దక్షిణ మధ్య రైల్వేలో లేని పీరియాడికల్ ఓవర్‌హాలింగ్
షెడ్‌కు అనువైన ప్రదేశంగా మహబూబాబాద్ గుర్తింపు
భూ పరిశీలన తర్వాత మధ్యలోనే ఆగిన నిర్మాణ అంచనాలు
పీఓహెచ్ వస్తే 10 వేల మందికి ఉపాధి.. రైల్వేకు ప్రయోజనం
సాక్షి, మహబూబాబాద్: రైళ్ల నిర్వహణలో అత్యంత కీలకమైనవాటిలో ఒకటి పీరియాడికల్ ఓవర్ హాలింగ్ (పీఓహెచ్). రైళ్లలో ఏర్పడే సమస్యలను పరిష్కరించేందుకు, పాడైపోయిన పరికరాలను మార్చేందుకు ఈ షెడ్లు ఉపయోగపడతాయి. భారతీయ రైల్వే ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటైనప్పటికీ, పీఓహెచ్‌లు దేశంలో ఆరు మాత్రమే ఉన్నాయి. భూస్వాల్, కంచరపార, చార్‌బాగ్, పెరంబూర్, ఖరగ్‌పూర్, దాహోడ్‌లో మాత్ర మే వీటిని ఏర్పాటుచేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైల్వే నెట్‌వర్క్ భారీగానే ఉన్నప్పటికీ.. ఇక్కడ ఇప్పటివరకు పీఓహెచ్‌ను ఏర్పాటుచేయలేదు. రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య లో ఉన్న మహబూబాబాద్ (మానుకోట) వద్ద పీఓహెచ్ ఏర్పాటుచేయాలని గతంలో భావించినా అది అందుబాటులోకి రాలేదు. ఇప్పటికైనా ఇక్కడ పీఓహెచ్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
అర్హత ఉన్నా..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధి కలిగిన దక్షిణ మధ్య రైల్వేలో పూర్తిస్థాయి లోకోమోటివ్ (రైలు ఇంజిన్) ఓవర్ హాలింగ్ షెడ్లు ఇప్పటివరకు లేవు. పీఓహెచ్ ఏర్పాటుచేయాలంటే జోన్ పరిధిలో కనీసం 800 లోకోలు ఉండాలి. కానీ దక్షిణ మధ్య రైల్వేలో 1,100లకు పైగా లోకోలు ఉన్నప్పటికీ పీఓహెచ్ లేదు. రైలు ప్రారంభమైన తరువాత గమ్యస్థానం చేరేలోపు తలెత్తే చిన్నచిన్న మరమ్మతులు పీఓహెచ్‌లో ఆలస్యం కాకుండా పూర్తిచేసే వీలుంటుంది. ఇక్కడ లోకోమోటివ్‌ల క్యామ్లా షాఫ్ట్‌లు, క్రాంక్ షాఫ్ట్‌లను శుభ్రం చేస్తారు. వాటిని పరీక్షించి కాలం చెల్లిన వాటిని తొలగించి, కొత్తవి అమరుస్తారు.
పిష్టిన్లు, కనెక్టింగ్ రాడ్లు, సిలిండర్ హెడ్లను శుభ్రం చేసి దెబ్బతిన్నవాటి స్థానంలో కొత్తవి ఏర్పాటుచేస్తారు. నీరు సరఫరా అయ్యే మార్గాలను పరీక్షించి పగుళ్లను గుర్తిస్తారు. వాల్‌్వలకు ఎప్పటికప్పుడు మరమ్మతు చేస్తారు. లోకో సామర్థ్య పరీక్ష నిర్వహిస్తారు. రోటర్ బ్యాలెన్సింగ్, కొత్త ఆయిల్ సీల్స్, సీలెంట్ గాస్కెట్లు, ఫౌండేషన్ బోల్ట్‌ను అమరుస్తారు. ఇంతటి కీలకమైన పీఓహెచ్ స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో లేకపోవటంతో రైళ్లలో తలెత్తే చిన్నచిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యగా మారుతున్నాయని అధికారులు అంటున్నారు.
అనువైన ప్రదేశంగా మానుకోట
పీఓహెచ్ ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా మహబూబాబాద్ ప్రాంతాన్ని రైల్వే అధికారులు గుర్తించినట్లు సమాచారం. దక్షిణ మధ్య రైల్వేలో సెంట్రల్ పాయింట్‌గా ఉన్న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దీనిని ఏర్పాటు చేయాలని భావించారు. చెన్నై నుంచి న్యూఢిల్లీ, భువనేశ్వర్ నుంచి ముంబైని కలిపే ప్రధాన రైలు మార్గం ఈ ప్రాంతంలో ఉంది. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. ఇక్కడి పీఓహెచ్ సేవలు వినియోగించుకోవచ్చు. మహబూబాబాద్ పట్టణంలో డంపింగ్ యార్డు సమీపంలో ఉన్న 865 ఎకరాల ప్రభుత్వ భూమి ఈ షెడ్ నిర్మాణానికి అనువైనదిగా రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇక్కడ వర్క్‌షాప్ నిర్మిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పీఓహెచ్ కోసం గతంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు భూములను పరిశీలించారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ మధ్యలోనే వదిలేశారు.
రైల్వే మంత్రికి విన్నవించాం
మహబూబాబాద్ పట్టణ సమీపంలో రైల్వే పీఓహెచ్ ఏర్పాటు చేయాలని గతంలో కేంద్ర మంత్రులకు విన్నవించాం. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులతో కలిసి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశాం. గతంలోనే ప్రకటించిన బడ్జెట్ ఇవ్వడంతోపాటు, మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరాం. పోరిక బలరాం నాయక్, ఎంపీ
విభజన చట్టం హామీ నెరవేరుతుంది
తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం. మానుకోటలో పీఓహెచ్ షెడ్ నిర్మిస్తే ఈ ప్రాంతం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆదివాసీలు, గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ జిల్లా ప్రజల జీవన ప్రమానాలు మెరుగుపడతాయి. పీఓహెచ్ షెడ్ ఏర్పాటు కోసం ఎంపీ, ఇతర నాయకులు గట్టిగా ప్రయత్నించాలి. అవసరమైతే పారీ్టలకు అతీతంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కలిసి ఢిల్లీకి వెళ్లేందుకు మేం సిద్ధం. – తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్సీ
ప్రజాప్రతినిధులు గట్టిగా పోరాడాలి
పదివేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించే రైల్వే పీఓహెచ్ షెడ్‌ను జిల్లాలో నిర్మించాలి. ఇందుకోసం స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కృషి చేయాలి. – యాళ్ల మురళీధర్ రెడ్డి, యువజన నాయకులు
Comments
Please login to add a commentAdd a comment