వందలోపు కుటుంబాలు.. దాదాపు అందరూ ఉద్యోగులే
కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ వరకు... ప్రతీ ఇంట్లో డాక్టర్, ఇంజనీర్
ఏడు దశాబ్దాల క్రితమే రూప్లానాయక్ తండాలో విద్యా కుసుమాలు
సాక్షి, మహబూబాబాద్: లంబాడ తండాలు అంటే అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంటాయని అనుకుంటారు. కానీ ఏడు దశాబ్దాల క్రితమే ఆ తండా అక్షరాస్యతతో అభివృద్ధి దిశగా పయనించింది. మహబూబాబాద్ జిల్లాలోని సీరోలు మండలం రూప్లానాయక్ తండా (కలెక్టర్ తండా)లో కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ వరకు కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో దాదాపు అన్ని విభాగాలు, దేశ విదేశాల్లో.. డాక్టర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు ఇలా అన్ని రంగాల్లో రాణించారు.
జలపతినాయక్ నుంచి చదువుల ప్రస్థానం
భారతదేశాన్ని బ్రిటీష్ వారు పాలిస్తున్న కాలంలో బానోత్, తేజావత్ కుటుంబాలకు చెందినవారు సీరోలు గ్రామానికి సమీపంలో తండాను ఏర్పాటు చేశారు. ఈ తండాకు చెందిన జలపతినాయక్ అప్పటి మదరాసాల్లో ఉర్దూ మీడియంలో ఐదోతరగతి వరకు చదువుకొని సమీపంలోని చింతపల్లి గ్రామ పోలీస్ పటేల్‌గా ఉద్యోగం చేశారు.
ఆయన్ను చూసి తండాకు చెందిన బానోత్ చంద్రమౌళినాయక్ హెచ్‌ఎస్సీ చదివి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరారు.. ఇలా మొదలైన తండాలో విద్యా ప్రస్థానం.. పిల్లలను పనికి కాకుండా బడికి పంపించడం అలవాటుగా మారింది. ఒకరిని చూసి ఒకరు పిల్లలను పక్కనే ఉన్న కాంపెల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు పంపించారు. ఆపై మహబూబాబాద్, అక్కడి నుంచి హైదరాబాద్ వరకు పిల్లలను పంపించి ఉన్నత చదువులు చదివించారు.
అప్పుడు 20...నేడు 80 కుటుంబాలు
మొదట 20 కుటుంబాలుగా ఉన్న రూప్లాతండా ఇప్పుడు 80 కుటుంబాలకు చేరింది. జనాభా 150 మంది ఉండగా, వీరిలో దాదాపు 90 శాతం మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగులుగా, జాతీయ అంతర్జాతీయ రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తండాకు చెందిన జలపతినాయక్ కు ఎనిమిది మంది కుమారులు, ఎనిమిది మంది కుమా ర్తెలు.. వారి కుటుంబాల్లో మొత్తం 13 మంది డాక్టర్లు, ఒక ఐపీఎస్, ఇంజనీర్లు, సాఫ్ట్‌వేర్, ఫార్మా, డిఫెన్స్, యూనివ ర్సిటీ ప్రొఫెసర్లుగా ఉన్నారు.
చంద్రమౌళినాయక్ నలుగురి సంతానంలో యూఎస్, ఇతర దేశాల్లో స్థిరపడినవారు, డాక్టర్లు ఉన్నారు. బీమ్లానాయక్ కుటుంబానికి చెందిన రాంచంద్రునాయక్ లంబాడ నుంచి మొదటగా ఐఏఎస్ అధి కారిగా ఎంపికయ్యారు. రామోజీనాయక్ కుటుంబం నుంచి రమేష్‌నాయక్ ఐపీఎస్ కాగా, డిఫెన్స్, ఎయిర్‌ఫోర్స్, డాక్టర్లు ఇలా ఉన్నత చదువులు, అత్యున్నత ఉద్యోగాలు సాధించిన వారూ ఉన్నారు.
ఇలా ఇప్పటి వరకు ఆ తండా నుంచి ఐదుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, 20 మంది డాక్టర్లు, 25 మంది ఇంజనీర్లు, 10 మంది విదేశాల్లో ఉన్నత చదువులు చదివి అక్కడే స్థిరపడ్డారు. ఆరుగురు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో, మరో పది మంది ఫార్మా కంపెనీల్లో పనిచేస్తుండగా, హైదరాబాద్, ఖమ్మం, ఢిల్లీ ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు చేస్తుండగా, మిగిలిన వారిలో కూడా చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు.
తండాలో పుట్టినందుకు గర్వంగా ఉంది
నలభై సంవత్సరాల క్రితం నేను బడికి పోతుంటే అందరూ హేళన చేసేవారు. కానీ మా నాన్న ఉపాధ్యాయుడు కావడంతో నన్ను పట్టుదలతో చదివించారు. అప్పటివరకు మా లంబాడ ఇళ్లలో డాక్టర్ చదవం నాతోటే మొదలైంది. ఈ తండాలో పుట్టినందుకు గర్వంగా ఉంది.
– కళావతిబాయి, ఖమ్మం జిల్లా డీఎంహెచ్‌ఓ
నాన్న ముందు చూపే
ఉర్దూ మీడియంలో ఐదవ తరగతి వరకు చదువుకున్న నాన్న ముందు చూపే తండాలో పుట్టిన వారి జీవన విధానాన్నే మార్చేసింది. కుటుంబాలు గడవడం ఇబ్బందైన రోజుల్లోనే ఇంటర్ హైదరాబాద్‌లో చదవించారు. అదే స్ఫూర్తిగా ఇప్పటి వరకు తండాలో పుట్టిన మాతోపాటు, మా బిడ్డలు కూడా ఉన్నత చదువులు చదివి దేశవిదేశాల్లో స్థిరపడ్డారు.
– డాక్టర్ రూప్‌లాల్, మహబూబాబాద్
ఒకరిని చూసి ఒకరు పోటీపడి చదివాం
మా తండాలో పుట్టడం ఒక వరంగా భావిస్తాం. నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అందరూ బడికి పోవాలి అని చెప్పేవారు. పిల్లల ప్రవర్త నపై దృష్టి పెట్టి ఎప్పటి కప్పుడు హెచ్చరించేవారు. అందుకోసమే ఏ పాఠశాల, ఏ కళాశాలకు వెళ్లినా మా తండా విద్యార్థి అంటే ప్రత్యేకం. అందరం పో టీపడి చదివాం. ఐఏఎస్, ఐపీఎస్ నుంచి అన్ని రకాల ఉన్నత చదువులు చదివినవారు ఉన్నారు.
– జగదీష్, మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రి ఆర్‌ఎంవో
Comments
Please login to add a commentAdd a comment