forest range officer
-
‘నెమలి కర్రీ’ వీడియోతో బుక్కయ్యాడు
తంగళ్లపల్లి (సిరిసిల్ల): ‘ట్రెడిషినల్ పికాక్ కర్రీ రెసిపీ’ అంటూ ఓ యూట్యూబర్ తన చానల్లో వీడియో పోస్టు చేసి అడ్డంగా బుక్కయ్యాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్‌కుమార్ శ్రీటీవీ అనే యూట్యూబ్ చానల్లో నెమలి వంట చేయడం గురించి వీడియో పోస్టు చేశాడు. ఈ విషయంపై ‘యూట్యూబ్‌లో నెమలికూర వంటకం’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన కథనానికి అటవీ అధికారులు స్పందించారు.తంగళ్లపల్లిలో వంట చేసిన స్థలాన్ని పరిశీలించి, ప్రణయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి కల్పనాదేవి మాట్లాడుతూ, వంటకాన్ని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నెమలి పేరుతో వీడియో పెట్టినందుకు అటవీచట్టం ప్రకారం కేసు నమోదు చేశామని, పలు అటవీ జంతువులు, పక్షుల వంటకాల వీడియోలు కూడా పోస్టు చేసినట్లు గుర్తించామన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. తనిఖీలలో ఫారెస్టు సెక్షన్ అధికారి శ్రవణ్‌కుమార్, బీట్ ఆఫీసర్ ఎంఏ ఖలీమ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏపీ: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్
సాక్షి, విజయవాడ: ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ అందించింది. నాలుగు ఉద్యోగ నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసింది. 37 ఫారెస్ట్ రేంజ్ అధికారి పోస్టులకు, అయిదు స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు, నాలుగు ఫిషరీస్ డెవలప్మెంట్ అధిరారి పోస్టులకు, మూడు ఎలక్ట్రికల్ ఎన్స్పెక్టర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరాలు ►37 ఫారెస్ట్ రేంజ్ అధికారి పోస్టులకు నోటిఫికేషన్...ఏప్రియల్ 15 నుంచి మే 5 వరకు ధరఖాస్తుల స్వీకరణ. ►అయిదు స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్...ఏప్రియల్ 18 నుంచి మే 8 వరకు ధరఖాస్తుల స్వీకరణ. ►నాలుగు ఫిషరీష్ డెవలప్మెంట్ అధికారి పోస్టులకు నోటిఫికేషన్.. ఏప్రియల్ 23 నుంచి మే 13 వరకు ధరఖాస్తులకు అవకాశం. ►మూడు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్.. మార్చ్ 21 నుంచి ఏప్రియల్ 10 వరకు ధరఖాస్తుల స్వీకరణ. చదవండి: యువతరానికి దిక్సూచి ‘భవిత’ -
అటవీశాఖ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
మంచిర్యాలక్రైం: ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ వేధింపులు భరించలేక ఓ బీట్ ఆఫీసర్ ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన అటవీ శాఖలో చర్చనీయాంశంగా మారింది. బీట్ ఆఫీసర్ కథనం ప్రకారం... మంచిర్యాల జిల్లా కోటపల్లి అటవీ శాఖ రేంజ్ పరిధిలోని బీట్ ఆఫీసర్ లత ఇటీవల సెక్షన్ ఆఫీసర్ రాందాస్‌తో కలిసి వెంచవెల్లి బీట్‌లో ప్లాంటేషన్ నిర్వహించారు. ఇందుకుగాను సెక్షన్ ఆఫీసర్ రాందాస్ రూ.2 లక్షలు కూలీల వేతనాలు, ప్లాంటేషన్ నిర్వహణకు ఇచ్చారు. అయితే ఇవికాకుండా అదనంగా రూ.1.50 లక్షలను కూలీలకు చెల్లించాల్సి ఉందని, బిల్లు ఇవ్వాలని ఎఫ్ఆర్వో రవిని లత కోరగా అసభ్యకరంగా మాట్లాడుతూ మానసికంగా వేధిస్తున్నారు. దీంతో ఆమె శుక్రవారంరాత్రి మంచిర్యాలలోని తన ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన లత భర్త ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. డీఎఫ్‌వోకు ఒడిశా కూలీల ఫిర్యాదు ప్లాంటేషన్ పనులు చేసిన ఒడి శా కూలీలు కూలి డబ్బులు ఇవ్వాలని ఎఫ్ఆర్వోను కోరగా ‘కూలి లేదు, డబ్బులు లేవు, దిక్కున్నకాడ చెప్పుకోండి’అని బెదిరించారు. దీంతో వారంతా జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశీశ్ సింగ్‌కు ఫిర్యాదు చేయగా ఎఫ్ఆర్వోను మందలించారు. ఈ విషయా న్ని మనసులో పెట్టుకొన్న రవి శుక్రవారం తనను కా ర్యాలయానికి పిలిపించి దుర్భాషలాడారని లత ఆ రోపించారు. కాగా, వేధింపుల విషయమై ఎఫ్ఆర్వో రవిని సంప్రదించగా, తాను బీట్ ఆఫీసర్ లతను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని తెలిపారు. -
ఎఫ్ఆర్వో హత్య కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అటవీఅధికారి (ఎఫ్ఆర్వో) చళ్లమళ్ల శ్రీనివాసరావు హత్య కేసులో తీసుకున్న చర్యలేంటో వివరించాలని సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో అడవుల పరిరక్షణకు సంబంధించిన ఓ పిటిషన్ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్‌నాథ్‌ల ధర్మాసనం విచారణ చేసింది. ఈ కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది ఏడీఎన్ రావు...భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హత్యకు గురైన ఎఫ్ఆర్వో చళ్లమళ్ల శ్రీనివాసరావు అంశాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వార్తాపత్రికల ఆధారంగా పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అడవుల పరిరక్షణ వ్యవహారంపై కోర్టు నియమించిన కేంద్ర సాధికారిత కమిటీ నుంచి నివేదికను తీసుకోవాలని సీనియర్ న్యాయవాది ఏడీఎన్ రావు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అమికస్‌క్యూరీ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఇదీ చదవండి: అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందే -
ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ రావు హత్యపై కుటుంబసభ్యుల అనుమానాలు
-
పోడు సర్వేకు బ్రేక్.. విధులు బహిష్కరించిన అటవీ సిబ్బంది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పోడు సర్వేకు బ్రేక్ పడింది. ఎఫ్ఆర్ఓ చలమల శ్రీనివాసరావు హత్యను నిరసి స్తూ అటవీశాఖ ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో గ్రామసభలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శాఖ సిబ్బంది గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మంలో నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శన చేయడంతో పాటు డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. అలాగే గాందీచౌక్‌లోని గాంధీ విగ్రహానికి కూడా వినతిపత్రం ఇచ్చారు. ఇక శుక్రవారం నుంచి డివిజన్, జిల్లా స్థాయిలో ఆందోళనలకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా ఉద్యమం చేపట్టనున్నట్లు ఫారెస్ట్ రేంజర్స్ అసోసియేషన్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. అడవుల్లో విధులు నిర్వహించే తమ కు ఆయుధాలు ఇవ్వాలని, ప్రత్యేకంగా ఫారెస్ట్ స్టేష న్లు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిబ్బందిని పెంచడంతో పాటు ఎనిమిది గంటల పనివిధానం అమలు చేయాలని నినదించారు. అలాగే ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్‌ను బహిర్గతం చేయాల న్నారు. ఇక ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు హత్యకు సంబంధించిన దర్యాప్తును పారదర్శకంగా చేయా లని డిమాండ్ చేశారు. నిందితులను తామే పట్టు కుని పోలీసులకు అప్పగించినట్లు ఉద్యోగులు తెలిపారు. దరఖాస్తులపై గందరగోళం.. పోడు దరఖాస్తులపై గందరగోళం నెలకొంది. దర ఖాస్తుల స్వీకరణ గడువు తేదీని బహిర్గతం చేయకపోవడంతో ఇంకా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయని అటవీశాఖ యంత్రాంగం తెలిపింది. ప్రస్తుతం పోడు కొడుతూ దరఖాస్తులు చేసుకుంటున్నారని, దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పోడు సర్వే చివరి దశకు చేరిందని ప్రకటిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అటవీశాఖ సిబ్బంది చెబుతున్న సమస్యలను అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇంతలోనే ఎఫ్ఆర్ఓ హత్య జరగడంతో వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది ఆందోళనలు పోడు సర్వేపై ప్రభావం చూపిస్తున్నాయి. పోడు సర్వేలో అటవీ సిబ్బంది కీలకం కాగా.. వీరు లేకుండా రెవెన్యూ, గ్రామ పంచాయతీ సిబ్బంది సర్వేకు వెళ్లే అవకాశాలు లేవు. ఇదీ చదవండి: Recession: ముందు నుయ్యి... వెనుక గొయ్యి -
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.. సంయమనం పాటించాలి
చండ్రుగొండ ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ ఆదివాసీల చేతిలో మరణించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఆయన మరణం బాధాకరమే. నిజానికి ప్రభుత్వం పోడు భూములపై ఆదివాసీలకు హక్కులు కల్పించడంలో చూపిస్తున్న సాచివేత ధోరణే ప్రజలకూ – ప్రభుత్వ అధికారులకు మధ్య యుద్ధం జరగడానికి కారణం అని చెప్పక తప్పదు. అసలు ఈ సంఘటనకు కారణమేమిటో తేల్చడానికి జిల్లా జడ్జితో విచారణ జరిపించాలని ఆదివాసీలు కోరుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు అక్రమంగా తప్పుడు పద్ధతులలో భూ పట్టాలను మంజూరు చేస్తున్నారు అధికారులు. అలాగే గిరిజనేతరులు ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తుంటే అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ఇదంతా తెలిసినా ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన షెడ్యూల్డ్ ప్రాంతంలో కనిపించకుండానే శాంతియుతమైన వాతావరణం క్రమక్రమంగా కరిగి పోతోంది. అందుకు ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్‌పై దాడి ఒక మంచి ఉదాహరణ. అటవీ అధికారులు రాష్ట్రంలో ఆదివాసీ మహిళల మీద, చిన్నారుల మీద దాడులు చేసినప్పడు; పంటలకూ, ఆహార ధాన్యాలకూ, ఇళ్ళకూ నిప్పుపెట్టినప్పుడూ, మనుషుల మీద మూత్రం పోసినప్పుడూ, ఇటువంటి మరికొన్ని అమానవీయ ఘటనలకు పాల్పడినప్పుడూ ప్రభుత్వం స్పందించిన దాఖలాలు కనిపించవు. పోడు భూములపై హక్కుల కోసం ఆదివాసీ సంఘాలు ఆందోళనలు నిర్వ హించినప్పుడు... పోడు సాగుదారులకు పట్టాలిస్తామనీ, పోడు సమస్యను పరిష్కరిస్తామనీ ఒకపక్క చెబుతూనే... మరోపక్క సాగు చేసుకుంటున్న ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులను ఉసిగొలుపుతోంది ప్రభుత్వం. ఆ నిర్లక్ష్య ధోరణి వల్లే ఈరోజు అటవీ అధికారి శ్రీనివాస్ హత్య జరిగింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు ముఖ్యమ్రంతి. చనిపోయిన శ్రీనివాసరావును ముఖ్యమంత్రి తిరిగి తీసుకొస్తాడా? ఆయన పోడు భూముల సాగుపై స్పష్టమైన వైఖరినీ, చిత్తశుద్ధినీ వెల్లడించకుండా ప్రతిసారీ ఎన్నికలసమయంలో సబ్ కమిటీల (అటవీ హక్కుల కమిటీలు) నియామకం పేరుతో కాలం వెళ్ళదీస్తూ అసలు విషయాన్ని దాటవేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆదివాసీలను కేవలం ఓటు బ్యాంక్‌గా వాడుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారు. ఏదేమైనా... ఆదివాసీ ప్రజలూ సహనం, ఓపికతో చట్టానికి లోబడే పోరాటం కొనసాగించాలే తప్ప... ఇలా ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడం తగదు. సంయమనం పాటించాలి. (క్లిక్ చేయండి: 28 ఏళ్ల కిందట ఆయుధాలు రద్దు.. అటవీ సంరక్షకులకు రక్షణ ఏదీ?!) – వూకె రామకృష్ణ దొర, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ -
28 ఏళ్ల కిందట ఆయుధాలు రద్దు.. అటవీ సంరక్షకులకు రక్షణ ఏదీ?!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఇటీవల కుమ్రంభీం జిల్లా సార్సాల గ్రామంలో అటవీశాఖ అధికారిణి అనితపై ఓ ప్రజాప్రతినిధి సోదరుడి ఆధ్వర్యంలో దాడి. మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం మడగూడెంలో పోడు భూముల సాగును అడ్డుకున్న డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కర్ణానాయక్‌పై దాడి. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలంలోని గుండాలపాడు సమీపంలో సెక్షన్ ఆఫీసర్ నీలమయ్య, బీట్ ఆఫీసర్ భాస్కరరావులపై కర్రలతో దాడి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు పంచాయతీ ఎర్రబోరు అటవీప్రాంతంలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు దారుణ హత్య. తెలంగాణ రాష్ట్రంలో అడవుల సంరక్షణే ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తున్న అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై జరుగుతున్న వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావుపై పగ పెంచుకున్న గొత్తికోయలు మంగళవారం ఆయనపై దాడి చేసి హత్య చేసిన నేపథ్యంలో.. ‘అటవీ సిబ్బందికి ఆయుధాలు’ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అడవుల సంరక్షణ కోసం విధులు నిర్వహించే అటవీశాఖ సిబ్బందికి మళ్లీ ఆయుధాలు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. తాజాగా శ్రీనివాసరావు హత్యతో చలించిన ఎఫ్ఆర్ఓల సంఘం నాయకులు ఆ యుధాలు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేదంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘అర్హులైన గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ’కార్య క్రమం సమస్యాత్మకంగా మారే అవకాశం ఉందని వారు స్పష్టం చేశారు. మావోయిస్టుల కార్యకలాపాల నేపథ్యంలో 28 ఏళ్ల కిందట అటవీ, ఆబ్కారీ శాఖలకు చెందిన ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఆయుధాలు, వైర్లెస్ సెట్ల కోసం మావోయిస్టులు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే గత పదేళ్లుగా రెండు శాఖల అధికారులు, సిబ్బందికి స్మగ్లర్లు, అక్రమార్కుల ఆగడాలు, పోడు భూముల సాగు నియంత్రణ సమస్యగా మారింది. 2013 సెప్టెంబర్ 15న నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం పెంబిలో అటవీ భూముల ఆక్రమణను అడ్డుకునేందుకు 11 మంది సిబ్బందితో వెళ్లిన ఎఫ్ఆర్ఓ గంగయ్య (42)పై.. అక్కడున్న జనం గొడ్డళ్లతో దాడి చేసి చంపేశారు. మరో ఏడుగురిని గాయపరిచారు. అప్పుడున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అప్పటి అటవీశాఖ పీసీసీఎఫ్ బీఎస్ఎన్ రెడ్డితో ఆయుధాల అప్పగింతపై చర్చలు జరిపారు. ఆ తర్వాత కూడా అనేక దాడులు జరగ్గా.. దాడులు జరిగినప్పుడు ఆయుధాల విషయం చర్చించడం ఆ తర్వాత మరిచిపోవడం ఓ తంతుగా మారింది. ‘పోడు’నేపథ్యంలో పెరుగుతున్న దాడులు ఒక వైపు అర్హులైన గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పించే అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తుండగా.. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల అటవీ ప్రాంతాల్లో పోడు కోసం అడవులు నరుకుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అడ్డుకుంటున్న అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై దాడులు జరుగుతున్నట్లు కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 12.46 లక్షల ఎకరాల పోడు భూములపై హక్కుల కల్పనకు సంబంధించి గిరిజనుల నుంచి 4,14,219 దరఖాస్తులు రాగా.. అందులో 10.36 లక్షల ఎకరాలకు సంబంధించిన 3.59 లక్షల దరఖాస్తులను పరిశీలించారు. భద్రాద్రి నుంచి 2,99,478 ఎకరాలపై 305 గ్రామాల నుంచి 83,663 అర్జీలు ఉన్నట్లు వరంగల్ సీసీఎఫ్ ప్రకటించారు. భద్రాద్రి జిల్లాలో ఎఫ్ఆర్ఓ హత్యకు పోడు భూముల సర్వే నేపథ్యం కూడా ఉండటంతో..ఈ అంశం భవిష్యత్తులో సర్వే ప్రక్రియకు అంతరాయం కలిగించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. చదవండి: మల్లారెడ్డిపై ఐటీ దాడులు: సంచలనం రేపుతున్న ‘రూ.100 కోట్లు’ ఆయుధాలు ఇస్తేనే పోడు భూముల సర్వే అడవుల సంరక్షణ కోసం పనిచేస్తున్న అటవీశాఖ సిబ్బంది ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్‌రావు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హ్యత నేపథ్యంలో ఎఫ్ఆర్ఓల సంఘం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. మా ప్రాణాలకు రక్షణ కల్పించకుండా పోడు భూముల సర్వేకు వెళ్లేది లేదు. ఆయుధాలు ఇవ్వాలని, మా ప్రాణాలకు రక్షణ కల్పించాలని మా ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. – షౌకత్ అలీ, రాష్ట్ర అధ్యక్షుడు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల సంఘం -
తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ అంత్యక్రియలు
-
ఫారెస్ట్ రేంజ్ అధికారి హత్యకేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
-
దాడికి ముందు గుత్తికోయలతో ఎఫ్ఆర్వో.. ఫోటో వైరల్
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస రావు హత్యకేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. మడకం తుల(37), మంగ(43) అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు కొత్తగూడెం ఎస్పీ వినీత్ తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. సమగ్ర విచారణ జరిపి కసులో ఎవరెవరు ఉన్నారో అందరిని అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. దోషులను చట్ట ప్రకారం శిక్షిస్తామని తెలిపారు. శ్రీనివాసరావును హత్యచేసిన వారిని ఉపేక్షించేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఘటనకు ముందు గుత్తికోయలతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు మాట్లాడుతున్న ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని బెంబాలపాడు అటవీ ప్రాంతంలో ఎఫ్‌ఆర్‌ఓగా పనిచేస్తున్న చెలమల శ్రీనివాసరావును మంగళవారం గొత్తికోయలు హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ప్లాంటేషన్ భూముల్లో పశువులు మేపడాన్ని అడ్డుకున్నందుకే గుత్తికోయలు ఫారెస్ట్ అధికారిని చంపినట్లు తెలుస్తోంది. చదవండి: ఫారెస్ట్ అధికారి మృతిపై అనుమానాలు.. ఆయుధాలు ఇవ్వాల్సిందే.. తెలంగాణ సర్కార్‌కు అల్టిమేటం -
Forest Range Officer: ఇక్కడ కాపాడిన ప్రాణం.. అక్కడ పోయింది!
చెట్టమ్మకు చుట్టమైండు. అడవి తల్లికి దడి కట్టిండు. దండెత్తిన మూకలను తరిమికొట్టిండు. పచ్చదనాన్ని కాపాడినందుకు మావోల హిట్లిస్ట్కెక్కిండు. చివరికి గొత్తికోయల చేతిలో హత్యకు గురైండు. ఇప్పుడా వనం కన్నీళ్లు కారుస్తోంది. చెట్లన్నీ నిలబడి సంతాపం తెలుపుతున్నాయి. ‘శ్రీనివాస్ అమర్ రహే’ అని మౌనంగా నినదిస్తున్నాయి. – బయ్యారం సాక్షి, మహబూబాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో ఎఫ్‌ఆర్‌ఓగా పనిచేస్తున్న చెలమల శ్రీనివాసరావును మంగళవారం గొత్తికోయలు హత్య చేశారు. 2011 నుంచి 2018 వరకు బయ్యారం అటవీశాఖ డీఆర్ఓగా శ్రీనివాసరావు పని చేశారు. ఆయన మృతితో ఉమ్మడి జిల్లాలో విషాదం నెలకొంది. అటవీరక్షణకు ఈప్రాంతంలోని సాయుధ దళాలతో పాటు లీగల్‌గా గట్టిపట్టు ఉన్న న్యూడెమోక్రసీ పార్టీని ఢీకొన్నారు. అటవీ రక్షణకు వెనకడుగు వేయలేదు. 2018లో పదోన్నతిపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని లింగాల ఎఫ్‌ఆర్‌ఓగా విధుల్లో చేరారు. ఆసమయంలో అటవీ రక్షణకు తనదైన శైలిలో పని చేశారు. దీంతో పోడు, సాగుదారుల ఫిర్యాదుల ఆధారంగా మావోయిస్టులు ఎఫ్ఆర్ఓను టార్గెట్ చేశారు. ఈవిషయాన్ని ఇంటెలిజెన్స్ అధికారులు అటవీ ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. దీంతో ఎఫ్ఆర్ఓ ప్రాణాలు రక్షించుకునేందుకు ఆశాఖ అధికారులు భద్రాద్రి జిల్లా చండ్రుగొండకు బదిలీ చేశారు. చండ్రుగొండ రేంజ్ పరిధిలో సైతం శ్రీనివాసరావు అటవీ ప్రాంతం అన్యాక్రాంతం కాకుండా కృషి చేశారు. ఈక్రమంలో ఆప్రాంతానికి వలస వచ్చిన గొత్తికోయలు శ్రీనివాసరావును లక్ష్యంగా చేసుకొని హత్య చేశారు. లింగాలలో కాపాడినా.. చండ్రుగొండలో మాత్రం కాపాడుకోలేకపోయామని అటవీశాఖ అధికారులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉమ్మడి జిల్లాలో విషాదం... బయ్యారం డీఆర్ఓగా, లింగాల ఎఫ్‌ఆర్‌ఓగా పని చేసిన శ్రీనివాసరావు హత్యకు గురవడంపై ఉమ్మడి జిల్లాలోని అటవీశాఖలో విషాదం నెలకొంది. అటవీ రక్షణకు శ్రీనివాసరావు చేసిన కృషిని ఈసందర్భంగా పలువురు అధికారులు కొనియాడారు. చదవండి: ఫారెస్ట్ అధికారి మృతిపై అనుమానాలు?.. హత్యకు ముందు శ్రీనివాసరావు వీడియో వైరల్ -
ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ అంత్యక్రియల్లో ఉద్రిక్తత
-
ఫారెస్ట్ అధికారి మృతిపై అనుమానాలు?.. హత్యకు ముందు శ్రీనివాసరావు వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు మృతి వెనక పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్లాంటేషన్ భూముల్లో పశువులు మేపడాన్ని అడ్డుకున్నందుకే ఫారెస్ట్ అధికారిని చంపినట్లు ప్రచారం జరుగుతోంది. లింగాలలో పనిచేస్తున్న రోజుల్లో శ్రీనివాస రావు హిట్లిస్టలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మావోయిస్టుల ప్రోత్సాహం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ రావునును గొత్తికోయలు వేట కొడవళ్లతో మెడపై దాడి చేసి క్రూరంగా హత్య చేసిన విషయం తెలిసిందే. మరో ఇద్దరు ఉద్యోగులను కర్రలతో బెదిరింపులకు గురి చేశారు. కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో శ్రీనివాసరావు నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరు ఉంది. ఆయన రేంజ్లో ఎవరూ ఒక పుల్లను కూడా అడవిని నుంచి బయటకు తీసుకువెళ్లలేరనే విధంగా పేరు సంపాదించారు. ఈ క్రమంలో శ్రీనివాస రావు చనిపోక ముందు చెట్టు కర్ర గురించి గ్రామస్తులకు, ఇతర అధికారులకు అవగాహన కల్పిస్తున్న ఓ వీడియో ఒకటి తాజాగా వైరల్‌గా మారింది. పాడే మోసిన మంత్రులు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ ఈర్లపూడికి చేరుకున్నారు. శ్రీనివాసరావు మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇదే సమయంలో జోహార్ శ్రీనివాసరావు అంటూ అటవీశాఖ అధికారులు, సిబ్బంది నినాదాలు చేశారు. ఇదే సమయంలో మహిళ ఉద్యోగులు కన్నీటి పర్యంతమయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి.. శ్రీనివాస రావు పాడే మోశారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. దాడులను సహించేది లేదని అన్నారు. శ్రీనివాస రావుపై దాడి చేసి, హత్య చేసిన ఎవరిని వదిలిపెట్టమని తెలిపారు. ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుందని, సీఎం కెసీఆర్ గారు వెంటనే స్పందించి అధికార లాంఛనలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్‌ను ఆదేశించారని తెలిపారు. సీఎం కేసీఅర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికీ ప్రభుత్వ ఉద్యోగం, ఇతర బెనిఫిట్స్ కల్పిస్తూ జీవో జారీ చేసినట్లు తెలిపారు. ఇక్కడి గిరిజనులతో సమస్య లేదని, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ అక్రమంగా వలస వచ్చిన గుత్తి కొయలు అడవులను విచక్షణ రహితంగా నరికి వేస్తున్నారని మండిపడ్డారు. అడవులను నరికినట్లు అటవీ అధికారులపై కూడా దాడులు చేస్తాం అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అటవీశాఖకు ఆయుధాల అంశం శ్రీనివాసరావు మృతితో అటవీశాఖ ఉద్యోగులకు ఆయుధాలు ఇచ్చే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై సీఎం కేసీఆర్‌కు ప్రతిపాదనలు చేస్తామని అటవీ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతితో ఆయుధాలు లేకుండా అడవిలో డ్యూటీ చేయలేమని అటవీశాఖ సిబ్బంది తేల్చి చెప్తున్నారు. ఆరు నెలల క్రితమే గోత్తి కోయలు శ్రీనివాసరావు హత్యకు ప్లాన్ చేశారని సంచలన నిజాలు వెల్లడించారు అటవీశాఖ సిబ్బంది. తనకు ప్రాణహాని ఉందని అనేకమార్లు తమకు చెప్పారన్నారు. గతంలో కూడా ఆయుధాలు అంశానికి సంబంధించి అనేకమార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లామని ఇప్పుడు మళ్ళీ మరోసారి తీసుకెళ్తామన్నారు.. శ్రీనివాసరావుది చివరి మృతి కావాలని ఫారెస్ట్ శాఖలో ఇక ఎవ్వరు చనిపోవద్దంటే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. ఉద్రిక్తత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు అంత్యక్రియల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాడులను నిరసిస్తూ ఫారెస్టు సిబ్బంది ఆందోళన చేపట్టింది. ర్యాలీగా బయలుదేరి వచ్చిన ఉద్యోగులు.. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు లాగా తమకు తుపాకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయుధాలు ఇచ్చి అటవీశాఖ అధికారులకు, సిబ్బంది ప్రాణాలకు రక్షణ కల్పించాలని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ ఎదుట అటవీ శాఖ సిబ్బంది నినాదాలు చేశారు. అటవీశాఖ సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. చివరకు ఫారెస్ట్ సిబ్బంది నిరసనతో మంత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
పాత వీడియో వైరల్: ఫారెస్ట్ అధికారి మృతిపై పోలీసుల అనుమానం
-
కాళ్లమీద పడినా కర్కశంగా.. గొత్తికోయల దారుణ కృత్యం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చంద్రుగొండ: బెండాలపాడు అటవీ ప్రాంతంలో తమ ఆఫీసర్‌పై దాడి చేయొద్దని సహచర సిబ్బంది కాళ్లపై పడి మొక్కినా గొత్తి కోయలు కనికరించలేదు. వేటకొడవళ్లతో దాడి చేయడంతో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు మెడపై తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో కింద పడి ఉన్న ఎఫ్ఆర్ఓపై తులా వేటకొడవలితో దాడి చేస్తుండగా.. ‘మీ కాళ్లు మొక్కుతా, మా సార్‌ను ఏం చేయొద్దు.. మేము ఇక్కడి నుండి వెళ్లిపోతాం’అంటూ రామారావు వేడుకున్నారు. అయినా పట్టించుకోకుండా చేతిలోని పదునైన ఆయుధంతో శ్రీనివాసరావు మెడ, తల, గొంతుపై అదే పనిగా దాడి చేశాడు. మంగును వాచర్ రాములు నిలువరించే ప్రయత్నం చేశాడు. అయితే ఆవేశంగా ఉన్న వారిద్దరినీ నిలువరించడం సాధ్యం కాక శ్రీనివాసరావును అక్కడే వదిలి రామారావు, రాములు తదితరులు ప్లాంటేషన్ నుంచి బయటకు పరుగులు తీశారు. పోలీసులు, అటవీ సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకునే వరకు సుమారు గంట పాటు ఎఫ్ఆర్ఓ రక్తపుమడుగులోనే ఉన్నారు. ఆ తర్వాత కారులో మధ్యాహ్నం 1:56 గంటల ప్రాంతంలో చంద్రుగొండ ప్రాథమిక ఆస్పత్రికి, ఆ తర్వాత ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. జీపులో వెళ్లుంటే..: ఫారెస్ట్ ఆఫీసర్‌గా కేటాయించిన జీపులోనే శ్రీనివాసరావు ఎక్కువగా ఫీల్డ్ విజిట్‌కు వెళ్తుంటారు. కొత్తగూడెం నుంచి చంద్రుగొండకు తన కారులో వచ్చి అక్కడి నుంచి ఫారెస్ట్ జీపులో అడవిలోకి వెళ్లడం ఆయనకు అలవాటు. జీపులో తనతో పాటు సిబ్బందిని తీసుకెళ్లేవారు. కానీ, మంగళవారం ఆయన బైక్ మీద ఫీల్డ్ విజిట్‌కు వెళ్లడం, ఆయన వెంట ఒక్కరే సిబ్బంది ఉండడంతో ఆయనపై పగ పెంచుకుని అదను కోసం చూస్తున్న గొత్తికోయలు తేలికగా దాడి చేయగలిగారని అటవీ సిబ్బంది చెబుతున్నారు. పచ్చదనమే ప్రాణంగా బతికారు పచ్చదనమే ప్రాణంగా బతికిన సిన్సియర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావు చివరకు ఆ పచ్చని చెట్ల మధ్యే ప్రాణాలు వదిలారు. అడవుల రక్షణే ఊపిరిగా జీవించిన ఆయన చివరకు విధి నిర్వహణలో తుదిశ్వాస విడిచారు. శ్రీనివాసరావు సహజంగానే అడవులంటే ప్రేమ కలిగిన ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఎక్కడ పని చేసినా పోడు వ్యవసాయాన్ని అరికట్టడంతో పాటు అడవులు పెంచడంపై శ్రద్ధ చూపించేవారు. ఈ క్రమంలో అటవీ శాఖ నుంచి గోల్డ్ మెడల్ సైతం అందుకున్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండే ఆయన వ్యక్తిగతంగా మాత్రం చాలా సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రేంజ్లో ఎవరూ ఒక పుల్లను కూడా అడవిని నుంచి బయటకు తీసుకువెళ్లలేరనే విధంగా పేరు సంపాదించారని, అలాంటి ఆయన ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని తోటి అధికారులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: ఎఫ్ఆర్వో మృతి.. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన.. దోషులను కఠినంగా శిక్షిస్తామన్న సీఎం కేసీఆర్ -
ఎఫ్ఆర్వో మృతి.. సీఎం కేసీఆర్ స్పందన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు సహించబోమని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తి కోయల దాడిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతి చెందిన ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ఆయన. ఉద్యోగులపై దాడులను సహించబోమన్న సీఎం కేసీఆర్.. దోషులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. అంతేకాదు.. శ్రీనివాసరావు కుటుంబానికి పూర్తి జీతభత్యాలు అందుతాయని, రిటైర్మెంట్ వయసు వరకు కుటుంబ సభ్యులకు వేతనం చెల్లిస్తామని తెలిపారు. చంద్రుగొండ మండలం బెండలపాడులో మంగళవారం ఈ దాడి ఘటన చోటు చేసుకుంది. విధి నిర్వహణలో శ్రీనివాసరావు ప్రాణాలు పొగొట్టుకోవడంతో ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అధికార లాంఛనాలతో ఎఫ్ఆర్వో శ్రీనివాస రావుకు అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. -
గుత్తికోయల దాడిలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ మృతి
-
అటవీ అధికారుల కంటపడ్డ వింతజీవి.. కాటేస్తే డౌటే!
రాయగడ(భువనేశ్వర్): జిల్లాలోని మునిగుడ సమితి లోదిపొంగ అడవుల్లో అటవీశాఖ అధికారులకు ఓ వింతజీవి తారసపడింది. దీనిని చాకచక్యంలో పట్టుకుని అటవీశాఖ కేంద్రానికి తరలించారు. శనివారం రాత్రి కొంతమంది అటవీశాఖ సిబ్బంది అడవిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ జీవి కనిపించిందని అటవీశాఖ అధికారి ప్రసన్నకుమార్ మిశ్రొ తెలిపారు. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పేరుతో పిలుస్తారనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. అయితే ఇది విషపూరితమైన జీవమని, మనుషులపై దాడి చేసి, కాటు వేస్తుందని వన్యప్రాణుల సంరక్షణ విభాగానికి చెందిన తెలిపారు. దాడి చేసే స మయంలో శరీరంలోకి విషం ఎక్కి, ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉందని సమాచారం. దీనిపై వివరాలు సేకరిస్తున్నారు. చదవండి: సామూహిక లైంగిక దాడి చేసి.. ఆమెకు ఇలా వెల కట్టారు -
అదిగో పులి... ఇదిగో తోక
కోటవురట్ల: పులి భయంతో అటవీ పరిధి గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు అటవీ పరిధిలో సంచరించిన పులి తాజాగా నర్సీపట్నం–రేవుపోలవరం రోడ్డుపై కూడా సంచరిస్తోందన్న ప్రచారం సాగుతోంది. గురువారం రాత్రి ఇందేశమ్మవాక ఘాట్‌రోడ్డులో పలువురికి పులి కనిపించినట్టు చెబుతున్నారు. ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి వెళుతుండగా ఘాట్‌రోడ్డులో పులి కనిపించడంతో బైకును అక్కడే వదిలేసి వెనక్కి పరుగులు తీసినట్టు చెబుతున్నారు. పందూరు గ్రామానికి చెందిన కిర్రా నాగేశ్వరరావు ఇందేశమ్మతల్లి ఆలయంలో ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తుంటారు. ఎప్పటిలానే గురువారం రాత్రి 9 గంటల సమయంలో అమ్మవారికి దీపం పెట్టి తిరిగి పందూరులోని ఇంటికి వెళ్లేందుకు బయటకొచ్చి బైక్ స్టార్ట్ చేసేసరికి లైట్ వెలుతురులో సుమారు 200 అడుగుల దూరంలో పులి కొండపైకి ఎక్కుతూ కనిపించినట్టు నాగేశ్వరరావు చెబుతున్నారు. తాను స్పష్టంగా చూశానని, పులి తోక, కాళ్లు కనిపించాయని రోడ్డు నుంచి కొండపైకి ఎక్కుతుండడంతో భయపడి వెంటనే గుడిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నట్టు తెలిపాడు. మరికొద్ది సమయానికి అటుగా రెండు లారీలతో పాటు కొందరు యువకులు బైకులపై రావడంతో వారితో పాటు హారన్లు కొట్టుకుంటూ ఆ ప్రాంతం నుంచి తప్పించుకున్నట్టు చెబుతున్నారు. అయితే ఇదంతా కేవలం వదంతులేనని ఫారెస్టు రేంజరు రాజుబాబు కొట్టిపారేస్తున్నారు. పులి కొండల్లో సంచరిస్తున్న మాట వాస్తవమేనని, ఘాట్‌రోడ్డుపైకి రావడం కేవలం వదంతులే అన్నారు. శ్రీరాంపురంలో దున్నపై దాడి జరిగిన ప్రాంతంలో ట్రాక్ కమెరాలు ఏర్పాటు చేశామని, ఆ పులి మళ్లీ అటువైపు రాలేదని తెలిపారు. ప్రస్తుతం దాని దిశ మార్చుకుని నక్కపల్లి, పాయకరావుపేట మండలాల వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు. దున్నను వేటాడి ఆహారం తీసుకుని సుమారు 30 గంటలు దాటుతోందని, మళ్లీ అటాక్ చేసే అవకాశం ఉందన్నారు. దానిని బట్టి పులి ఆచూకీ తెలుసుకుని ఆ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తమ సిబ్బంది, రెస్క్యూ టీమ్ అనుమానం వచ్చిన ప్రాంతాలలో తనిఖీలు చేస్తున్నారని తెలిపారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పులి పాదముద్రలు లభ్యం కావడం లేదన్నారు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం.. ఇందేశమ్మ వాక ఘాట్‌రోడ్డులో పులి తిరుగుతోందని అడ్డురోడ్డు నుంచి కోటవురట్ల వైపు ఎవరూ వెళ్లొద్దని గురువారం రాత్రి వాట్సప్ గూపుల్లో ప్రచారం జరిగింది. వేర్వేరు ప్రాంతాలల్లో పులి సంచరిస్తున్న వీడియోలను గ్రూపుల్లో అప్లోడ్ చేసి హడలెత్తిస్తున్నారు. దాంతో ఘాట్‌రోడ్డులో రాకపోకలు బాగా తగ్గిపోయాయి. అణుకు, అల్లుమియ్యపాలెం, రామచంద్రపురం, గూడెపులోవ, పందూరు, బంద, శ్రీరాపురం, తడపర్తి, బోనుకొత్తూరు గ్రామాలను పులిభయం వెంటాడుతోంది. ఒంటరిగా బైకులపై వెళ్లేందుకు భయపడుతున్నారు. అడవి వైపు వెళ్లొద్దు... యలమంచిలి రూరల్ : రిజర్వ్ ఫారెస్ట్‌ను అనుకొని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆటవీశాఖ అధికారి రామ్ నరేష్ అన్నారు. శుక్రవారం పెదపల్లి అటవీ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వ్ ఫారెస్ట్‌లోకి పులి ప్రవేశించడంతో ప్రజలు ఒంటరిగా అడవిలోకి వెళ్లరాదన్నారు. అడవిని ఆనుకొని ఉన్న రైతులు పశువులను ఇంటికి తరలించడంతో పాటు అటు వైపు వెళ్లరాదని హెచ్చరించారు. పెదపల్లి రిజర్వాయర్, కొక్కిరాపల్లి రిజర్వాయర్ సమీపంలో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండడంతో పాటు పశువులను గ్రామానికి తరలించాలని సూచించారు. పులికి ఆహారం లభించు స్థలం, నీరు అందుబాటులో ఉన్న ప్రదేశాలను పరిశీలించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పెదపల్లి ఆటవీ శాఖ ప్రాంతంలోకి బెంగాల్ టైగర్ ప్రవేశించడంతో అటవీ శాఖ అధికారులు వెంకటపురం, పెదగొల్లలపాలెం, చిన గొల్లలపాలెంతో పాటు పలు గ్రామాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి ఆటవీ శాఖ అధికారులు రవి కుమార్, గోవిందు, ప్రభాకర్, మూర్తి పాల్గొన్నారు. (చదవండి: రైతులకు సిరులు కురిపిస్తోన్న పత్తి..) -
అటవీశాఖ అధికారులపై గ్రామస్తుల దాడి
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ ఫారెస్ట్ రేంజ్ అటవీ అధికారులపై దాడి జరిగింది. తప్పించుకునే క్రమంలో పరుగెడుతూ 8 నెలల గర్భిణీ అయిన ఎఫ్‌బీవో అస్వస్థతకు గురయ్యారు. కాగజ్‌నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆధ్వర్యంలో అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించడం కోసం కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం ఊట్పల్లిలో మంగళవారం కళాజాత నిర్వహించారు. వంట చెరుకును తీసుకోనివ్వకుండా అధికారులు అడ్డుకుంటున్నారని, గొడ్డళ్లు, సైకిళ్లను స్వాధీనం చేసుకుంటున్నారని అధికారులను గ్రామస్తులు ఘెరావ్ చేశారు. దీంతో కళాజాత బృందం సభ్యులు అర్ధాంతరంగా కార్యక్రమాలను ఆపేసి వెళ్లిపోయారు. కోసిని ఎఫ్‌బీవో శిరీష, వాచ్మేన్లు దేవ్‌సింగ్, రాములు, శంకర్ తమ ద్విచక్ర వాహనాలపై బయల్దేరుతుండగా గ్రామస్తులు అడ్డుకొని కర్రలతో దాడికి దిగారు. శిరీష ఎడమ చేతికి గాయాలయ్యాయి. దాడి నుంచి తప్పించుకోవడానికి పరుగెత్తడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న శిరీష భర్త బైక్‌పై ఆమెను పట్టణంలోని ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం అటునుంచి ఆమెను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. -
మహిళా అధికారినిపై దాష్టీకం: డ్యూటీలో ఉంది.. అందులోనూ గర్భిణి!
కొంతమంది ఇటీవల కాలంలో అత్యంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఆడ, మగ అనే తారతమ్యం లేకుండా అత్యంత దారుణంగా దిగజారి ప్రవర్తిస్తున్నారు. అచ్చం అలాంటి అమానుష ఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పైగా సాటి మహిళ, గర్భిణి అని చూడకుండా అత్యంత పాశవికంగా ఆమె పై దాడి చేశారు. అసలు విషయంలోకెళ్తే....మహారాష్ట్రలోని సతారా జిల్లాలో అటవీ శాఖలో పనిచేస్తున్న గర్భిణి అధికారి పై పల్సవాడే మాజీ సర్పంచ్ అతని భార్య అత్యంత అమానుషంగా దాడిచేశారు. మహిళా అటవీ శాఖాధికారులు తనకు సమాచారం ఇవ్వకుండా కూలీలను వేరే స్థలంలో పనిలో పెట్టుకున్నారని స్థానిక అటవీ కమిటీలో మాజీ సర్పంచ్ రామచంద్ర గంగారాం వాపోయారు. అంతేకాదు మాజీ సర్పంచ్ సోమవారం మహిళా అధికారిణిని ఫోన్లో బెదిరించాడు కూడా. ఈ మేరకు మాజీ సర్పంచ్ రామచంద్ర గంగారాం జంకర్, అతని భార్య ప్రగతి జంకర్.. మహిళా అటవీ అధికారి, ఆమె భర్త పై దాడి చేశారు. పైగా మాజీ సర్పంచ్ భార్య ప్రగతి జంకర్... సాటి మహిళ, గర్భిణి అనే కనికరం లేకుండా అటవీ అధికారి జుట్లు పట్టుకుని లాగి కిందపడేసి, చెప్పుతో కొట్టి అవమానించారు. ఈ మేరకు ఈ ఘటనను ఆ మహిళా ఆఫీసర్ భర్త, అటవీ సిబ్బంది రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి మాజీ సర్పంచ్‌ని అతని భార్యను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. (చదవండి: ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఏందయ్యా ఇది..) -
అక్కడ చెట్లను తొలగిస్తే.... బహుమతులు ఇస్తారట!
Callery Pear Tree Smells Bad In US state of Maine: చెట్లను నాటండి అంటూ మన దేశాల్లో పచ్చదనం, హరిత విప్లవం అంటూ రకరకాల కార్యక్రమాలను చేపడుతుంటారు. అయితే అందుకు విరుద్ధంగా యూఎస్‌లోని మైనే రాష్ట్రంలోని అధికారులు మొక్కలను తొలగిస్తే బహుమతులు ఇస్తాం అంటున్నారు. అసలే ప్రపంచ దేశాలన్ని కాలుష్యం కోరల్లో చిక్కుకుని బెంబేలెత్తుతుంటే ఏంటిది వెటకారంగా అని అనుకోకండి. (చదవండి: బాప్రే!.... నెపోలియన్ ఖడ్గం వేలంలో రూ. 21 కోట్లు పలికిందట!) అసలు విషయంలోకెళ్లితే... మానవుల మనగడ చెట్లతోనే సాధ్యం అని అందరికి తెలిసి విషయమే. కానీ యూఎస్‌కి తూర్పున ఉన్న మైనే రాష్ట్రంలోని కాలరీ పియర్ చెట్లు మాత్రం ప్రజలకు సమస్యగా మారి ఇబ్బందులకు గురిచేస్తోంది. అంతేకాదు సౌత్ కరోలినా ఫారెస్ట్రీ కమిషన్ కాలరీ పియర్ చెట్లను తొలగించాలనుకునే వారికి ఐదు కొత్త చెట్ల బహుమతిగా ఇస్తానని ప్రకటించింది. అయితే ఈ కాలరీ పియర్ చెట్టు యూఎస్‌కి చెందినది కాదు. అంతేకాదు ఈ చెట్టు చైనా, వియత్నాంకు చెందిన పియర్ చెట్టు జాతి. ఈ మేరకు ఇది 1900లలో అనేక ఆసియా దేశాల నుండి యూఎస్ దేశానికి వచ్చింది. అయితే 1960ల నాటికల్లా ఈ చెట్లు వాటికి పూచే ఆకర్షణీయమైన తెల్లని పువ్వుల కోసం రాష్ట్రాలలోని అనేక శివారు ప్రాంతాల్లో విస్తారంగా వీటిని నాటారు. పైగా యూఎస్‌లో విస్తృతంగా సాగు చేయబడిన 'బ్రాడ్ఫోర్డ్' పియర్ చెట్టుగా కూడా పిలుస్తారు. ఏ ఆకర్షణీయమైన పువ్వుల కోసం అయితే ఈ మొక్కలను నాటారో ఆ పువ్వులు అత్యంత భయంకరమైన వాసనను కలిగి ఉన్నాయన్న విషయాన్ని ప్రజలు గ్రహించలేకపోయారని మైనే వ్యవసాయ సంరక్షణ అటవీ శాఖకు చెందిన ఉద్యానవన నిపుణులు అన్నారు. అంతేకాదు ఈ పియర్ చెట్లు వల్ల స్థానిక జాతి చెట్ల పై తీవ్ర వినాసకరమైన ప్రభావాన్ని చూపాయని చెప్పారు. దీంతో అక్కడి అధికారులు 2024 నాటికల్లా ఈ పియర్ మొక్కలను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు. పైగా అక్కడి అధికారులు ఇప్పటికే ఉన్న కాలరీ పియర్ చెట్లను తొలగించినందుకు ఇంటి యజమానులకు బహుమతులు అందించే వరకు వెళ్లడం గమనార్హం (చదవండి: జైలును ఆర్ట్ సెంటర్‌గా మార్చడం కోసం... కోట్లు సేకరిస్తున్నాడు!!) -
కొంగుపట్టి లాగి.. జాకెట్ చించి..
టేకులపల్లి (భద్రాద్రి కొత్తగూడెం): పోడుభూములను సాగు చేసుకుంటున్న ఆదివాసీ మహిళారైతులపై అటవీఅధికారులు దౌర్జన్యం చేయడంతోపాటు అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గంగారం పంచాయతీ సిద్ధారం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. సిద్ధారం సమీపంలో ఆదివాసీలు 30 ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొందరికి పట్టాలు ఇచ్చారు. మరికొన్ని భూములకు ఫారెస్టు అధికారులు రీసర్వే చేయడంతో బాధిత రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో గురువారం సాగు చేసుకుంటున్న రైతులు మధ్యాహ్న భోజనానికి ఇళ్లకు వెళ్లిన సమయంలో అటవీ అధికారులు పోడు భూముల వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్న మహిళలను దుర్భాషలాడుతూ వారిపై దౌర్జన్యానికి దిగారు. ‘ఎవడబ్బ సొమ్మని పోడు దున్నుతున్నారు’ అని తిడుతూ అరకలను తొలగించేందుకు ప్రయత్నించగా మహిళారైతులు అడ్డుకున్నారు. బీట్ ఆఫీసర్ మోతీలాల్ ఆగ్రహంతో మహిళా రైతులు జోగ కుమారి, కోరం రమణల కొంగుపట్టి లాగడంతో వారి జాకెట్లు చిరిగిపోయాయి. ఈ విషయమై వివరణ కోరేందుకు ఎఫ్ఆర్వోను ‘సాక్షి’ ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. కాగా, ఈ ఘటనపై బాధితులు జోగ కుమారి, కోరం రమణతోపాటు మహిళారైతులు స్వరూప, సమ్మక్క, పవిత్ర, లక్ష్మీ, నాగమణి, పద్మ, వివిధ పార్టీల నేతలు బోడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీట్ ఆఫీసర్లు మోతీలాల్, రమేష్‌పై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. -
మేధావి కీర్తిని ‘రేంజర్ దీదీ’ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?
ఉత్తరాఖండ్‌లోని భద్రగడ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు మేధావి కీర్తి. గతేడాది మే నెలలో ఫారెస్ట్ రేంజ్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన కీర్తిని స్థానికులంతా ‘రేంజర్ దీదీ’ అని ప్రేమగా పిలుచుకుంటారు. పేరుకు తగ్గట్టుగానే స్థానిక మహిళలకు తోడబుట్టిన అక్కలా వ్యవహరిస్తున్నారు ఈ యంగ్ ఆఫీసర్. ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న అనేకమంది మహిళలకు చేయూతనిస్తూ వారి ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు కీర్తి . ‘ధాత్రీ’ అనే సంస్థను స్థాపించి, భుట్గావ్, నెగ్యానా, బండసరి, తిక్రీ సుమన్కారి గ్రామాల్లోని మహిళల ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తున్నారు. ధాత్రీ సంస్థ ద్వారా కుట్లు, అల్లికలు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి పనుల్లో స్థానిక మహిళలకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ట్రైనింగ్ పూర్తయిన మహిళలతో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేయించి వాటిని మంచి లాభాలకు విక్రయిస్తూ ఆదాయాన్ని పదింతలు చేస్తున్నారు. దీపాలు, పూజాసామగ్రి, కుండల తయారీ, సుంగధ ద్రవ్యాల ఉత్పత్తులు, స్థానికంగా పండే బార్లీ, రాజ్మా, మండెవా, రోడోడెండ్రాన్ రసం వంటివాటిని తయారు చేయిస్తున్నారు. అంతేగాక స్థానికంగా పెరిగే మలు, తిమ్లీ అనే మొక్కల నుంచి తయారు చేసిన ప్లేట్స్, గిన్నెలను ‘వేదిక్ పత్రావళి’ పేరుతో విక్రయిస్తున్నారు. కొంతమంది మహిళలను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి ఆవుపేడతో కళాఖండాలు తయారు చేయిస్తున్నారు. ‘నందినీ’ అనే బ్రాంచ్ ప్రారంభించి దీనిలో పెళ్లికాని అమ్మాయిలతో వివిధ రకాల వస్తువులను ఉత్పత్తి చేయిస్తున్నారు. ప్రారంభంలో ఇక్కడి మహిళలను ఒప్పించడం చాలా కష్టమైంది. కానీ తరువాత సీనియర్ అధికారుల సాయంతో ముందుకు సాగగలిగానని కీర్తి చెప్పారు. మహిళలకు శిక్షణ నివ్వడం గతేడాది దీపావళి పండుగకు ఒక నెలముందు ప్రారంభించాం. అప్పుడు కొన్ని రకాల మెషిన్లు, కొంతమంది ట్రైయినర్లతో శిక్షణ ఇప్పించడంతో.. నెలరోజుల్లోనే వేగంగా నేర్చుకుని దీపావళి పండుగ సమయంలో అనేక ఉత్పత్తులు అందించిన మహిళలు వాటిని విక్రయించడం ద్వారా రూ.40 వేలు ఆదాయం పొందారు’’ అని కీర్తి చెప్పారు. ‘‘ఆవుపేడతో కళాఖండాలు తయారు చేయడంలో నైపుణ్యం కలిగిన నాగ్‌పూర్‌కు చెందిన ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. పశువులు పాలు ఇవ్వడం ఆపేసిన తరువాత వాటిని పెద్దగా పట్టించుకోరు. అటువంటి పశువుల నుంచి పేడ సేకరించి వాటిని ఉపయోగపడే కళాఖండాలుగా తీర్చితిద్ది వాటి ద్వారా గ్రామీణ మహిళలకు మరికొంత ఆదాయం సృష్టించడమే తమ లక్ష్యం’’ అని ఆమె పేర్కొన్నారు. ‘‘మేధావి కీర్తి ఎంతో కష్టపడి ఇక్కడి మహిళలను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారు. నాణ్యతతో కూడిన స్వదేశీ ఉత్పత్తులకు ధాత్రీ మంచి బ్రాండ్‌గా ఎదుగుతుంది’’ అని ముస్సోరీ డివిజినల్ ఫారెస్ట్ అధికారి కహంకన్ నసీమ్ అన్నారు. ధాత్రీ ద్వారా ఉపాధి పొందుతున్న తమకు రేంజర్ దీదీ తల్లిలా, అక్కలా తమని ఆదుకుంటున్నారని ధాత్రీద్వారా లబ్ధి పొందుతున్న మహిళలు చెప్పారు. ఎప్పటికప్పుడు తమని మోటివేట్ చేస్తూ తమలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి ఆదాయంగా మలుస్తున్నారు. మహా కుంభమేళా–2021లో మా ఉత్పత్తులను విక్రయించేందుకు దీదీ అధికారుల నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. దీనిద్వారా తమ ఆదాయం పెరుగుతుందని వారు ఆనందం వ్యక్తం చేశారు.