరకు రైతుల్ని ప్రోత్సహిస్తోంది.
సాగుకు సర్కారు అనుమతి
వెదురు, సుబాబుల్, శ్రీగంధం, సరివి చెట్లు గతంలో అక్కడక్కడా రైతుల పొలం గట్లపై మాత్రమే కన్పించేవి. అటవీ ప్రాంతాల్లోనే వెదురు ఎక్కువగా ఉంటుంది. తాజాగా వీటిని తోటల మాదిరిగా విరివిగా పెంచి అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ములుగులోని సీఈసీ గత రెండేళ్లుగా అటవీ మొక్కల్లో మేలైన రకాలను ఉత్పత్తి చేస్తూ రైతులకు అందిస్తోంది.
తమిళనాడు, అసోం, కేరళ రాష్ట్రాల్లోని పలు పరిశోధన కేంద్రాల నుంచి మేలైన వెదురు విత్తనాన్ని తెప్పించి భారీగా మొక్కల ఉత్పత్తి చేపడుతోంది. ప్రధానంగా బీ–స్ట్రిక్టస్, తుల్డా పేరుతో ఉన్న అత్యంత నాణ్యత కలిగిన మొక్కలను ఉత్పత్తి చేసి రైతులకు నామమాత్రపు ధరకు విక్రయిస్తోంది.
సిద్దిపేటతో పాటు యాదాద్రి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, వరంగల్, మెదక్, ఖమ్మం, మహబూబ్‌నగర్ తదితర జిల్లాలకు చెందిన రైతులకు సరఫరా చేస్తోంది. వెదురు మాదిరిగానే శ్రీగంధం, సరివి, సుబాబుల్ మొక్కలను కూడా ఉత్పత్తి చేస్తున్నారు.
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోనూ..
వ్యవసాయంలో వచ్చే మార్పులను నిరంతరం గమనిస్తూ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటల సాగుపై దృష్టి పెట్టే మాజీ సీఎం కేసీఆర్ సైతం అటవీ వ్యవసాయం వైపు మళ్లారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో కూడా వెదురు పెంపకాన్ని చేపట్టారు.
జగదేవ్‌పూర్ మండలంలో ఇటిక్యాలలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిరణ్ ఆరు ఎకరాల్లో సాగు చేసిన వెదురు తోటను స్వయంగా పరిశీలించి వివరాలను తెలుసుకున్న కేసీఆర్...ఫామ్‌హౌస్‌లో ఇటీవలే వివిధ రకాల మొక్కలను తెప్పించి నాటించారు.
మొక్కలు నాటితే చాలు..
భూములు ఉన్నప్పటికీ ఇతర వృత్తుల రీత్యా బీజీగా ఉండటం, పంటలు వేసినా వాటిని పరిరక్షించుకోలేని పరిస్థితుల్లో చాలామంది బీళ్లుగా ఉంచేస్తున్నారు. ఇలాంటి వారికి అటవీ వ్యవసాయం చక్కని పరిష్కారంగా మారుతోంది. ఒకసారి మొక్కలు నాటితే చాలు ఈ తరహా మొక్కలు వాటంతట అవే పెరిగిపోతాయి. పైగా వీటిని చీడపీడలు ఆశించవు. ఎరువులు, క్రిమిసంహారకాల అవసరం లేదు.
నీటి సదుపాయం కూడా పెద్దగా అవసరం లేదు. బిందు (డ్రిప్) సేద్యం తరహాలో అందిస్తే చాలు. దీంతో రైతులు పెద్ద సంఖ్యలో ఈ మొక్కల పెంపకం వైపు ఆకర్షితులవుతున్నారు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే అటవీ వ్యవసాయంతో భూముల్లో సారం స్థిరంగా ఉంటుందని, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేలా ఆక్సిజన్ అత్యధికంగా ఉండే గాలిని వెదురు మొక్కలు అందిస్తాయని సీఈసీ అధికారులు చెబుతున్నారు.
ఈ తోటలతో ఇతర పంటల మాదిరిగా వెంటనే ఆదాయం రాకున్నా..రెండు మూడేళ్ల తర్వాత మంచి, మెరుగైన ఆదాయం మొదలవు తుండటంతో భూముల్ని బీళ్లుగా ఉంచడం కంటే ఇది మేలని రైతులు భావిస్తున్నారు.
ఎన్ని సానుకూలతలో..
ఒక్కసారి మొక్కలు నాటితే చాలు
నిరంతర పర్యవేక్షణ అవసరం లేదు
నీటి అవసరం అంతగా లేదు
భూసారం తగ్గనే తగ్గదు
చీడపీడలు సోకుతాయనే చింత లేదు
క్రిమిసంహారకాలు, ఎరువులతో పనే లేదు
వెదురుతో అత్యధిక స్థాయిలో ఆక్సిజన్
అటవీ వ్యవసాయానికి మంచి భవిష్యత్తు
అటవీ వ్యవసాయానికి మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పటికే రైతులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో మేం కూడా మేలైన అటవీ మొక్కలను ఉత్పత్తి చేసి నామమాత్రపు ధరకే అందిస్తున్నాం. రాబోయే రోజుల్లో మరింత విరివిగా ఈ ప్రక్రియ చేపట్టనున్నాం. – శ్రీధర్, ఉద్యానవన శాఖ ఏడీ (ములుగు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్‌చార్జి)
వెదురుకు విదేశాల్లో మంచి గిరాకీ
నేను వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను. హైదరాబాద్‌లో ఉంటున్నా. మా స్వగ్రామం సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని ఇటిక్యాలకు వచ్చి వ్యవసాయం చేయాలంటే సమయం కుదరడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆరు ఎకరాల్లో వెదురు సాగు చేశా. సీఈసీ నుంచి తుల్డా రకం మొక్కలు తెప్పించి వేశా. ఏడాది గడిచింది. మరో రెండేళ్ల తర్వాత నాకు మంచి ఆదాయం వచ్చే అవకాశముంది.
గృహాలకు సంబంధించిన ఫర్నిచర్, ఇతర ఉపకరణాల కోసం ఇతర దేశాల నుంచి వెదురు దిగుమతి చేసుకుంటున్నారని తెలుసుకొని ఇది సాగు చేశా. ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉన్నందువల్ల భారీగా లాభాలు రావచ్చని భావిస్తున్నా. – కిరణ్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, ఇటిక్యాల, సిద్దిపేట జిల్లా
Comments
Please login to add a commentAdd a comment