సాక్షి ప్రతినిధి, వరంగల్: ఇటీవల కుమ్రంభీం జిల్లా సార్సాల గ్రామంలో అటవీశాఖ అధికారిణి అనితపై ఓ ప్రజాప్రతినిధి సోదరుడి ఆధ్వర్యంలో దాడి. మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం మడగూడెంలో పోడు భూముల సాగును అడ్డుకున్న డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కర్ణానాయక్‌పై దాడి. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలంలోని గుండాలపాడు సమీపంలో సెక్షన్ ఆఫీసర్ నీలమయ్య, బీట్ ఆఫీసర్ భాస్కరరావులపై కర్రలతో దాడి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు పంచాయతీ ఎర్రబోరు అటవీప్రాంతంలో ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరావు దారుణ హత్య.
తెలంగాణ రాష్ట్రంలో అడవుల సంరక్షణే ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తున్న అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై జరుగుతున్న వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావుపై పగ పెంచుకున్న గొత్తికోయలు మంగళవారం ఆయనపై దాడి చేసి హత్య చేసిన నేపథ్యంలో.. ‘అటవీ సిబ్బందికి ఆయుధాలు’ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
అడవుల సంరక్షణ కోసం విధులు నిర్వహించే అటవీశాఖ సిబ్బందికి మళ్లీ ఆయుధాలు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. తాజాగా శ్రీనివాసరావు హత్యతో చలించిన ఎఫ్‌ఆర్‌ఓల సంఘం నాయకులు ఆ యుధాలు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేదంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘అర్హులైన గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ’కార్య క్రమం సమస్యాత్మకంగా మారే అవకాశం ఉందని వారు స్పష్టం చేశారు.
మావోయిస్టుల కార్యకలాపాల నేపథ్యంలో 28 ఏళ్ల కిందట అటవీ, ఆబ్కారీ శాఖలకు చెందిన ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఆయుధాలు, వైర్‌లెస్ సెట్ల కోసం మావోయిస్టులు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే గత పదేళ్లుగా రెండు శాఖల అధికారులు, సిబ్బందికి స్మగ్లర్లు, అక్రమార్కుల ఆగడాలు, పోడు భూముల సాగు నియంత్రణ సమస్యగా మారింది.
2013 సెప్టెంబర్ 15న నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం పెంబిలో అటవీ భూముల ఆక్రమణను అడ్డుకునేందుకు 11 మంది సిబ్బందితో వెళ్లిన ఎఫ్‌ఆర్‌ఓ గంగయ్య (42)పై.. అక్కడున్న జనం గొడ్డళ్లతో దాడి చేసి చంపేశారు. మరో ఏడుగురిని గాయపరిచారు. అప్పుడున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అప్పటి అటవీశాఖ పీసీసీఎఫ్ బీఎస్‌ఎన్ రెడ్డితో ఆయుధాల అప్పగింతపై చర్చలు జరిపారు. ఆ తర్వాత కూడా అనేక దాడులు జరగ్గా.. దాడులు జరిగినప్పుడు ఆయుధాల విషయం చర్చించడం ఆ తర్వాత మరిచిపోవడం ఓ తంతుగా మారింది.
‘పోడు’నేపథ్యంలో పెరుగుతున్న దాడులు
ఒక వైపు అర్హులైన గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పించే అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తుండగా.. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల అటవీ ప్రాంతాల్లో పోడు కోసం అడవులు నరుకుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అడ్డుకుంటున్న అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై దాడులు జరుగుతున్నట్లు కేసులు నమోదవుతున్నాయి.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 12.46 లక్షల ఎకరాల పోడు భూములపై హక్కుల కల్పనకు సంబంధించి గిరిజనుల నుంచి 4,14,219 దరఖాస్తులు రాగా.. అందులో 10.36 లక్షల ఎకరాలకు సంబంధించిన 3.59 లక్షల దరఖాస్తులను పరిశీలించారు. భద్రాద్రి నుంచి 2,99,478 ఎకరాలపై 305 గ్రామాల నుంచి 83,663 అర్జీలు ఉన్నట్లు వరంగల్ సీసీఎఫ్ ప్రకటించారు. భద్రాద్రి జిల్లాలో ఎఫ్‌ఆర్‌ఓ హత్యకు పోడు భూముల సర్వే నేపథ్యం కూడా ఉండటంతో..ఈ అంశం భవిష్యత్తులో సర్వే ప్రక్రియకు అంతరాయం కలిగించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.
చదవండి: మల్లారెడ్డిపై ఐటీ దాడులు: సంచలనం రేపుతున్న ‘రూ.100 కోట్లు’
ఆయుధాలు ఇస్తేనే పోడు భూముల సర్వే
అడవుల సంరక్షణ కోసం పనిచేస్తున్న అటవీశాఖ సిబ్బంది ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాస్‌రావు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హ్యత నేపథ్యంలో ఎఫ్‌ఆర్‌ఓల సంఘం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. మా ప్రాణాలకు రక్షణ కల్పించకుండా పోడు భూముల సర్వేకు వెళ్లేది లేదు. ఆయుధాలు ఇవ్వాలని, మా ప్రాణాలకు రక్షణ కల్పించాలని మా ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం.
– షౌకత్ అలీ, రాష్ట్ర అధ్యక్షుడు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల సంఘం
Comments
Please login to add a commentAdd a comment