కార్తీకపౌర్ణమి రోజు సేకరణతో మంచి ఫలితాలు
సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తీసుకెళ్తున్న ఆయుర్వేద వైద్యులు, కోయ గిరిజనులు
కురవి: దేశంలో పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యం విరాజిల్లింది. ప్రకృతిలో లభించే వనమూలికలు, ఔషధమొక్కలతో పలు రకాల రోగాలను నయం చేసేవారు. ప్రస్తుతం ఆయుర్వేద వైద్యం మనుగడలోకి వస్తోంది. వన మూలిక మొక్కలు ప్రకృతిలో ఎక్కువగా కొండలు, గుట్టల్లో లభిస్తాయి. అలాంటి ఔషధ మొక్కలకు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గుట్ట నిలయంగా పేరుగాంచింది.
మునులు తపస్సు చేసిన ప్రాంతం కందికొండపై ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కొండపైకి నడక దారి, మార్గమధ్యలో గుహలు, పైన దేవాలయం, కోనేర్లు ఉన్నాయి. ఈ క్షేత్రంలో పూర్వం కపిలవాయి మహాముని, స్కంద మహాముని వంటి వారు తపస్సులు చేసినట్లు చరిత్ర చెబుతోంది.
అయితే అప్పటి నుంచి ఈ కొండపై తపస్సుకు వినియోగించే మొక్కలతో పాటు, వైద్యం చేసేందుకు ఉపయోగపడే ఔషధ మొక్కలు కూడా పెంచినట్లు చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొండ పరిసర ప్రాంతాలకు వెళ్లగానే ఏదో అనుభూతి, ప్రత్యేకమైన సువాసన వెదజల్లుతోందని స్థానికులు చెబుతారు.
మూలికల సేకరణ..
గుట్టపై పెద్ద కందిచెట్టు ఉండేదని, అందుకే ఇది కందికల్ గుట్టగా చరిత్రలో లిఖించి ఉందని పూర్వికులు చెబుతుంటారు. కొండ అనేక వనమూలికలకు ప్రసిద్ధి అని, ఇక్కడికి సాధువులు, కోయ గిరిజనులు, ఆయుర్వేద వైద్యులు వచ్చి వనమూలికలు, ఔషధ మొక్కలను తీసుకెళ్తుంటారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికీ కొంత మంది కోయ జాతికి చెందిన గిరిజనులు వచ్చి మొక్కలను తీసుకెళ్తుంటారని చెబుతుంటారు.
గుట్ట ఎక్కుతుంటే మధ్యలో భోగం గుడి ఎదురుగా రెండు కోనేర్లు ఉంటాయి. అందులో అనేక ఔషధమొక్కలు కనిపిస్తుంటాయి. గుడి ముందు మరో కోనేరు ఉంటుంది. ఈ కోనేటిలో స్నానాలు ఆచరించడం వల్ల రోగాలు నయమవుతాయని నమ్మకం. అయితే కార్తీక పౌర్ణమితోపాటు, ఇతర శుభ దినాల్లో మూలికలను సేకరిస్తే మంచి ఫలితం ఉంటుందని సాధువులు చెబుతారు.
అందుకోసమే తెలంగాణ ప్రాంతంలోని జంగాలు ఈ ప్రాంతం నుంచి ఔషధ మొక్కలు, వన మూలికలు సేకరించి తయారు చేసిన ఆయుర్వేద మందులు చెన్నై, ముంబై, సింగపూర్, ఢిల్లీ వంటి ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకు వెళ్లి వైద్యం చేసి వస్తారు.
ఔషధ మొక్కల పేర్లు..
గుట్టపై ఉన్న కోనేరులో నాలుగు రకాల మొక్కలు కనిపిస్తాయి. ఈరజడ, రక్తజడ, అంతర దామెర, మద్దెడ వీటిని గుట్ట ఎక్కిన భక్తులు తెంపుకుని తీసుకెళ్తుంటారు. ఈరజడ ఆకులను ఇంటికి తీసుకెళ్లి చిన్నారులకు ఊదు పడుతుంటారు. వీటికి తోడు రాజహంస, పరంహంస, పందిచెవ్వు చెట్టు, నల్ల ఉసిరి చెట్టు, అడవి నిమ్మ, బుర్రజమిడి, నల్లవాయిలి చెట్లు ఉన్నాయి.
గుడి దగ్గర బండ పువ్వు లభిస్తుంది. అలాగే నాగసారం గడ్డ, నేల ఏను మొక్కల ఆకులను పశువులకు రోగాలు వచ్చినప్పుడు ఉపయోగిస్తారు. కొండ మామిడి చెట్టుతో కాళ్లు, చేతులు విరిగితే కట్టు కడుతుంటారు. పొందగరుగుడు చెక్క, నల్లెడ తీగలు, బురుదొండ, అడవిదొండ లాంటి మొక్కలు లభిస్తా యని గ్రామస్తులు తెలిపారు.
గొర్రెలు, మేకల కు రోగాలు వస్తే న యం చేసేందుకు చే గొండ ఆకు, ఉప్పుచెక్క, ముచ్చతునక చెట్టు ఆకులను వాడుతుంటారని గొర్రెలు, మేకల పెంపకందారులు చెబుతున్నారు. అలాగే కలములక చెట్టు మనుషులకు దగ్గుదమ్ముకు, సోమిడిచెట్టు చెక్క, ఆకులు చిన్న పిల్లలకు జబ్బు చేస్తే వాడుతుంటారని చెబుతున్నారు.
కార్తీక పౌర్ణమిరోజు మూలికలు సేకరిస్తారు
కందికొండ గుట్టపై అనేక ఔషధ మొక్కలుంటాయి. మొక్కల కోసం ఏటా కోయ జాతి గిరిజనులు, ఆయుర్వేద వైద్యులు, సాధువులు వస్తుంటారని గ్రామంలో చర్చించుకుంటారు. కార్తీక పౌర్ణమిరోజు మూలికలు సేకరిస్తే మంచిగా పని చేస్తాయని నమ్మిక.
– బి.హేమలత, కందికొండ మాజీ సర్పంచ్
ప్రతీ మొక్కలో ఔషధ గుణమే
కొండపైన ఉన్న ప్రతీ మొక్కకు ప్రత్యేకత ఉంది. మనం రోజువారీగా చూసే మొక్కలతోపాటు, రకరకాల మొక్కలు దొరుకుతాయి. పెద్ద పెద్ద రోగాలను కూడా నయం చేసే మొక్కలు ఇక్కడ దొరుకుతాయట. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారు గొర్రెల కాపరులను తీసుకెళ్లి మొక్కలు తెస్తారు.
– మెట్టు ఉప్పల్లయ్య, కందికొండ
ఆయుర్వేద కళాశాల ఏర్పాటు చేయాలి
మా ఊరు సరిహద్దులో కందికొండ గుట్ట ఉంటుంది. ఇక్కడ దొరికే ఔషధ మొక్కలు ఎక్కడ దొరకవు అంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న గుట్టపై ఉన్న మందు మొక్కలను పరిరక్షించాలి. దీనిని రాబోయే తరాలకు, ఆయుర్వేదంలో ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంతంలో ఆయుర్వేద కళాశాల ఏర్పాటు చేయాలి.
– గాండ్ల సతీశ్, సూదనపల్లి
Comments
Please login to add a commentAdd a comment