Mahbubabad
-
మానుకోటకు పీఓహెచ్ వచ్చేనా?
సాక్షి, మహబూబాబాద్: రైళ్ల నిర్వహణలో అత్యంత కీలకమైనవాటిలో ఒకటి పీరియాడికల్ ఓవర్ హాలింగ్ (పీఓహెచ్). రైళ్లలో ఏర్పడే సమస్యలను పరిష్కరించేందుకు, పాడైపోయిన పరికరాలను మార్చేందుకు ఈ షెడ్లు ఉపయోగపడతాయి. భారతీయ రైల్వే ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటైనప్పటికీ, పీఓహెచ్లు దేశంలో ఆరు మాత్రమే ఉన్నాయి. భూస్వాల్, కంచరపార, చార్బాగ్, పెరంబూర్, ఖరగ్‌పూర్, దాహోడ్‌లో మాత్ర మే వీటిని ఏర్పాటుచేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైల్వే నెట్వర్క్ భారీగానే ఉన్నప్పటికీ.. ఇక్కడ ఇప్పటివరకు పీఓహెచ్ను ఏర్పాటుచేయలేదు. రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య లో ఉన్న మహబూబాబాద్ (మానుకోట) వద్ద పీఓహెచ్ ఏర్పాటుచేయాలని గతంలో భావించినా అది అందుబాటులోకి రాలేదు. ఇప్పటికైనా ఇక్కడ పీఓహెచ్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అర్హత ఉన్నా..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధి కలిగిన దక్షిణ మధ్య రైల్వేలో పూర్తిస్థాయి లోకోమోటివ్ (రైలు ఇంజిన్) ఓవర్ హాలింగ్ షెడ్లు ఇప్పటివరకు లేవు. పీఓహెచ్ ఏర్పాటుచేయాలంటే జోన్ పరిధిలో కనీసం 800 లోకోలు ఉండాలి. కానీ దక్షిణ మధ్య రైల్వేలో 1,100లకు పైగా లోకోలు ఉన్నప్పటికీ పీఓహెచ్ లేదు. రైలు ప్రారంభమైన తరువాత గమ్యస్థానం చేరేలోపు తలెత్తే చిన్నచిన్న మరమ్మతులు పీఓహెచ్లో ఆలస్యం కాకుండా పూర్తిచేసే వీలుంటుంది. ఇక్కడ లోకోమోటివ్ల క్యామ్‌లా షాఫ్ట్‌లు, క్రాంక్ షాఫ్ట్‌లను శుభ్రం చేస్తారు. వాటిని పరీక్షించి కాలం చెల్లిన వాటిని తొలగించి, కొత్తవి అమరుస్తారు.పిష్టిన్లు, కనెక్టింగ్ రాడ్లు, సిలిండర్ హెడ్లను శుభ్రం చేసి దెబ్బతిన్నవాటి స్థానంలో కొత్తవి ఏర్పాటుచేస్తారు. నీరు సరఫరా అయ్యే మార్గాలను పరీక్షించి పగుళ్లను గుర్తిస్తారు. వాల్్వలకు ఎప్పటికప్పుడు మరమ్మతు చేస్తారు. లోకో సామర్థ్య పరీక్ష నిర్వహిస్తారు. రోటర్ బ్యాలెన్సింగ్, కొత్త ఆయిల్ సీల్స్, సీలెంట్ గాస్కెట్లు, ఫౌండేషన్ బోల్ట్‌ను అమరుస్తారు. ఇంతటి కీలకమైన పీఓహెచ్ స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో లేకపోవటంతో రైళ్లలో తలెత్తే చిన్నచిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యగా మారుతున్నాయని అధికారులు అంటున్నారు. అనువైన ప్రదేశంగా మానుకోటపీఓహెచ్ ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా మహబూబాబాద్ ప్రాంతాన్ని రైల్వే అధికారులు గుర్తించినట్లు సమాచారం. దక్షిణ మధ్య రైల్వేలో సెంట్రల్ పాయింట్‌గా ఉన్న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దీనిని ఏర్పాటు చేయాలని భావించారు. చెన్నై నుంచి న్యూఢిల్లీ, భువనేశ్వర్ నుంచి ముంబైని కలిపే ప్రధాన రైలు మార్గం ఈ ప్రాంతంలో ఉంది. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. ఇక్కడి పీఓహెచ్ సేవలు వినియోగించుకోవచ్చు. మహబూబాబాద్ పట్టణంలో డంపింగ్ యార్డు సమీపంలో ఉన్న 865 ఎకరాల ప్రభుత్వ భూమి ఈ షెడ్ నిర్మాణానికి అనువైనదిగా రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇక్కడ వర్క్‌షాప్ నిర్మిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పీఓహెచ్ కోసం గతంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు భూములను పరిశీలించారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ మధ్యలోనే వదిలేశారు. రైల్వే మంత్రికి విన్నవించాం మహబూబాబాద్ పట్టణ సమీపంలో రైల్వే పీఓహెచ్ ఏర్పాటు చేయాలని గతంలో కేంద్ర మంత్రులకు విన్నవించాం. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులతో కలిసి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశాం. గతంలోనే ప్రకటించిన బడ్జెట్ ఇవ్వడంతోపాటు, మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరాం. పోరిక బలరాం నాయక్, ఎంపీ విభజన చట్టం హామీ నెరవేరుతుంది తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం. మానుకోటలో పీఓహెచ్ షెడ్ నిర్మిస్తే ఈ ప్రాంతం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆదివాసీలు, గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ జిల్లా ప్రజల జీవన ప్రమానాలు మెరుగుపడతాయి. పీఓహెచ్ షెడ్ ఏర్పాటు కోసం ఎంపీ, ఇతర నాయకులు గట్టిగా ప్రయత్నించాలి. అవసరమైతే పారీ్టలకు అతీతంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కలిసి ఢిల్లీకి వెళ్లేందుకు మేం సిద్ధం. – తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్సీప్రజాప్రతినిధులు గట్టిగా పోరాడాలి పదివేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించే రైల్వే పీఓహెచ్ షెడ్‌ను జిల్లాలో నిర్మించాలి. ఇందుకోసం స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కృషి చేయాలి. – యాళ్ల మురళీధర్ రెడ్డి, యువజన నాయకులు -
అదానీ, అల్లుడి కోసమే రేవంత్ పాలన: కేటీఆర్
సాక్షి,మహబూబాబాద్: ఏడాదిలో ఇరవైఎనిమిదిసార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. లగచర్ల ఫార్మాసిటీ బాధితులకు న్యాయం చేయాలని సోమవారం(నవంబర్ 25) మహబూబాబాద్ పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ మహాధర్నాలో కేటీఆర్ మాట్లాడారు.‘చిన్న సన్న కారు రైతులపై రేవంత్‌రెడ్డి జులుం ప్రదర్శిస్తున్నారు. లగచర్లలో సొంత అల్లుడి కోసం రేవంత్ పేదల భూములు లాక్కుంటున్నారు. రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పాలి. లగచర్లలో పేదల భూములను వెంటనే తిరిగి ఇచ్చేయాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. మహాధర్నాలో కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే.. లగచర్లలో 3 వేల ఎకరాల భూములను చెరబట్టాలని చూశారుసీఎం రేవంత్ రెడ్డి.. తన సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన ప్రజలను ఇబ్బంది పెడుతున్నారుఢిల్లీకి 28 సార్లు వెళ్లి 28 రూపాయలు కూడా తేలేదురేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో తిరుగుబాటు ఎదుర్కొంటున్నాడులగచర్లకు అధికారులు పోతే నిరసన వ్యక్తం చేశారు.. రేవంత్ రెడ్డి పోతే ఉరికించి కొట్టేవాళ్ళుప్రధాని మోదీ.. రైతులు ఏడాది పాటు నిరసన తెలిపితే నల్ల చట్టాలు వెనక్కి తీసుకున్నారురేవంత్ రెడ్డి రైతులతో పెట్టుకున్నారుజైల్లో పెట్టిన 30 మందికి సంఘీభావంగా మానుకోటలో ధర్నా చేస్తామంటే.. అడ్డుకునే ప్రయత్నం చేశారుఎవరికోసం ఫార్మా విలేజ్..?.. అల్లుడి కోసం పేదవాళ్ల భూములు లాక్కుంటున్నారుముఖ్యమంత్రి పేదల కోసం పనిచేయడం లేదు..అదాని కోసం.. అల్లుడి కోసం.. అన్నదమ్ముల కోసం పనిచేస్తున్నారుపేద ప్రజల కోసం సీఎం రేవంత్ రెడ్డి పనిచేయడం లేదుఇంకా నాలుగు రోజులు అయితే ఈ ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతుంది.. ఆరు గ్యారెంటీలు అన్నారు .. ఒక హామీ అయినా అమలైందారేవంత్ రెడ్డికి మహారాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు.. కాంగ్రెస్ పార్టీని తన్ని వెళ్ళగొట్టారునేను వస్తే రాళ్లతో కొడతామని కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు.అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామంటే పోలీసులు ఏం చేస్తున్నారుమానుకోట రాళ్ల మహత్యం ఏంటో తెలంగాణ ఉద్యమంలో చూపించాంకోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుంటే.. వెయ్యి మంది వస్తారు అనుకుంటే 20 వేల మంది వచ్చారుప్రభుత్వం మీద ఎన్నో వ్యతిరేకత ఉందో మానుకోట మహా ధర్నా చూస్తే అర్థమవుతుందినాలుగేళ్లు గట్టిగా కొట్లాడుదాం.. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి వస్తాంఢిల్లీకి వెళ్లి గిరిజనులు వివిధ కమిషన్లకు తమ బాధ చెప్తుంటే.. వాళ్లు కూడా ఎంతో బాధపడ్డారుగిరిజనుల రిజర్వేషన్ 6 శాతం నుంచి 10 శాతానికి పెంచారుమానుకోట మొదటి అడుగు మాత్రమే.. రాష్ట్రంలోని ప్రతి తండా, పల్లెకు వెళ్లి మద్దతు కూడా కడతాముఇదీ చదవండి: మహబూబాబాద్‌లో హైటెన్షన్..కేటీఆర్ ఫ్లెక్సీలు చింపివేత -
మహబూబాబాద్‌లో హైటెన్షన్.. కేటీఆర్ ఫ్లెక్సీలు చింపేసిన దుండగులు
సాక్షి,మహబూబాబాద్జిల్లా: లగచర్ల బాధితులకు మద్దతుగా మహబూబాబాద్ పట్టణంలో తహసిల్దార్ ఆఫీసు ఎదుట బీఆర్ఎస్ నేతలు సోమవారం(నవంబర్25) ధర్నా చేయనున్నారు. మహధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు ,ఎమ్మెల్సీలు,మాజీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.అయితే ధర్నా సందర్భంగా మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన కేటీఆర్ ఫ్లైక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు.ఫ్లెక్సీల రగడపై పోలీసులు ఆరా తీస్తున్నారు.మరోవైపు గో బ్యాక్ కేటీఆర్ అని పోస్టర్లు వెలిశాయి.దీంతో మహాధర్నాకు భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.ధర్నాలో ఏమి జరుగుతుందోనని స్థానికంగా టెన్షన్ నెలకొంది.ధర్నాను అడ్డుకొని తీరుతామని స్థానిక గిరిజనులు,కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించారు.ఇదీ చదవండి: నేడు బీఆర్ఎస్ మహాధర్నా -
చదువుల తండా.. రూప్లానాయక్ తండా
సాక్షి, మహబూబాబాద్: లంబాడ తండాలు అంటే అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంటాయని అనుకుంటారు. కానీ ఏడు దశాబ్దాల క్రితమే ఆ తండా అక్షరాస్యతతో అభివృద్ధి దిశగా పయనించింది. మహబూబాబాద్ జిల్లాలోని సీరోలు మండలం రూప్లానాయక్ తండా (కలెక్టర్ తండా)లో కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ వరకు కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో దాదాపు అన్ని విభాగాలు, దేశ విదేశాల్లో.. డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు ఇలా అన్ని రంగాల్లో రాణించారు. జలపతినాయక్ నుంచి చదువుల ప్రస్థానం భారతదేశాన్ని బ్రిటీష్ వారు పాలిస్తున్న కాలంలో బానోత్, తేజావత్ కుటుంబాలకు చెందినవారు సీరోలు గ్రామానికి సమీపంలో తండాను ఏర్పాటు చేశారు. ఈ తండాకు చెందిన జలపతినాయక్ అప్పటి మదరాసాల్లో ఉర్దూ మీడియంలో ఐదోతరగతి వరకు చదువుకొని సమీపంలోని చింతపల్లి గ్రామ పోలీస్ పటేల్‌గా ఉద్యోగం చేశారు. ఆయన్ను చూసి తండాకు చెందిన బానోత్ చంద్రమౌళినాయక్ హెచ్ఎస్సీ చదివి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరారు.. ఇలా మొదలైన తండాలో విద్యా ప్రస్థానం.. పిల్లలను పనికి కాకుండా బడికి పంపించడం అలవాటుగా మారింది. ఒకరిని చూసి ఒకరు పిల్లలను పక్కనే ఉన్న కాంపెల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు పంపించారు. ఆపై మహబూబాబాద్, అక్కడి నుంచి హైదరాబాద్ వరకు పిల్లలను పంపించి ఉన్నత చదువులు చదివించారు. అప్పుడు 20...నేడు 80 కుటుంబాలుమొదట 20 కుటుంబాలుగా ఉన్న రూప్లాతండా ఇప్పుడు 80 కుటుంబాలకు చేరింది. జనాభా 150 మంది ఉండగా, వీరిలో దాదాపు 90 శాతం మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగులుగా, జాతీయ అంతర్జాతీయ రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తండాకు చెందిన జలపతినాయక్ కు ఎనిమిది మంది కుమారులు, ఎనిమిది మంది కుమా ర్తెలు.. వారి కుటుంబాల్లో మొత్తం 13 మంది డాక్టర్లు, ఒక ఐపీఎస్, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్, ఫార్మా, డిఫెన్స్, యూనివ ర్సిటీ ప్రొఫెసర్లుగా ఉన్నారు. చంద్రమౌళినాయక్ నలుగురి సంతానంలో యూఎస్, ఇతర దేశాల్లో స్థిరపడినవారు, డాక్టర్లు ఉన్నారు. బీమ్లానాయక్ కుటుంబానికి చెందిన రాంచంద్రునాయక్ లంబాడ నుంచి మొదటగా ఐఏఎస్ అధి కారిగా ఎంపికయ్యారు. రామోజీనాయక్ కుటుంబం నుంచి రమేష్‌నాయక్ ఐపీఎస్ కాగా, డిఫెన్స్, ఎయిర్‌ఫోర్స్, డాక్టర్లు ఇలా ఉన్నత చదువులు, అత్యున్నత ఉద్యోగాలు సాధించిన వారూ ఉన్నారు. ఇలా ఇప్పటి వరకు ఆ తండా నుంచి ఐదుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, 20 మంది డాక్టర్లు, 25 మంది ఇంజనీర్లు, 10 మంది విదేశాల్లో ఉన్నత చదువులు చదివి అక్కడే స్థిరపడ్డారు. ఆరుగురు పోలీస్ డిపార్ట్మెంట్లో, మరో పది మంది ఫార్మా కంపెనీల్లో పనిచేస్తుండగా, హైదరాబాద్, ఖమ్మం, ఢిల్లీ ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు చేస్తుండగా, మిగిలిన వారిలో కూడా చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు.తండాలో పుట్టినందుకు గర్వంగా ఉందినలభై సంవత్సరాల క్రితం నేను బడికి పోతుంటే అందరూ హేళన చేసేవారు. కానీ మా నాన్న ఉపాధ్యాయుడు కావడంతో నన్ను పట్టుదలతో చదివించారు. అప్పటివరకు మా లంబాడ ఇళ్లలో డాక్టర్ చదవం నాతోటే మొదలైంది. ఈ తండాలో పుట్టినందుకు గర్వంగా ఉంది. – కళావతిబాయి, ఖమ్మం జిల్లా డీఎంహెచ్ఓనాన్న ముందు చూపేఉర్దూ మీడియంలో ఐదవ తరగతి వరకు చదువుకున్న నాన్న ముందు చూపే తండాలో పుట్టిన వారి జీవన విధానాన్నే మార్చేసింది. కుటుంబాలు గడవడం ఇబ్బందైన రోజుల్లోనే ఇంటర్ హైదరాబాద్‌లో చదవించారు. అదే స్ఫూర్తిగా ఇప్పటి వరకు తండాలో పుట్టిన మాతోపాటు, మా బిడ్డలు కూడా ఉన్నత చదువులు చదివి దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. – డాక్టర్ రూప్‌లాల్, మహబూబాబాద్ఒకరిని చూసి ఒకరు పోటీపడి చదివాంమా తండాలో పుట్టడం ఒక వరంగా భావిస్తాం. నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అందరూ బడికి పోవాలి అని చెప్పేవారు. పిల్లల ప్రవర్త నపై దృష్టి పెట్టి ఎప్పటి కప్పుడు హెచ్చరించేవారు. అందుకోసమే ఏ పాఠశాల, ఏ కళాశాలకు వెళ్లినా మా తండా విద్యార్థి అంటే ప్రత్యేకం. అందరం పో టీపడి చదివాం. ఐఏఎస్, ఐపీఎస్ నుంచి అన్ని రకాల ఉన్నత చదువులు చదివినవారు ఉన్నారు. – జగదీష్, మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రి ఆర్ఎంవో -
మత్తు వదలరా.. మంచివైపు సాగరా!
మహబూబాబాద్ జిల్లాలో అధికంగా ఆదివాసీ, గిరిజన తండాలు ఉన్నాయి. ఇక్కడ యువతలో చాలామంది చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. కాగా, ప్రభుత్వాలు ఎన్ని సౌకర్యాలు కల్పించినా..కొందరు యువతీ, యువకులు చెడుమార్గం పట్టడం పరిపాటిగా మారింది. గంజాయి మత్తుకు బానిసకావడం, రవాణా, గుడుంబా తయారీ, బెల్లం విక్రయాలు, ఇతర అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడం, తాగిన మత్తులో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి కొందరిది. చదువుకోవాలనే ఆశ ఉన్నా.. సరైన మార్గదర్శకత్వం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే ఆపి వ్యవసాయం చేయడం, పొలం లేనివాళ్లు కూలీలుగా మారిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో యువతలో మార్పు తీసుకురావాలన్న ఆలోచనతో మానుకోట జిల్లా పోలీస్‌లు వినూత్న రీతిలో ఆలోచించారు. యువతను మంచి మార్గంలో నడిపించేందుకు అక్కడి రుగ్మతలకు చికిత్స మొదలు పెట్టారు. చెడు వ్యసనాలకు దూరం..జిల్లాకు మాయని మచ్చగా ఉన్న గంజాయి, గుడుంబాకు యువత బానిసకాకుండా ఎస్పీ సుదీర్ రాంనాథ్ కేకన్ వినూత్నంగా ఆలోచన చేశారు. ఏజెన్సీ ప్రాంతాలు, గిరిజన, ఆదివాసీ గూడేల్లో గుడుంబా తయారీని నిర్మూలించాలని, అందుకు అందరి సహకారం కావాలని తండాలు, గూడేల పెద్దలను కోరారు. దీంతో పోలీసుల తనిఖీలు, స్థానికుల సహకారంతో ఇప్పటివరకు జిల్లాలోని సుమారు రూ.10కోట్ల విలువ చేసే నల్లబెల్లం, పానకం, పటిక, గంజాయి, మద్యంతోపాటు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్నారు. బెల్లం, గంజాయి రవాణా చేస్తున్న వారిని శిక్షించే విషయంలో ప్రజాప్రతినిధుల అడ్డు రావద్దని ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులను కోరినట్లు సమాచారం. అదేవిధంగా పోలీస్, ఎక్సైజ్‌శాఖలోని కొందరు ఉద్యోగులు ముందస్తు సమాచారం ఇస్తున్న విషయంపై కూడా పోలీస్ బాస్ సీరియస్‌గా ఉన్నట్లు ఆశాఖలో చర్చ జరుగుతోంది. మానసిక పరివర్తనజిల్లాలోని సమస్యాత్మక ప్రాతాలను గుర్తించి అక్కడ యువతతో పోలీసులు మమేకమయ్యారు. వారి అవసరాలను తెలుసుకున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో 43 ప్రైవేట్ కంపెనీలను పిలిపించి విద్యార్హతకు తగిన ఉద్యోగాలు ఇప్పించేందుకు ఏర్పాటు చేసిన జాబ్‌మేళాకు జిల్లా నలుమూలల నుంచి 3వేలకు పైగా యువతీ, యువకులు హాజరయ్యారు. అర్హులకు ఉద్యోగాలు ఇప్పించారు. మరికొందరికి నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు సిద్ధమయ్యారు. యువతకు క్రికెట్, ఇతర క్రీడా పరికరాలు అందజేసి ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని, ఉద్యోగాల్లో స్థిరపడాలని హితబోధ చేశారు. అదేవిధంగా స్కూల్ పిల్లలతో కలసి భోజనం చేయడం, వారికి బ్యాగులు, పుస్తకాలు అందజేసి తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి పిల్లల భవిష్యత్ గురించి వివరించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిస కావొద్దని కోరారు. సరఫరా చేస్తున్న వారిలో కొందరిని అదుపులోకి తీసుకుని హెచ్చరించారు. గుడుంబా రహిత గ్రామాలుగా తయారు చేసేందుకు కృషి చేస్తామని పలు గ్రామాల ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. మార్పు దిశగా యువత గంజాయి రవాణా, గుడుంబా తయారీ జిల్లాకు చెడ్డ పేరు తెస్తున్నాయి. వీటి నుంచి యువతను దూరం చేయాలన్నదే పోలీస్‌శాఖ లక్ష్యం. అందుకోసమే ఈ ప్రయత్నాలు. మూడు నెలలుగా ఏజెన్సీ, గిరిజన తండాల్లోని యువతలో కొంత మార్పు కనిపిస్తుంది. ఇందుకు నిదర్శనం జాబ్‌మేళాకు మూడువేలకుపైగా యువతీ, యువకులు హాజరుకావడమే. – సుదీర్రాంనాథ్ కేకన్, ఎస్పీ, మహబూబాబాద్ -
అయ్యగారూ! అభినందనలు
కురవి: మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ముత్యాలమ్మ కుంట కట్టపై గుడికి వెళ్లేందుకు నిర్మించిన సీసీరోడ్డు కిందిభాగం ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురికాగా మరమ్మతు చేపట్టారు. కాగా, గత నెల 24న ‘సాక్షి’ప్రధాన సంచికలో ‘కర్ర జారిందా..ప్రాణం గోవిందా’అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి గ్రామ పురోహితుడు బుక్కామఠం వీరన్న స్పందించారు. మంగళవారం తన సొంత ఖర్చులతో మొరం పోయించి జేసీబీ సాయంతో చదును చేయించారు. అలాగే కట్టకింద ధ్వంసమైన బీటీరోడ్డు మరమ్మతులు చేయించారు. కాగా సీసీరోడ్డు కిందిభాగం కోతకు గురై నెలరోజులు దాటినా అధికారులెవరూ స్పందించలేదని..అయ్యగారు మరమ్మతులు చేయించడం అభినందనీయమని గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. -
కేసీఆర్‌ది రైతు గుండె.. రేవంత్ రెడ్డిది రాతి గుండె
సాక్షి, మహబూబాబాద్: ‘తెలంగాణ సాధించిన కేసీఆర్.. పదేళ్ల పాలనలో రైతు పక్షపాతిగా ఉన్నారు. ఆయనది రైతుగుండె.. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులను మోసగించిన సీఎం రేవంత్‌రెడ్డిది రాతి గుండె’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. అందరికీ రుణమాఫీ చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్లతో శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బీఆర్ఎస్ రైతు మహాధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో హరీశ్‌రావు మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు కల్ల్లబొల్లి మాటలు చెప్పి, నేనే మొనగాడిని.. రాష్ట్రాన్ని బాగుచేసేది నేనే అని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అసలు స్వ రూపం బయట పడిందన్నారు. ఆయన మొనగాడు కాదు .. మోసగాడని ప్రజలు గ్రహించారని చెప్పారు. రుణ మాఫీ పై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒకతీరు.. మంత్రి తు మ్మల మరోతీరు మాట్లాడి రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. సీఎం మాటలు నమ్మిన రైతులు రూ.2 లక్షలకు పైగా ఉన్న అప్పులు చెల్లించారని, రుణమాఫీ అవుతుందని అధిక వడ్డీకి డబ్బులు తెచ్చి ఇప్పు డు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు సీఎం రేవంత్‌రెడ్డిని, ప్రభుత్వాన్ని విడిచి పెట్టేది లేదని హరీశ్ అన్నారు. హామీల అమలుకు దసరా తర్వాత ఢిల్లీలోని రాహుల్‌గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మంత్రుల్ని, ఎమ్మెల్యే లను నిలదీయాలని ఆయన పిలుపు నిచ్చారు. కాగా, ధర్నా సందర్భంగా ఓ తొండ తాటికొండ రాజయ్య చొక్కాలోకి వెళ్లడంతో కార్యకర్తలు అప్రమత్తమై దానిని తీసివేశారు. దీంతో కొంతసేపు నవ్వులు విరిశాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత తదితరులు పాల్గొన్నారు. -
గండి దాటితేనే బడి
నర్సింహులపేట: భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం శివారు అన్నస్వామి కుంటకు గండి పడింది. దీంతో బక్కతండా, పోట్యాతండా, బండమీదితండాకు చెందిన విద్యార్థులు గండి దాటి 5 కిలోమీటర్ల దూరంలోని నర్సింహులపేట, 2 కిలోమీటర్ల దూరంలోని జయపురం పాఠశాలలకు రావాలి. దాదాపు 40 మంది విద్యార్థులు పాఠశాలలకు వచ్చి వెళ్తున్నారు. ఇందులో బాలికలు ఎక్కువగా ఉన్నారు. కాగా, గండి లోతుగా పడటంతో వరద నీటిలో సైకిళ్లను ఎత్తుకొని దాటాల్సిన పరిస్థితి నెలకొంది. కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి గండి దాటిస్తున్నారు. గండిని త్వరగా పూడ్చాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. -
వరదలో చిక్కుకున్నాం.. రక్షించండి
మరిపెడ రూరల్, కారేపల్లి: భారీ వరద ఉజ్వల భవిష్యత్ ఉన్న ఓ యువ సైంటిస్టును బలి తీసుకుంది. మారుమూల గిరిజన ప్రాంతంలో జన్మించిన ఆమె వ్యవసాయ విద్యలోసత్తా చాటింది. జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్‌లో పరిశోధనలు చేసి పీహెచ్డీ సాధించి జాతీయ స్థాయిలో పరిశోధనా శాస్త్రవేత్తగా మొదటి స్థానంలో నిలిచింది. యూనివర్సిటీ స్థాయిలో ఆరు బంగారు పతకాలే కాక ఎమ్మెస్సీలోనూ బంగారు పతకం సాధించింది.అలాంటి అద్భుతమైన ఆమె భవిష్యత్‌ను వరద గల్లంతు చేసింది. ఆమెతో పాటు తండ్రి ప్రయాణిస్తున్న కారు ఆకేరు వాగు ప్రవాహంలో కొట్టుకు పోగా, ఈ ప్రమాదంలో కుమార్తె మృతదేహం లభ్యమైంది.. తండ్రి ఆచూకీ కోసం రెస్క్యూటీం గాలిస్తోంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం గ్రామ శివారు ఆకేరు నది వాగు వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ విషాద ఘటన వివరాలిలా.. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి గ్రామ పరిధిలోని గంగారం తండాకు చెందిన నూనావత్ మోతీలాల్ (55), మేజ దంపతులకు కుమారుడు అశోక్ కుమార్, కుమార్తె అశ్విని (30) ఉన్నారు. కుమారుడు విద్యుత్‌శాఖలో ఏఈగా విధులు నిర్వహిస్తున్నాడు. కుమార్తె అశ్విని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయపూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తగా ఉద్యోగం చేస్తోంది. ఇటీవల ఏప్రిల్‌లో జరిగిన అంతర్జాతీయ సెమినార్లో 4వ స్థానం పొంది మంచి గుర్తింపు పొందింది. తన సోదరుడి నిశ్చితార్థం కావడంతో స్వగ్రామం గంగారంతండాకు వచ్చిన అశ్విని శుభకార్యం ముగిశాక శంషాబాద్ నుంచి రాయపూర్ వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ రిజర్వేషన్ బుక్ చేయించుకుంది.ఈ క్రమంలో భారీ వర్షాలు పడుతుండడంతో తండ్రి మోతీలాల్ తానే స్వయంగా కారులో హైదరాబాద్‌లో దించేందుకు తెల్లవారు జామున బయలు దేరారు. వయా మరిపెడ మీదుగా హైదరాబాద్ వెళ్తుండగా పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న విషయం గమనించని వారు నేరుగా వచ్చి ప్రవాహంలో చిక్కుకున్నారు. వెంటనే కారులోనుంచి బయటకు దిగిన తండ్రి మోతీలాల్ తన అన్నకు కాల్ చేసి తాము వరదలో చిక్కుకున్నామని, రక్షించాలని పరిస్థితి వివరించారు. సోదరుడు మరిపెడలో ఉన్న బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పి తిరిగి తమ్ముడికి ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.వెంటనే వాగు పరీవాహక ప్రాంతానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని జల్లెడ పట్టాయి. సాయంత్రానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో వంతెన సమీపంలో కారు చిక్కుకొని కనిపించింది. బాల్నిధర్మారం సమీపంలోని ఆయిల్‌పామ్‌తోటలో యువ సైంటిస్టు ఆశ్విని మృతదేహం లభ్యమైంది. మోతీలాల్ ఆచూకీ ఇంకా లభించలేదు. ఆదివారం సాయంత్రం దాటాక మోతీలాల్ మృతదేహం కారులో దొరికినట్లు ప్రచారం జరిగినా పోలీసులు నిర్ధారించడం లేదు. అశ్విని మృతదేహాన్ని పోలీసులు.. స్థానికుల సహాయంతో ఒడ్డుకు చేర్చారు. కాగా, తెల్లవారుజామున చీకటిగా ఉండడం, రోడ్డు మార్గం సరిగా తెలియకపోవడం.. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో కారులోనుంచి దిగినా ప్రయోజనం లేకుండాపోయిందని భావిస్తున్నారు. -
పిల్లలను హతమార్చిన దంపతుల ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా: నెల రోజుల క్రితం పిల్లలకు పాలల్లో విషం ఇచ్చి చంపి పరారైన తల్లిదండ్రులు అడవిలో అస్తి పంజరాలయ్యారు. భార్యాభర్తలు ఒకే చెట్టుకు ఉరి వేసుకున్నారు. భర్త మృతదేహం అస్తిపంజరమై చెట్టుకు వేలాడుతుండగా, భార్య మృతదేహాన్ని అడవి జంతువులు పీక్కుతిన్నాయి. దీంతో కేవలం ఆమె పుర్రె మాత్రమే మిగిలింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం నగరం గ్రామ సమీపంలో శుక్రవా రం ఈ అస్తిపంజరాలు వెలుగు చూశాయి. గార్ల బయ్యారం సీఐ బి.రవికుమార్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్న గూడెంకు చెందిన పెండకట్ల అనిల్‌కుమార్, దేవి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు సంతానం. ఈ ఏడాది మార్చి 10న ఇద్దరు చిన్నపిల్లలకు పాలల్లో విషం ఇచ్చి చంపిన తలిదండ్రులు బైక్‌పై పరార య్యారు. నాటి నుంచి పోలీసులు భార్యాభ ర్తల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. నగరం గ్రామ సమీప అటవీ ప్రాంతంలోని పొదల్లో బైక్ ఉండటాన్ని ఓ వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో భార్యాభర్తలు ఇదే ప్రాంతంలో ఉంటారని భావించి బైక్ దొరికిన ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నగరం గ్రామ సమీ పం గుట్టమీద నుంచి దుర్వాసన రావడంతో దగ్గరికి వెళ్లి చూడగా చెట్టుకు ఓ మృతదే హం వేలాడుతూ కని పించింది. పోలీసులు వెంటనే అనిల్‌కుమార్ తండ్రి వెంకన్నను ఘటనా స్థలానికి తీసుకొచ్చి మృతదేహాన్ని చూపించగా ఇది తన కొడుకుదేనని చెప్పాడు. దేవి మృతదేహం కోసం వెతుకగా పక్కనే పుర్రె, ఎముకలు, చీర లభించాయి. అడవి జంతువులు మృతదేహాన్ని తిని ఉంటాయని పోలీసులు భావించారు. మృతుడి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు గుట్టపైకి డాక్టర్‌ను తీసుకొచ్చి అస్తిపంజరాలకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ రవికుమార్ తెలిపారు. గుట్టపైనే కుటుంబసభ్యులు అంత్య క్రియలు నిర్వహించారు. కాగా, భార్యాభర్తలు ఎందుకు పిల్లలకు విషమిచ్చి చంపారు.. అసలు వాళ్లు ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారనే కారణాలు ఇప్పటివరకు తెలియలేదు. పోలీసులు కూడా ఇదొక మిస్టరీలా ఉందని, ఇంకా కారణాలు తెలియలేదని చెబుతున్నారు. -
ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకటేష్ అలియాస్ వెంకట్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం చోటుచేసుకున్న ఈఘటన వివరాలను వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు. జిల్లాలోని దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీష్.. దంతాలపల్లి మండల కేంద్రంలో 128 గజాల భూమి కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా గజానికి రూ.200 చొప్పున డిమాండ్ చేయగా.. రూ.150 చొప్పున ఇస్తానని బేరం కుదుర్చుకుని వరంగల్ జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం సాయంత్రం మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తికాగానే రూ.19,200 నగదును అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకటేష్‌కు ఇవ్వమని సబ్ రిజిస్ట్రార్ చెప్పగా.. హరీష్ ఆ డబ్బులను అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వెంకట్ వద్ద లెక్క చూపని మరో రూ.1.72లక్షలు నగదు ఉండగా స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆలేటి వెంకట్‌ను అదుపులోకి తీసుకుని వరంగల్‌లోని ఏసీబీ కోర్టుకు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దాడుల్లో ఏసీబీ సీఐలు శ్యాంసుందర్, రాజు, సునీల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
పార్టీని వీడే నేతలతో నష్టం లేదు
సాక్షి, హైదరాబాద్: పార్టీని వీడి వెళ్లే నేతలతో బీఆర్ఎస్కు ఎలాంటి నష్టం లేదని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని.. పార్టీ ఓడిపోయిన చోట్ల కూడా నేతలు ధైర్యంగా ముందుకు వెళ్లి కేడర్‌లో ఆత్మస్థైర్యం నింపాలని పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో జరిగిన ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. గతంలో ఎన్టీఆర్ వంటి నేతకే రాజకీయాల్లో ఒడిదుడుకులు తప్పలేదని.. మనకూ తప్పవనే విషయాన్ని అర్థం చేసుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదామని బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. ఈ వ్యతిరేకతను బీఆర్ఎస్ సద్వినియోగం చేసుకునేలా పార్టీ నేతలు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. త్వరలో ఖమ్మంలో బహిరంగ సభ లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. ‘‘కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన పదేళ్ల పాలనలో ప్రజలకు చేయాల్సిందంతా చేశాం. దళితబంధు వంటి మంచి పథకం తెచ్చాం. ఎన్నికల్లో ఓట్లు ఆశించి అమలు చేయలేదు. రాష్ట్రంలో ప్రతి పథకాన్ని మనం ఆయా వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే అమలు చేశాం. అయినా ప్రతిపక్ష పాత్ర పోషించాలని మనకు ఓటర్లు తీర్పునిచ్చారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ విలువను ప్రజలు తెలుసుకుని కచి్చతంగా ఆదరిస్తారు..’’అని పేర్కొన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే గైర్హాజరు కేసీఆర్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరుకాలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయిన వెంకట్రావు.. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని కుటుంబ సమేతంగా కలసిన విషయం తెలిసిందే. ఆయనకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సన్నిహితుడిగా పేరుంది. నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందే వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరినా.. చివరి నిమిషంలో తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీచేశారు. మరోవైపు సీఎం రేవంత్‌తో తెల్లం వెంకట్రావు భేటీ అయిన నేపథ్యంలో.. భద్రాచలానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. ఎమ్మెల్యే పార్టీని వీడినా.. స్థానిక నేతలు అభద్రతా భావానికి లోనుకావొద్దని, పార్టీ వెంటే కొనసాగితే గుర్తింపునిస్తామని భరోసా ఇచ్చారు. 11న కాంగ్రెస్‌లోకి వెంకట్రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ నెల 11న కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంబోత్సవం సందర్భంగా బూర్గంపాడులో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ సమక్షంలో వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. -
కాంగ్రెస్‌పై వ్యతిరేకత మొదలైంది
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత ప్రారంభమైందని, అడుగడుగునా కాంగ్రెస్‌ను నిలదీసే రోజులు ముందున్నాయని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ నిలదీయడం బీఆర్ఎస్ పారీ్టకే సాధ్యమవుతుందన్నారు. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు నామా నాగేశ్వర్రావు, మాలోత్ కవితతో పాటు ఆయా సెగ్మెంట్ల పరిధిలోని ముఖ్యనేతలతో తెలంగాణ భవన్లో హరీశ్ సోమవారం భేటీ అయ్యారు. కేసీఆర్ ఆదేశాల మేరకు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై నేతలతో చర్చించారు. కాంగ్రెస్ మోసాలను నిలదీస్తూ ప్రజల్లో చర్చ జరిగేలా చూడాలని, అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే విఫలమైన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. రుణమాఫీ, విద్యుత్ కోతలు, ట్యాంకర్లతో పొలాలకు నీరు, గ్యాస్ సబ్సిడీలో 70 శాతం లబ్ధి దారులకు మొండి చేయి వంటి అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గల్లీలో కాంగ్రెస్ ఉన్నా ఢిల్లీ వేదికగా తెలంగాణ గొంతు వినిపించేందుకు బీఆర్ఎస్ ఎంపీలు అవసరమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ శ్రేణులు పక్కా ప్రణాళికతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రసార మాధ్యమాలతో పాటు సోషల్ మీడియా వేదికగా ప్రజలను జాగృతం చేయాలని హరీశ్ పిలుపునిచ్చారు. -
నేడు మరో మూడు కేసీఆర్ సభలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ శుక్రవారం మరో మూడు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. తొలుత ఉదయం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభకు సీఎం హాజరవుతారు. తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని మహబూబా బాద్ సభకు వస్తారు. అనంతరం వరంగల్ నగరం భట్టుపల్లిలో నిర్వహించే వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. వరంగల్ జిల్లా పరిధిలోని సభల ఏర్పాట్లను గురువారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, దాస్యం వినయభాస్కర్, శంకర్‌నాయక్ తదితరులు పరిశీలించారు. -
వానరాల వీరంగం.. తీవ్రగాయాలతో గృహిణి మృతి
మహబూబాబాద్ రూరల్: వానరాల మూక చేష్టలతో తీవ్రంగా గాయపడిన ఓ గృహిణి మృతి చెందింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ అర్జున్‌రెడ్డి ఆస్పత్రి సమీపంలో ఆదివారం జరిగిన ఈ సంఘటనపై మృతురాలి కుటుంబ సభ్యుల కథనమిది. స్థానికంగా నివసించే ఎండీ గౌస్ భార్య సాబీరా బేగం (55) ఎప్పట్లాగే ఉదయం నిద్రలేచి ఇంటి ముందు వాకిలి ఊడుస్తోంది. ఈ క్రమంలో ఆమె ఇంటిపై సిమెంటు దిమ్మెకు కట్టిన విద్యుత్ తీగను కోతుల గుంపు ఊపడంతో.. ఆ దిమ్మె ఒక్కసారిగా ఊడిపోయింది. అదే సమయంలో వాకిలి ఊడ్చి ఇంట్లోకి వెళ్లడానికి కదులుతున్న సాబీరాబేగంపై దిమ్మె పడిపోయింది. దీంతో ఆమె తలకు లోపలి భాగంలో తీవ్రగాయమై.. కాలు విరిగింది. రక్తస్రావంతో కుప్పకూలిన బాధితురాలిని స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి భర్త, కుమార్తె ఉన్నారు. -
Mahabubabad: రేఖా నాయక్ అల్డుడి ఆకస్మిక బదిలీ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ బదిలీ అయ్యారు. ఆయనను తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎస్పీగా పనిచేస్తున్న చంద్రమోహన్ గుండేటిని నియమిస్తూ సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆకస్మికంగా జరిగిన ఎస్పీ బదిలీపై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నాయకులు ఏరికోరి తెచ్చుకున్న ఎస్పీ ఎన్నికల వరకు ఉంటారని అందరూ భావించగా.. ఊహించని విధంగా బదిలీ కావడానికి ‘రేఖా నాయక్ ఎఫెక్ట్’ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ Ajmeera Rekha Nayak ఎస్పీకి స్వయాన బిడ్డను ఇచ్చిన అత్తగారు. ఈసారి ఆమెకు టికెట్ రాకపోగా, ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. రేఖా నాయక్‌పై కోపంతో ఆమె అల్లుడిని ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ మారతానని ప్రకటించిన గంటల్లోనే ఈ ఆదేశాలు వెలువడడం గమనార్హం. -
బ్యాంకులో చోరీ యత్నం.. నిందితుడు 7వ తరగతి విద్యార్థి!
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్రాంచ్‌లో బుధవారం రాత్రి జరిగిన చోరీ యత్నం ఘటనలో ఏడో తరగతి విద్యార్థి సీసీ కెమెరాకు చిక్క డం ఆసక్తిగా మారింది. నిత్యం జనసంచారం.. రహదారికి ప క్కన ఉండే బ్యాంకు ఆవరణలోకి రాత్రి 8.20 గంటలకే బా లుడు రావడం చూస్తుంటే ఎవరైనా డైరెక్షన్ ఇస్తే యాక్షన్‌లోకి దిగాడా లేక స్వతహాగానే వచ్చాడా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బయ్యారం–పందిపంపుల రహదారి పక్కన ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ ఆవరణలోకి బయ్యారంలో నివాసం ఉంటున్న ఇర్సులాపురానికి చెందిన 13 సంవత్సరాల బాలు డు గడ్డపారతో వెళ్లాడు. వెనుకవైపు గ్రిల్స్‌తో ఉన్న తలుపు తాళం పగులకొట్టి లోపలికి ప్రవేశించాడు. బ్యాంకులో పల ఉన్న డెస్‌్కల్లో డబ్బులు, నగలు ఉంటాయేమోనని గంటపా టు వెతికి ఆ తరువాత బయటకు వెళ్లినట్టు సీసీ కెమెరాల ఫు టేజీని బట్టి తెలుస్తోంది. గురువారం ఉదయం బ్యాంకు వద్ద కు స్వీపర్ పద్మ వచ్చింది. తాళం పగులకొట్టిన విషయాన్ని అధికారులకు తెలిపింది. వారి ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాలుడితో సాధ్యమేనా?: కట్టుదిట్టమైన భద్రతమధ్య ఉండే బ్యాంకులోకి 13 సంవత్సరాల బాలుడు ఇతరుల ప్రమేయం లేకుండా చోరీకి యత్నించడం సాధ్యం కాదని పలువురు అంటున్నారు. గడ్డపారతో తాళం పగులకొట్టడం కష్టమని, బాలుడు సునాయాసంగా ఎలాంటి చప్పుడు లేకుండా ఎలా పగులకొట్టాడని, ఎవరైనా డైరెక్షన్ ఇచ్చి చేయించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బెదిరింపులతోనే చేశా..: దొంగతనాల్లో అనుభవం ఉన్న ఓ పాత నేరస్తుడు చోరీకి యత్నించిన బాలుడికి ఇటీవల పరిచయం అయినట్టు తెలుస్తుంది. ఆ పరిచయం ఆధారంగా బాలుడిని మచ్చిక చేసుకున్న పాత నేరస్తుడు బ్యాంకు దొంగతనం చేయాలని బెదిరించినట్టు బాలుడు పోలీసుల విచారణలో తెలిపినట్టు సమాచారం. వెనుక నుంచి బ్యాంకు గోడపైకి ఎక్కించి, తను బయటకు వచ్చే వరకు ఆ పాతనేరస్తుడు అక్కడే ఉన్నాడని, ఆ తరువాత ఇద్దరం ఎవరి ఇళ్లకు వారు వెళ్లినట్టు బాలుడు చెప్పినట్లు తెలిసింది. కాగా, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న గార్ల–బయ్యారం సీఐ బాలాజీ, ఎస్ఐ రమాదేవి బ్యాంకు పరిసరాలతోపాటు బ్యాంకులో రికార్డయిన సీసీ ఫుటేజీని పరిశీలించారు. చోరీకి యతి్నంచిన బాలుడి ఆనవాళ్లను గుర్తించిన అధికారులు ఇర్సులాపురంలో అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. -
గుమ్ముడూరులో ఉద్రిక్తత
-
పేదరికంతో పోరాడి.. వైకల్యంతో ఎదురీది.. విజేతగా నిలిచిన భాగ్య
ఆమె పేరులో భాగ్యం ఉంది. ఆ భాగ్యం జీవితంలో కొరవడింది. ఆమె పేదరికంతో పోరాడింది. శారీరక వైకల్యంతో ఎదురీదింది. సమాజంలో విజేతగా నిలిచింది. అభినందనలు అందుకుంటోంది. తమిళనటి, నర్తకి సుధాచంద్రన్ ఒక అద్భుతం. నాట్య మయూరిగా పేరు తెచ్చుకుంది. నెమలిలా నాట్యం చేసే ఆమెతో విధి వింత నాటకం ఆడింది. ఒక కాలిని తీసుకెళ్లింది. ఆమె నిర్ఘాంతపోయింది. నడవడమే కష్టం అనుకున్న స్థితి నుంచి కోలుకుని కృత్రిమ కాలితో నాట్యం చేసింది. మన తెలుగు నాట్య మయూరితో విధి మరింత ఘోరంగా ఆటలాడుకుంది. ఆమెను ఒక్క కాలితోనే భూమ్మీదకు పంపించింది. డాన్స్ చేయాలంటే రెండు కాళ్లు ఉంటే మంచిదే... కానీ లేదని ఊరుకోవడమెందుకు? ఒక కాలు లేకపోతేనేం... మరో కాలుందిగా... అంటూ డాన్స్ చేస్తోంది. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం గెలిచాయి. తెలంగాణ జానపద కళలంటే ప్రాణం పెట్టే భాగ్య అందులోనే ఎం.ఏ చేస్తోంది. తన విజయగాధను సాక్షితో పంచుకుంది. బస్సులు మారలేక... ‘‘మాది మహబూబాబాద్ జిల్లా, గూడూరు గ్రామం. అమ్మ కూలిపనులకు వెళ్తుంది. నాన్న మేకలు కాస్తాడు. అన్న, నేను ఇద్దరం పిల్లలం. నేను పుట్టడమే ఒక విచిత్రం. బిడ్డ ఒక కాలు లేకుండా పుట్టిందని ఊరంతా వచ్చి చూశారట. ఆ తర్వాత నేను పెరగడం, చదువు, డాన్స్ నేర్చుకోవడం... అన్నీ విచిత్రంగానే గడిచాయి. సెవెన్త్ క్లాస్ వరకు వరంగల్ జిల్లా, నెక్కొండ మండలం, పెద్ద కొర్పోల్‌లో చదువుకున్నాను. ఆ తర్వాత హన్మకొండలో సాగింది. ఇంటర్ ప్రైవేట్ కాలేజ్‌లో చదివించడం డబ్బుండి కాదు. ప్రభుత్వ కాలేజ్‌కి రెండు బస్సులు మారి వెళ్లాల్సి ఉండింది. నేనలా వెళ్లలేనని ప్రైవేట్ కాలేజ్‌లో చేర్చారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజ్‌లో డిగ్రీ చేసి, ఇప్పుడు హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళల్లో ఎం.ఏ. చేస్తున్నాను. ఇంతకీ నేను డాన్సర్‌గా మారిన వైనం మరీ విచిత్రం. బాలెన్స్కి నెల పట్టింది నేను నైన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు జరిగిందా విచిత్రం. ప్రముఖ డాన్సర్ లారెన్స్ మాస్టారి ఆలోచన నన్ను డాన్సర్‌ని చేసింది. ఆయన దగ్గర పని చేసిన ప్రశాంత్ మాస్టారు స్పెషల్లీ ఏబుల్డ్ పిల్లలకు డాన్స్ నేర్పించడానికి మేమున్న హాస్టల్‌కి కూడా వచ్చారు. అలా అప్పుడు వాళ్లు పదిమందికి పైగా స్టూడెంట్స్‌ని సేకరించి డాన్స్ క్లాసులు మొదలు పెట్టారు. వారిలో స్టేజ్ మీద ప్రదర్శనలిచ్చే స్థాయికి చేరింది ముగ్గురమే. అప్పటివరకు కర్ర లేకుండా నిలబడగలమనే ఊహ కూడా లేని వాళ్లమే అందరం. మొదట ఒక కాలి మీద దేహాన్ని బాలెన్స్ చేయడం సాధన చేశాం. బాలెన్స్ సాధించడానికి నెల పట్టింది. సినిమా పాటలు, జానపద నృత్యం, బతుకమ్మ పాటలు ప్రాక్టీస్ చేశాను. ఆ కోర్సు తర్వాత కూడా సొంతంగా కొన్ని పాటలకు సాధన చేశాను. టీవీ ప్రోగ్రామ్‌లలో కూడా డాన్స్ చేశాను. దసరా ఉత్సవాలు, వినాయక చవితి, ఇతర సమావేశాల్లో అవకాశాలను వెతుక్కుంటూ నాట్యం చేస్తున్నాను. శివరాత్రికి వేములవాడ రాజరాజేశ్వరస్వామి గుడిలో కూడా నాట్యం చేశాను. ఇక్కడ మరో విచిత్రం... ఏమిటంటే, సిట్టింగ్ వాలీబాల్ ఆడే అవకాశం వచ్చింది. ఈ ఆటకు మన దగ్గర పెద్దగా ఆదరణ లేదు. రాజస్థాన్, హర్యానా, తమిళనాడు, కర్నాటకల్లో జరిగిన పోటీలకు హాజరయ్యాను. థాయ్‌లాండ్‌లో జరిగే పోటీలకు ఎంపిక ప్రక్రియలో నెగ్గాను. మనదేశం తరఫున ఆడే అవకాశం వచ్చింది. కానీ కరోనా కారణంగా వెళ్లలేకపోయాను. తెలంగాణ ఆట పాట ఫోక్ ఆర్ట్స్ కోర్సులో భాగంగా డప్పు, జానపదగేయాలు, కర్రసాము, చెక్క భజన వంటి తెలంగాణ సంప్రదాయ కళలను నేర్చుకున్నాను. బతుకమ్మ పాటలను సేకరించి పాడాను. ఇతర పాటలు పాడే అవకాశాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. డాన్స్‌లో కూడా నిరూపించుకుంటాను. నాకు సీటు ఇచ్చేటప్పుడు సీటు వృథా అవుతుందేమోనని సందేహించిన యూనివర్సిటీనే ఇప్పుడు నాకు అండగా నిలిచింది. నేను ఎవరికీ భారం కాకూడదు, నా కాళ్ల మీద నేను నిలబడాలనే పట్టుదలే నన్ను ఇంతవరకు నడిపించింది’’ అని చెప్పింది భాగ్య. సవాళ్లను ఎదుర్కొనే మనోధైర్యం ఆమె సొంతం. ఆడపిల్లలకు ధైర్యం ఒకింత ఎక్కువగా ఉండాలని చెప్తోంది. బాలికలకు కర్రసాము నేర్పించి ధీరలుగా మలవాలనే ఆమె ఆశయం, జానపదానికి సేవ చేయాలనే ఆమె ఆకాంక్ష నెరవేరాలి. కొత్త అడుగులు ఎల్బీ స్టేడియంలో ఇచ్చిన ప్రదర్శన నా జీవితాన్ని కొత్తగా రాసింది. డిసెంబర్ మూడవ తేదీ ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్’. ఆ సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో నాలుగు రోజుల ముందు నుంచి ఆటలు, డాన్స్ ప్రోగ్రామ్‌లు జరిగాయి. నా డాన్స్ ఫొటోలు పేపర్లో వచ్చాయి. ఆ పేపర్ చూసి మా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కిషన్‌రావు సర్ నన్ను పిలిచి మాట్లాడారు. మా ఆర్థిక పరిస్థితి, గవర్నమెంట్ పెన్షన్‌తో హాస్టల్ ఫీజు కట్టుకుంటూ చదువుకుంటున్నానని తెలుసుకుని ఆయన చలించిపోయారు. ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలియదు, వీసీ సర్, రిజిస్ట్రార్ సర్ కలిసి మూడు లక్షల నిధులు సేకరించి, జర్మనీ నుంచి డాన్స్ చేయడానికి వీలుగా ఉండే ప్రోస్థటిక్ లెగ్‌ను తెప్పించి పెట్టించారు. ఇప్పుడు ఆ కాలితో నడక ప్రాక్టీస్ చేస్తున్నాను. నడక మీద పట్టు వచ్చిన తర్వాత డాన్స్ చేస్తాను. – వాకా మంజులారెడ్డి -
28 ఏళ్ల కిందట ఆయుధాలు రద్దు.. అటవీ సంరక్షకులకు రక్షణ ఏదీ?!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఇటీవల కుమ్రంభీం జిల్లా సార్సాల గ్రామంలో అటవీశాఖ అధికారిణి అనితపై ఓ ప్రజాప్రతినిధి సోదరుడి ఆధ్వర్యంలో దాడి. మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం మడగూడెంలో పోడు భూముల సాగును అడ్డుకున్న డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కర్ణానాయక్‌పై దాడి. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలంలోని గుండాలపాడు సమీపంలో సెక్షన్ ఆఫీసర్ నీలమయ్య, బీట్ ఆఫీసర్ భాస్కరరావులపై కర్రలతో దాడి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు పంచాయతీ ఎర్రబోరు అటవీప్రాంతంలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు దారుణ హత్య. తెలంగాణ రాష్ట్రంలో అడవుల సంరక్షణే ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తున్న అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై జరుగుతున్న వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావుపై పగ పెంచుకున్న గొత్తికోయలు మంగళవారం ఆయనపై దాడి చేసి హత్య చేసిన నేపథ్యంలో.. ‘అటవీ సిబ్బందికి ఆయుధాలు’ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అడవుల సంరక్షణ కోసం విధులు నిర్వహించే అటవీశాఖ సిబ్బందికి మళ్లీ ఆయుధాలు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. తాజాగా శ్రీనివాసరావు హత్యతో చలించిన ఎఫ్ఆర్ఓల సంఘం నాయకులు ఆ యుధాలు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేదంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘అర్హులైన గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ’కార్య క్రమం సమస్యాత్మకంగా మారే అవకాశం ఉందని వారు స్పష్టం చేశారు. మావోయిస్టుల కార్యకలాపాల నేపథ్యంలో 28 ఏళ్ల కిందట అటవీ, ఆబ్కారీ శాఖలకు చెందిన ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఆయుధాలు, వైర్లెస్ సెట్ల కోసం మావోయిస్టులు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే గత పదేళ్లుగా రెండు శాఖల అధికారులు, సిబ్బందికి స్మగ్లర్లు, అక్రమార్కుల ఆగడాలు, పోడు భూముల సాగు నియంత్రణ సమస్యగా మారింది. 2013 సెప్టెంబర్ 15న నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం పెంబిలో అటవీ భూముల ఆక్రమణను అడ్డుకునేందుకు 11 మంది సిబ్బందితో వెళ్లిన ఎఫ్ఆర్ఓ గంగయ్య (42)పై.. అక్కడున్న జనం గొడ్డళ్లతో దాడి చేసి చంపేశారు. మరో ఏడుగురిని గాయపరిచారు. అప్పుడున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అప్పటి అటవీశాఖ పీసీసీఎఫ్ బీఎస్ఎన్ రెడ్డితో ఆయుధాల అప్పగింతపై చర్చలు జరిపారు. ఆ తర్వాత కూడా అనేక దాడులు జరగ్గా.. దాడులు జరిగినప్పుడు ఆయుధాల విషయం చర్చించడం ఆ తర్వాత మరిచిపోవడం ఓ తంతుగా మారింది. ‘పోడు’నేపథ్యంలో పెరుగుతున్న దాడులు ఒక వైపు అర్హులైన గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పించే అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తుండగా.. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల అటవీ ప్రాంతాల్లో పోడు కోసం అడవులు నరుకుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అడ్డుకుంటున్న అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై దాడులు జరుగుతున్నట్లు కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 12.46 లక్షల ఎకరాల పోడు భూములపై హక్కుల కల్పనకు సంబంధించి గిరిజనుల నుంచి 4,14,219 దరఖాస్తులు రాగా.. అందులో 10.36 లక్షల ఎకరాలకు సంబంధించిన 3.59 లక్షల దరఖాస్తులను పరిశీలించారు. భద్రాద్రి నుంచి 2,99,478 ఎకరాలపై 305 గ్రామాల నుంచి 83,663 అర్జీలు ఉన్నట్లు వరంగల్ సీసీఎఫ్ ప్రకటించారు. భద్రాద్రి జిల్లాలో ఎఫ్ఆర్ఓ హత్యకు పోడు భూముల సర్వే నేపథ్యం కూడా ఉండటంతో..ఈ అంశం భవిష్యత్తులో సర్వే ప్రక్రియకు అంతరాయం కలిగించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. చదవండి: మల్లారెడ్డిపై ఐటీ దాడులు: సంచలనం రేపుతున్న ‘రూ.100 కోట్లు’ ఆయుధాలు ఇస్తేనే పోడు భూముల సర్వే అడవుల సంరక్షణ కోసం పనిచేస్తున్న అటవీశాఖ సిబ్బంది ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్‌రావు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హ్యత నేపథ్యంలో ఎఫ్ఆర్ఓల సంఘం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. మా ప్రాణాలకు రక్షణ కల్పించకుండా పోడు భూముల సర్వేకు వెళ్లేది లేదు. ఆయుధాలు ఇవ్వాలని, మా ప్రాణాలకు రక్షణ కల్పించాలని మా ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. – షౌకత్ అలీ, రాష్ట్ర అధ్యక్షుడు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల సంఘం -
ఎంపీ స్కూటీపై వెళ్లి.. బాధితులకు అండగా..
సాక్షి, మహబూబాబాద్ /బయ్యారం: అటవీ ప్రాంతాల్లో కరోనాతో బాధపడుతున్న గిరిజనులకు ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే బానోతు హరిప్రియ అండగా నిలిచారు. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం అటవీ ప్రాంతాల్లో శనివారం కవిత, హరిప్రియతో కలసి పర్యటించారు. మండలంలోని గురిమెళ్ల, గౌరారం, బాలాజీపేట పంచా యతీల్లో కరోనా బాధితులను వారు పరామర్శించి 158 మందికి నిత్యావసర సరుకులు అందజేశారు. కొన్ని ప్రాంతాలకు పెద్ద వాహనాలు వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో ఎంపీ స్కూటర్‌పై, ఎమ్మెల్యే బైక్‌పై ప్రయాణించడం విశేషం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా బాధితులు అధైర్యపడొద్దని సూచించారు. పౌష్టికాహారం తీసుకుంటూ, వైద్యులు సూచించిన మందులు వాడితే త్వరగా కోలుకోవచ్చని అన్నారు. బైక్‌పై ఎమ్మెల్యే బానోతు హరిప్రియ పిల్లల్లో కోవిడ్–19పై ఆందోళన వద్దు సాక్షి, హైదరాబాద్: పిల్లల్లో కోవిడ్ వ్యాప్తి గురించి ఆందోళన చెందవద్దని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కరోనా పరిస్థితులపై శనివారం ఆమె ఉన్నతాధికారులు, జిల్లా సంక్షేమాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్‌లో మహిళలు, యువకులు ఎక్కువగా ఇబ్బంది పడ్డారన్నారు. మూడో దశ పిల్లలపై అధిక ప్రభావం చూపే అవకాశాలున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి ప్రచారాలను చూసి ఆందోళన చెందవద్దని, పిల్లలు కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించేలా సిద్ధం చేయాలని, మాస్కు ధరించడం, శానిటైజర్లు, హ్యాండ్ వాష్ వినియోగించి చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న ఈ సమయంలో కూడా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు పొషకాహారాన్ని అందిస్తున్నారని మంత్రి వారిని అభినందించారు. చదవండి: జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో.. ‘పది పడకల ఐసీయూ’లు -
ఆశ చూపి అత్యాచారం
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లా బలరాంతండా గ్రామ పరిధిలో ఓ యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. మొత్తం తొమ్మిది మంది నిందితుల్లో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. నిందితుల్లో ఆరుగురు మైనర్లు ఉన్నారు. కేసుకు సంబంధించిన వివరాలు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సోమవారం మీడియాకు వెల్లడించారు. ఖమ్మం జిల్లా ఇల్లందు మండలానికి చెందిన యువతి (24) ఈ నెల 6న హైదరాబాద్ నుంచి రైలులో బయలుదేరి 7న ఉదయం మహబూబాబాద్‌కు చేరుకుంది. ఆమె దగ్గర డబ్బులు లేకపోవడంతో సాయంత్రం వరకు అక్కడే నిరీక్షించింది. ఎటూ తోచక రాత్రి ఎనిమిది గంటల సమయంలో తనకు పరిచయమున్న బలరాం తండాకు చెందిన ఓ యువకుడికి ఫోన్ చేసి డబ్బు అడగ్గా తండాకు రమ్మని చెప్పడంతో అక్కడికి చేరుకుంది. సదరు యువకుడితో పాటు మరో ఎనిమిది మంది కలసి డబ్బు ఇస్తామని ఆమెను గ్రామ శివారులో మామిడి తోటకు తీసుకెళ్లి సామూహికంగా అత్యాచారం చేశారు. అర్ధరాత్రి 11 గంటల సమయంలో మామిడితోట నుంచి అరుపులు వినిపించడంతో అటుగా బైక్‌పై వెళుతున్న బలరాం తండా సర్పంచ్ ఇస్లావత్ నీలవేణి భర్త హరి ఘటనా స్థలం దగ్గరికి వెళ్లాడు. ఆయన రాకను గమనించిన నిందితులు పరారయ్యారు. బాధితురాలితో మాట్లాడి ఆమె తండ్రికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 8 మంది నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రెండు సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇస్లావత్ రఘు, ఇస్లావత్ కిషన్ (బలరాంతండా), గుగులోతు హుస్సేన్ (భవానీనగర్ తండా)లు తప్ప మిగతా వారంతా మైనర్లని ఎస్పీ తెలిపారు. నిందితులకు శిక్ష పడేలా పకడ్బందీగా సాక్ష్యాలను సేకరించి త్వరలోనే కోర్టులో చార్జిïషీటు వేస్తామని తెలిపారు. -
వ్యవసాయం దండగ కాదు..పండగ
నర్సంపేట రూరల్ : వ్యవసాయం దండగ అని నాటి పాలకులు మాట్లాడితే.. దండగ కాదు.. పండగ అని నేడు సీఎం కేసీఆర్ చేసి చూపిస్తున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. నర్సంపేట మండలం భాంజీపేట గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన ‘రైతుబంధు’ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం మాట్లాడుతూ నాడు కరెంటు, విత్తనాలు, గిట్టుబాటు ధర కోసం అన్నదాతలు రోడ్కెక్కితే.. నేడు వ్యవసాయానికి ఉచితంగా 24గంటల విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచడంతోపాటు పెట్టుబడికి ఏడాదికి రెండు పంటలకు ఎకరానికి రూ.4వేలు అందిస్తున్నది తెలంగాణ సర్కారు మాత్రమే అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా మేనిఫెస్టోలో పొందుపరిచిన పథకాలతోపాటు, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. ప్రతి ఇంటికి నల్లా నీటిని అందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ పనులు, ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వడానికి దేవాదుల ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్పీ కాల్వలను ఆధునికీకరణకు శ్రీకారం చుట్టిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి రెండు పంటలకు నీరందించవచ్చన్నారు. ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ గత పాలకులు సంక్షోభంలోకి నెట్టిన వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ హరిత, వ్యవసాయ శాఖ జేడీఏ ఉషాదయాళ్, ఆర్డీఓ రవి, వ్యవసాయ శాఖ ఏడీఏ తోట శ్రీనివాసరావు, ఏసీపీ సునీతామోహన్, ఎంపీపీ బాదావత్ భద్రమ్మ, జెడ్పీటీసీ అజ్మీరా పద్మ, సర్పంచ్‌లు భూక్య లలితా వీరునాయక్, భాషబోయిన సాంబక్క రవి, వైస్ ఎంపీపీ కట్ల సుదర్శన్‌రెడ్డి, ఎంపీటీసీ భాషబోయిన సునీతారాజు, టీఆర్ఎస్ నాయకులు మచ్చిక నర్సయ్యగౌడ్, గూళ్ల అశోక్ , రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ రాయిడి రవీందర్‌రెడ్డి, మండల కన్వీనర్ మోతె జయపాల్‌రెడ్డి, తహసీల్దార్ పూల్‌సింగ్ చౌహన్, మండల వ్యవసాయాధికారి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
ఏడీఎం కార్యాలయ భవన పరిశీలన
మానుకోట ఏఎంసీ భవనంపై కార్యాలయం బోర్డు ఏర్పాటు మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడనున్న తరుణంలో స్థానికంగా జిల్లాస్థాయి అధికారుల కార్యాలయాల ఏర్పాటుకు కసరత్తు ఊపందుకుంది. ఇందులో భాగంగా మార్కెటింగ్ శాఖకు సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. తాజాగా బుధవారం వరంగల్ మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ ప్రవీణ్‌రెడ్డి మహబూబాబాద్‌కు వచ్చారు. స్థానిక ఏఎంసీ సెక్రటరీ వి.సుచిత్ర, సూపర్వైజర్ శ్రీనివాసరాజుతో కలిసి ఏడీఎం కార్యాలయ ఏర్పాటుకు ఎంపిక చేసిన భవనాన్ని పరిశీలించారు. అక్టోబర్ 1కల్లా ఏడీఏం కార్యాలయ ఫర్నీచర్ మహబూబాబాద్‌కు చేరుతుందని ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ భవనంపైన జిల్లా మార్కెటింగ్ కార్యాలయం బోర్డును కూడా ఏర్పాటు చేయించడం గమనార్హం.