Center for Excellence
-
కాపలా పనిలేదు.. చీడపీడల బాధలేదు
గజ్వేల్: భూములు కలిగివున్నా ఎప్పటికప్పడు చూసుకోలేని, పంటల్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో.. వ్యవసాయం చేయలేక బీడుగా ఉంచుతున్న రైతులకు అటవీ వ్యవసాయం చక్కని తరుణోపాయంలా మారుతోంది. ఇంతకాలం నిరుపయోగంగా ఉన్న భూముల్లో అటవీ మొక్కలను తోటల మాదిరిగా సాగు చేస్తున్నారు. సమయం చిక్కినప్పుడు వచ్చి చూసుకొని వెళుతున్నారు. సాధారణ వ్యవసాయంతో పోలిస్తే నామమాత్రపు పెట్టుబడి కావడం అధిక ఆదాయం లభిస్తుండటంతో దీనివైపు మొగ్గుచూపుతున్నారు. నేలలో సారం తగ్గకుండా కాపాడుతున్నారు. వాతావరణ కాలుష్య నియంత్రణకు దోహదపడుతున్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ (సీఈసీ) ఈ కొత్త తరహా సాగుకు శ్రీకారం చుట్టి ఈ మేరకు రైతుల్ని ప్రోత్సహిస్తోంది.సాగుకు సర్కారు అనుమతివెదురు, సుబాబుల్, శ్రీగంధం, సరివి చెట్లు గతంలో అక్కడక్కడా రైతుల పొలం గట్లపై మాత్రమే కన్పించేవి. అటవీ ప్రాంతాల్లోనే వెదురు ఎక్కువగా ఉంటుంది. తాజాగా వీటిని తోటల మాదిరిగా విరివిగా పెంచి అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ములుగులోని సీఈసీ గత రెండేళ్లుగా అటవీ మొక్కల్లో మేలైన రకాలను ఉత్పత్తి చేస్తూ రైతులకు అందిస్తోంది. తమిళనాడు, అసోం, కేరళ రాష్ట్రాల్లోని పలు పరిశోధన కేంద్రాల నుంచి మేలైన వెదురు విత్తనాన్ని తెప్పించి భారీగా మొక్కల ఉత్పత్తి చేపడుతోంది. ప్రధానంగా బీ–స్ట్రిక్టస్, తుల్డా పేరుతో ఉన్న అత్యంత నాణ్యత కలిగిన మొక్కలను ఉత్పత్తి చేసి రైతులకు నామమాత్రపు ధరకు విక్రయిస్తోంది. సిద్దిపేటతో పాటు యాదాద్రి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, వరంగల్, మెదక్, ఖమ్మం, మహబూబ్‌నగర్ తదితర జిల్లాలకు చెందిన రైతులకు సరఫరా చేస్తోంది. వెదురు మాదిరిగానే శ్రీగంధం, సరివి, సుబాబుల్ మొక్కలను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోనూ..వ్యవసాయంలో వచ్చే మార్పులను నిరంతరం గమనిస్తూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగుపై దృష్టి పెట్టే మాజీ సీఎం కేసీఆర్ సైతం అటవీ వ్యవసాయం వైపు మళ్లారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో కూడా వెదురు పెంపకాన్ని చేపట్టారు. జగదేవ్‌పూర్ మండలంలో ఇటిక్యాలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి కిరణ్ ఆరు ఎకరాల్లో సాగు చేసిన వెదురు తోటను స్వయంగా పరిశీలించి వివరాలను తెలుసుకున్న కేసీఆర్...ఫామ్‌హౌస్‌లో ఇటీవలే వివిధ రకాల మొక్కలను తెప్పించి నాటించారు.మొక్కలు నాటితే చాలు..భూములు ఉన్నప్పటికీ ఇతర వృత్తుల రీత్యా బీజీగా ఉండటం, పంటలు వేసినా వాటిని పరిరక్షించుకోలేని పరిస్థితుల్లో చాలామంది బీళ్లుగా ఉంచేస్తున్నారు. ఇలాంటి వారికి అటవీ వ్యవసాయం చక్కని పరిష్కారంగా మారుతోంది. ఒకసారి మొక్కలు నాటితే చాలు ఈ తరహా మొక్కలు వాటంతట అవే పెరిగిపోతాయి. పైగా వీటిని చీడపీడలు ఆశించవు. ఎరువులు, క్రిమిసంహారకాల అవసరం లేదు. నీటి సదుపాయం కూడా పెద్దగా అవసరం లేదు. బిందు (డ్రిప్) సేద్యం తరహాలో అందిస్తే చాలు. దీంతో రైతులు పెద్ద సంఖ్యలో ఈ మొక్కల పెంపకం వైపు ఆకర్షితులవుతున్నారు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే అటవీ వ్యవసాయంతో భూముల్లో సారం స్థిరంగా ఉంటుందని, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేలా ఆక్సిజన్ అత్యధికంగా ఉండే గాలిని వెదురు మొక్కలు అందిస్తాయని సీఈసీ అధికారులు చెబుతున్నారు. ఈ తోటలతో ఇతర పంటల మాదిరిగా వెంటనే ఆదాయం రాకున్నా..రెండు మూడేళ్ల తర్వాత మంచి, మెరుగైన ఆదాయం మొదలవు తుండటంతో భూముల్ని బీళ్లుగా ఉంచడం కంటే ఇది మేలని రైతులు భావిస్తున్నారు. ఎన్ని సానుకూలతలో..ఒక్కసారి మొక్కలు నాటితే చాలు నిరంతర పర్యవేక్షణ అవసరం లేదు నీటి అవసరం అంతగా లేదుభూసారం తగ్గనే తగ్గదుచీడపీడలు సోకుతాయనే చింత లేదుక్రిమిసంహారకాలు, ఎరువులతో పనే లేదువెదురుతో అత్యధిక స్థాయిలో ఆక్సిజన్అటవీ వ్యవసాయానికి మంచి భవిష్యత్తు అటవీ వ్యవసాయానికి మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పటికే రైతులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో మేం కూడా మేలైన అటవీ మొక్కలను ఉత్పత్తి చేసి నామమాత్రపు ధరకే అందిస్తున్నాం. రాబోయే రోజుల్లో మరింత విరివిగా ఈ ప్రక్రియ చేపట్టనున్నాం. – శ్రీధర్, ఉద్యానవన శాఖ ఏడీ (ములుగు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్చార్జి)వెదురుకు విదేశాల్లో మంచి గిరాకీ నేను వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను. హైదరాబాద్‌లో ఉంటున్నా. మా స్వగ్రామం సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని ఇటిక్యాలకు వచ్చి వ్యవసాయం చేయాలంటే సమయం కుదరడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆరు ఎకరాల్లో వెదురు సాగు చేశా. సీఈసీ నుంచి తుల్డా రకం మొక్కలు తెప్పించి వేశా. ఏడాది గడిచింది. మరో రెండేళ్ల తర్వాత నాకు మంచి ఆదాయం వచ్చే అవకాశముంది. గృహాలకు సంబంధించిన ఫర్నిచర్, ఇతర ఉపకరణాల కోసం ఇతర దేశాల నుంచి వెదురు దిగుమతి చేసుకుంటున్నారని తెలుసుకొని ఇది సాగు చేశా. ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉన్నందువల్ల భారీగా లాభాలు రావచ్చని భావిస్తున్నా. – కిరణ్, సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఇటిక్యాల, సిద్దిపేట జిల్లా -
ఇంటిపంటలపై రేపు ఉద్యాన శాఖ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్
నగర, పట్టణ ప్రాంతాల్లో సేంద్రియ ఇంటిపంటల సాగు (అర్బన్ ఫార్మింగ్)పై పెరుగుతున్న ఆసక్తి దృష్ట్యా ప్రజల్లో అవగాహన పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ ఈ నెల 24న ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు జీడిమెట్ల విలేజ్(పైపులరోడ్డు)లోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనుంది. అర్బన్ ఫార్మింగ్, వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోపోనిక్స్ తదితర అంశాలపై కేరళకు చెందిన నిపుణురాలు డాక్టర్ సుశీల శిక్షణ ఇస్తారు. 25 మంది సీనియర్ ఇంటిపంటల సాగుదారులు తమ అనుభవాలను వివరిస్తారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, ఉద్యాన శాఖ ప్రధాన కార్యదర్శి పార్థసారథి, విశ్రాంత ఐఏఎస్ అధికారి మోహన్ కందా పాల్గొంటారని ఉద్యాన కమిషనర్ ఎల్. వెంకట్రామ్రెడ్డి తెలిపారు. ప్రవేశం ఉచితం. ఆసక్తిగలవారు 79977 24936, 79977 24983, 79977 24985 నంబర్లకు ఫోన్ చేసి ముందుగా పేర్లు నమోదు చేయించుకోవచ్చు. -
హైదరాబాద్ అందరిదీ
నిస్సంకోచంగా పెట్టుబడులు పెట్టండి ఉచిత పథకాలతో దేశ ప్రగతికి చేటు ఇక విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కేంద్రమంత్రి వెంకయ్యునాయుుడు హైదరాబాద్: ప్రస్తుత తరుణంలో ప్రపంచంలోని అన్ని పరిశ్రమలు హైదరాబాద్‌వైపు చూస్తున్నాయని వాటిని ఆకర్షించే శక్తి భాగ్యనగరానికే ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఉప్పల్ పారిశ్రామిక వాడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన సెంటర్ ఫర్ ఎక్సెలెన్స్ కార్యాలయ భవన శంకుస్థాపన కార్యక్రమానికి ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలను మరింత ప్రోత్సహిస్తే ఇంకా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ హైదరాబాదీలేనని, భాగ్యనగరం మన అందరిదన్నారు. దీనిపై అందరికీ సమాన హక్కులున్నాయని, ఎవరైనా పెట్టుబడులు నిస్సంకోచంగా పెట్టవచ్చని సూచించారు. కల్లు గీయడం, కుండలు చేయడం లాంటి కళలు, పోచంపల్లి, కంచి పట్టు లాంటి చీరలు తయారు చేయడం మనం తప్ప మరే దేశం చేయలేదన్నారు. ఇక నుంచి ఎవరూ విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్ని సౌకర్యాలు మనదేశంలో ఉన్నాయని తెలిపారు. ఉచిత పథకాల వల్ల దేశ ప్రగతి కుంటుపడుతుందని అలాం టివి ప్రోత్సహించ వద్దన్నారు. తెలుగు వారు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా మనందరం భారతీయులమని గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రాంతీయత పేరిట విద్వేషాలను రెచ్చగొట్టే వారి ని దూరం పెట్టాలని కోరారు. జన్‌ధన్ కార్యక్రమాన్ని రూపొందించి 15 రోజు ల్లో మూడు కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు ఇప్పించామన్నారు. రైతు రుణ మాఫీ శాశ్వత పరిష్కారమా? వ్యవసాయ రంగానికి రైతు రుణ మాఫీ శాశ్వత పరిష్కారమా అని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య సూటిగా ప్రశ్నించారు. రైతు నేస్తం వ్యవసాయ మాసపత్రిక పదో వార్షికోత్సవం సందర్భంగా ఆది వారం జరిగిన రైతు నేస్తం పురస్కారాలు-2014 కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు. వ్యవసాయ రంగానికి అప్పుల మాఫీ కంటే ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అవసరమన్నారు. బ్యాంకులు రైతులకు ఇచ్చే అప్పులు ప్రజల డబ్బు అని, ప్రజల సొమ్ముపై కొద్దిపాటి లాభాలతో రైతులకు ఇచ్చే రుణాలను మాఫీ చేస్తే దివాళా తీస్తాయని పేర్కొన్నారు. వ్యవసాయూనికి ఉచిత విద్యుత్ కంటే నాణ్యమైన పదిగంటల విద్యుత్ అవసరమని స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లలో ప్రతిరైతు కూ వ్యవసాయ భూసార కార్డులు అందించేం దుకు ప్రధాని నరేంద్రమోడీ కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి ప్రకటించారు. కార్యక్రవుంలో నాబార్డు రిటైర్డ్ సీజీఎం పాలాది మోహనయ్య, మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రసంగించారు. వ్యవసాయ రంగంలో సేవలు అందిస్తున్న వారికి పురస్కారాలు అందించారు. పురస్కారం అందుకున్న వారిలో సాక్షి దినపత్రిక సబ్ ఎడిటర్ జిట్టా బాల్‌రెడ్డి ఉన్నారు. రైతు నేస్తం పురస్కార గ్రహీతలు జీవితసాఫల్య పురస్కారం: డా.ఎల్.జలపతి రావు( ఏఎన్జీఆర్ఏయూ రిటైర్డ్ రిజిస్ట్రార్) శ్రమధాత్రి పురస్కారం: జి.మునిరత్నమ్మ(చిత్తూరు), రైతు విభాగం: పారినాయుడు(విజయనగరం), సామినేని హిమవంతరావు(ఖమ్మం), ఎం.విజయరామకుమార్ (కృష్ణా), దండా వీరాంజనేయులు(ప్రకాశం), ఎస్.స్తంభాద్రిరెడ్డి (మహబూబ్‌నగర్), పి.పావని (రంగారెడ్డి), మేకల వేణు, ఎం.నాగేశ్వరరావు (గుం టూరు), భూక్యా బాలగంగాధర్ నాయక్(అనంతపురం), గోదాసు నర్సింహా (నల్లగొండ), మహమ్మద్ రియాజుద్దీన్ (నిజామాబాద్). శాస్త్రవేత్తల విభాగం: ఆర్. రాఘవయ్య, ఆర్వీఎస్కే రెడ్డి(హైదరాబాద్), వై.కోటేశ్వర్రావు(గుంటూరు), జె.కృష్ణప్రసాద్ (బాపట్ల), టి.స్వర్ణలతాదేవి (కడప), కె.జలజాక్షి(అనంతపురం), జి.జయశ్రీ, కె. విజయలక్ష్మీ(హైదరాబాద్), ఎం.కిషన్‌కుమార్, వై.ఆంజనేయులు, బి.రమేష్‌గుప్తా(కరీంనగర్). విస్తరణ విభాగం: వి. లక్ష్మారెడ్డి, డి. చక్రపాణి (మెదక్), పి. గురుమూర్తి(విజయనగరం), బి. మురళీధర్(ఆదిలాబాద్), ఎం. సరితారెడ్డి(హైదరాబాద్). అగ్రి జర్నలిజం విభాగం: జిట్టా బాల్‌రెడ్డి (సాక్షి), చాపల శ్రీవకుళ (ఈటివి), కందిమళ్ల వెంకట్రావు (ఆంధ్రజ్యోతి), పి.రామచందర్‌రావు (99 టివి), మట్టిమనిషి కార్యక్రమం (టి న్యూస్), భూమిపుత్ర కార్యక్రమం (మా టీవీ).